ధారావాహికలు - శ్రీరామాయణ సంగ్రహం
యుద్ధకాండ
- డా. అక్కిరాజు రమాపతిరావు

రావణుణ్ణి చూసిన సుగ్రీవుడి సంరంభం

రావణుణ్ణి అట్లా చూసీ చూడగానే సుగ్రీవుడు మహాకోపోద్రిక్తుడైనాడు. ఆ మహాపరాక్రమశాలి సుగ్రీవుడు ఒక్క ఉదుటున లంఘించి పోయి రావణుడి ముందు నిలిచాడు. రావణుణ్ణి చురచురా చూస్తూ, ''రాక్షసాధమా! నేను లోకనాథుడైన శ్రీరాముడి దాసుణ్ణి. ఆయన మాత్రం నన్ను మిత్రుడిగా భావిస్తుంటాడు. ఆ రామప్రభువు దివ్యతేజస్సు ఇప్పుడు నన్నావహించింది. ఇప్పుడెక్కడికి తప్పించుకొనిపోతావు?'' అంటూ ఎగిరి తన్ని రావణుడి కిరీటం తూలి కింద పడేట్లు చేశాడు. దీనితో రావణుడు రెచ్చిపోయినాడు. ''ఓరి సుగ్రీవా! ఇప్పుడే నీ మెడ విరిచిపారేసి నిన్ను మెడలేనివాడిని చేస్తాను. నాకు కనపడనంతవరకే నీవు సుగ్రీవుడివి'' అని మోద్ధతుడై సుగ్రీవుణ్ణి నేలమీద పడేట్లు తోసివేసాడు. సుగ్రీవుడు బంతిలాగా ఎగిరి రావణుణ్ణి గట్టిగా ఒడిసి పట్టుకున్నాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు పడతోసుకుంట, కొట్టుకొంటూ, గుద్దుకుంటూ, తన్నుకుంటూ, చరచుకొంటూ చాలాసేపు ద్వంద్వయుద్ధం చేశారు. నడిచే కొండల్లా ఒకరి నొకరు ఢీకొన్నారు. రెండు చేతులతో పరస్పరం నడుము విరిచేసేట్లు పట్టు పట్టుకొన్నారు. కటిభాగం కదలకుండా చేసుకొన్నారు. ఒకరిరమ్ముతో ఒకరి రొమ్ముకు తాటించుకున్నారు. తొడలు తొడలతో ఒరిసిపోయేట్లు కలబడ్డారు. ఆకాశానికి ఎగిరి అక్కడ నిలిచి దూషించుకున్నారు. ఒకరి నొకరు చిక్కించుకొని గుండ్రంగా గిర్రున తిప్పారు. ఒకరినొకరు శకలశకలాలు చేయాలనుకున్నారు. మల్లయుద్ధంలో వివిధ నైపుణ్యాలు ప్రదర్శించారు. ఎదుటివాడు ఈద పడిపోతుండగా కూచుని తప్పించుకుంటున్నారు. కుప్పించి ఎగస్తున్నారు. ఒకరిచెయ్యి ఒకరికి చిక్కకుండా చేసుకుంటున్నారు.

అప్పుడిక రావణాసురుడు మాయాయుద్ధం చేసి సుగ్రీవుణ్ణి ఆక్రమించుకుందామని చూస్తుండగా సుగ్రీవుడు రావణుడి కపటోపాయాన్ని తెలుసుకొని ఒక్క ఉదుటున గగనానికి ఎగిరిపోయినాడు. రాముడి పక్కకు చేరుకున్నాడు. సుగ్రీవుడి సాహసాన్ని చూసి శ్రీరాముడు ఎంతో నొచ్చుకున్నాడు. ''ఏమైనా ప్రమాదం జరిగి ఉంటే ఏమయ్యేది? నేను నా ప్రాణాలను కూడా త్యజించేవాణ్ణి కదా! నాకు రాజ్య మెందుకు? సీతెందుకు నీవు లేకపోతే?'' అని సుగ్రీవుడిపట్ల తన గాఢమైన ప్రేమాభిమానాలు ప్రకటించాడు శ్రీరాముడు. 'నాతో చెప్పకుండా నీవు ఇక ముందు ఎప్పుడూ ఏ సాహసార్యానికీ పూనుకోవద్దు' అని బతిమాలాడు. ''నేను యుద్ధంలో రావణుణ్ణి సబాంధవంగా చంపివేసి, లంకలో విభీషణుడికి పట్టాభిషేకం చేసి, అయోధ్యలో భరతుడికి పట్టాభిషేకం చేసి నా మనోభీష్టం నెరవేర్చుకోవాలను కంఉటున్నాను. నీకేమైనా ప్రమాదం జరిగితే నేను భరించలేను,'' అన్నాడు శ్రీరాముడు. అప్పుడు సుగ్రీవుడు 'శ్రీరామా! నీ అతులితబలపరాక్రమాలు తెలియని దెవ్వరికి? నీ పత్నిని అపహరించుకొనిపోయిన ఆ దుష్టుణ్ణి చూసేసరికి నాకు ఒళ్ళు తెలియని కోపం వచ్చింది. నిగ్రహించుకోలేకపోయినాను'' అని వినయంగా చెప్పాడు శ్రీరాముడికి సుగ్రీవుడు. శ్రీరాముడు సుగ్రీవుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు.

తరువాత శ్రీరాముడు వానరసేనను యుద్ధవ్యూహాలుగా రచించాడు. ''దుర్నిమిత్తాలు లంక వినాశనాన్ని సూచిస్తున్నాయి. లంకమీమద దాడి ప్రారంభిద్దాం'' అని సువేలపర్వతం నుంచి సమస్తవానరసేనతో లంకను పట్టుకోవటానికి నడిచాడు శ్రీరాముడు.ఆయనవెంట అప్పుడు విభీషణుడు, సుగ్రీవుడు, లక్ష్మణుడు, హనుమంతుడు, జాంబవంతుడు, సుషేణుడు, వాళ్ళ వెనుక ఎలుగుబంట్లసేన, వానరసేన శ్రీరాముణ్ణి అనుసరించాయి. వాళ్ళ చేతుల్లో పెద్ద పెద్ద వృక్షాలు, కోసు దేరిన పర్వతశిఖరశకలాలూ ఉన్నాయి. ఉత్తరద్వారం దగ్గర తన కపివీరప్రముఖులతో నిలిచాడు శ్రీరాముడు. ఆ మేర్పరచుకొన్న యుద్ధవ్యూహరచన కనుగుణంగా ఇతరద్వారాలవద్ద తమ నాయకులతో వానరయూథాలు మోహరించాయి. ఈ అన్ని ద్వారాలను విభీషణుడు, లక్ష్మణుడు పర్యవేక్షిస్తున్నారు. వానరవీరులు, భల్లూకవీరులు మదగజాలవలె స్వపరాక్రం చూసుకొని గర్విస్తున్నారు.

అంగద రాయబారం

అప్పుడు శ్రీరాముడు యుద్ధనీతివిశారదుడు కాబట్టి రాజనీతిని అనుసరించాలనుకొన్నాడు. అంగదుణ్ణి రావణుడి దగ్గరకు రాయబారం పంపాలని నిశ్చయించుకున్నాడు. ''అంగదా! నా మాటలుగా రావణుడికి ఈ సందేశం అందించు. 'ఓ రావణా! లంకకు వినాశకాలం వచ్చింది. దొంగచాటుగా నీవు నా భార్యను అపహరించుకొనిపోయినావు. నేను దండధరుడినై ఇప్పుడు నిన్ను దండించడానికి వచ్చాన. నీ తమ్ముణ్ణి విభీషణుణ్ణి లంకారాజ్యానికి అధిపతిని చేస్తాను. లంకానగరాన్ని తనవితీరా చూసుకో చివరిసారి. నీవు ఇక ముల్లోకాలలో ఎక్కడ దాగినా, ఎవరి శరణు జచ్చినా లాభం లేదు' అని రావణుడికి చెప్పవలసిందిగా అంగదుణ్ణి శ్రీరాముడు పంపించాడు.

ఆగ్రహజ్వాలలు ఎగసి పడుతున్నట్లు అంగదుడు రావణుడి సన్నిధికి వెళ్ళి, నిండు సభలో ఆ రావణుడి మంత్రులు అందరూ వింటూ ఉండగానే దూతకార్యం నెరపాడు. రావణుడికి పట్టరాని కోపం వచ్చింది. ''ఈ మూఢుణ్ణి బంధించి ప్రాణాలు తీయండి'' అని కండ్లనుంచి నిప్పులు రాలుస్తూ, మంత్రులను ఆజ్ఞాపించాడు రావణుడు, పెద్దగా కేకలు వేశాడు. అప్పుడు నలుగురు రాక్షసులు వచ్చి అంగదుడి రెక్కలు పట్టుకున్నారు. లంగిపోయినట్లు కావాలనే నటించాడు ంటదుడు. వాళ్ళను తన బాహుమూలాల్లో ఇరికించుకొని రావణుడి అంత్ణపురమహాప్రాసాదశిఖరం పైకి ఎగిరిపోయినాడు. తనను పట్టుకొన్న ఆ రాక్షసులను విదలించి నేలమీదకు విసరికొట్టాడు. తన పాదఘట్టనంతో, చేతిచరుపులతో ఆ భవనశిఖరాన్ని పడతోటయం ప్రారంభించాడు అంగదుడు. తరువాత దాన్ని పడగట్టి సింహనాదం చేస్తూ ఆకాశంలోకి ఎగిరిపోయినాడు. తరువాత శ్రీరాముడు దగ్గరకు పోయి నిలుచున్నాడు. రావణుడు తన క్రోధం విఫలమైన దనే విచారంతో నిట్టూర్పులు పుచ్చాడు.

వానరులు లంకను ముట్టడించడం

వానరసైన్యమంతా సింహనాదాలతో గగనాన్ని హోరెత్తించింది. వానరసైన్యాధిపతి అయిన సుషేణుడు అప్పుడు సుగ్రీవాజ్ఞ శిరసావహించి లంకాపట్టణం నాలుగు ద్వారాలు చూసివచ్చాడు. వానరసేనలను చూసి రాక్షసులు హతాశులైనారు. హాహాకారాలు చేశారు. ముంచుకొని వచ్చిన ప్రమాదాన్ని చూసి రాక్షసులు పోయి రావణుడికి చెప్పుకొన్నారు. లంకానగరం ప్రాకారం అంతా తిరిగి చూస్తుండగా శ్రీరాముడికి సీతాదేవి మదిలో మెదిలి చాలా ద్ణఖం వచ్చింది. ''త్వరగా లంను స్వాధీనం చేసుకోవలసింది'' అని తన సేనను ఆజ్ఞాపించాడు శ్రీరాముడు.

రావణుడు తన ప్రాసాదాగ్రభాగం మీదికి పోయి నేల ఈనినట్లు వస్తున్న ఆ వానరసైన్యాలను చూసి భయకంపితుడైనాడు. అంతకన్నా కుపితుడైనాడు. ధైర్యం తెచ్చుకొన్నాడు. ఈ వానరసైన్యా లన్నిటినీ నాశనం చేయటం ఎట్లా అనే ఆలోచనలో పడ్డాడు. అప్పుడు లంకాపట్టణం నాలుగు ద్వారాల దగ్గర పోరు ఘోరంగా జరిగింది.

వానరులు కోటగోడలు ఎగబాకారు. అగడ్తలు పూడ్చారు. ప్రాకారాలు బద్దలు చేశారు. లంకపై శిలావర్షం కురిపించారు. ఎదురైన రాక్షసులను చెట్లతో చావమోదారు. ఆకాశంలోనూ భూమిమీదా రాక్షసులూ, వానరులూ బాహాబాహీ కొట్టుకున్నారు. తన్నుకున్నారు. పీడించుకొన్నారు. పడతోసుకున్నారు. గర్జించుకొన్నారు. ఒకరినొకరు గోళ్ళతో చీల్చివేశారు.

వానరసైనికులు పరమోత్సాహంతో, పట్టరాని సంతోసంతో, చెప్పలేని సంరంభంతో గర్జించారు. ఇట్లా-

జయత్యతితబలో రామె లక్ష్మణశ్చ మహాబల్ణ
రాజా జయతి సుగ్రీవో రాఘవే ణాభిపాలిత్ణ (యుద్ధ.42.20)

'జయము జయము సాటిలేని పరాక్రమశాలి శ్రీరాముడికి, జయము జయము మహాబలుడైన లక్ష్మణుడికి. జయము జయము రాముడి అనుగ్రహం పొందిన సుగ్రీవుడికి!' అని పెద్ద పెట్టున జయజయధ్వానాలు చేశారు. పూర్వపు దేవాసురయుద్ధాన్ని తలపింపచేసింది రాక్షసులకూ, వానరభల్లూకసేనలకూ అప్పుడు జరిగిన యుద్ధం

ఇంద్రజిత్తు రంగప్రవేశం

గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు వానరసైన్యాల చుట్టూ తిరుగుతూ తమ సైన్యాన్ని సంరక్షిస్తున్నారు. రాక్షసులకూ వానరులూ భీకరయుద్ధం జరుగుతున్నది. వానరుల తాకిడికి రాక్షసులు తట్టుకోలేకపోతున్నారు. అప్పుడు ఇంద్రజిత్తు యుద్ధరంగప్రవేశం చేశాడు. యముడు రుద్రుడితో తలపడటానికి వచ్చినట్లు, ఇంద్రజిత్తు అంటదుడితో తలపడటానికి వచ్చాడు. రాక్షసులు అనేక సంఖ్యలో వానరులతో ద్వంద యుద్ధానికి పూనుకున్నారు. వాళ్ళ దేహాలనుంచి నెత్తురులు ఓడకలు కట్టాయి.

అప్పుడు ఇందజ్రిత్తు తన గదితో వాలిపుత్రుడుఐన అంగదుణ్ణి మోదాడు. అంగదుడు ఎగిరి ఇంద్రజిత్తు స్వర్ణరథాన్ని వికలం చేశాడు. ఆ రథం గుర్రాలను, సారథిని మట్టుపెట్టాడు. ప్రజంఘుడు విభీషణుడి మంత్రివీద భానప్రయోగం చేశాడు. సంపాతి అనే ఆ మంత్రి మద్దిచెట్టుతో ప్రజంఘుణ్ణి మోది చంపివేశాడు. జంబుమాలి రథం మీద వచ్చిన రథంతో సహా హనుమంతుడిపై కవిశాడు. అతులితబలధాముడైన ఆంజనేయుడు రథంలోకి దూకి జంబుమాలిని అరచేతులతో చరుస్తూ చావగొట్టాడు, తన మీదకు తీవ్రవేగంతో వస్తున్న ప్రతపనుడి కనుగుడ్లు ఊడబెరికాడు నలుడు. తీవ్రశరాలు గుప్పిఊ్త వస్తున్న ప్రఘనుణ్ణి సుగ్రీవుడు పెద్ద చెట్టుతో కొట్టి మట్టుపెట్టాడు.

అగ్నిహేతువూ, రశ్మికేతువూ, సుప్తఘ్నుడూ, యజ్ఞకోపుడూ అనే భయంకర రాక్షసులు శ్రీరాముడిపై బాణాలు వేయగా రాముడు తన నిశితశరాలతో ఆ రాక్షసుల తలలు తెగవేశాడు. మైందుడి పిడికిటి పోటుకు వజ్రముష్టి అనే క్రూరాక్షసుడు కళ్ళు తేలవేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నికుంభుడు నీలపర్వతంవంటి నీలుడిమీద నిశితాస్త్రాలు గుప్పించాడు. నూరుబాణాలు ఒకేసారి ప్రయోగించి, నవ్వుతున్న నికుంభుడిపై విష్ణుపరాక్రముడేమో ననుకొనేట్లు నీలుడు పరాక్రమించి వాడి శిరస్సు ఖండించి వేశాడు. వాడి రథచక్రం ఊడగొట్టి దానితో రథసారథిని చంపాడు. అశనిప్రభుడనే రాక్షసుణ్ణి వజ్రకాయుడైన ద్వివిదుడు చెట్లతో, మొనదేలిన కొండరాళ్ళతో కొట్టి చంపాడు.

రథం మీద వచ్చిన విద్యున్మాలి సుషేణుడి మీద శరపరంపరను ప్రయోగించి ఉత్సాహసూచకంగా అరిచాడు. పెనుశిలతో తనను మోదవస్తున్న సుషేణుడి వక్ష్ణస్థలాన్ని పెనుగదతో విద్యున్మాలి కొట్టాడు. దీనితో పట్టరాని ఆగ్రహావేశంతో సుషేణుడు తనచేతిలో ఉన్న కొండరాతిని విద్యున్మాలిపై విసిరాడు. దీనితో విద్యున్మాలి హతుడైనాడు. వివిధాయుధాలతో ఇరుపక్షాలు ఘోరంగా పోరాడాయి. యుద్ధభూమి పరమభయంకరంగా రక్తప్రవాహ పంకిలమైంది. రాక్షసులు సూర్యాస్తమయం కోసం ఎదురుతెన్నులు చూశారు. ఇంతలో అంధకారం కమ్ముకొన్నది. రాక్షసులు విజృంభింగా అంతకన్న మించిపోయి వానరసైన్యం విజృంభించి రాక్షసులను చంపివేయసాగింది. రామలక్ష్మణులు అసంఖ్యాకంగా రాక్షసవీరులను నేలకూల్చారు.

ఆ గాఢాంధకారంలో రాక్షసులు బాణవర్షం కురిపిస్తూ రాముణ్ణి చుట్టుముట్టారు. అట్లా రాముణ్ణి సాధించాలని వచ్చిన ఆరుగురు మహారాక్షసులు మహోదరుడు, మహాపార్శ్వుడు, యమశత్రువు వజ్రదంష్ట్రుడు, శుకసరాణులు అనేవారు రాముడి ముందు నిలవలేక పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. రాముడి పరాక్రమం ముందు అగ్గిలో పడి మాడిపోయే మిడుతలలాగా రాక్షసులు రూపుమాసిపోయారు.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)