కథా భారతి - అనగనగా ఓ కథ
తాబేళ్లు
- ఘండికోట బ్రహ్మాజీరావు

చీఫ్ యింజనీరుగారు ఫీల్డు మైకులో మాటాడుతున్నారు.

"మరొక్క పదినిమిషాలలో పని ప్రారంభించాలి. పోలీసువారి పరిశోదన ముగిసింది. ముందుపడిన యింజనులు ఒకరు, పట్టాలు తప్పిన పెట్టెలను మరొకరు, ఇద్దరు యింజనీర్లు ఎత్తించి, రైలుదారి బాగుచేయాలి రేపు మధ్యాహ్నం పండ్రెండు గంట్లవేళకు రైళ్ళు మామూలుగా నడవాలి."

చీఫ్ యింజనీరుగారంటే క్రింది వాళ్ళకు సింహస్వప్నం. అన్న నిమిషానికి పని పూర్తి కాకపోతే చాలా యిబ్బందులు పడవలసి వస్తుంది.

రెండు ఇంజనులూ పట్టాలు తప్పాయి. ముందుది పట్టాలు తప్పి రాళ్ళలో నిలుచుంది. రెండవది వెల్లకిల పడి చక్రాలు ఆకాశానికి చూపించుతున్నది.

ఇంజనుల వెనుకనున్న నాలుగు పెట్టెలు పట్టాలు తప్పినవి. డ్రైవర్లకు చిన్నగాయాలు తగిలాయి. కొంతమంది ప్రయాణికులకు కూడా చిన్నచిన్న దెబ్బలు తగిలాయి. ప్రథమ చికిత్స కోసం కూడా చూడకుండా కొంతమంది పారిపోయారు. రైలు మరొక్క పదినిమిషాలలో నగరం చేరుకోవలసింది. ఇంతలోనే ఈ ప్రమాదం సంభవించింది.

రాత్రి తొమ్మిది గంటలవేళ ప్రమాదం జరిగింది. మరొక్క గంటలోనే స్టేషను నుండి, నగరం నుండి పోలిసులు, డాక్టర్లు, రైల్వేవారు అందరూ వచ్చారు. అప్పటినుంచీ జనంలో వార్త అల్లుకుపోయింది. ప్రజలు మాఘమాసపు చలిని కూడా లక్ష్యపెట్టకుండా వచ్చిపడ్డారు.

వెంటనే ఏమిచేయడానికి వీలయింది కాదు. ప్రయాణికులలో చాలామంది ప్రాణాలు దక్కినందుకు పిట్టాల్లా ఎగిరిపోయారు. మిగిలిన వారిని స్టేషనుకు పంపించారు.

రాత్రికి రాత్రే అక్కడ పనివాళ్ళు గుడారాలు వేశారు. లైట్లుపెట్టారు. ఫీల్డు మైకు, లౌడుస్పీకర్లు అమర్చారు. ప్రతి పదినిమిషాలకు హెచ్చరిస్తున్నారు. పైనుంచి పెద్దవాళ్లు తెల్లవారేసరికి చేరుకున్నారు. అంతవరకు ఏ పనిచేయలేదు. తరువాత కూడా చేయడానికి పోలీసుల ఆచూకీ పూర్తి కాలేదు. రాత్రి గడిచిపోయింది.

మధ్యాహ్నం దక్షిణం నుంచి ఒక జట్టు వచ్చింది. చిన్న యింజనీరు రావు, ఇద్దరు ఫోర్మెనులు, పనివాళ్లు వచ్చారు బళ్ళనెత్తడానికి. ఉత్తరం నుండి ఒక జట్టు ఇంజనులని ఎత్తడానికి వచ్చింది.

కాని, పని మొదలుపెట్టడానికి వీలుకాలేదు. పోలిసులు ప్రదేశాన్ని చుట్టుముట్టారు. తెల్లవారిన దగ్గర నుండి ప్రజలు రావడం హెచ్చయింది.

అదొక యాత్రాస్థలంగా మారిపోయింది. పిన్నలు, పెద్దలు, స్త్రీలు.... అందరూ వస్తున్నారు. వాళ్ళకోసం టీ దుకాణాలు, పకోడి దుకాణాలు, వేరిశనగ తట్టలు రావడం మొదలయ్యాయి.

ప్రమాదం జరిగినచోటు ఒక కటింగ్‍లో ఉంది. ఎత్తయిన దిబ్బకోసి లైనులువేశారు. పట్టాలు తప్పిన నాలుగు పెట్టెలలో మొదటిది ఎడమవైపు దిబ్బ పైకెక్కి వెనుక చక్రాలమీద నిలుచుంది. రెండవది కుడిచేతివైపు దూసుకుపోయి దిబ్బను దున్నిపారేసింది. మూడవది పార్సెలు పెట్టి- అది మధ్యకు రెండుముక్కలుగా విరిగింది. పైనున్న రేకు పట్టుతో కలిపి ఉంది. నాలుగవది పట్టాలు తప్పి నిలుచుంది. ఆ వెనుక పెట్టెలు పోలీసులు, రైల్వేవారు ఉండటానికి తాత్కాలికమైన ఆశ్రయమిచ్చాయి.

దక్షిణం నుంచి వచ్చిన రావు రాగానే అంతటా తిరిగివచ్చాడు. రైలు పట్టాలు ఎవరో వేరుచేశారు. ఎగువకు పోయే లైను, దిగువకుపోయే లైను కూడా ఈ ప్రమాదంవల్ల రాకపోకలకు వీలుకాకుండా పోయాయి. ఆ రెండు లైన్లమధ్య రావుకొక వింతదృశ్యం కనుపించింది. అక్కడో ఎముకలకుప్ప ఉంది. చిరిగిన ఆడవాళ్ల రవికలు ఉన్నవి. పనికిరాని చింకి జోళ్ళు, తల వెండ్రుకల చుట్టలు, మానవుల పుర్రెలు ఉన్నవి. వాటి పక్కనే రైలుపట్టాలు వేరయి, ప్రమాదం సంభవించింది. ఈ అమంగళకరమైన వస్తువులకు, జరిగిన రైలు ప్రమాదానికి ఏమి సంబంధం.... ఏదో ఉంది కాబోలు.... ఎవరు వేరయారో.... ఎవరు తిరిగిరాలేదో....

రావు, ఫోర్మెనులు తిరుగుతున్నారు. పోలీసులు అనుమతి యిచ్చే వరకు తిరుగుతున్నారు. ఏ పెట్టలను ముందు ఎత్తాలో, ఏ పెట్టలను కోసి వేరుచేయాలో, ఎంతమంది పనివారిని ఎక్కడ నియోగించడమో ఆలోచిస్తున్నారు.

సాయంకాలం వేళకి పోలీసు కుక్కలు వచ్చాయి. అవి అంతటా తిరిగి ఎవరినీ గుర్తుపట్టలేక పోయాయి. అప్పటితో పోలీసులు అనుమతించారు. రైలుపెట్టెలను ఎత్తటానికి, అప్పుడే ఛీఫ్ యింజనీరుగారు మైకులో ఆర్డర్లిచ్చారు చిన్న ఇంజనీర్లకి. పట్టాల మీదనున్న పెట్టలను వెనుకను లాగేశారు. చెడిపోయిన రైలులైను బాగుచేసుకుంటూ ముందుకు వచ్చేసరికి రాత్రి పన్నెండు గంటలవేళ అయింది.

అపుడు విరిగిన మూడో పెట్టె దగ్గరికి వచ్చాడు రావు. అంతవరకు వచ్చిపోతున్నారు గాని దీక్షగా అక్కడ నిలబడి ఉండలేదు. పెట్రోమాక్సులైట్ల వెలుతురులో ఆ విరిగిన పార్సెలు పెట్టెను చూస్తున్నాడు.

ఛీఫ్ ఇంజనీరుగారు ఇంతలో అక్కడికి వచ్చారు. దానిని గాస్‍తో కోయాలి. గాస్‍సిలిండర్ లు అక్కడకు తెచ్చి పైపులు తగిలిస్తున్నారు.

"రావ్ : ఈ పెట్టను తీసివేయడానికి ఎంతకాలం పడుతుంది?" అడిగారు ఛట్టర్జీగారు.

"అవునుసార్ : _ అవును :_" అన్నాడు పరధ్యానంగా రావు.

"అవునేమిటీ?" కోపంగా ప్రశ్నించాడు ఛీఫ్.

"చూడండి సార్: ఇంతవరకు అవి చచ్చిపోయినవనుకున్నాను. కాని కాళ్ళు ఆడిస్తున్నవి_"

ఛీఫ్ చూచారు.

"పొద్దున్నే చెప్పాను. వీటిని తీసుకొని పొమ్మని కాని ఎవరూ రాలేదా?"

"రాలేదు సార్:"

ఛీఫ్ వెళ్ళిపోయారు. తిరిగి మైకులో మాట్లాడారు-- పార్సెలు పెట్టెలోనున్న తాబేళ్ళను తీసుకొనిపొమ్మని.

కాని ఎవరూ రాలేదు. మనుషులందరూ చెల్లాచెదరైపోయారు. వాటిని తోసుకుని పోవలసిన సిబ్బంది, పని చేస్తున్న వాళ్ళకు రొట్టెలు, టీ తేవడానికి ట్రక్కులో బజారుకి వెళ్ళిపోయారు.

రావు చూస్తూ నిలబడ్డాడు __ మధ్యాహ్నం సంగతులు అతని మనస్సులో కదుల్తున్నాయి.

గుట్టమీద నుంచి విసురుగా ఒక పడుచు, ఒక కాలేజీ విద్యార్థి క్రిందికి దిగి ఒక్కసారిగా ఆగిపోయారు.

"చూడు: ఎంతపెద్దవో ఈ తాబేళ్లు? కాని వాటి మెడలు ఎంత చిన్నవో__ మనుషులను చూచి వాటిని లోపలికి ముడుచుకుంటాయి, భయంతో__"

వాళ్ళు వెళ్ళిపోయారు.

ఒక చిన్న కుర్రాడూ, వాడి తండ్రి కాబోలు దిగివచ్చారు.

నాన్నా : __ ఈ తాబేళ్ళను ఇలా వీపుమీద పడేశారేం?"

"పారిపోతాయని__"

"అవి నడవనే లేవుకదా? __ ఎలా పారిపోతాయి"

"అలాగే మెల్లగా పారిపోతాయి__ నీరు దొరికిందంటే మరి పట్టుకోలేం."

వాళ్ళుకూడా వెళ్ళిపోయారు. తరవాత ఎవరో పెద్ద మనుష్యులు, పంచెలు, వాచీలు, చేతికర్రెల వాళ్లొచ్చారు... వ్యాపార సరళిలో మాట్లాడుతున్నారు...

"పూరీలో ఈ తాబేలు ధర అయిదు రూపాయలు మాత్రమే.... కలకత్తాలో ఎంతో తెలుసా, రమారమి నూరు రూపాయలు. మామూలు వాళ్ళు తినేదనా మీ అభిప్రాయం: పీరీ తాబేలుకు గ్రాండ్‍హోటలులో మంచి గిరాకీ... దొరలు పడిచస్తారయ్యా వీటి కోసం"

రావుకన్నీ వినిపిస్తున్నాయి. ఎదురుగుండా ఉన్న అరలో మూడు తాబేళ్ళున్నాయి. విరిగిన రెండూ పక్క కాలువలో ఉన్నాయి. అరలోని తాబేళ్ళలో రెండు వెనుకకి ఉన్నాయి. ఒకటి ముందుకొచ్చి ఉంది. అది విరిగిన అరమీద వెల్లకిలా పడిఉంది. దాని మెడ దిగువకు వేలాడుతూ ఉంది. దాన్ని లోపలికి తీసుకోవాలని అదిప్రయత్నం చేస్తూ ఉంది. కాని మెడ వ్రేలాడుతూనే ఉంది.

దిగువకు వ్రేలాడుతున్న తలలో రెండు కళ్ళున్నవి. ఆ కళ్ళు ఉబ్బి ఉన్నవి. రెప్పలు లేనికళ్ళు అరిగిన గోళీకాయలలా కనిపిస్తున్నాయి. ఆ చిన్నకళ్ళ నుండి అప్పుడప్పుడు ఒకటి రెండు చిక్కటి చుక్కలు పడుతున్నవి... అవి అలానే ఉన్నవి.... మధ్యాహ్నంనుంచి.... కాదు కాదు... ప్రమాదం జరిగిన రాత్రి నుండి...

"పనిమానేసి ఏంచూస్తున్నావు, రావ్?" భుజంమీద చేయివేసి అడిగారు ఛీఫ్ ఇంజనీరుగారు.

"ఈ తాబేళ్ళే సార్ :__"

"పాపం : ..."

"ఏంచేయడమో నాకు తోచకుండా ఉంది సార్: ..."

"ఏముంది... అవి ఉన్నాలేనట్లే... ఇప్పటికే చాలకాలం వీటికే వ్యర్థమయింది."

అవిభాదతో కన్నీళ్ళు కారుస్తున్నవి సార్: ...."

"రావ్ : ... అవి కన్నీళ్ళుకావు... నాకీ విషయం తెలుసు... పడేవవి నెత్తురు చుక్కలు... పట్టుకున్న తరువాత ఈ తాబేళ్ళు ఎక్కడికీ పారిపోకుండా కళ్ళు పొడిచేస్తారు... అవి ఒకంతటికీ చావవు... ఎంత మరణబాధకైనా నిలబడతాయి...."

"ఏంచేయడం?"

"ఈ చచ్చేతాబేళ్ళ కోసం మరి, కాలం వ్యర్థం చేయడానికి వీలు లేదు"

ఆయన వెళ్ళిపోయారు. ఇది ఆజ్ఞ.

వెల్డరు నారాయణ ముందుకు వచ్చాడు. సగం విరిగిన పార్సెలు’పెట్టె ’పై కప్పు కోయడానికి మీద కెక్కాడు.

నీలి మంట .... అది ఇనుపరేకునుతాకి వంగపండు రంగుగా మారింది. నిప్పు రవ్వలు.... కాకారపూలు ..... అవి పక్కను కాలువలో పడిన తాబేళ్ల మీద ముందు పడ్డవి. వాటి చురకలకి అవి ఇటు అటు గాలిలో కాళ్ళు ఆడిస్తున్నవి.

తరువాత మీదనున్న తాబేలుపై నిప్పు రవ్వలు పడడం మొదలయింది. మొదట ఒకటిరెండు.... తరువాత జల్లులుగా పడుతున్నవి. కప్పులేని దాని కడుపుమీద అవి వాతలు పెడుతున్నవి. అది కాళ్ళను గాలిలో విదలిస్తున్నది ... తల ఇటు అటు తిప్పుతున్నది.

"నారాయణా ! ... పూర్తికాకుండా, వెనుక నున్న ఛీ ఫ్‍యింజనీరు అతని భుజంతట్టారు.

"పని ఆగడానికి వీలులేదు ... అప్పుడే రెండుగంటల రాత్రి దాటింది. ఇంకా రెండు పెట్టెలు ఎత్తవలసి ఉంది. ఒక్క నిముషంకాదు. ఒక సెకండు కాలం వ్యర్థమయినా, అనుకున్న వేళకు రైళ్ళు నడపడానికి లేదు" అన్నారాయన.

నారాయణ తొందరగా కోస్తున్నాడు.... నిప్పుల రవ్వలు కావని... కాకరపూలు కావని ... అవి కరుగుతున్న లోహపు ధారలు... కప్పులేని మెత్తటి తాబేలు కడుపుమీద పడుతున్నవి. అవి వాతలు పెట్టటం లేదు.... మర్మాలను ఛేదిస్తున్నవి .... తాబేలు విలయతాండవ మాడుతున్నది. కళ్ళంట ధారలు కారుతున్నవి.... దాని కళ్ళు, ముఖం మరీ ఉబ్బీనవి.

ఠప్! .... అంతవరకు పై రేకుతో కలిసిన రెండుముక్కలు ఒక్కసారి విడిపోయాయి. తాబేలుపడుతున్న బాధకు అది అంతం .... కపాల మోక్షం కాబోలు ... ఆ తాబేలు పరలోకాలకు వెళ్ళిపోతుంది.

రావు అదిరిపడ్డాడు.... అంతవరకు వెనుకనే ఉండి చూస్తున్న ఛీఫ్ వెళ్ళిపోయారు .... క్రేను ముందుకు వచ్చింది. ఆ పెట్టెముక్కలను తాబేళ్ళను ఎత్తి, వెనుకకు తీసుకునిపోయి, దూరంగా పారేసివచ్చించి.

"అప్పారావూ : .... ఆ తాబేలు చచ్చిపోయిందా?" తిరిగి వచ్చిన క్రేను డ్రైవరును అడుగాడు రావు.

"లేదుసార్ : ... ఆ పెట్టె దూరంగా పారేసిన తరువాత చూసాను సార్: ..... అప్పటికే అది తల తిప్పి, కాళ్లు ఆడిస్తున్నది ......"

కపాల మోక్షం పెట్టెకు? ... తాబేలు ఎందుకు బ్రతికి ఉంది....

* * * *

అనుకున్న వేళకు రైళ్ళు నడిచాయి. రావు పరివారాన్ని తీసుకుని దక్షిణానికి వెళ్ళిపోయాడు.

ఛీఫ్ యింజనీరు ఛటర్జీగారు మాత్రం ఉండి పోయారు .... రెండు రోజులయి అతను ఒకచోట కూర్చొని నాలుగు మెతుకులు తినలేదు.... నడుస్తూనే టీ త్రాగడం రొట్టె ముక్కలు నమలడం చేస్తున్నాడు..... సాయంకాలం శుభ్రంగా స్నానంచేసుకొని, రాత్రి భోజనానికి ఊరిలోనున్న పెద్ద హోటలుకి వెళ్ళిపోయాడు.

బేరరు వచ్చాడు. ఆయన పూర్తి డిన్నరు ఆర్డరుచేశాడు. బేరరు వచ్చేవరకు ప్రక్కనే వున్న మెనూకార్డు చూచాడు....

వరుసగా చదువుతున్నాడు __ సూప్ __ స్పెషల్‍టర్టిల్ సూపు__ ప్రెంచిప్రై__ చికెన్ __ వరుసగా ఏవేవో : ఆయన మామూలుగా చదివి కార్డు పక్కన పెట్టాడు.

బేరర్ ముందుగా సూప్‍తెచ్చాడు. బౌల్ నుంచి మంచి వాసనలు వస్తున్నవి ఏమి సూపిది... ఇది స్పెషల్ ... టర్ట్ల్ సూపు ... టర్టిల్ ...... తాబేలు.....

ఆ సూపును ఆయన కళ్ళు పెద్దవిచేసి చూచారు.

అందులో ఆయనకో వాలిన మెడ, దాని కంటిన చిన్న తల, ఆ తలలో అరిగిన గోళీలవంటి రెండు కనులు ... వాటి నుండి చుక్కలు .... కరిగిన లోహపుధారలకు పెరిగిన నెత్తుటి చుక్కలు.....

ఆ సూపు బౌలు పక్కకు పెట్టేశారు.

ఛీఫ్ యింజనీరు ఛటర్జీగారు గబ గబా గ్లాసుడు మంచినీళ్ళు త్రాగి టేబిలు నుండి లేచిపోయారు.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)