మనబడి
ప్రతీచిలో తెలుగు ప్రభంజనం
- సీతారామ రాజు, దక్షిణ ఆఫ్రికా

అప్పుడెప్పుడో అమెరికా ఆఫ్రికా నుండి మనుషుల్ని బానిసలుగా చేసి అమానుషంగా లాక్కొచ్చింది ఇప్పుడేమో ఓ భాషాబంటుని అభిమానంతో ఆత్మీయంగా విమానంలో మోసుకొచ్చింది!

మహా సదస్సులో ఆదర స్వాగతం, అద్భుత ఆతిథ్యం ఎంతగానో అలరించాయి. వివిధ ప్రాంతాలనుండి వచ్చిన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, సమన్వయకర్తలు, నిర్వాహకుల ఆప్యాయతపు పలకరింపులు, అభిప్రాయాల కలబోతలు, అనుభవాల సారాలు మొత్తంగా అదో ఆనంద కోలాహలం. ఆ భాషానుబంధం మరపురానిది, మరువరానిది. ఆ అనుభూతుల ఆస్వాదన కోసమే సంవత్సరమంతా సదస్సు కోసమే ఎదురుచూస్తుందేమో అనిపిస్తుంది.

మన బడి కీర్తి కిరీటంలో ఒక రత్నం వచ్చి చేరింది. రాజుగారి విద్యారత్న రూపంలో పరిధుల్లేని ఈ భాషా సేవకు ఏదైనా విశ్వవిద్యాలయం డాక్టరేటు ప్రధానం చేయాలని కోరుకుంటున్నాను. ఇవన్ని స్వోత్కర్షలని అనుకోవక్కర్లేదు. ఈ గెలుపు గీతికలే మనకు ఉత్ప్రేరకాలై మన పనికి మరింత ఉత్సాహాన్నిస్తాయి. అయినా హానికరమైన దురలవాట్లను పెంపొందించే ఉత్పత్తుల గురించి విపరీతమైన ఊకదంపుడు ప్రచారం జరుగుతున్న ఈ రోజుల్లో మన సంస్కృతికి మూలమైన భాషకు, భాషాసేవకు ఎంత ప్రచారం కల్పించినా తక్కువే అవుతుంది.

పురిపుష్ఠమైన పదసంపదతో అలరారుతున్న అపూర్వమైన భాష, శిలాశాసనాల భాషగా మొదలిడి, నన్నయ్య నట్టింట నడయాడి, తిక్కన్న కలంలో తియ్యదనాన్ని జుర్రుకొని, పోతన్న కైతలన్ని పోతపోసుకుని, శ్రీనాథుని శృంగార సిరులు అద్దుకుని, అష్టదిగ్గజాల ప్రబంధాలలోని కావ్యనాయికలా కవ్వించి, గిడుగు బాడిలో వ్యావహారిక సొబగులు దిద్దుకుని, గురజాడ అడుగులో కొత్త పంతలు తొక్కి, కిన్నెరసాని ఒంపుసొంపుల్ని ఒడిసిపట్టిన నవరసభరిత నా తెలుగు. మందార మకరంద మాధుర్యాలను పంచి మన్ననలను పొందిన అజరామరమైన భాష... వెరసి మన అమ్మ భాష.

తెలుగు ఆ పేరు వింటేనే మనసులో కోటి వెలుగులు విరబూసిన ఓ అవ్యక్త భావన. అదో తేనెవాగు.

అభివ్యక్తి పరిణతకు, విషయపరిపుష్ఠికి అద్దం పట్టే భాష. కాలగతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఒదగగలిగిన సామర్థ్యం ఉన్న భాష. ప్రపంచంలో చెప్పుకోదగ్గ 6 వేల భాషల్లో 13వ స్థానంతో వెలుగుతున్న భాష. శక్తివంతమైన 10 భాషల్లో తెలుగు ఒకటి. కావ్య భాషగా తెలుగుతో పోటీపడగల భాషలు కేవలం 5-6 ఉంటాయేమో! హృదమైన పద్యం తెలుగు భారతికి నైవేద్యం. అంతటి తెలుగు పద్యఛందస్సుతో పోటీపడగల భాష లేనేలేదేమో...

ఇంతటి అద్భుతమైన తెలుగు భాష ఒక తరం నుండి తరువాత తరానికి అలా అలా ప్రవహించి జీవద్భాషగా చిరంతరం వర్థిల్లాలి. ఆపై ఎదిగి ప్రపంచ భాషగా ఫరిడవిల్లాలి అనే సదాశయంతో అమ్మ భాషను అమెరికాలోని తెలుగు పిల్లలకు నేర్పించాలని... ఒక గుడిలో బడిగా మొలకెత్తి ఆపై మనబడిగా వడివడిగా సమున్నత వృక్షంగా ఎదిగి అజంతాల భాషను దిగంతాలకు వ్యాప్తి చేస్తూ అంతర్జాతీయ యవనికపై తెలుగు భాషా కీర్తిపతాకను రెపరెపలాడించింది సిలికానాంధ్ర. ఈ క్రమంలో మనబడి కలిగిస్తున్న భాషా చైతన్యం, భాషా వికాసం నిత్యస్మరణీయం.

మనబడిలో అభ్యసిస్తున్న పిల్లలే తెలుగు భాషావృక్షపు నవప్రసూనాలు. అమ్మ భాషకు స్వచ్ఛమైన వారధులు. వారు సాధిస్తున్న విజయాలే మనకు స్ఫూర్తిమంత్రాలు.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)