ధారావాహికలు
విశ్వామిత్ర 2015 - నవల
- యస్ యస్ వి రమణారావు

విశాఖపట్టణం, లోతైన, విశాలమైన సముద్రం, బీచ్, ఎందరికో ఉపాధినిస్తున్న సాఫ్ట్ వేర్ పార్క్ లు, విద్యాబోధ చేస్తున్న విద్యాలయాలు, నాలుగు మిలియన్ అమెరికన్ డాలర్ల తో మహా స్మార్ట్ సిటీగా రూపొందనున్న నగరం. విశాఖపట్టణం నుంచి భీమిలికి అందమైన ఫోర్ లేన్ రోడ్డు, ఎల్ డి లైట్స్, ఆహ్లాదకరమైన డ్రైవ్, శ్రీవరాహ లక్ష్మీనరసింహ స్వామి కొలువై ఉన్న సింహాచలం కొండ.

గ్రాండియోర్. ఆ హోటల్ నగరం పొలిమేరలలో, హైవేకి ఆనుకుని వున్న ఒక రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది. పేరుకే రెసిడెన్షియల్ ఏరియా గాని, ఓ పదీ ఇరవై ఇళ్ళు కంటే ఎక్కువలేవు అక్కడ. కారణం అక్కడ ఉన్న‌ఒకటి, రెండు స్లమ్స్. ఆ హోటల్ సాక్షాత్తూ ఆరాష్ట్ర హోమ్ మినిస్టర్ దే అయినప్పటికీ ఆ స్లమ్స్ ని తీయించలేకపోవడానికి కారణం, అతను కేవలం పదివోట్లతోనే గెలిచిన వాడు కావడం. ఓడిపోయినా ఆ అపోజిషన్ లీడర్ కి ఆ నియోజకవర్గంలో బలమైన పట్టు ఉండడం.

విశాలమైన పార్కింగ్, ఎత్తైన పోర్టికో, నాలుగు ఫ్లోర్స్, దాదాపు ఒక మూడు వందల రూములు, గ్లాస్ విండోస్ తోటి, కర్టెన్లతోటి, హోటల్ చాలా అందంగానూ, అద్భుతంగానూ ఉంది.

సడన్ గా సెక్యూరిటీ గార్డు అదిరిపోయేలా, రివ్వుమంటూ దూసుకొచ్చింది 2015 Indian Scout, Motor Bike.కార్ పార్కింగ్ స్టాండ్ దగ్గరకొచ్చి, తలతిప్పి సెక్యూరిటీ గార్డు వైపు చూశాడు, Gucci Sunglasses కళ్ళతోటి, బైక్ మీద ఉన్న యువకుడు. పరుగెత్తుకుంటూ గార్డ్ దగ్గరకు రాగానే బైక్ అతని చేతిలో వదిలేసి, చటుక్కున దిగాడు. ఎక్సాక్ట్లీ సిక్స్ ఫీట్ స్టేచర్, ఎక్సాక్ట్లీ సిక్స్ పాక్ ఛాతీ, మెరుస్తున్న రెడీమేడ్ పేంట్, టక్ చేయకుండా వదిలేసిన ఫుల్ హేండ్స్ షార్ట్ షర్ట్, లేటెస్ట్ నైక్ స్పోర్ట్స్ షూ. తల తిప్పి చుట్టూ ఒకసారి చూసి, తల పైకెత్తి హోటల్ పేరు వంక చూసి లోపలకి అడుగులు వేశాడు.`వాసంతి మల్టీకైసిన్ రెస్టారెంట్' లెటర్స్ మెరుస్తున్నాయి. లోపలకి అడుగు పెట్టాడు. హోటల్ అంతా ఖాళీగా ఉంది. నల్లకోటు వేసుకున్న ఇద్దరు కేప్టెన్లు, నలుగురయిదుగురు సర్వర్ లు, టి.వి చూస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. యువకుడ్ని చూడగానే పరుగెత్తుకుంటూ వచ్చాడు ఒక కేప్టెన్.

రెస్టారెంట్ గ్లాస్ డోర్ కి ఆనుకుని ఉన్న సోఫాలాంటి కుర్చీలో కూర్చోబెట్టాడు.

"ఆర్డర్ సార్"

"మిత్ర"

"సార్" ఆశ్చర్యంగా చూశాడు కేప్టెన్

"అలా చూస్తావేంటి? పేరే కదా అడిగావు"

"లేదు సార్. ఆర్డర్ అడిగాను" కేప్టెన్ కొంచెం కన్ఫ్యూస్ అయ్యాడు.

"మళ్ళీ అడుగుతావేటి. చెప్పేశాను కదా?"

అప్పటికి అర్థమయ్యింది, కేప్టెన్ కి`ఓ..సార్, ఇంగ్లీష్ ప్రొఫెసర్ లా ఉన్నారు. ఈరోజుల్లో, వైజాగ్ లో ఇలాంటి వాళ్ళున్నారా? బట్టలు చూస్తే అలా లేవే?'

"ఏంట్రా ఆలోచిస్తున్నావు?"

`వామ్మో. అప్పుడే `ఒరే'లోకి వచ్చేశాడు. వీడితో జాగ్రత్తగా ఉండాలి'

"టిఫిన్ సార్, అదే ఫలహారం ఏదైనా తీసుకుంటారా?"

"ఏంట్రా, తెలుగులో కూడా చెప్తున్నావ్. సరే, రాసుకో, ఇడ్లీ సాంబార్, పెసరట్టుప్మా, పెరుగు వడ... ఆపై ఓ కాఫీ"

మిత్ర టిఫిన్ పూర్తి చేసి ఒళ్ళు విరుచుకున్నాడు. సర్వర్ బిల్లు తీసుకొచ్చిపెట్టాడు. బిల్ ఫోల్డర్ తెరిచి, బిల్లు టేబుల్ మీద పడేసి, ఫోల్డర్ ని బోర్లించి చూసి, పెదవి విరిచాడు. ఇదంతా సర్వర్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఒక నిట్టూర్పు విడిచి పైకి లేచాడు మిత్ర. జేబుల్లో చేతులు పెట్టుకుని ఎంట్రన్స్ వైపు బయలుదేరాడు. మరింత ఆశ్చర్యపోయిన సర్వర్ పరుగెత్తి, మిత్రని ఎంట్రన్స్ ముందర అడ్డుకున్నాడు.

"డబ్బులు ఇవ్వలేదు" అగౌరవం ధ్వనించే గొంతుతో అడిగాడు.

"ఉన్నప్పుడు ఇస్తాలే, అడ్డు తప్పుకో"వెంటనే సమాధానం చెపుతూ సర్వర్ని ఎడంచేత్తో నెమ్మదిగా పక్కకు తోశాడు మిత్ర.

వెంటనే సర్వర్ చూపు మారింది. గొంతులో తిరస్కారం ఒక్కసారిగా తీవ్రంగా పెరిగింది

"నీలాంటి వాళ్ళను చాలామందిని చూశానురా.ముందు డబ్బులు తీయ్"

ఆ మాటలు వినగానే ఎడంచేత్తో కళ్ళజోడు సద్దుకున్నాడు మిత్ర. అదే చూశాడు సర్వర్. కానీ జేబులోంచి పైకి వచ్చిన కుడిచేయిని చూడలేదు. ఆ చెయ్యి సర్వర్ చెంపని తాకడం, వెంటనే సర్వర్ వెళ్ళి రెండు టేబుల్స్ అవతల పడడం ఒకేసారి జరిగాయి. క్రిందపడ్డ సర్వర్, తెగిన పెదవినుంచి జారిపడుతున్న రక్తాన్ని చూసుకుంటూ ఒక్కసారిగా గట్టిగా అరిచాడు"దొంగ దొంగ, డబ్బులు ఇవ్వకుండా పారిపోతున్నాడు, పట్టుకోండి" ఆ అరుపు వింటూనే అక్కడున్న మిగతా నలుగురు సర్వర్ లు ,పట్టుకోవడానికి మిత్రా వైపు పరుగు తీశారు. కానీ వారికి ఆ అవసరం లేకుండానే మిత్రాయే వారి వైపు దూసుకొచ్చాడు. ఆ నలుగుర్ని నాలుగు తన్నులు తన్ని, మొదటి సర్వర్ ని మళ్ళీ ఇంకో రెండు పీకాడు. ఇంతలో లోపలనుంచి కేప్టెన్ పరుగెత్తుకుంటూ వస్తాడు. "ఏంట్రా ఏంటీ గొడవ? "అంటూ. సర్వర్, మిత్రా వైపు చేయి చూపిస్తూ,సంజ్ఞలతో, డబ్బులివ్వకుండా వెళ్ళిపోతున్నాడని తెలియజేసాడు. చుట్టుపక్కల పడివున్న టేబుల్స్, కాళ్ళు, చేతులమీద తీవ్ర గాయాలతో, నేలమీద పడి మూలుగుతూ, భయంతో వణుకుతున్న మిగతా నలుగురు సర్వర్లని చూశాడు. కేప్టెన్ కి వెంటనే అంతా అర్థమైంది. వెంటనే మిత్రావైపు వచ్చాడు. మిత్రా ఎక్కడికి కదలకుండా అక్కడే నిలబడి ఉన్నాడు.

"ఎందుకు కొడుతున్నారు సార్" చాలా వినమ్రంగా అడిగాడు

"వాడు నన్ను దొంగ అన్నాడు. నేనేమైనా పర్సులు కొట్టానా, కేష్ కౌంటర్ లో కేష్ ఎత్తుకెళ్ళానా? నాకు కాలింది. అందుకునే కొట్టాను."

`ఓహో ఆరూట్ లో వచ్చావా? డబ్బులివ్వలేదుగానీ ఎదవ లాజిక్కొకటి'మనసులో అనుకున్నాడు కేప్టెన్
"ఏంట్రా ఆలోచిస్తున్నావ్?"

"ఏంలేదు సార్. పర్సు లు, కేష్ కౌంటరు, కేషు, మీరు ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడుతున్నారా, అని ఆలోచిస్తున్నాను సార్"

మిత్రా కళ్ళజోడు సర్దుకున్నాడు, కేప్టెన్ వంకే చూస్తూ

"చదువుకున్నవాళ్ళు, మీరిలా తప్పులు చేయడం ఏవైనా బాగుందా సార్"

మిత్రా కేప్టెన్ వంక ఆశ్చర్యంగా చూశాడు

"అదే.. టిఫిన్ చేయడం, డబ్బులివ్వకుండా వెళ్ళిపోవడం"

మిత్రా మొహంలో చిరునవ్వు మెరిసింది, కేప్టెన్ భుజంమీద చెయ్యి వేసి డోర్ ఎంట్రన్స్ వైపు నడిచాడు.
"నీపేరేంట్రా?"

"రవిబాబు సార్"

"ఒరే రవిబాబూ, తప్పులన్నీ నువ్వే చేసి నేను చేశానంటావేట్రా?"

రవిబాబు వెర్రిమొహం వేసుకుని ఆశ్చర్యంగా మిత్రా వంక చూశాడు

"అర్థం కాలేద్సార్"

"నేను చదువుకున్నవాడ్నని ఎలా డిసైడ్ చేశావ్? నా టెంత్ క్లాస్ సర్టిఫికెట్ చూశావా? నేనేదైనా కాలేజీ క్లాసురూమ్ లో కూర్చుని ఉండగా చూశావా? ఏం చూశావ్?"

రవిబాబు వెర్రి మొహం మరింత పెద్దదయింది

"అది సరే, ఇందాకా నేను ఏం టిఫిన్ లు చెప్పానో ఒకసారి చెప్పు"

"ఇడ్లీ సాంబార్, పెసరట్టుప్మా,పెరుగు వడ... ఆపై ఓ కాఫీ" "

"మంచి మెమొరీరా నీది"మెచ్చుకున్నాడు మిత్ర "టిఫిన్ ఏంకావాలని అడిగావు కాని బిల్లుకి డబ్బులు ఉన్నాయా లేదా అని అడిగావా?"

రవిబాబు కళ్ళతోపాటు నోరు కూడా తెరుచుకుంది ఆ డైలాగ్ వినగానే

"మరి, ఇన్ని తప్పులు నువ్వు చేసి, నేను తప్పు చేశానంటావేట్రా"

రవిబాబు ఎంట్రన్స్ డోర్ తోసి ఇద్దరూ బయటకు వెళ్ళగానే మిత్రా భుజం మీంచి చెయ్యి తోయడంతో డోర్ దగ్గరే నిలబడిపోయాడు. మిత్రా వెళ్ళి పార్కింగ్ స్టాండ్ లోంచి బైక్ బయటకు తీసాడు. రవిబాబు పరుగెట్టుకుంటూ మిత్రా దగ్గరకు వెళ్ళాడు

"మీ బట్టలు సార్"

మిత్రా ప్రశ్నార్థకంగా చూశాడు.

"అదే సార్, మీరడిగారు కదా, డబ్బులున్నాయా లేదా, పర్సు చూశావా అని అడిగారు కదా? ఇంత కాస్ట్లీ బట్టలు వేసుకున్న వాళ్ళని అవన్నీ ఎలా అడుగుతాం సార్"

"ఓ.." మిత్రా బైక్ స్టాండ్ వెయ్యబోయాడు. రవిబాబు వెంటనే దూరంగా పారిపోయాడు. మిత్రా స్టాండ్ వెయ్యకుండానే దగ్గరకు రమ్మన్నట్టు చెయ్యి ఊపాడు.కేప్టెన్ దగ్గరకు రాగానే

"బట్టలు చూసి మోసపోయావా"అంటూ చూపుడువేలు కేప్టెన్ కణత మీద పెట్టాడు. అప్పుడు మిత్రా బట్టల షాపులో బట్టలు ఎలా కొట్టేసిందీ దృశ్యం రవిబాబు కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడింది......

..బట్టల షాపుముందర స్కూటర్ పార్క్ చేసాడు మిత్ర. బట్టల షాపులో చాలా బట్టలు సెలెక్ట్ చేసాడు. బాయ్ కి హెల్ప్ చేసున్నట్టు తను కూడా కొన్ని పట్టుకున్నాడు. బాయ్ వెనకాల లిఫ్ట్ లో దిగి బాయ్ ని కౌంటర్ దగ్గరకు పంపించి తను డైరెక్ట్ గా బయటకు వెళ్ళిపోయాడు. బిల్లు అడిగిన సెక్యూరిటి గార్డుకి కౌంటర్ దగ్గరనున్న బాయ్ ని చూపించి, గార్డుకి విషయం అర్థమయ్యేలోగా చక చక కారిడార్ మెట్లు దిగి ఒక బైక్ తాళం ఓపెన్ చేసి స్టార్ట్ చేసి స్పీడ్ గా వెళిపోయాడు....

మిత్రా వేలు తీసేసాడు. ఒక్కసారి ఉలిక్కిపడి ఈలోకంలోకి వచ్చాడు కేప్టెన్." వెళ్ళేటప్పుడు స్కూటర్, వచ్చేటప్పుడు బైక్" చేతులెత్తి దణ్ణం పెట్టాడు.

మిత్రా బైక్ స్టార్ట్ చేసి కొంచెం దూరం ముందుకు వెళ్ళి,వెనక్కు తిరిగి కేప్టెన్ ని పిలిచాడు. దగ్గరకు రాగానే అడిగాడు.

"అవున్రా,ఇందాకా ఏంట్రా, పెసరట్టుప్మా, పెరుగు వడ ఎందుకురా అంత లేట్ గా తెచ్చావు?"

మళ్ళీ వెర్రిమొహం వచ్చేసింది రవిబాబు కి.

"ఇప్పుడీ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత అవసరం అంటారా సార్?"

"కస్టమర్ అడిగితే చెప్పవా?"

"కస్టమరా?" రవిబాబు మొహంలో మళ్ళీ రంగులు మారాయి. వెర్రి మొహం మరింత పెద్దదయింది. వెర్రి నవ్వు నవ్వుతూ అన్నాడు.

"అంటే కస్టమర్ ఆర్డర్ ఇచ్చాక తయారు చేస్తాం సార్. ముందర తయారు చేసి పెట్టుకుని, వేడి చేసి ఇవ్వం. మీరిలాంటి హోటల్లో ఎప్పుడు తిని ఉండరు"

మిత్రా కళ్ళజోడు కళ్ళమీంచి కొంచెం క్రిందకు దించి, కేప్టెన్ వంక సీరియస్ గా చూసాడు. రవిబాబు వెంటనే జేబులోంచి కర్ఛీఫ్ తీసి బైక్ టాంక్ తుడిచాడు. మిత్రా చెయ్యి హాండిల్ మీద పెట్టబోతుంటే అదికూడా తుడిచాడు.మిత్రా బండి మీద కూర్చోగానే, చెయ్యి పైకెత్తి శాల్యూట్ చేసాడు "కస్టమర్" అంటూ. బైక్ గ్రాండియోర్ హోటల్ గేటులోంచి రివ్వున బయటకు దూసుకుపోయింది. వెంటనే జేబులోంచి సెల్ బయటకు తీసి బైక్ నంబరు పడేలా క్లిక్ చేసి, ఏదో నంబరు డయల్ చేసాడు రవిబాబు.

వెంటనే అక్కడ నుంచి రెస్పాన్స్ వచ్చింది. "లైన్లో ఉండు."అంటూ. అవతలి వ్యక్తి ఇంకో వ్యక్తికి ఫోన్ చేసాడు. ఆ వ్యక్తి ఇంకో వ్యక్తికి ఫోన్ చేసాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు. హోమ్ మినిస్టర్ పి‌ఏ. హోమ్మినిస్టర్ సిటీలోనే ఉన్నాడని, మర్నాడు పొద్దున్నకల్లా హోటల్ లో గొడవ చేసినవాడెవడైనా, పొద్దున్నకల్లా మినిష్టర్ ఇంట్లో ఉండాలని ఆదేశం వచ్చింది, రవిబాబు కి. ప్ర్రైవేట్ మనుషులనెంతమందినైనా తీసుకు వెళ్ళమని, పోలీస్ మాత్రం వద్దనికూడా ఆ ఆదేశంలో ఉంది. మిత్రా దెబ్బకి ఒక్కసారిగా ఖాళీ హోటల్ లో ఖాళీగా ఉండే కేప్టెన్ రవిబాబు చాలా బిజీ అయిపోయాడు

(ఇంకా ఉంది)

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)