సారస్వతం - 'దీప్తి' వాక్యం
భారతజాతికి ఆదర్శం గురుపూర్ణిమ
- దీప్తి కోడూరు

గురుపూర్ణిమ సాయిభక్తులకు మహత్తర పర్వదినం. సాయిబాబా తన నోటి వెంట, చేసుకోమని చెప్పిన పండుగ ఈ గురుపూర్ణిమ ఒక్కటే. బాబా వంటి మహాపురుషుడు చెప్పిన ప్రతిమాటా చాలా విలువ కలిగి ఉంటుంది. ఏదీ వ్యర్థం కాదు. దానికి ఇదొక ఉదాహరణ.

చిత్రమేమిటంటే, భారతదేశంలో అన్ని చోట్ల ఉగాది ఒకే రోజు రాదు. చాలా పండుగలు వివిధ చోట్ల కొంచెం వ్యత్యాసంతో జరుపుకుంటారు. ఒక దగ్గర చేసే పండుగలు ఇంకో దగ్గర చేయరు. మొత్తం భారతీయులందరూ చేయటం మరచిపోయిన, ఒకనాడు అద్భుతంగా చేసిన, ఇప్పుడు చేసి తీరవలసిన గొప్ప పండుగ గురుపూర్ణిమ. స్మరించవలసినది విస్మరించిన రోజు గురుపూర్ణిమ.

విదేశీయులు, ముస్లింలు, అంతకుముందు క్రిస్టియన్లు, వీరంతా భారతదేశం మీద దాడి చేయకమునుపు, భారతదేశపు ఋషి కులాలన్నీ ప్రతినిత్యమూ జరుపుకొన్న పండుగ గురుపూర్ణిమగా తోస్తోంది. ఎలా అంటే, ఆసేతు శీతాచల పర్యంతమూ, భారతీయులందరూ ఒకే జాతి, ఒకే ధర్మము, ఒకే జీవనవిధానము అంతఃసూత్రంగా కలిగి ఉండటానికి ఒక మహాపురుషుడు కారణం. ఆ మహాపురుషుడు ఈనాడు మనం చెప్పుకొనే పెళ్ళికి, కర్మకత్రువులకు, పూజకు, సమస్తానికీ ఒక జీవనశైలిని ఏర్పాటు చేసినారు. మన జాతి అటువంటి మహాపురుషుడిని విస్మరించింది. ఆయనే వేదవ్యాసుడనీ, కృష్ణద్వైపాయనుడనీ పిలవబడే మహాఋషి.

సాక్షాత్తూ విష్ణుదేవుడే వ్యాస రూపం ధరించి వచ్చారని,"వ్యాసాయ విష్ణు రూపాయ, విష్ణురూపాయ వ్యాసవే" అన్నారు.

ప్రపంచంలో ఒక్కొక్క జాతికి ఒక్కో ఆదర్శం ఉంటుంది. భారతీయులకు భగవంతుడు ఆదర్శం కావటానికి మూలకారకుడు వేదవ్యాసుడే. భారతదేశంలో ఉండే ప్రతివ్యక్తీ విశ్వసించే దైవీభావాలకు ఆయన ఆలోచనలే మూలం.

భారతీయ ఋషులచే చెప్పబడిన వేదవిధానాలన్నింటినీ నాలుగు భాగాలుగా విభజించాడు. అందులో పద్యాలన్నింటినీ ఋగ్వేదమన్నారు. గద్యభాగాన్ని యజుర్వేదమన్నారు. పాటల రూపంలో ఉన్నదాన్ని సామవేదమన్నారు. ఇవి కాక మత్రయంత్రతంత్రాదులతో కూడినటువంటి, అరణ్యకాలలో దొరికే భాగాలన్నింటినీ అధర్వణాచార్యుడనే ఋషి సమీకరించి ఉన్నాడు గనుక, ఆయన పేరుతో నాలుగవ వేదానికి అధర్వణవేదమని పేరు పెట్టాడు. వేదాల అంతిమ భాగాలను ఉపనిషత్తులంటారు. ఆయన 108ఉపనిషత్తులను ప్రవచించినారు.

"కలియుగంలోని వారంతా అల్పాయుష్కులు. వీరు ధర్మాన్ని తెలుసుకొనే చేవ, సత్తువ, వివేకము, శక్తి కలిగి ఉండరు. వీళ్ళకు తగినటువంటి ధర్మం చెబుదామని బ్రహ్మసూత్రాలు లేదా వేదాంతసూత్రాలను రచించినారు. ఇలా వ్రాసిన వేదవ్యాసునికి గురుపూర్ణిమతో రెండు సంబంధాలున్నాయి. మొట్టమొదటిది గురుపూర్ణిమ రోజున వారి జయంతి కావడమైతే, రెండవది భారతీయ శ్రేయస్సును ఆశించి ఆయన బ్రహ్మసూత్రాలు వ్రాయడం ఆరంభించిన రోజు కూడా గురుపూర్ణిమ.

గురుపూర్ణిమకు ఉన్న మరో విశేషం తర్వాతి కాలంలో వెల్లడైంది. హిమాలయ సానువులలో ఉండే ఒక యువరాజు, సిద్ధార్థుడు దుఃఖ రాహిత్యాన్ని అన్వేషిస్తూ సమస్త రాజసుఖాలూ వదిలి వెళ్ళినది గురుపుర్ణిమ నాటి అర్థరాత్రి. ఆయనే గౌతమ బుద్ధుడై, మొట్టమొదటిసారి తాను పొందిన జ్ఞానాన్ని, వారణాసి వచ్చి, పంచశ్రమణులకు, బౌద్ధధర్మంగా ప్రవచించిన రోజు కూడా గురుపూర్ణిమయే. మళ్ళొక్కసారి ప్రచీన ఋషిధర్మాన్ని సంస్కరించి అహింసా సిద్దాంతాన్ని బోధించిన మహత్తర కరుణామూర్తియైన గౌతమబుద్ధుని బుద్ధధర్మ సిద్ధాంతం ప్రరంభించబడిన పవిత్రదినం గురుపూర్ణిమ.

మరొక విశేషమేమంటే,

శిరిడీలో సర్వధర్మాలను సమన్వయిస్తూ, దేహధారిగా వచ్చిన భగవంతుడైన సాయినాధుడు ఈ సనాతన ఋషితత్వానికి మూలకారకుడు. ఆయనను, ఉత్తమ ధర్మాలన్నిటిలాగే, బాబాని అర్థం చేసుకోవటంలో ఆ సమకాలీన భారతీయ సమాజం దారుణంగా విఫలమైంది. ఎలా అంటే కొంతమంది వేషభాషలు చూచి ముస్లిమనుకొన్నారు, ఆయన చెవులకున్న చిల్లుల్ని పట్టించుకోలేదు, ఆయనను ఎక్కడ ఉంచితే అక్కడ నిరంతర అగ్నిహోత్రం వ్రేల్చిందీ వారు పట్టించుకోలేదు. ఆయన వేసుకొన్న తలగుడ్డ శరణాగత చిహ్నమని, అన్ని ధర్మాలూ సమర్ధించవచ్చిన ఋషియే వారని గుర్తించలేక వాళ్ళేమో బాధిస్తే, ఆయనేమో ప్రేమను పంచిపెట్టారు. అటువంటి ఋషి ఎదుట కూర్చుని కూడా ప్రాచీన ఋషి విలువలను గమనించని తనవారిని చూచి దయతో, కరుణతో బాబా ఇలా సూచించారు.

"ఆర్షధర్మాన్ని పాటించే ఆ ముసలయ్యను, నూల్కర్ ను, ద్వారకామాయిలోని ఈ స్తంభాన్ని పూజించమని చెప్పరాదా?" అని శ్యామాతో అంటారాయన. ఆ మాటలలో కూడా మహత్తర ధర్మం ఇమిడి ఉంది. మీరందరూ కూడా మీ గురువును పూజించకూడదా? అనలేదు వారు.

దానికి శ్యామా, "బాబా మేము స్తంభాలని, రాళ్ళని, గోడలనీ ఎందుకు పూజిస్తాము, మిమ్మల్నైతే పూజిస్తాంగానీ?" అని నూల్కర్, మిగతా భక్తులూ గొప్ప భక్తియుతంగా మొట్టమొదటి బాబా సూచన మేరకు ఆ రోజు వారిని పూజించుకొన్నారు. చేసుకున్న తర్వాత చూసుకుంటేగాని తెలియలేదు వారికి ఆ రోజు గురుపూర్ణిమ అని!!!

అంటే బాబా నుంచి వచ్చిన ఆ మాట వెనుక, మొత్తం భారతదేశమంతా ఒక పండుగగా నిర్వహించుకోవలసిన ఉత్తమమైన దినాన్ని విస్మరించినది, మళ్ళొక్కసారి గుర్తుచేసినంతటి విషయం ఉందని వాళ్ళకప్పుడు స్ఫురించలేదు. ఏది ఏమైనా సాయి భక్తులైనవారు, సాయిని అదే రీతిగా స్మరించుకోవటానికి వారే స్వయంగా ప్రొత్సహించి, తాము వాళ్ళ బలవంతం చేత తమ సహజమైన సాధువిధానాన్ని పక్కన పెట్టి వాళ్ళకు ఉత్తమ శ్రేయస్సు చేకూరేందు కోసమై తాము గురుస్వరూపమై పూజలందుకొన్నారు. అదే విధంగా ఈనాటి భక్తులందరూ బాబానలా విశేషంగా పూజించుకోవటం తగినది.

మన భారతీయ సంప్రదాయానికి సంబంధించినంత వరకూ దేహము భూమికి గుర్తు, భూమి తత్వంతో దేహం పరిఢవిల్లి ఉంటుంది. మనస్సుకు చంద్రుడు కారకుడు. చంద్రుడి పూర్ణస్థితి జ్ఞానానికి, ఆనందానికి మూలము. అది జ్యోతిశ్శాస్త్రంలో కూడా చెప్పబడి ఉంది. ఆ విధంగా సంపూర్ణ కళా ప్రపూర్ణుడైనటువంటి చంద్రోదయ శుభవేళలో గురుపూర్ణిమను జరుపుకోవటం సాధన పరంగా కూడా సూక్ష్మతరమైనటువంటి విలువ కలిగి ఉందని పెద్దలు చెప్పినారు. ఇన్ని రకాలైన మేళ్ళన్నీ కలిసి ఉన్నాయి గనుకనే సాయినాధుడు, దిగి వచ్చిన దత్తాత్రేయుడు, మనకు గురుపూర్ణిమ చేసుకొమ్మని సూచించినారు.

గురువుని ఒకచోట కూర్చుని స్మరిస్తే, ఈ విశ్వమే గురురూపమై మననెలా అనుగ్రహిస్తుందో తెలుస్తుందని సాయి సూచించి ఉన్నారు. అందుచేత గురుపూర్ణిమ సాయిభక్తులకు విశిష్టమైన పర్వదినం.

ప్రతివారికీ గురుపూర్ణిమ సందర్భంగా శ్రీసాయి అనుగ్రహము లభించాలని ఆశిస్తూ మీ రూపంలో ఉన్న దత్తాత్రేయ స్వరూపియైన సాయినాధునికి, నన్ను ఈ పవిత్ర మార్గం వైపు ప్రేరేపిస్తున్న నా గురువు చేతనా స్వరూపానికి శిరసా ప్రణామం చేస్తూ నమస్కరిస్తున్నాను.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)