శీర్షికలు
పద్యం - హృద్యం
- పుల్లెల శ్యామసుందర్

ఈ మాసంప్రశ్న:

చెడుగుణములె మేలుఁగూర్చుఁజీవునికెపుడున్

గతమాసం ప్రశ్న:

కొట్టినవాడే ఘనుడని కోమలి పలికెన్

ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.

రాజేశ్వరి నేదునూరి, న్యూజెర్సీ
వంచనేమరి లోకమందున వాడుకొందురు యెందరో
మంచినంతయు మాటలందున మార్చివేయుచుఁ చంపుచున్
కొంచమై ననుప్రేమ భావముకోరి పంచగ లేరొకో
కంచికేగిన కానరాదట కంచుకాగడ వేసినన్

డా. ఐ.యస్.ప్రసాద్, సైంట్ లూయిస్, మిస్సోరి
కట్టుకు వచ్చిన సతికిని
పట్టికి తలిదండ్రులకును పట్టెడు అన్నం
పెట్టగ కట్టెలనైనన్
కొట్టెడివాడే ఘనుడని కోమలి పలికెన్

గండ్లూరు ప్రసాద రావు
(ద్రౌపది తన భర్తలతో అన్న మాటలు)
వెట్టికి విరాటుకొలువున
పట్టపు దేవిని కటకట పంపితిరయ్యో
బెట్టిదుడా కీచకునిన్
గొట్టిన వాడే ఘనుడని కోమలి పల్కెన్

సూర్యకుమారి వారణాసి, మచిలీపట్టణం
(1)
పట్టుదలతో విజయమను
మెట్టున నిలిచీ పలువురమితముగ మెచ్చన్
ఇట్టే మనసులు కొల్లం
కొట్టినవాడే ఘనుడని కోమలి పలికెన్
(2)
పట్టువిడువక విరోధిని
గట్టిగ బంధించి బుద్ధి గఱపఁగ నెంచన్
మట్టి కరిపించియుచితక
కొట్టిన వాడే ఘనుడని కోమలి పలికెన్

డా. బులుసు వేంకట సత్యనారాయన మూర్తి, రాజమహేంద్రవరము
సంచితమ్మని కూడబెట్టుచు సమ్పదన్ వెనకేయుచున్
కొంచెమైనను దానధర్మము కూడ చేయక దాచినన్
మంచినంతయు మాటలందున మార్చివేయుచు చంపుచున్
వంచనమ్మున వచ్చిచేరెడు బంధుకోటికి చేరుటే

మల్లేశ్వరరావు పొలిమేర, కెల్లర్, టెక్సాస్
గుట్టుగ పెళ్ళాడత, చే
పట్టెద నే ప్రియతమయని బలికిన , వలదే
పుట్టిన వారి మనసు పడ
గొట్టినవాడే ఘనుడని కోమలి పలికెన్.

చావలి విజయ, సిడ్నీ, ఆస్ట్రేలియా
(1)
కట్టెను క్రికెట్టు పందెము
పట్టును పెంచె నిరుజట్టు పరుగుల నేర్పున్
జట్టు గెలువంగ నారును
కొట్టిన వాడె ఘనుడని కోమలి పలికెన్ .
(2)
సొట్టల బుగ్గ సుదతితా
పట్టిన కుందేలు రీతి పాటను పాడన్
గట్టిగ భజన సలిపి జై
కొట్టిన వాడె ఘనుడని కోమలి పలికెన్ .

గార రంగనాథం, రాజాం, శ్రీకాకుళం జిల్లా
కొట్టిన,తిట్టిన,మొట్టిన
నిట్టటులాడక, మురిపెము లెంతయు మూటం
గట్టి,పనులన్నిటికి నూ
కొట్టిన వాడే ఘనుడని కోమలి పలికెన్!

శివప్రసాద్ చావలి,సిడ్నీ, ఆస్ట్రేలియా
(1)
పట్టిన యవమానంబున
పట్టిన ప్రతిజ్ఞకు మరి నిలబడి రారాజున్‌
పట్టి రణమున తొడ పగుల
గొట్టిన వాడే ఘనుడని కోమలి పలికెన్‌
అట్టాంటోడిట్టాంటో
డుట్టిగ మనువుకు సరిపడడు తనకు నచ్చన్‌
గట్టిగ హీరో వలె తొడ
గొట్టిన వాడే ఘనుడని కోమలి పలికెన్‌

జంధ్యాల కుసుమ కుమారి, హైదరాబాదు
గట్టిది,జనకుని ముద్దుల
పట్టి వశంబై చెలంగు పరమాద్భుతమై
నట్టి శివ శరాసనమున్
కొట్టిన వాడే ఘనుడని కోమలి పలికెన్.

గండికోట విశ్వనాధం, హైదరాబాదు.
గట్టిగ తిట్టిన కొట్టిన
కట్టడి చేసిన, పలు వెటకారపు కధలన్‌
గుట్టుగ చిరునగవుతొ "వూ
కొట్టిన" వాడే ఘనుడని కోమలి పలికెన్‌.

మధిర మూర్తి
పట్టిన పట్టును వీడక
యుట్టిల గొట్టిన బడాయి యువకుల తోడన్
పిట్టకు కట్టిన పండును
కొట్టిన వాడే ఘనుడని కోమలి పలికెన్

డా. బులుసు వేంకట సత్యనారాయన మూర్తి, రాజమహేంద్రవరము
ఎట్టుల వత్తును హనుమా!
నెట్టన రాముండు వచ్చి నేరుగ తా చే
పట్టక రాక్షస హసనము
కొట్టినవాడే ఘనుడని కోమలి పలికెన్

మహీధర రామశాస్త్రి, రాజమహేంద్రవరము
చుట్టపు చూపుగ వచ్చుచు
కొట్టన్ జాలని క్రికెటరు కొఱకొఱ వెడలన్
ఫట్టని వరుసగ సిక్సులు
కొట్టినవాడే ఘనుడని కోమలి పలికెన్

ఇంద్రగంటి సతీష్ కుమార్, చెన్నై
(1)
ఎట్టి సమస్యలనైనను
గట్టిగ నిలబడి తెలివిగ గడచి మనసునా
కట్టుకొని మంచి ముద్రను
కొట్టినవాడే ఘనుడని కోమలి పలికెన్!
(2)
గట్టిగ కండలు పెంచుచు,
ఒట్టిగ గాలికి తిరిగెడు సోమరి కంటెన్,
పట్టెడు తిండికి కట్టెలు
కొట్టినవాడే ఘనుడని కోమలి పలికెన్!
(3)
పట్టాలే గాక వరుడు,
తిట్టక, కొట్టక, షికార్లు తిప్పుచు, కోరన్
బట్టలు కొనుటకు నోట్లను
కొట్టినవాడే ఘనుడని కోమలి పలికెన్!

పుల్లెలశ్యామసుందర్, శేన్హోసే, కాలిఫోర్నియా
మట్టిని బాగా పట్టిన
బట్టలనుతకంగఁదానుపట్టుకువానిన్
గట్టిగ చాకలిబండకు
కొట్టినవాడే ఘనుడని కోమలి పలికెన్!

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)