కబుర్లు - సత్యమేవ జయతే
తెలుగు సాహిత్యం పై సాంకేతిక ప్రభావం!
- సత్యం మందపాటి

పోయిన నెల (జూన్ 2016) అట్లాంటాలోని తామా (Telugu Association of Metro Atlanta) వారు వారి సాహిత్య సదస్సుకి నన్ను అతిధిగా ఆహ్వానించారు. “తెలుగు సాహిత్యం పై సాంకేతిక ప్రభావం” అనే విషయం మీద నన్ను మాట్లాడమన్నారు. ఈ విషయం మీద నా అనుభవాలు నాకు వున్నాయి కనుక, నాకూ అది ఇష్టమైన విషయమేనని సరే అన్నాను. అక్కడ మాట్లాడిన కొన్ని విషయాలకు, ఇంకా కొన్ని నా అనుభవాలు కలిపి ఈ వ్యాసం వ్రాస్తున్నాను.

నాకు తెలుగు వ్యాసాల్లోనూ, కథల్లోనూ ఇంగ్లీషు పదాలు, మరీ అవసరం అయితే తప్ప, వాడటం ఇష్టం వుండదు. కానీ ఈ వ్యాసంలో కొన్ని సాంకేతిక పదాలకు తగిన మాటలు దొరకకా, నాకు తెలిసిన అలాటి కొన్ని తెలుగు మాటలు మీకు అర్ధమవటం కోసమనీ ఇంగ్లీషులో వ్రాయక తప్పటంలేదు. క్షమించాలి.

‘తెలుగు సాహిత్యం పై సాంకేతిక ప్రభావం’ అనే వ్యాసాన్ని విషయపరంగా రెండు కోణాలలో, ఒకటి రచయితలపై సాంకేతిక ప్రభావం, రెండవది పాఠకులపై సాంకేతిక ప్రభావం ఎలావుంటాయో చూద్దాం. పత్రికా ప్రచురణ కర్తల పై కూడా ఎంతో వుంది కానీ, ఈ డిజిటల్ యుగంలో వాళ్ళ పనిని అది సుఖవంతమే చేసింది కనుకా, నేను వ్రాసే విషయాల్లో అదీ అంతర్లీనంగా వుంది కనుక, అది వేరే వ్రాయటం లేదు. ముందు రచయితగా డిజిటల్ యుగంలో నా అనుభవాలు చూద్దాం.

నేను 1967-68 సంవత్సరాలనించే ఆనాటి ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, యువ, జ్యోతి మొదలైన పత్రికలలో తరచుగా కథలు వ్రాస్తూ వుండేవాడిని. ముందు కథ కాగితాల మీద వ్రాసుకుని. తర్వాత దాన్ని నాకు చేతనయినంత చక్కగా మళ్ళీ వ్రాసి ఆ పత్రికలకు పంపేవాడిని. తర్వాత పెళ్ళయాక, నేనేవో కాగితాల మీద వ్రాస్తే, నా శ్రీమతి చక్కగా మళ్ళీ వ్రాసేది, ఆ కాపీని పత్రికలకి పంపించేవాడిని. ఏమాటకామాటే చెప్పుకోవాలి. నా చేతివ్రాత నాకే అర్ధమయేది కాదు. కానీ ఆవిడ అందమైన అక్షరాలతో చక్కగా వ్రాస్తుంది. అందుకేనేమో నా కథలు చాలావరకూ తిప్పి పంపకుండా ప్రచురించేవారు!

నా మొట్టమొదటి కంప్యూటర్ మా ఆస్టిన్ నగరంలో 1984లో ఒక కంపెనీకి ఇంజనీరింగ్ మేనేజరుగా పనిచేస్తున్నప్పుడు, దాదాపు రెండు వేల ఐదు వందల డాలర్లు పెట్టి కొన్నట్టు గుర్తు. అప్పటికి కంప్యూటర్లు వచ్చి ఇంకా రెండు మూడేళ్ళు కూడా కాలేదు. దాని పేరు XT. IBM కంపెనీ దాన్ని చేసినా, చేయకపోయినా IBM XT అనేవారు. దాంట్లో ఒక పెద్ద ఫ్లాపీ డ్రైవ్ వుండేది కానీ, అప్పటికి ఇంకా హార్డ్ డ్రైవులు కనిపెట్టలేదు. తెలుగు ఖత్తులు అనేవి అసలు లేనేలేవు. అలా అవి వస్తాయని కూడా నాలాటి వారు ఎవరూ ఊహించలేదు.

ఎనభైల చివరలో అనుకుంటాను, అలబామాలోనో అక్కడే ఎక్కడో ఒక తెలుగు తెలిసిన ప్రొఫెసర్ గారు ‘రచన’ అనే ఖత్తులు తయారు చేశారు. ఆయన పేరు మరచిపోయాను. పది డాలర్లు పెట్టి ఆ ఫ్లాపీ కొన్నాను. అవే అమెరికాలో మొట్టమొదటి తెలుగు ఫాంట్స్ అనుకుంటాను. వాటిని తెలుగులో ‘సత్యమైన ఖత్తులు’ అందాం. (True Fonts). ఏమాత్రం వేగం లేని ఆ కంప్యూటర్ మీద, ఆ కొత్త ఖత్తులతో కసరత్తు చేసేవాడిని.

నాలాగా ఆలోచిస్తూ, బుర్రలో కథానిర్మాణం చేసుకుంటూ టైపు చేసే వాళ్లకి, సమయం కలసివచ్చే అవకాశం లేకపోగా, ఆ ఖత్తుల వల్ల ఆలోచనా క్రమం తప్పి, అనుకుంటున్న కథ కూడా సరిగ్గా ముందుకి సాగేది కాదు. అందుకని అవి ఏవో ఉత్తరాలు, నోట్స్ నెమ్మదిగా వ్రాసుకోవటానికి మాత్రమే వాడేవాడిని.

తర్వాత 1980ల చివరలోనో, 1990ల మొదట్లోనో కెనడానించీ ప్రొ. దేశికాచారిగారి “పోతన” ఫాంట్స్ వచ్చాయి. పోతన ఖత్తులతో కొంచెం తతంగం వున్నా, ఆరోజుల ప్రామాణికం బట్టి వాడకంలో ఎంతో సుఖం వుండేది. అవి వాడి నా సాహిత్యాన్ని కొనసాగించాను. ఎంతోమంది మిత్రులు కూడా పోతన వాడుతుండేవారు. మా తెలుగు సాహిత్య సదస్సులు, ఆటా, తానాలలో అష్టావధానం పద్యాలు అప్పటికప్పుడు తెర మీద తెలుగులో టైప్ చేస్తుండే వాళ్ళం.

దాని తర్వాత మిత్రులు చోడవరపు ప్రసాద్ నిర్మించిన అక్షరమాల ‘తిక్కన’ ఖత్తులు వచ్చాయి. అవి అందంగా వుండి కథా ప్రచురణకి కూడా బాగుండేవి. తిక్కన ఖత్తులతో కొన్ని తెలుగు పత్రికలు కూడా వచ్చేవి. నేను కొన్ని శీర్షికలు కూడా ‘తిక్కన’తోనే వ్రాస్తే, అవి అలాగే ప్రచురింపబడేవి.

మిత్రులు కిరణ్ ప్రభగారు అంతకన్నా మంచివి వున్నాయని, నాకు ‘లింగ్విపాడ్’ పంపించారు. దానిలో మేఘన ఖత్తులతో పాటు ఎన్నో రకరకాలవి వున్నాయి. వాటిలో ‘చిత్ర’ అనేవి బాపూగారి అక్షరాలు. నేను శీర్షికలూ, కథలే కాకుండా నవలలు కూడా మేఘన ఖత్తులతో వ్రాసి, అదే అక్షరాలతో పుస్తక ప్రచురణ కూడా చేశాను. మకుటాలు మాత్రం బాపూగారి ‘చిత్ర’ వాడేవాడిని.

పైన చెప్పిన అన్ని ఖత్తులలోనూ సౌలభ్యం ఏమిటంటే, ప్రతి అక్షరానికీ ఒక నిర్దుష్టమైన నిర్వచనం వుంటుంది. దానివల్ల మనం ఏ మాట కావాలంటే ఆ మాటే టైప్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ద కావాలంటే da, దా కావాలంటే dA, డ కావాలంటే Da, డా కావాలంటే DA మొదలైనవి. అలాగే ఒత్తులు. అత్త (atta), అట్ట (aTTa), ఆవు (Avu), శంభు (Sambhu), క్షమాపణ (kShamApaNa) మొదలైనవి.

వీటితో నా కథా, నవలా వ్యాసాంగం చకచకా పరుగెత్తింది. నేను కాగితం మీద వ్రాసే దానికన్నా, వేగం పెరిగి నా ఆలోచనా పద్ధతిని కూడా మెరుగుపెట్టింది. ఎందుకంటే నా కథా సమయంలో ఎక్కువ సమయం కథనానికీ, మరీ తక్కువ సమయమే టైపు చేసినదాంట్లో తప్పులు సరిదిద్దుకోవటానికీ.

ఈలోగా ఇక్కడ అమెరికాలో నేను వాడని కొన్ని ఖత్తులు, భారతదేశంలో ఎన్నో రకాల ఫాంట్స్ వచ్చాయి కానీ, అవేవీ నేను వాడలేదు.

కాకపొతే ఈ True Fonts వల్ల ఒక పెద్ద సమస్య వుండేది. నేను వీటితో ఏమి వ్రాసినా, మిగతావాళ్ళు అవి చదవాలంటే వాళ్ళ కంప్యూటరులో కూడా అవే True Fonts వుండాలి. లేకపోతే అంతా గజిబిజిగా జిబ్రిష్ వస్తుంది. అందుకని దాన్ని PDFలోకి మార్చి పంపించాలి. అది ఇంకొక పని. ఈమైల్ పంపిచటానికి ఈ ఖత్తులు పనికి వచ్చేవి కాదు.

అప్పుడే వచ్చింది యూనికోడ్. ఈ యూనికోడ్ ఖత్తులు మన ఇంగ్లీష్ ఫాంట్స్ లాగానే, మనం వాడే ప్రతి ప్రోగ్రాములోనూ అంతర్లీనమై వుంటాయన్నమాట. ఇలాటి వాటిలో నాకు మొట్టమొదటగా అందినది “లేఖిని”. ఆనాటికీ, ఈనాటికీ కూడా నాకు నచ్చిన ప్రోగ్రాములలో దీన్ని మించింది లేదు. పైన చెప్పిన ఖత్తులలోలాగా ఇక్కడా సౌలభ్యం ఏమిటంటే, ప్రతి అక్షరానికీ ఒక నిర్దుష్టమైన నిర్వచనం వుంటుంది. దానివల్ల మనం ఏ మాట కావాలంటే ఆ మాటే టైప్ చేసుకోవచ్చు. వీటి అక్షర విర్వచనం కూడా పైన చెప్పిన పద్ధతిలోనే వుండటం వల్ల, వాతావరణంలో పెద్ద మార్పు ఏమీ కనపడలేదు. కీ బోర్డు మీద చేతులు పెట్టటమే ఆలస్యం, వ్రాస్తున్న మాటలు కీ బోర్డు చూడకుండానే అలా ప్రవహించేవి. ఎక్కడో చేతి వేళ్ళు ఇటూ అటూ సంచారం చేస్తుంటే తప్ప, అచ్చుతప్పులు వచ్చేవి కాదు. ఇవి ఈమైలులో కూడా వాడుకోవచ్చు. PDFతో పని లేదు.

ఆ వేగం వల్లనే సిలికాన్ ఆంధ్రా సుజనరంజనిలోనూ, కిరణ్ ప్రభ కౌముదిలోనూ, ఎన్నో సంవత్సరాలు నా శీర్షికలు ‘నెల తప్పకుండా’ వచ్చాయి. ఆంధ్రభూమి వారపత్రికలో నా ఎన్నారై కబుర్లు, ఒక్క వారం కూడా తప్పకుండా నాలుగున్నర సంవత్సరాలు వరుసగా వచ్చాయి. నాకెంతో సహాయం చేసినవి ఈ ఖత్తులే.

లేఖిని ఎంతో బాగున్నా, దీనివల్ల కూడా ఒక చిన్న సమస్య వుంది. లేఖిని పేజీలో కావలసింది టైప్ చేసుకుని, దాన్ని మళ్ళీ కాపీ చేసి, వర్డ్ ప్రోగ్రామ్లోనో, ఈమైల్లోనో మళ్ళీ కాపీ చేసుకోవాలి. అది కొంచెం విసుగు పుట్టించేది.

అప్పుడే గూగులమ్మగారు Google Transliteration Program యూనికోడులో తయారు చేసి, ఎన్నో ప్రపంచ భాషలు దానిలో పెట్టారు. వాటిలో అన్ని ముఖ్యమైన భాషలతో పాటూ తెలుగు కూడా వుంది.
“వర్డ్ ప్రోగ్రాములో గౌతమి ఫాంట్ పెట్టుకుని, టైప్ చేసేయటమే. దాన్ని మళ్ళీ కాపీలు, పేస్టులూ చేసుకునే అవసరం లేదు” అని ఒక మిత్రుడు చెప్పగానే ఎగిరి గంతేసి, క్రిందపడి, లేచి, ఆ ప్రోగ్రాముని నా లాప్టాప్లో, డెస్క్టాప్లో వెంటనే పెట్టేసుకున్నాను. తెలుగులో ఒక పేరాగ్రాఫ్ టైప్ చేసేటప్పటికీ నీరుగారిపోయాను. అంత అర్ధంపర్ధంలేని ప్రోగ్రాం భూమి మీద ఎక్కడా వుండదని వెంటనే అర్ధం అయిపోయింది.

గూగుల్ తెలుగులో ఏ అక్షరానికీ నిర్దుష్టమైన నిర్వచనం వుండదు. మీరు టైప్ చేసిన మాటనుబట్టి, దాని ఇష్టమైనవీ, ఇష్టం లేనివీ ఐదు మాటలు ఇస్తుంది. వాటిలో మీకు కావలసింది ఒకటి మీరు ఎంచుకోవాలి. అలా చేయకపోతే, అది ఇచ్చిన మొదటి మాటని అక్కడ పెట్టేస్తుంది. ‘వెళ్ళాడుట’ అని నేను ఇప్పుడు గూగులమ్మగారి దయతో టైప్ చేస్తాను చూడండి. వేల్లాడుత, వేళ్ళాడుత, వేల్లాదుట, వేల్లాడుతూ, వేళ్ళాడుతూ అని ఐదు మాటలు ఇచ్చి, వీటిలో నీకు కావలసిన మాట తీసుకోరా డింభకా అన్నది. వీటిలో నాకు కావలసిన మాట లేనే లేదు. కొంచెం పెద్ద మాటలు వ్రాస్తే గూగులమ్మకి గాబరా. నమ్మిమ్చేతంటగా, నమ్మిమచేతంటగా, నమ్మిమ్చెతంటగా అని నమ్మించటానికి ప్రయత్నం చేస్తుంది కానీ ‘నమ్మించేటంతగా’ అని మాత్రం చెప్పదు. చెప్పదు (cheppadu) అని చెబుదామంటే, చెప్పాడు, చెప్పడు అన్నాకే చెప్పదు అంటుంది.

పాతకులు, పాతాకులు, పాథాకులు అంటే ఎవరో తెలుసా? పాఠకులు. అంటే ఈ వ్యాసం చదివే మీరే!
ఇంకో విషయం ఏమిటంటే అది ఇచ్చే నాలుగైదు పదాలు ఒకసారి వచ్చిన వరుసలో మళ్ళీ రావు. దీని వల్ల టైప్ చేస్తున్నప్పుడు ప్రతి మాటకీ వాళ్ళు ఇచ్చే పదాలలో ఏది కావాలో ఎంచుకోవాలి. ఒకవేళ అది మనం అనుకున్న పదం ఇవ్వకపోతే, ఒక్కొక్క అక్షరమే కొట్టుకుంటూ పోవాలి. అంతే (సారీ, నేను అంటే అని టైప్ చేద్దామనుకున్నాను), అంటే అక్షరాలూ దిద్దుకుంటూ పోతూ, మాటల ఎంపికతో కుస్తీలు పడుతూ, మనం వ్రాద్దామనుకున్న కథని మరచిపోతూ వ్రాస్తుంటే, నా కథ ఎంత మహత్తరంగా వస్తుందో ఊహించండి. దీని కన్నా మళ్ళీ వెనక్కి వెళ్లి, చేత్తో కాగితం మీద వ్రాసుకోవటమే సుఖమేమో అనిపించేది. ఇటు టైపింగ్ వేగమూ ఎన్నో రెట్లు తగ్గేది, అటు నా ఆలోచనా సరళి పూర్తిగా దెబ్బతినేది.
నేను వ్రాసిన కొత్త పుస్తకాల ప్రచురణ రోజుల్లో, అవి వ్రాయటం మామూలు సమయం కన్నా ఎక్కువ సమయం తీసుకోవటం ఒకటి, అవి ప్రచురించే ముందు అచ్చు తప్పులు, హల్లు తప్పులు వెతుక్కుంటూ వాటిని సరిదిద్దటం ఇంకొకటి. ఒకటే విసుగు పుట్టించేవి. ప్రాణాలు తోడేసేవి.

ఇక ఆ తెగులు గూగులమ్మతో కాపురం చేయలేక, మా మిత్రుడిని పిలిచి, ‘భాస్కరా! ఇక మీరే గతి’ అని అడిగితే మా కొంపెల్ల భాస్కరుడు, ‘అదెవరు వాడమన్నారు. అంతకన్నా చక్కటి ప్రోగ్రాములు ఎన్నో వున్నాయి. బరహా వాడండి లేదా ప్రముఖ్ వాడండి’ అని మన తెలుగు సినిమాతారలు ‘నేను లక్స్ టాయిలెట్ సోపునే ఎల్లప్పుడూ వాడతాను. మీరూ అదే వాడండి’ అన్నంత సులభంగా నా సమస్యని తీర్చేశారు.

అప్పటినించీ మా భాస్కరుడి పుణ్యమా అని, మళ్ళీ ‘ఆనందమానందమాయనే“ అని పాడుకుంటూ అప్పటినించీ ఇప్పటిదాకా ఆ ప్రోగ్రాములే వాడుతూ, తీరిక దొరికినప్పుడల్లా మూడు కథలూ, ఆరు వ్యాసాలూ వ్రాసుకుంటూ ముందుకి వెడుతున్నాను.

అంతేకాదు. సిలికాన్ ఆంధ్రా, నాటా మొదలైన సంస్థలు, గౌతమి కుటుంబానికి ఇంకా ఎన్నో అందమైన రకరకాల ఖత్తులు తయారు చేసి ఉచితంగా ఇస్తున్నారు. అవి కూడా చాల బాగున్నాయి.

౦ ౦ ౦

ఇక పాఠకులు అనే రెండవ కోణంనుంచి చూస్తే, ఈ సాంకేతిక ప్రభావం పెద్ద సహాయం అనే చెప్పొచ్చు. ఉదాహరణకి తెలుగువెలుగు, విపుల, చతుర, నవ్య, ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర భూమి, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్ర్రిక, మొదలైన పత్రికలు మీ కంప్యూటర్ తెర మీద చదువుకోవచ్చు. అలాగే సుజనరంజని, కౌముది, గో తెలుగు, మధురవాణి, అక్షర, వాకిలి... ఒకటి కాదు ఎన్నో వెబ్ పత్రికలు. పాఠకులకి విందు భోజనం.

ఇదీకాక కథానిలయం, ప్రెస్ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, పుస్తకం.కాం మొదలైన ఎన్నో వెబ్సైట్లలో పాత తెలుగు పుస్తకాలు, పత్రికలు, కథలు, నవలలు ఉచితంగా లభిస్తున్నాయి. ఇంగ్లీషు – తెలుగు – ఇంగ్లీషు డిక్షనరీలు కూడా ఎన్నో వున్నాయి. అంతేకాదు మీ అభిరుచినిబట్టి, వేదాలూ, ఉపనిషత్తులూ, శతకాలు, పురాణాలు... చదువుకుందామనుకున్న వాళ్లకి చదువుకునేటన్ని వున్నాయి!

మరచిపోయానండోయ్.. చందమామ కుటుంబ పత్రికలో ప్రచురింపబడ్డ ప్రతి కథా, సీరియల్, చిత్ర, శంకర్ గార్ల బొమ్మలతో సహా, మొదటి సంచిక నించీ ఇప్పటి దాకా అన్నీ వున్నాయి. ఇహ పండగే పండగ!

రూపాయి ధరలకి ఇండియానించీ కినిగే.కాం అనే సంస్థ ఎన్నో ఈ-పుస్తకాలను డౌన్లోడ్ చేసుకోవటానికే కాక, నెలరోజుల అద్దెకి కూడా పంపిణీ చేస్తున్నారు. కొన్ని తెలుగు ఈ-పుస్తకాలు కిండెల్, నూక్ మొదలైన వెబ్ సైట్ల ద్వారా అమ్మకం చేస్తున్నారు. వీటిలో సౌలభ్యం ఏమిటంటే, తెలుగు అచ్చు పుస్తకాలు విదేశాలకి పంపించాలంటే, పుస్తకం ఖర్చుకన్నా పోస్టేజి ఖర్చులు కనీసం ఐదారు రెట్లు వుంటుంది. ఈ-పుస్తకాలు అలాకాక పోస్టేజి ఖర్చులు వుండవు కనుక, ఎంతో చౌకగా లభిస్తాయి.

ఇలా పాఠకులకి ఇలాటి సాంకేతిక సహాయం వల్ల ఎన్నో లాభాలున్నాయి.

ఈ పత్రికలు ప్రచురించే వారికీ, నిర్వాహకులకూ కూడా అచ్చు పుస్తకాల కన్నా ఖర్చు ఎంతో తక్కువ. ఈరోజుల్లో చాలామంది రచయితలు, యూనికోడ్ లోనే టైప్ చేసి తమ రచనలు పంపిస్తున్నారు కనుక, మళ్ళీ వాళ్లకి డిటిపి చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు.

ఇలా మిగతా సాహిత్యాలలాగానే, తెలుగు సాహిత్యం మీద కూడా సాంకేతిక ప్రభావం, దానివల్ల లాభం ఎంతో వుంది.

అంతా మన మంచికే!

౦ ౦ ౦

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)