సారస్వతం
అన్నమయ్య శృంగార నీరాజనం - 2
- టేకుమళ్ళ వెంకటప్పయ్య, విజయవాడ.

అన్నమయ్య శృంగార సంకీర్తనలలో నాయకుడు శ్రీవేంకటేశ్వరుడు. "నయతి ప్రాప్నోతి, వృత్తం ఫలం చేతి నాయక:" అనగా కధా కావ్యం మొత్తం వ్యాపించి ఉన్నవాడు, ఫల భోక్త యైన వాడు నాయకుడు. “కీర్తి ప్రతాప సుభగుండార్తవను డఖిల గుణగణాఢ్యుడు, బాహావర్తిత భూభరుడై, పరికీర్తితుడగు భర్త కావ్య గీత ప్రియుడై!” అనే కంద పద్యంలో నాయక స్వరూపాన్ని “కావ్యాలంకార సంగ్రహం” లో రామరాజ భూషణుడు వివరిస్తాడు. కీర్తిప్రతాపాలు, సర్వగుణ సంపన్నుడు, భూభారాన్ని వహించేవాడు, కావ్య గీత ప్రియుడైన వాడు నాయకుడు.

ధైర్య సాహసాలను బట్టి చూస్తే నాయకులు ధీరోదాత్తుడు, ధీరోద్ధతుడు, ధీర లలితుడు, ధీరశాంతుడు అని నాలుగు విధములు. ప్రవర్తనమును బట్టి నాయకులు అనుకూలుడు, దక్షిణుడు,శఠుడు, దృష్టుడు అని నాలుగు విధములు. హేమచంద్రుడు తన కావ్యానుశాసనంలో "ధర్మ, యుద్ధ, వీర ప్రధాన: ధీరోద్దాత:, వీర, రౌద్ర ప్రధాన: ధీరోద్దత:, వీర శృంగార ప్రధాన: ధీరలలిత:, దాన, ధర్మ వీర ప్రధాన: ధీర శాంత: అంటాడు.

ఈ నాయకలక్షణాలు అవస్థాసూచకములే కానీ నిర్ధిష్ట మైనవి అని చెప్పడం కష్టం. ఒక్కోసారి ధీరోదాత్తుని గుణాలు ధీరోద్ధతునిలోనూ, అలాగే ధీరలలితుని, ధీరశాంతునిలోనూ దర్శించగలం. కనుక ఒక సర్వలక్షణ సంపన్నుడైన నాయకుని నాలుగు పేర్లతోనూ పిలిచే వీలు ఒక్కోసారి ఉండడం మనం గమనించవచ్చు. ఈ నాయక లక్షణాలను అన్నమయ్య భగవద్విషయంలో అనేక నాయికలతో శ్రీవేంకటేశ్వరుని గల సంబదాన్ని ఉల్లేఖిస్తూ రాసిన కీర్తనలలో పైన చెప్పబడిన అన్ని నాయక లక్షణాలను శ్రీమహావిష్ణువు వివిధ అవతారకు మనం అన్వయించుకుని ఆనందిచవచ్చు.

ధీరలలితుడైన శ్రీకృష్ణుని అన్నమయ్య తన శృంగార కీర్తనలో వర్ణించిన విధం చూద్దాం. ధీరలలితుడు అనగా పైన చెప్పినట్లుగా "వీర శృంగార ప్రధాన: ధీరలలిత:" శ్రీకృష్ణుని అవతారంలో విష్ణు మూర్తి వీర శృంగార రసాలను రెండింటినీ సమపాళ్ళలో పోషించడం గమనించవచ్చు. గోవర్ధన గిరినెత్తడం, కంసవధ, శిశు పాలవధ, కాళీయ మర్ధనం వంటి వీరోచిత కృత్యాలతో బాటూ.. అష్టభార్యలతోనూ..పదహారువేలమంది గోపికలతోనూ స్వామి శృంగారం నెరపినట్టు మనకు పురాణాలు, భాగవతమూ చెబుతున్నాయి. ఆ ధీర లలిత లక్షణాలను నిరూపిస్తూ అన్నమయ్య రాసిన ఈ కీర్తన చూద్దాం.

పల్లవి: ఎపుడు వత్తువో యనుచు యెదురు చూచీ జెలియ
వుపమించి చెప్పితిమి వువిద జెందవయ్యా!

చ.1. నెలంత కనుగలువలకు నీ మోము జందురుని
నలరంగ జూప గదవయ్య నేడు
కలికి చక్కదనంబు కడగి ప్రతిబింబించ
తళకు నీ చెక్కుటద్దములు చూపవయ్యా! || ఎపుడు ||

చ.2. నిరతిమె
దీగెకును నీ బాహు శాఖలివి
అరడుగా జూప గదవయ్య నేడు
సరి జన్నుజక్కవలు జంటవాయక యుండ
తొరల తనుసూర్యకాంతులు చూపవయ్యా! || ఎపుడు ||

చ.3. గళనాద పికములకు కడు నీ జవ్వనమదము
అలమి చోటుగ జూపవయ్య నేడు
వలచి వేంకటేశ్వర ఈకె గూడితివి
కలకాలమును నిటుల గరుణ చూపవయ్యా! || ఎపుడు ||
(రాగం: ముఖారి; శృం.సం.సం.28; రాగి రేకు 1809; కీ.సం.52)

కీర్తన నేపధ్యం: సకలసృష్టికీ ప్రభువు, లోకరక్షకుడు, ఆర్తపరాయణుడు అయిన శ్రీమహా విష్ణువు నిత్యం భక్తుల సంరక్షణలోనే మునిగి ఉంటాడు. అందువల్ల నాయిక అయిన అమ్మవారిని దర్శించవలసినదిగా కోరుతూ ఒక శృంగార రాయభారిగా అన్నమయ్య నిలబడ్డాడు. శ్రీహరి ధీరత్వాన్ని, అమ్మ లలితత్వాన్ని కలగలిపి, స్వామి వీరశృంగార గుణాలతో "ధీరలలితునిగా" మనకు శృంగార నీరాజమిస్తూ సాక్షాత్కరింప జేసిన యత్నమే ఈ శృంగార కీర్తన. శ్రీవేంకటేశ్వరుని దర్శనం కోసం విరహవేదనతో యెదురు చూపులు చూస్తూ ఉన్న నాయికను అన్నమయ్య వర్ణిస్తున్నాడు.

వివరణ:

పల్లవి: ఎపుడు వత్తువో యనుచు యెదురు చూచీ జెలియ
వుపమించి చెప్పితిమి వువిద జెందవయ్యా!
“స్వామీ!!! ఎప్పుడు మీ రాక యని యెదురు చూపులు జూచే నాయిక (జవ్వని)” ను రూపకాలంకారంలో చెప్తున్నాడు అన్నమయ్య.

చ.1. నెలంత కనుగలువలకు నీ మోము జందురుని
నలరంగ జూప గదవయ్య నేడు
కలికి చక్కదనంబు కడగి ప్రతిబింబించ
తళకు నీ చెక్కుటద్దములు చూపవయ్యా!

అమ్మవారి కన్నులు కలువలతో పోల్చి చెప్తూ, స్వామి మోమును సుందరమయిన చంద్రునితో పోలుస్తున్నాడు. కలువలు చంద్రుని చూస్తే వికసిస్తాయి. అందువలన స్వామీ.. ఒక్క సారి అమ్మకు నీ ముఖచంద్రుని దర్శింపజేయవయ్యా అని ప్రార్ధిస్తూ... స్వామీ...నునుపెక్కిన మీ ముఖ చెక్కుటద్దముల చక్కదనానికి నాయిక చక్కదనం ప్రతిబింబించాలయ్యా అంటూ స్వామిని కోరుతున్నాడు నాయిక తరఫున రాయబారిగా అన్నముడు.

చ.2. నిరతిమె
దీగెకును నీ బాహు శాఖలివి
అరడుగా జూప గదవయ్య నేడు
సరి జన్నుజక్కవలు జంటవాయక యుండ
తొరల తనుసూర్యకాంతులు చూపవయ్యా!

స్వామీ! అమ్మవారి శరీరం అనే తీవకు నీ బాహువులు అల్లుకునే తీగలు కావాలి. లావణ్య లత అనే అమ్మవారి శరీరానికి ఆధార భూతమై (అరడుగా) నీ బాహువులు చుట్టుకోవడం వల్ల అమ్మకు మరింత రక్షణ జన్మ చరితార్ధం అంటాడు అన్నమయ్య చమత్కారంగా. చక్రవాక పక్షి జంటలు ఉదయం ప్రొద్దులలో జంటగా ఉంటాయి. రాత్రిళ్ళు విరహవేదనను అనుభవిస్తాయి. ఎందుకంటే ఆ పక్షులకి కేవలం వెన్నెలే ఆహారం. వెన్నెల కోసం విడిపోతాయి. అన్నమయ్య ఇక్కడ నాయిక చనుదోయిని జక్కువ పక్షులతో పోల్చి చెప్తున్నాడు. జక్కువ పక్షుల జంటకు ఎడబాటు ఉంటే వుండొచ్చు గానీ ఈ చన్నుల జంటకు ఎడబాటు అనేదే ఉండదట. నాయకుని శరీర వెచ్చదనం (సూర్య కాంతి) సోకగానే విరహవ్యధ ఉండదు అని భావం. తుషార బిందువులచే చల్లనైన నాయిక స్తనద్వయం స్వామి సూర్యకాంతి లాంటి వెచ్చదనంతో ఎడబాటు లేని విధంగా కప్పిపుచ్చమని కోరుతున్నాడు అన్నమయ్య.

చ.3. గళనాద పికములకు కడు నీ జవ్వనమదము
అలమి చోటుగ జూపవయ్య నేడు
వలచి వేంకటేశ్వర ఈకె గూడితివి
కలకాలమును నిటుల గరుణ చూపవయ్యా!

అన్నమయ్య ఈ చరణంలో “గళనాద పికము” అనే గమ్మత్తయిన పదం వాడాడు. నాయిక కంఠ స్వరంలోనుండి వచ్చే శబ్దాన్ని కోయిల కంఠస్వరంతో పోల్చడమే కాక నాయిక పరంగా "మణితము" అనే శృంగార అవస్థను కూడా మనకు తెలుపుతున్నాడు అన్నమయ్య. స్వామి జవ్వన మదము తోడైతే నాయిక కంఠస్వరం నుండి పికనాదము వంటి సవ్వడి వస్తుంది అని చెప్తున్నాడు. ఆ విధమైన ప్రేమను అమ్మ పై జూపవయ్యా ఈరోజు అని ప్రార్ధిస్తున్నాడు. స్వామీ! శ్రీవేంకటేశ్వరా! వలచి ఈ అమ్మవారిని చేరావు. కలకాలము ఈ రీతిగా కలసి ఉండి ఎల్లవేళలా నీ కరుణను జూపవలసినది అని ఒక అర్ధంలో చెప్తూ, అన్యాపదేశంగా "జీవాత్మ-పరమాత్మలను ఈ రీతిగా ఎల్లప్పుడూ కలసిఉండేట్టు చూడవలసినదిగా నా విన్నపం ప్రభూ! అని వేడుకోవడం ఆధ్యాత్మికతను శృంగార రసంతో కలగలిపిన రీతిగా మనకు తోస్తుంది.

ముఖ్యమైన అర్ధములు:

ఉపమించి = పోల్చి ; ఉవిద = స్త్రీ, జవ్వని; అలరంగ = సంతోషపెట్టునట్లు; తళ(ళు?)కు = మిక్కిలి ప్రకాశము; నిరతి = ఆశక్తి; మెఇ (యి?) = మాదిరిగా, తృతీయావిభక్తియందు వచ్చెడు ‘మెయి’ ప్రత్యయము. అరడు = ఏరును లేక నదిని దాటే ఒక కొయ్య దుంగ వంటి సాధనము; వాయక = వదలిపెటక; పికము = చాటునుండి కూయునది, కోయిల; అలమి = క్రమ్ముకొని; ఈకె, ఈపె = ఈ స్త్రీ.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)