ధారావాహికలు - శ్రీరామాయణ సంగ్రహం
యుద్ధకాండ
- డా. అక్కిరాజు రమాపతిరావు

రావణ తనయుల రంగప్రవేశం

అప్పుడు రావణాసురుడి తనయులు త్రిశిరుడు, దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు తండ్రిని ఊరడించి ప్రతీకారం సాధిస్తామని నమ్మబలికి యుద్ధానికి బయలుదేరారు. ఆ నలుగురు పుత్రులను కౌగిలించుకొని ఆశీర్వదించాడు రావణుడు. వాళ్ళు తండ్రికి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. యుద్ధభూమిలో ఆ అప్రతిమపరాక్రములు తమ తమ వాహనాలతో ఆకాశంలో గ్రహాలవలె కన్పించారు. ఏనుగులమీద, గుర్రాలమీద, రథాల మీద అశేషరాక్షస సేనావాహిని కూడా కదలిపోయింది.

యుద్ధభూమిలో మహాకోలాహలం చెలరేగింది. శత్రుజయమో, వీరమరణమో అని కఠిన నిర్ణయానికి వచ్చారు ఆ రాక్షసయోధులు. వానరులూ, రాక్షసులూ హోరాహోరీ పోరాడారు. ఇరుపక్షాలలో అసంఖ్యాక వీరవరులు మడిశారు. యుద్ధభూమిలో నెత్తురు వరదలై పారింది. వృక్షాలను పర్వతశిలలను ఒకరి నుంచి ఒకరు లాక్కుని పరస్పరం ఒకరిపక్షం వారిని, వేరొక పక్షంవారు చంపుకున్నారు. వానరులు భయభ్రాంతులై సుగ్రీవుడితో మొరపెట్టుకున్నారు. సుగ్రీవుడు అంగదుణ్ణి వెళ్ళి వానరులకు ధైర్యం చెప్పి ఈ ఉత్పాతాన్ని నివారించవలసిందిగా కోరాడు. యుద్ధభూమిలో మృత్యుదేవతలాగా విజృంభిస్తున్న నరాంతకుణ్ణి అంగదుడు విక్రమించి చంపివేశాడు. శ్రీరాముడు అంగదుణ్ణి అప్పుడు ఎంతో మెచ్చుకున్నాడు. నరాంతకు డిట్లా అంగదుడి చేతిలో హతుడవటం చూసి కోపోద్రిక్తులై ప్రతీకారేచ్ఛతో త్రిశిరుడూ, దేవాంతకుడూ, మహోదరుడూ అంగదుడిపై విజృంభించి పోరాడారు. ముగ్గురూ అంగదుణ్ణి కమ్ముకుని అస్త్రశస్త్రాలతో మహాభయంకరంగా క్షోభపెట్టారు. అయినా అంగదుడు చలించలేదు. ఒకరి తర్వాత ఒకరిని ప్రచండ విక్రమంతో ఆహవభూమిలో సంహరించాడు. ఇట్లా ముగ్గురినీ అంగదుడు మట్టుపెట్టడం చూసి మహోద్రేకంతో మహాపార్శ్వుడు వానరసైన్యంపై విజృంభించాడు. ఋషభుడనే వానరయోధుడికీ, మహాపార్శ్వుడికీ మధ్య ఘోరయుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మహాపార్శ్వుడు మరణించాడు.

మహాపార్శ్వుడి మరణం చూసి రాక్షస సైన్యాలు కకావికలై మహా సంక్షోభంతో పలాయనం చేశాయి. రాక్షస సైన్యమంతా నాశనమైపోవటం, తన పినతండ్రులూ, సోదరులూ హతం కావటం భరించలేక క్రోధోద్రిక్తమానసుడై అతికాయుడు ఎట్లానైనా వానరసేనను నిర్జించి శ్రీరాముణ్ణి భంగపుచ్చి పరాభవించాలని మదోద్ధతుడై యుద్ధరంగాన నిలిచాడు. ఆ అతికాయుడి ప్రళయ కాలానలమహోద్ధతి చూసి శ్రీరాముడు విభీషణుడితో ఈ రాక్షసుడి పరాక్రమం అసదృశంగా ఉంది. వీడిని గూర్చి చెప్పవలసిందని ప్రస్తావించాడు. అప్పుడు విభీషణుడు అతికాయుడి అప్రతిమాన పరాక్రమం గూర్చి శ్రీరాముడికి తెలియచేశాడు. అతికాయుడు అప్పుడు అహంకారంతో ''నన్ను ఎవరైనా ఎదిరించగలరా?'' అని భీషనంగా గర్జించాడు. అతికాయుడి దర్పోద్ధతిని లక్ష్మణుడు సహించలేకపోయినాడు. ఆ క్రూర పరాక్రముడిపై నారి ఎక్కుపెట్టి అల్లెతాటిని మోగించి బాణం సంధించబోతుండగా అతికాయుడు పరుషాతి పరుషంగా లక్ష్మణుణ్ణి రెచ్చగొట్టాడు. ''నీవు చిన్నవాడివి. నాతో యుద్ధం ఎందుకు?'' అని చులకన చేసి మాట్లాడాడు.

లక్ష్మణుడు క్రుద్ధుడై అతికాయుడి ఫాలభాగాన తీవ్రమైన శరం ప్రయోగించాడు. ఆ బాణం ధాటికి అతికాయుడు కంపించిపోయినాడు. లక్ష్మణుడిపై శరవర్షం కురిపించాడు. వీటన్నిటినీ ముక్కలుముక్కలు చేశాడు లక్ష్మణుడు. అతికాయుడు భరించరాని అవమానంతో తీక్ష్ణ శరం ప్రయోగించి లక్ష్మణుడి వక్షఃస్థలం గాయపరచాడు. దుస్సహుడై లక్ష్మణుడు అగ్నిదేవతాకమైన అస్త్రాన్ని అతికాయుడిపై ప్రయోగించాడప్పుడు. అతికాయు డది చూసి ఆగ్నేయాస్త్రం మరింత మంత్రపూతం చేసి ప్రయోగించాడు. ఆకాశంలో ఈ రెండు అస్త్రాలూ ఢీకొని చల్లారిపోయినాయి.

తర్వాత ఇద్దరూ వివిధ దేవతాస్త్రాలు ఒకరిపై ఒకరు ప్రయోగించుకున్నారు. కాని ఎవరూ పరాజయం పాలు కాలేదు. అప్పుడు వాయుదేవుడు లక్ష్మణుడితో ఈ అతికాయుడు బ్రహ్మాస్త్రంతో తప్ప విజితుడు కాడు అని చెప్పగా అప్పుడు లక్ష్మణుడు అతికాయుడిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. అప్పుడు భూమ్యాకాశాలు సంచలించాయి. దిక్కులు కదలబారాయి. సూర్యచంద్రులు గతులు తప్పారు. దాన్ని భగ్నం చేయాలని వివిధ దేవతాస్త్రాలు సంధించాడు అతికాయుడు. కాని బ్రహ్మాస్త్రం అమోఘమై వచ్చి అతికాయుడి శిరాన్ని ఖండించింది. రాక్షససేన అంతా హాహాకారాలు చేసింది.

ఇంద్రజిత్తు మళ్లీ యుద్ధరంగంలో ప్రవేశించటం

ఈ వార్త విని రావణుడు విహ్వలుడైనాడు. భీతి చెందాడు. 'ఇంద్రజిత్తు ప్రయోగించిన నాగపాశాలను కూడా రామలక్ష్మణులు తెంపివేశారు. ఇక వాల్ళతో పోరాడగల రాక్షసవీరు లెవరూ లేరు. ఆ రాముడు సాక్షాత్తూ విష్ణువే నేమో! లంక నాశనం కాకుండా రాక్షసులారా! జాగ్రత్తగా కాపాడుకోండి' అని రావణుడు నిర్వేదం చెందాడు. చాలా దుఃఖపడ్డాడు. పదే పదే నిట్టూర్పులు పుచ్చాడు. తమ్ములూ, కొడుకులూ మరణించినందుకు దుఃఖసముద్రంలో కూరుకొనిపోయినాడు. అప్పుడు ఇంద్రజిత్తు తండ్రిని చూడటానికి వచ్చాడు. 'ఇంద్రజిత్తు బతికి ఉండగా నీ కీ నిర్వేదం ఎందుకు. నేను యుద్ధరంగాన నిలిచి నీ పరాభవం పూర్తిగా తుడిచివేస్తాను. నన్ను జయించగలవా రెవ్వరూ ఇంతవరకు పుట్టలేదు. ఆ రామలక్ష్మణులను పరిమారుస్తాను. వచ్చి నీ దీవెన లందుకుంటాను' అని రావణుడికి దుఃఖోపశమనం చేశాడు. ససైన్యుడై యుద్ధరంగానికి వెళ్ళాడు. ప్రళయకాలాగ్నిలా విజృంభించి వానరులను దహించాడు. మాయా యుద్ధం చేసి వానరులను అసంక్యాకంగా మట్టుపెట్టాడు. తమమీద వచ్చిపడే బాణాలే వాళ్ళు చూశారుకాని ఇంద్రజిత్తు ఎక్కడున్నాడో వాళ్ళు చూడలేకపోయినారు.

ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ప్రయోగం

ఇక అప్పుడు రామలక్ష్మణులపై విజృంభించాడు ఇంద్రజిత్తు. వాళ్ళపై బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రాన్ని చులకన చేయలేక రామలక్ష్మణులు సొమ్మసిల్లి పడిపోయినారు. సుగ్రీవుడు, నీలుడు, అంగదుడు, జాంబవంతుడు కూడా చేతనరహితులైనారు. విభీషణుడు వానరసేనానాయకులకు ధైర్యం చెప్పాడు. బ్రహ్మాస్త్రాన్ని అవజ్ఞ చేయకుండా ఉండేందుకు వాళ్ళు దానికి కట్టుబడిపోయినారు అంటూ వాళ్ళకు స్థైర్యం చేకూర్చాడు. అప్పుడు హనుమంతుడూ, విభీషణుడూ పోయి వానర సైన్యాన్ని సేదదీర్చారు. కోటానుకోట్లు వానరులు ఇంద్రజిత్తు ప్రతాపానికి క్షతగాత్రులైనారు. కొందరు ప్రాణాలు వదిలారు. వానరయూథప్రముఖులే నిలవలేకపోయినారు. జాంబవంతుడి వంటి మహాబల పరాక్రమవంతుడే డస్సిపోయినాడు.

జాంబవంతుడిని విభీషణుడు ఓదార్చగా, జాంబవంతుడు విభీషణుడి మాట గుర్తుపట్టి ఎలాగో గొంతు పెగల్చుకొని- ''విభీషనా! వాయుదేవుడి ప్రభావంతో అంజనాదేవికి జన్మించిన వానరోత్తముడు హనుమంతుడు ప్రాణాలతో ఉన్నాడా?'' అని అడిగాడు. అప్పుడు విభీషణుడు ఆయనతో ''ఆర్యుడా! పూజ్యులైన రామలక్ష్మణుల క్షేమం అడగక, ముందుగా హనుమంతుడిపై ఎందుకు శ్రద్ధ చేపుతున్నావ''ని ప్రశ్నించాడు. దానికిట్లా బదులు చెప్పాడు జాంబవంతుడు-

తస్మిన్‌ జీవతి వీరే తు హతమప్యహతం బలమ్‌,
హనుమత్యజ్ఞితప్రాణే జీవంతో2 పి వయం హతాః (యుద్ధ 74.22)
''విభీషణా! హనుమంతుడు జీవించి ఉన్నట్లయితే వానరసైన్యం హతమైనా జీవించి ఉన్నట్లే. అలా కాక మారుతి మరణిస్తే, మనమంతా బ్రతికి ఉన్నా చచ్చినవారితో సమానమే.''

అప్పుడు హనుమంతుడు వెళ్ళి జాంబవంతుడి పాదాలకు నమస్కారం చేసి నిలుచున్నాడు. 'నాయనా హనుమంతుడా! నీ విప్పుడే హిమాలయపర్వతానికి వెళ్లు. అక్కడ కాంచనపర్వత శిఖరానికీ, కైలాసపర్వత శిఖరానికీ మధ్య ఒక ఓషధీపర్వతం ఉంది. అక్కడ ఓషధులు దివ్యకాంతులతో ప్రకాశిస్తూ ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది సంజీవకరణి అనే ఓషధి. ఇది మృతులను బతికిస్తుంది. విశల్యకరణి అనే ఓషధి రెండోది. దీనివల్ల సమస్త వ్రణాలు నయమైపోతాయి. సౌవర్ణకరణి మూడోది. దీనివల్ల గాయాలు మానిపోతాయి, మచ్చలు మాసిపోతాయి. శరీరం యథాతథమై పోతుంది. నాలుగోది సంధానకరణి. వికలమైపోయిన, తెగిపోయిన అవయవాలను కలిపి చక్కబరుస్తుంది ఈ ఓషధి. నీవు వెంటనే వెళ్ళి ఈ నాలుగు మూలికామహౌషధులను తీసుకొనిరావాలి. అప్పుడు వానరులంతా పునర్జీవిస్తారు. యతాపూర్వం బలతేజోవంతు లవుతారు'' అని జాంబవంతుడు అర్థించాడు హనుమంతుణ్ణి.

హనుమంతుడు సంజీవని పర్వతం నుంచి ఓషధులు తేవటం

అప్పుడు హనుమంతుడు ఉప్పొంగి తన దేహాన్ని పెంచాడు. త్రికూట పర్వతంపైకి వెళ్ళాడు. ఆ పర్వతాన్ని కదం తొక్కాడు. ఆ ఉద్ధతికి లంకాపట్టణం గడగడ వణికింది. అక్కడ నుంచి ఎగిరి మలయపర్వతంపై కాలు మోపాడు హనుమంతుడు. అక్కడ నుంచి ఆయన చేసిన గర్జనం లంకలో వాళ్ళు కూడా విన్నారు. అక్కడ నుంచి ఆయన ఉత్తరదిక్కుతగా లంఘించి హిమవత్పర్వతం చేరాడు. అక్కడ రాత్రిపూట ధగధగమెరిసే పరమౌషధులతో ఉన్న పర్వతాన్ని చూశాడు. అక్కడంతా జాంబవంతుడు చెప్పిన ఓషధులను వెదకటం మొదలుపెట్టాడు. ఎంత తిరిగినా అవి కనపడలేదు. అప్పుడు హనుమంతుడికి చాలా కోపం వచ్చింది. ఆ పర్వత శిఖరాన్ని పెకలించాడు. అంతరిక్షంలోకి ఆ పర్వతం తీసుకొని ఎగిరాడు. అప్పుడాయన రెండో సూర్యుడిలా ప్రకాశించాడు.వానరవీరులను అసంఖ్యాకంగా ఇంద్రజిత్తు చంపుతుంటే లక్ష్మణుడు పట్టరాని ఆగ్రహంతో బ్రహ్మాస్త్రాన్ని సంధించటానికి అన్న అనుజ్ఞ వేడుకున్నాడు. అప్పుడు శ్రీరాముడు ఒక్కణ్ణి వధించటానికి భూవలయమంతా సంక్షోభింపచేయడం తగదని తమ్ముడికి కోపోపశమనం చేశాడు. ''ఇంద్రజిత్తు ఒక్కణ్ణే వధించే ప్రయత్నం చేద్దాం'' అని నచ్చచెపుతూ, ''నేను ఇప్పుడు ఒక దివ్యాస్త్రాన్ని వీడిపై ప్రయోగిస్తాను. అది వీడు ఎక్కడ ఉన్నా ఎక్కడ దాక్కున్నా వీణ్ణి వదిలిపెట్టదు' అని లక్ష్మణుడికి శపథపూర్వకంగా చెప్పాడు.

(-సశేషం)

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)