సారస్వతం
నరసింహ సుభాషితం
- ఓరుగంటి వేఙ్కట లక్ష్మీ నరసింహ మూర్తి

కార్యవాది -1

     

శ్లోకం:

सम्पूर्णकुम्भो न करोति शब्दमर्थघटो घोषमुपैति नूनं ।
विद्वान् कुलीनो न करोति गर्वं मूढास्तु जल्पन्ति गुणैर्विहीनाः ।।

సంపూర్ణకుంభో న కరోతి శబ్దమర్థఘటో ఘోషముపైతి నూనం ।
విద్వాన్ కులీనో న కరోతి గర్వం మూఢాస్తు జల్పన్తి గుణైర్విహీనాః ।।

సంధి విగ్రహం
సంపూర్ణ, కుంభః, న, కరోతి, శబ్దం, అర్థః, ఘటః, ఘోషం, ఉపైతి, నూనం ।
విద్వాన్, కులీనః, న కరోతి, గర్వం, మూఢాః, తు, జల్పన్తి, గుణైః, విహీనాః ।।

శబ్దార్థం
సంపూర్ణ కుంభః = నిండు కుండ, శబ్దం = ధ్వని, న కరోతి = చేయదు, అర్థః ఘటః = అసంపూర్ణమైన కుండ, ఘోషం ఉపైతి = చప్పుడు చేస్తుంది, నూనం = నిశ్చయంగా, విద్వాన్ = విద్వాంశుడు, కులీనః = ఉన్నత కుటుంబీకుడు, న కరోతి గర్వం = అనవసర ఆర్భాటంతో గర్విష్టుడు అవడు, మూఢాః = మూర్ఖులు, గుణైః విహీనాః = గుణవిహీనులు అగుట చేత, జల్పంతి = అసంబద్ధ ప్రేలాపనలు చేస్తారు.

Meaning
A pot filled with water brimful does not make any noise. However a half filled pot really makes noise. Similarly, a learned and respectable person is never vain or never exhibits a false pride, but foolish people bereft of any good qualities, babble incessantly or continuously.

భావార్థం
సంపూర్ణ కుంభం, అనగా నీటితో నిండుగా నిండిన కుండ, శబ్దం చేయదు. దానిలోని నీరు తొణికిసలాడదు. అదే సగం నీటితో నింపబడిన కుండలోని నీరు శబ్దం చేస్తూ బాగా తొణికిసలాడుతుంది.

మంచి కుటుంబములో పుట్టిన వాడు, విద్వాంసుడైన వాడు, ఉన్నతమైన విలువలని పాటించే కుటుంబంలో తాను పెరిగిన కారణంచేత, ఆ నేపధ్యంలో ఉన్నతమైన విలువలను సహజముగా సంక్రమించిన వాడు అవడంచేత, సమాజంలో ఇతరులతో గర్వంతో మెలగడు. అనవసరమైన గొప్పలకి పోడు. అదే, మూఢులు అనగా తెలివి తక్కువ వాళ్ళు ఉన్నతమైన విలువలని ఆకళింపు చేసుకోని కారణంచేత, బుద్ధి వికాశం సరిగా లేని నేపధ్యంలో ఎల్లప్పుడూ ఊరికే అనవసరమైన గొప్పలకి పోతూ అసంబద్ధ ప్రేలాపనలు చేస్తూ ఉంటారు.

ఎంతో విద్యావంతుడై, ఉన్నత విలువలు సంక్రమించిన వాడు అయినచో, బాగా ధనికుడైనప్పటికీ, ఏ మాత్రం గర్వం ప్రదర్శించకుండా, గొప్పలకి పోకుండా మెలగి ఉండే వ్యక్తిని చూసి "అతడు నిండు కుండ", "ఎంతైనా నిండుకుండ తొణకదు" అని ఆ వ్యక్తిని ప్రశంశా పూర్వకంగా మెచ్చుకుంటూ ఉంటారు.

అందుచే నిండుకుండ తొణకదు అనే నానుడి కూడా సమాజంలో స్థిరపడింది.

-------------- ॐ ॐ ॐ --------------

కార్యవాది -2

శ్లోకం:

शरदि न वर्षति गर्जति, वर्षति वर्षासु नि:स्वनो मेघ: ।
नीचो वदति न कुरुते, न वदति सुजन: करोत्येव ।।

శరది న వర్షతి గర్జతి, వర్షతి వర్షాసు ని: స్వనో మేఘ: ।
నీచో వదతి న కురుతే, న వదతి సుజన: కరోత్యేవ ।।

సంధి విగ్రహం
శరది, న వర్షతి, గర్జతి, వర్షతి, వర్షాసు ని: స్వనః, మేఘ:,
నీచః, వదతి, న కురుతే, న వదతి, సుజన:, కరోతి, ఏవ

శబ్దార్థం
శరది = శరత్కాలమునందు, మేఘ: = మేఘము, గర్జతి = గర్జిస్తుంది, న వర్షతి = కాని వర్షించదు, వర్షాసు = వర్షాకాలములయందు, మేఘ: = మేఘము, ని: స్వనః = శబ్దము చేయకుండా అనగా గర్జనలు చేయకుండా, వర్షతి = వర్షిసుంది.
నీచః = తెలివి హీనుడు, వదతి = కబుర్లు చెబుతూ గొప్పలకి పోతాడు, న కురుతే = కానీ కార్యోన్ముఖుడు అవడు, సుజన: = బుద్ధిమంతుడు లేదా తెలివైన వాడు, న వదతి = అనవసరమైన గొప్పలకి పోయి మాట్లాడకుండా, కరోతి ఏవ = తను చేయవలసిన కార్యములను పూర్తి చేస్తాడు.

Meaning
Clouds in autumn do not cause rain, but they make big thunderous sounds when they pass by. Whereas, monsoon clouds give rains, without making noice. An inferior person just talks, does not do anything but, a good person acts, does not boast about his acts.

భావార్థం
శరత్కాలంలో ఆకాశం నిండా మేఘాలు ఆవరించుకుని ఉంటాయి. ఆ శరత్కాల మేఘం ఉరుములూ మెరుపులతో గర్జిస్తూ ఆర్భాటం చేస్తుంది కానీ వర్షించదు. అదే వర్షాకాల మేఘం, సాధారణంగా, ఏ ఆర్భాటమూ లేకుండా, ఉరుములూ మెరుపులూ లేకుండా నిలచి వర్షిస్తూ ఉంటుంది. (కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఉరుములూ మెరుపులతో కూడిన వర్షం రావడం అనేది కలదు. అయిననూ వర్షిస్తుంది. ప్రస్తుత సందర్భానికి అనుగుణంగా ఉరుములూ మెరుపులతో కూడిన వర్షించే వర్షాకాల మేఘాన్ని ప్రస్తావనలోకి తీసుకోలేదు).

అదే విధంగా, నీచుడు అనగా తెలివి తక్కువ వాడు an inferior person, ఆర్భాటాలకి పోతూ, డాంబికాన్ని ప్రదర్శిస్తూ, గొప్ప గొప్ప మాటలు చెపుతూ, తాత్కాలిక మెప్పులని సంపాదించడానికి ప్రయత్నిస్తాడు. కానీ, కార్య వాది అయిన సుజనుడు అనగా తెలివైన వాడు, ఈ రకమైన మెరమెచ్చుల జోలికి పోకుండా, గొప్పలకి పోకుండా, తను చేయవలసిన పనిని చేసుకుంటూ పోతాడు.
అంటే ఒకడు డాంబికాలకు ఆర్భాటాలకి పోయి కార్యవాది కాకుండా కబుర్లతో కాలక్షేపం చేసే వాడు మరి యొకడు యే రకమైన డాంబికాలకి, గొప్పలకి పోకుండా కార్యవాదియై ప్రశాంతంగా తన పని చేసుకుపోయే వాడు.

ఆంగ్లములో ఒక saying కూడా ఉన్నది. Barking dog seldom bites అని.
ఇంచుమించుగా ఇదే అర్థంతో తెలుగు భాషలో కూడా ఒక సామెత ఉన్నది. అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదు అని.

అంటే, చేయదలచిన మంచి కార్యాన్ని గొప్పలకి పోకుండా లేకుండా చేయమని, వాటి అవసరం లేదని అని తాత్పర్యం.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)