కబుర్లు - వీక్షణం - సాహితీ గవాక్షం
వీక్షణం సాహితీ సమావేశం -47
- పెద్దు సుభాష్

వీక్షణం 47వ సమావేశం శ్రీ గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారు, వారి కుమారులు శ్రీ వంశీ స్వాగత వచనాలతో ఆరంభించబడింది.

ఈ సమావేశమునకు శ్రీ పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ గారు అధ్యక్షత వహించారు. ఈ సమావేశారంభం, చిన్నారులు శృతి, మాధవుల "ఆరు కోట్ల ఆంధ్రులు, జయ తెలుగు తల్లి" ప్రార్ధనా గీతంతో జరిగినది. వీక్షణం సమావేశములో పది, పన్నెండేళ్ల చిన్నారులు పాల్గొనడం, చక్కని లయతో పాడడం, అమెరికాలో తెలుగు ఝరి కొనసాగడానికి ఒక శుభ సంకేతం.

మొదటి ఉపన్యాసకర్త శ్రీ కల్లూరి సత్యరామ ప్రసాద్ గారు. ఆయన వృత్తి రీత్యా ఇంజినీర్, ఆయన ప్రవృత్తి మాత్రం త్యాగరాజ ఆరాధన. సత్యరామ ప్రసాద్ గారిని పరిచయం చేస్తూ, వారి కుమార్తె శ్రీమతి సత్యవాణి "మా నాన్నగారు నాకు సంగీతం నేర్పించటమే కాకుండా, నేను హైస్కూల్ చదువుతున్నప్పుడు తిరువాయూర్ తీసుకువెళ్లారు" అని చెప్పారు.

సత్యరామ ప్రసాదు గారి ఉపన్యాసం "కవిగా త్యాగరాజు". వారి ఉపన్యాస విశేషములు:

"అందరికీ త్యాగరాజు రామభక్తునిగాను, సంగీతకారుడిగాను పరిచయం, ఆయన కవిత్వములోని సాహిత్య విలువలు ప్రముఖముగా ప్రస్తావించకపోవటానికి పలు కారణములు. గాయకుడి స్వరాటోపములోని హడావిడిలో సాహిత్యం గురించి అంత పట్టించుకోకపోవటం ఒక ముఖ్య కారణము కావొచ్చు. త్యాగరాజు ఆంధ్ర దేశమునకు సుదూర ప్రాంతములో ఉండటం, దక్షిణాది సాహిత్యకారులయందు చిన్న చూపు ఉండటం కూడా కారణాలు కావొచ్చు.

కవిత్వం 2 రకాలు - వస్త్వాశ్రయం (Objective Poetry) ; ఆత్మాశ్రయం (Subjective Poetry). త్యాగరాజ కవిత్వం ఆత్మాశ్రయ పద్ధతిలోనే జరిగినది. ఆత్మాశ్రయంలో భక్తుడి బాధలు, తపన, దేవుడితో సంభాషణ, చనువు మొదలైనవి ఉంటాయి. ఆయన పాటల్లో దాదాపు 85 శాతం తెలుగు, మిగతావి సంస్కృతం అని చెప్పచ్చు.

త్యాగరాజ కీర్తనలలోని లక్షణాకృతిని ‘సొగసుగా మృదంతాళము’ అనే కృతిద్వారా తెలుసుకోవచ్చు. అవి-

1) వస్తువు - నిగమశిరోర్థము కలిగిన వాక్యాలు - వేదాంత వాక్యాలు

ఉదాహరణలు:

* ‘శాంతము లేక సౌఖ్యము లేదు!’ (సామ) - ‘అశాంతస్య కుతః సుఖమ్’ - గీత 2-66
* ‘చెడే బుద్ధి మానురా!’ (అఠాణా) - ‘వాసుదేవః సర్వమ్’ - గీత 7-19
* ’వేదావినాశినమ్’- గీత 2-21; ‘అథ చేత్త్వమిమమ్ - గీత 2-33’; ‘స్వధర్మే నిధనం శ్రేయః’- గీత 3-35 (ఇవన్నీ ’బాగాయెనయ్య!’ అనే చంద్రజ్యోతిరాగకృతిలో)

2) నిజవాక్కులు - స్వంతమైన, అనుభూతితో కూడిన మాటలు

* తెలుగు కానీయండి, సంస్కృతం కానీయండి, ఆయన మాటలను సృష్టించడంలో దిట్ట. చంద్రుడనే మాటకు మనం సాధారణంగా వినే పర్యాయపదాలేమిటి? ‘చందమామ, నెలరాజు, కలువరేడు’ - ఇలాంటివే కదా! మరి ఆయన వాడిన పదాలు - ‘చుక్కలరాయడు, భేశ, విధు, భరాజ’ మొ.వి.
అలాగే సూర్యుడికి - ‘దినమణి, ద్యుమణి, తరణి, మిత్ర’ మొ.వి ; దశరథుడికి - ‘పంక్తిరథుడు’

3) యతివిశ్రమ సద్భక్తి (యతి, ప్రాస మొదలైన నియమాలను - పద్యాలలో ఉన్నట్లుగానే పాటించడం)

‘యతి, 2వ అక్షరం ప్రాస స్థానం, ప్రాసయతి’ - వీటిని ఆయన విధిగా పాటించాడు. పల్లవికీ అనుపల్లవికీ ప్రాసనియమం పెట్టుకున్నాడు; పల్లవిలోను, అనుపల్లవిలోను, తిరిగి ఒక్కొక్క చరణంలోను మళ్ళీ యతిప్రాసలను పాటిస్తాడాయన.

4) ద్రాక్షాపాకంలో కవిత్వాన్ని చెప్పడం

*ఆయన రచనలు సులభబోధకాలు; చదువుకోనివాళ్ళు కూడా హాయిగా పాడుకో గలిగే పాటలు ఎన్నో, ఎన్నో!

*‘మాటల్లో పొదుపు, పొందిక’ - ఉదాహరణలు: మోడి, వగ, జాలి, కేరు మొదలైనవి

*సామెతలు - సామెతలు: "గణనాథుని చేయబోవ కడు వానరుండై తీరెగా", "వరభక్తవేషము వేయు వేళ వర్జ్యకాలమేమో?", "ఎంతవారలైనా కాంతదాసులే!"

5) సందర్భోచితంగా తగిన రసాన్ని ప్రదర్శించడం

‘కళ్ళకు కట్టినట్లుగా పదచిత్రాలను మన ఎదుట ఉంచడం’ అనే ప్రక్రియ ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.
‘అలకలల్లలాడగ గని’ అనే మధ్యమావతికృతిలో రాముడి ముంగురుల కదలికను కట్టెదుట చూపాడాయన!

6) అలంకారాలు, ఆలంకారికత

‘రామ! నీ సమానమెవరు?’ (ఖరహరప్రియ)లో అనన్వయాలంకారం (నిరుపమ) దాగి ఉంది.

ఇక, శబ్దాలంకారాల విషయానికొస్తే ఎవరో అన్నట్లుగా ‘అంత్యప్రాసలరేడు’ నిన్నటితరంలో ఆరుద్ర అయి ఉండవచ్చుగాక! ఆద్యుడు మాత్రం పోతనగారే, ఆ తరువాత గురువును మించిన శిష్యుడు త్యాగయ్యే!

‘విష్ణు, రోచిష్ణు, జిష్ణు, సహిష్ణుఁ, గృష్ణు’ అని ఒక విధమైన ధారలో పోతనగారంటే, ‘శ్రీధామా! నాతో వాదమా? నే భేదమా? ఇది మోదమా?’ అంటాడు భక్తిరసధార ముప్పిరిగొన్న ఒక వేళలో స్వామి!"

తదుపరి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి "ఆధునికత-సమకాలీనత" గ్రంథం శ్రీ గంగిశెట్టి గారి కుటుంబ సభ్యులందరితోనూ ఆవిష్కరించబడినది. డా|| కె.గీత, శ్రీ కిరణ్ ప్రభ, శ్రీ వేణు ఆసూరి, శ్రీ చరణ్ వీక్షణం తరఫున తొలిప్రతినందుకున్నారు.

"ఆధునికత-సమకాలీనత" ఒక ఉద్గ్రంథం. పలు ప్రౌడ వ్యాసాల సంకలనం. ఈ గ్రంథం రావటానికి కారణం చెప్తూ శ్రీ గంగిశెట్టి " వీక్షణం సాహితీ సమావేశాల స్ఫూర్తి తో, నేను చేసిన పరిశోధనలను, గతములో పలు సభలలో చేసిన ప్రసంగములను విస్తృత పరిచి, 40 వ్యాసాలుగా పొందుపరిచిన గ్రంథమే ఈ "ఆధునికత-సమకాలీనత " అన్నారు. ఈ సందర్భంగా వీక్షణం సమన్వయ కర్త డా|| కె.గీత ను "లేడీ నెపోలియన్ బోనపార్టీ" గా అభివర్ణించారు.

ఇంతటి ఉద్గ్రంథాన్ని సభకు పరిచయం చేయటానికి ఉద్దండులే కావాలి. అదృష్టవశాత్తు సిలికాన్ వాలీలో తెలుగు ఉద్దండులు చాలా మందే ఉన్నారు. గ్రంథ పరిచయం చేసిన మొదటి వారు శ్రీ వేణు ఆసూరి గారు.

వారి ప్రసంగ విశేషములు:-

"ఈ పుస్తకం గురించి ప్రసంగించటానికి అనుభవ లేమితో ఒప్పుకున్నాను. ప్రతి వాక్యము ఆలోచింప చేసేది. ఆధునికత - ఒక నిర్దిష్ట కాల పరిధిలో వచ్చిన భావతత్వాలకు, ప్రయోగాలకు మాత్రమే సంకేతంగా నిలిచే పేరది. మూడు మహా విప్లవ పోరాటాల భావ ఫలితాలను సమన్వయించుకొని ఒక నూతన నాగరికతను సృష్టించి, ప్రథమ ప్రపంచ యుద్ధం మిగిల్చిన భీభత్స అనుభవంతో ముగింపుపాలైన భావన్విత దశే ఆధునికత.

ప్రపంచ చరిత్రలో ఆధునికత మూలాలు పాశ్చాత్య దేశాలలోని 18, 19, 20వ శతాబ్దముల లోని విప్లవాలు.

అమెరికా విప్లవం - ప్రజాస్వామ్యం (1763 - 1787)
ఫ్రెంచి విప్లవం - స్వేచ్ఛ (1788 - 1804, ఇన్ థ్రీ ఫసెస్)
రష్యా - కమ్యూనిజం/సోషలిజం (1887 - 1917)

ఆధునికత అనగా నవ్యత, సమకాలీనత కాదు. ఆధునికతకు పలు పట్టెలు కలవు.

*చైతన్యం - సరికొత్త రీతులు, పరిధిని దాటిన ఆలోచనలు మొదలైనవాటితో కూడిన ప్రకంపనలు
*ముఖ్యమైన రీతి - సంప్రదాయ పద్ధతుల శృంఖలాలను ఛేదించుకున్న ఆలోచనలు
*పారిశ్రామీకరణ - సామాజిక, సాంస్కృతిక మార్పులు, వ్యక్తుల ఆలోచనా స్వాతంత్య్రం మొదలైనవి.

తెలుగులో పాశ్చాత్య ఆధునికతను ఉన్నది ఉన్నట్టుగా ప్రవేశ పెట్టటం కూడా జరిగినది. ఉదాహరణకు కమ్యూనిస్ట్ సాహిత్యం.

కవిగా విశ్వనాథ స్థానం గొప్పది, రచయితగా వివాదస్పదమైంది, సాహిత్యవేత్తగా (అంటే సాహిత్య విమర్శనా రచయితగా) అనితర సాధ్యమయింది, అతి విస్తృతమయింది. విశ్వనాథ సాంప్రదాయవాది. కానీ, ఆయన విమర్శనా సాహిత్యం ఆధునికతతో కూడి, కొత్త పుంతలు తొక్కింది.

నాటకము - భారతీయ దృక్కోణం వ్యాసములో గంగిశెట్టిగారి విశ్లేషణ చాలా బాగుంది.

నాటకము గురించి మన సాహిత్యములో మొదటి ప్రస్తావన, ముండక ఉపనిషత్తు మూడవ అనువాకంలో:

ద్వా సుపర్ణా సయుజా సఖాయా
సమానం వృక్షం పరిషస్వజాతే
తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి
అనశ్నన్నన్యో అభిచాకశీతి (3.1.1)

స్థాయీ భావం/రసానందము:

ప్రాచీన సాహిత్యములో ప్రస్తావించబడినవి ఎనిమిది రసానుభూతులే. శాంత రసం తరువాత చేర్చబడినది.

పద వ్యుత్పత్తి:

పరాక్రమం
నటన = నట్ - కానిదాన్ని మనపై ఆరోపించుకొని చూపే క్రియాచేతన జగతి
ఙ్ఞానం = ఙ్ఞ + ఆనం (తన్ను తాను గుర్తు పట్టుకునే ప్రయాణమే ఙ్ఞానం
వి - విపర్యాయ అర్థం, లేక అత్యధికమనే అర్థం
చిత్రం / విచిత్రం
విధవ - ధవుడు (భర్త) లేనిది

ఇవి గంగిశెట్టిగారి "ఆధునికత-సమకాలీనత" లోని అతి కొన్ని అంశములు మాత్రమే. "

"ఆధునికత-సమకాలీనత" గ్రంథాన్ని పాలడగు శ్రీ చరణ్ గారు కూడా సమీక్షించారు. వారి ప్రసంగ విశేషములు: "గంగిశెట్టి గారు, గ్రంథంలోని అధ్యాయాలకు "తరంగాలు" అని పేరు పెట్టారు. ఈ గ్రంథం నిజంగానే ఒక సముద్రం. దీనిలో ఈత కొట్టటం అంత తేలిక కాదు. ప్రతి మాటా మనలను ఆలోచింపచేసి, క్రొత్త దిక్కులకు తీసుకు వెళ్లకలదు. మామూలుగా "అయ్యవారు ప్రకాశం, అమ్మవారు విమర్శ" అంటాము. ఈ గ్రంథం అమ్మవారంతటి మంచి విమర్శ. ఆధునికతకు, నూతనత్వముకు చాలా భేదం వుంది. ఉదాహరణకు, రేపు వచ్చే సోమవారం నూతనం. కానీ, ఆధునికత కాదు. అలాగే సాహిత్య రంగములోని ఆధునికతను విశ్లేషించటం తేలికగా అయ్యే పని కాదు. అంతటి మహా కార్యాన్ని గంగిశెట్టిగారి "ఆధునికత-సమకాలీనత" గ్రంథం సాధించింది."

శ్రీ చరణ్ గారు, నాటక తరంగం కూడా సమీక్షించి, ఆయన రచించిన పద్యాన్ని శ్రీ అక్కిరాజు సుందరరామ కృష్ణ గారిని గానం చేయమని ఆహ్వానించారు. శ్రీ చరణ్ గారి కవిత్వానికి, అక్కిరాజుగారి లయ బద్ధమైన పద్య గానం తోడయ్యి, గంగి శెట్టి గారికి అభినందనీయమయింది.

శ్రీ చరణ్ గారి పద్యం:

సీ|| కవన లక్ష్మీ శిల్ప నవనవోన్మేషంపు
రంగు మెఱయ జేసె `గంగి శెట్టి'!
కావ్య నాటక కథా నవ్యాభినవ గుప్త
లక్ష్య లక్షణ విమర్శ ప్రపేటి!
లలిత భావ తరంగ రత్నాకరానంద
గంభీర `శక్తి' సంకలన పాఠి!
మరణాంత వేదాంత మహనీయ తత్త్వర్షి
రమణర్షి భావార్థ రస నిఘంటి!

ఆ|| భారతీయ తత్త్వ వాగ్గన్ధ తరు వాటి
సంచరించి సాగు స్వర వధూటి (స్వర్వధూటి)
పులక లెత్తు తీపి తెలుగు విరుల జుంటి
తరగల మగనింట వరలు ధాటి! ||

గంగిశెట్టి గారిది పెద్ద మనస్సు. ఆయన గ్రంథావిష్కరణ జరుగుతున్న సభలోనే, శ్రీమతి షమ్షాద్ బేగం గారికి సత్కరించారు. షమ్షాద్ గారి "ఈ కిటికీ తెరుచుకునేది ఊహలలోకే" కవితా సంకలనాన్ని విశ్లేషించారు. సమీక్షకులు వేణు ఆసూరి గారిని, పాలడుగు శ్రీ చరణ్ గారిని కూడా సత్కరించారు.

ఆ తరువాత, కిరణ్ ప్రభ గారి క్విజ్ అనే తెలుగు సాహితీ జిమ్నాస్టిక్స్ కార్యక్రమం. అందరూ ఎదురు చూసే కార్యక్రమం. వీక్షణంకు వచ్చే తెలుగు పండిత ప్రముఖులు కూడా చీకట్లో బాణాలు వేయవలసి వచ్చే కార్యక్రమం. ఉదాహరణ ప్రశ్న: "కదంబము, కదంబకము - ఈ రెండు పదాలకు అర్ధ వ్యత్యాసములు ఏమిటి?".

తర్వాత జరిగిన కవి సమ్మేళనం కార్యక్రమములోని కవితలు:

డా|| కె.గీత "కాఫీ కప్పు ..."
శ్రీమతి కొండేపూడి నిర్మల "ఉత్తరం ..."
శ్రీమతి షమ్షాద్ "విమాన ప్రయాణం ..."
శ్రీ అక్కిరాజు సుందర రామ కృష్ణ గారు "దొరల వల్ల కాదు" మొ.వి.

వీక్షణం 47 వ సమావేశం కాకర్ల సత్యవాణి గారు పాడిన త్యాగరాజ మంగళం "మంగళం నిత్య జయ మంగళం .." గానంతో ఆద్యంతం ఆసక్తిదాయకంగా ముగిసినది.

ఈ సభలో శ్రీమతి ప్రియదర్శిని, శ్రీమతి మంజులత , శ్రీమతి ఇందుమతి, శ్రీమతి లక్ష్మి, శ్రీమతి సుశీల, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీమతి శ్రీ చరణ్, శ్రీమతి కాంతి, శ్రీమతి రాధిక, శ్రీ గాంధీ ప్రసాద్ , శ్రీ లెనిన్, శ్రీ భాస్కర్ కూరపాటి, శ్రీ అబ్దుల్లా మహమ్మద్, శ్రీ అక్కిరాజు రమాపతిరావు, శ్రీ రామానుజరావు, శ్రీ రాజు, శ్రీ కేదార్, శ్రీ వంశీ, శ్రీ ప్రసాద్ మున్నగు వారు, చిన్నారులు కూడా పాల్గొన్నారు.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)