సారస్వతం
సతీ అనసూయ
- టీవీయస్. శాస్త్రి

అనసూయ -- ఎంత చక్కని అర్ధవంతమైన పేరు. అనసూయ అంటే అసూయ, ద్వేషాలు లేనిదని అర్ధం. ఈ పురాణ మహాసాద్వి అత్రి మహాముని భార్య, సాక్షాత్తు దత్తాత్రేయుని తల్లి. ఈ మహాసాధ్వికి అద్భుతమైన దివ్యశక్తులున్నాయి. అయినప్పటికీ, సాధారణ గృహిణిగానే ప్రవర్తించేది. అలా ఉండటమే యోగం, యాగం అంటే! అలా ఉండబట్టే, తాను సాధారణ స్త్రీ అనే భావన ఆమెలో ఉండబట్టే ఆమెకు అన్ని మహిమలు వచ్చాయి. ద్వేషం, అసూయలనుండి దూరంగా ఉంటే మనిషి దేవుడవుతాడు. ఈ మహా సాధ్విని గురించి రామాయణంలో కూడా ప్రస్తావించబడింది. ఒకసారి నారదుడు ఈమె పాతివ్రత్యాన్ని గురించి త్రిమూర్తుల భార్యల వద్ద ప్రస్తావిస్తాడు! దానికి వారు అసూయ చెంది అనసూయ పాతివ్రత్యాన్ని భంగం చేయమని తమ భర్తలను వేడుకుంటారు! దానికి సరేనన్న త్రిమూర్తులు మారు వేషాలతో ఆమె వద్దకు అతిధులుగా వెళ్లి, భోజనం పెట్టమని అడుగుతారు! అయితే ఆమె నగ్నంగా ఉండి వడ్డిస్తేనే ఆతిధ్యాన్ని స్వీకరిస్తామని వారు చెప్పారు! వెంటనే వచ్చినవారు సామాన్యులు కాదని ఆమె భావించింది! వచ్చినవారిని పసిబాలురిగా మార్చి నగ్నంగానే ఆతిధ్యం ఇస్తుంది. త్రిమూర్తుల భార్యలు ఈ విషయాన్ని తెలుసుకొని, ఆమె వద్దకు వెళ్లి తమ భర్తలను మళ్లీ వారి రూపాల్లోకి తెమ్మని ఆమెను ప్రాధేయపడ్డారు! అందుకు అంగీకరించిన ఆమె త్రిమూర్తులకు అసలు రూపాన్ని ప్రసాదిస్తుంది. త్రిమూర్తులు ఆమె పాతివ్రత్యాన్ని సంతోషించి ఏదైనా వరం కోరుకొమ్మని అడుగుతారు. అందుకు ఆమె త్రిమూర్తుల అంశ కలిగిన ఒక కుమారుడిని ప్రసాదించమని కోరుకుంటుంది! ఆ వరం మహిమ వల్ల పుట్టినవాడే దత్తాత్రేయ స్వామి! తన పాతివత్యం చేత, ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉండటం చేత భూలోకం మొత్తాన్ని సైతం భయంకర కరువు కాటకాలనుండి కాపాడగలిగింది. ఆ కథను క్లుప్తంగా చెబుతాను. ఆ రోజుల్లో ఒకానొక సందర్భంలో వర్షం లేక పది సంవత్సరాలైంది. ప్రపంచమంతా తల్లడిల్లిపోతుంది. నదీనదాలు పూర్తిగా ఎండిపోయాయి. అతి పెద్ద నది, విష్ణువు పాదాలనుండి ఉద్భవించిన గంగానది సైతం ఎండిపోయింది. అటువంటి సమయంలో అనసూయ తన తపశ్శక్తితో నదులన్నిటికీ జీవాన్ని పోసి వాటిని ప్రవహింప చేసి, భూమిని, సర్వప్రాణి కోటిని కాపాడగలిగింది. ఈ కథ, సంఘటనలోని అంతరార్ధం తెలుసుకుందాం! స్త్రీ ఒక మహా శక్తిస్వరూపిణి. ఈ భూమి మీద ఆమె నిర్వహించే పాత్ర అనిర్వచనీయం. ఓర్పుకు, నేర్పుకు స్త్రీ ప్రతీక. అందుకే స్త్రీని 'క్షమయా ధరిత్రి' అని అంటారు. సృష్టికి మూలం స్త్రీయే! ఆమె లేకుండా ఏదీ జన్మించబదదు. ఆమె లేకపోతే సృష్టి అంతమౌతుంది. ఈ విషయాన్ని గుర్తించక ఈ కలియుగంలో చాలామంది మూర్ఖులు 'గర్భం'లో ఉండగానే ఆ ఆదిశక్తిని భ్రూణహత్య చేస్తున్నారు. దీనికి స్త్రీమూర్తులు కూడా సహకరించటం మరీ దారుణం! అందుకే ప్రస్తుతం స్త్రీ జనాభా తగ్గి, స్త్రీ పురుష నిష్పత్తిలో సమతుల్యం లేక చాలా అకృత్యాలు జరుగుతున్నాయి. మానభంగాలకు ఒక కారణం కూడా అదే! ఇక చాలామంది వరులు 30 ఏండ్లు వచ్చినా కన్యామణులు దొరకక అవివాహితులుగానే మిగిలిపోతున్నారు. వీటన్నిటికీ కారణం-ప్రస్తుత సమాజానికి స్త్రీ అంటే ఉన్న చులకన భావనే కారణం! చేసిన దారుణమైన తప్పుకు యావత్ సమాజం శిక్షను అనుభవిస్తుంది. త్రిమూర్తులను సైతం పసిబిడ్డలుగా మార్చి వారికి పాలిచ్చిన దైవస్వరూపిణి అనసూయ! స్త్రీ శక్తిని గురించి తెలుసుకోవాలంటే, పురాణాలలోని చాలామంది స్త్రీ మూర్తులను గురించి తెలుసుకోవాలి. ధర్మం, త్యాగం మూర్తీభవించి, ఈ భూమిపైన నడయాడే దైవం స్త్రీ అంటే! అనసూయ వృత్తాంతం వాల్మీకీ రామాయణంలోని, అయోధ్య కాండలో 117,118, సర్గలలో విపులంగా చెప్పబడింది. సీతారాముల అరణ్యవాస సమయంలో, సీతారాములు అత్రి మహర్షి అనసూయల ఆతిధ్యాన్ని స్వీకరించారు. ఆ సందర్భంలో సీతా, అనసూయల సంభాషణ నుండి ఎన్నో నీతిదాయక సూక్తులను తెలుసుకొనవచ్చును. ఆ నీతి సూత్రాలు స్త్రీలకే కాదు, పురుషులకు కూడా ఆచరణీయాలే! సీతా అనసూయ సంభాషణలను గురించి మరొక సందర్భంలో తెలుసుకుందాం!


రామాయణ మహాకావ్యమ్ శతకోటి ప్రవిస్తరమ్
ఏకైకమక్షరమ్ ప్రోక్తమ్ పుంసామ్ మహా పాతక నాశనమ్
రామాయణ పారాయణం వల్ల లభించే ఫలితాలు అనంతం.

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)