సారస్వతం
గంగిరెద్దు - లఘుచిత్రం
- కృష్ణ చెన్నాప్రగడ

ఎంతో గొప్పదైన తెలుగు సంస్కృతి మనది. మనుషుల మధ్య ఆత్మీయానురాగాలు పెంపొందించే అచార వ్యవహారాలు, సంప్రదాయాలను అణువణువునా నింపుకున్న జాతి మనది. ఉదాత్తమైన ఈ కోవకు చెందిందే గంగిరెద్దులాట సంప్రదాయం. తన కళారూపాన్ని ప్రదర్శిస్తూ అందరూ సిరి సంపదలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని బసవన్న ద్వారా దీవెనలందిస్తాడు గంగిరెద్దులవాడు. ప్రతిగా బియ్యమో, డబ్బులో, పాతబట్టలో ఇచ్చి పంపుతారు ఊరివాళ్ళు. కళలను పరిడవిల్లింపచేయడంతో పాటు సమాజంలోని అన్ని వర్గాల ప్రజల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించే తత్త్వం కూడా మన సంప్రదాయాల్లో ఇమిడి ఉండటం విశేషం. వ్యవసాయ ప్రధానమైన మన ప్రాంతాల్లో, జీవన విధానంలో పాడి, పశు సంపదకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆవుని గోమాతగా పూజిస్తాం. ఎద్దు శివుడి వాహనం అయిన నందీశ్వరుడిగా, బసవన్నగా పూజలందుకుంటుంది. తొలకరి సమయంలో ఎడ్లని చక్కగా అలంకరించి పూజ చేయడంతో వ్యవసాయారంభం అవుతుంది. దేశానికి వెన్నెముక రైతు అయితే పొలంలో కాడెని మోస్తూ రైతుకే వెన్నెముకగా నిలుస్తుంది ఎద్దు.

రైతుకి పంట అమ్ముడయ్యి చేతిలో నాలుగు డబ్బులాడే సమయం సంక్రాంతి వేళ. ఈ రోజుల్లో గంగిరెద్దులాట కొన్నాళ్ళు నడుస్తుంది. గంగిరెద్దు ఆడించేవాడిని సన్నాయి అప్పన్న అంటారు. ఎద్దుకి శిక్షణ ఇచ్చి ఎంతో చక్కగా అలంకరించి గంగిరెద్దుగా మార్చి ఊరూ వాడా దాన్ని తిప్పుతాడు. తాను సన్నాయి వాయిస్తూంటాడు. “వ(అ)య్యగారికీ దండం పెట్టు అమ్మ గారికీ దండం పెట్టు” అంటూ గంగిరెద్దు చేత నమస్కారం పెట్టించడం మొదలు అనేక చిత్ర విచిత్ర విన్యాసాలు చేయిస్తూంటాడు. ఇవి అన్ని వయసుల వారిని ఎంతో అలరిస్తూంటాయి.

తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు ఆదరణ తగ్గడంతో గంగిరెద్దులాడించే వాళ్ళ జీవితాలు దుర్భరంగా మారాయిప్పుడు. వారి మొహంలో దైన్యం అలుముకుంది. ఒకప్పుడు గొప్ప గొప్ప కీర్తనలు ఆలవోకగా పాడిన వారి సన్నాయిలో నేడు విషాదం పలుకుతోంది. వారి జీవితం శ్రుతి తప్పింది. సాధారణంగా వీరు స్థిర నివాసాలు లేనివారు, భూములు లేని వీరి కుటుంబాల్లో విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తక్కువ. తరతరాలుగా నమ్ముకున్న వృత్తిని వదల్లేక ఆ వృత్తిలో మనుగడ లేక నానా బాధలు పడ్తున్నారు. మనోవేదన చెందుతున్నారు. వారికి గంగిరెద్దు ఒక ఆత్మీయ నేస్తం, బంధం. కుటుంబంలో ఒక భాగం. తమకిన్నాళ్ళూ అన్నం పెట్టిన గంగిరెద్దుకి నాలుగు గడ్డి పరకలు కొనలేక గంగిరెద్దులవాడు పడే క్షోభ గుండెల్ని పిండేస్తుంది. అయినా సరే తన వృత్తిని కొనసాగించుకోడానికి అతడు తాపత్రయపడుతూనే ఉంటాడు. దీన్ని కథాంశంగా ఎన్నుకుని ప్రఖ్యాత రచయిత, నటులు, దర్శకులు యల్ బి. శ్రీరాం “గంగిరెద్దు” అనే పేరిట ఒక లఘు చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో ఎంతో హృద్యంగా నిర్మించారు. తాను గంగిరెద్దువాడిగా నటించారు. ఆయన ఈ చిత్రాన్ని ప్రపంచానికంతటికీ ఉచితంగా యూట్యూబులో అందుబాటులో ఉంచారు. మన తెలుగు సాంస్కృతిక విలువలుతో పాటు మానవతా విలువల గొప్పతనాన్ని తెలియచెప్తూ సాగే ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. కధలో ఊహించని మలుపు చూసేవారిని కట్టిపడేస్తుంది. ప్రతీ తెలుగు వారూ చూడదగ్గ ఒక చక్కటి చిత్రమిది. సాటి తెలుగువారితో పంచుకోవల్సిన ఎంతో విలువైన చిత్రం, విలువలున్న చిత్రం – యల్ బి శ్రీరాం తీసిన “గంగిరెద్దు”

"గంగిరెద్దు" లఘు చిత్రాన్ని చూడటానికి ఇక్కడ క్లిక్ చేయగలరు


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)