నాకు నచ్చిన కథ
మురికి
కథారచన -సలీమ్
శీర్షిక నిర్వహణ: తమిరిశ జానకి


వాడికి నిండా పదేళ్ళుండవు. కానీ వాడి మొహంలో పసితనపు నిగారింపుకు బదులు పేదరికం బలవంతంగా రుద్దిన ముదురుతనం కన్పిస్తుంది. పదిరోజుల క్రితమే పార్వతమ్మ యింట్లో పనికి కుదిర్చాడు వాడి నన్న.

పార్వతమ్మ యిద్దరు కొడుకులూ అమెరికాలో ఉన్నారు. ఇక్కడ మిగిలింది ఆమె ఆమె భర్త. యిద్దరికీ వయసు అరవై దాటింది. ఆయనకు కీళ్ళ నొప్పులు. మనిషి సరిగ్గా నడవలేదు. కూచున్న చోటనుండి లేవాలన్నా నరకమే. ఆవిడకేమో యింటి పనుల్లో తీరికే దొరకదు. అందుకే చేతి సాయంగా ఉండటానికి ఎవరైనా కుర్రాణ్ణి చూసిపెట్టమని పనిమనిషితో చెప్పి పెట్టింది. ఆ పనిమనిషి శీను వాళ్ళ నాన్నతో విషయం చెప్పడమూ ఆ పనిలో శీను కుదురుకోవడమూ జరిగిపోయాయి.

వాడు వడివడిగా నడుస్తున్నాడు. ఎండాకాలం కావడం వలన పదింటికే ఎండ చురుక్కుమంటోంది. పనిమనిషి పదింటికి వెళ్ళిపోతుంది. వాడి పని అప్పట్నుంచే మొదలవుతుంది. బజారుకెళ్ళి సరుకులు కొనుక్కురావడం, మెడికల్ షాప్ కి వెళ్ళి మందులు కొనుక్కుని రావడం, బట్టలు యిస్త్రీ చేయించుకురావడం, అయ్యగారికి సిగరెట్ లు తేవడం. కూరగాయలు మాత్రం అమ్మగారే కొంటారు. వాడు సంచి మోయాలి అంతే.... ఓ రకంగా చెప్పాలంటే వాణ్ణి పన్లో పెట్టుకుందే ఆయనకు చేతికింద సాయంగా ఉంటాడని.

వాడికీ పని హాయిగానే ఉంది. పెద్దగా శ్రమనిపించడం లేదు. హాల్లో గోడకానుకుని కూచుంటాడు. ‘ఒరే శీనూ’ అని అయ్యగారు పిలవడం తరువాయి..‘వస్తున్నానయ్యా’ అంటూ తూనీగలా పరుగెత్తుతాడు. అయ్యగారేదో వస్తువు కావాలంటాడు. తెచ్చిస్తాడు. ఏ పుస్తకమో పేపరో అడుగుతారు. అందిస్తాడు. అప్పుడప్పుడూ కాళ్ళు పట్టమంటారు.

పార్వతమ్మ గారు వంటగదిలో ఉన్నప్పుడు ఫోన్ మోగితే,‘శీనూ..ఆ కార్డ్ లెస్ యిలా పట్రా’..అంటూ కేకేస్తారు. వాడు పరుగెత్తికెళ్ళి ఫోనందుకుని వంటగది వైపుకు పరిగెత్తుతాడు.

అక్కడే తంటా అంతా. అమ్మగారు అచ్చం పార్గతి దేవిలనే ఉంటారు. తెల్లటి కళగల మొహం. నుదుట రూపాయి కాసంత కుంకుమ బొట్టు. చూస్తే కాళ్ళకు మొక్కాలనిపించేలా ఉంటారు. ఆమె మొహంలో చిరాకుని వాడీ పదిరోజుల్లో ఎప్పుడూ చూళ్ళేదు. ఎప్పుడూ శాంతంగా...చల్లటి చూపు...మృదువుగా, మెల్లగా మాట్లాడ్తారు.

అంతా బావుంది. కానీ పార్వతమ్మ గారికి శుచీ, శుభ్రం ఎక్కువ. హాల్లో ఎక్కడా మరక కనిపించకూడదు. కిటికీల మీద దుమ్ము కనిపించకూడదు. ఆమె కళ్ళకు మురికి కనిపిస్తే వూరుకోదు. వాణ్ణి పనిలో చేర్పించడానికి వాడి నాన్న పిల్చుకొచ్చిన రోజు ఆమె అన్న మాటలు గుర్తుకొచ్చాయి.

‘నాకు శుభ్రం చాలా ఎక్కువ. వీడి బట్టలు చూడు ఎంత మురిగ్గా ఉన్నాయో..ఇలా ఉంటే ఇంటి లోపలికి రానివ్వను. రోజూ శుభ్రంగా ఉతికిన బట్టలే వేసుకుని రావాలి. యింట్లోకి వచ్చేముందు పెరట్లోకి వెళ్ళి కాళ్ళూ చేతులూ శుభ్రంగా కడుక్కుని రావాలి. మా పనిమనిషి వెళ్ళిపోయాక ఇల్లంతా అద్దంలా ఉంచాల్సిన బాధ్యత వీడిదే. ఎక్కడైనా ఓ చిన్న మట్టి రేణువు కన్పించినా చిన్న మరక కన్పించినా, చిన్న మరక కన్పించినా, చివరికి కాగితమ్ముక్క కన్పించినా ఊరుకోను. అన్నింటికంటే నాకు శుభ్రం ముఖ్యం. తెల్సిందా’

ఆమె మాటలు గుర్తుకు రాగానే వేగంగా నడుస్తున్నవాడల్లా రోడ్డు మధ్యలో ఠక్కున ఆగిపోయాడు. తన ఒంటిమీదున్న చొక్క వైపు, నిక్కరు వైపు చూసుకున్నాడు. చొక్కా రెండు చోట్ల చిరుగులు పట్టింది. నిన్న వాడే ఉతుక్కున్న జత. వాడికున్నవి రెండు జతలే. పనిలో చేరక ముందు వారానికోసారి ఉతుక్కునేవాడు. ఇప్పుడు అమ్మగారికి కోపం వస్తుందేమోనని రోజూ ఓ జత ఉతుక్కుని మరునాడు వెసుకుంటున్నాడు.

"మీ అయ్యగోర్ని ఓ పాత చొక్కా ఇమ్మని అడుగు..నువ్వేసుకుంటే పొడుగ్గా జుబ్బాలా ఉంటది" అన్నాడు వాడి నాన్న.

శీనుకో అనుమానం వచ్చింది. వాళ్ళయ్య చొక్కా అడగమంది తన కోసమా అతని కోసమా అని. తీరా అడిగి తెచ్చుకున్నాక, ‘నీకెందుకురా అంత పొడవు సొక్కా..నిండా మునిగిపోతావు.నాకిచ్చేయ్. సరిగ్గా సరిపోతుంది’ అని లాక్కుంటాడేమోనని.

ఏమైనాసరే ఈరోజు అయ్యగార్ని చొక్కా అడగాలనుకున్నాడు.

నడుస్తూనే తన కాళ్ళవైపు చూసుకున్నాడు. చెప్పుల్లేని కాళ్ళు..దుమ్ము పట్టి ఉన్నాయి. మురికి ... అమ్మగారికి ఇష్టంలేని మురికి..గుడిలాంటి యిల్లు... మురికంటకూడదు. వెళ్ళగానే శుభ్రంగా కడుక్కోవాలి. మురికంతా వదిలేంత వరకు ... కడుక్కోవాలి.

వాడు వెళ్ళేసమయానికి పార్వతమ్మ పూజ గదిలోంచి వస్తోంది.

తలారా స్నానం చేసినందున తడి జుట్టుని ఆరబోసుకుంది. చలువ చేసిన ఖరీదైన ఆర్గండీ చీర..పచ్చటి మేని చాయ...నుదుట ఎర్రటి కుంకుమ..

మొహం ఎప్పటికిమల్లె వింత తేజస్సుతో మెరుస్తోంది.

వాడికి పార్వతమ్మని చూసినప్పుడల్లా ఆశ్చర్యమే. అంత శుభ్రంగా..సర్ఫ్ వేసి వుతికిన తెల్ల చొక్కాలా..హాల్లోని తెల్లటి పాలరాతిని తడిబట్టతో గట్టిగా తుడిచినట్లుగా మెరిసినట్లు..ఆమె మెళ్ళోని బంగారు నక్లెస్ తళతళలా...

ఉదయం తను గుడిశె బైటికి వచ్చి తూర్పువైపునకు తలయెత్తి చూసినపుడు ముంచెత్తే తెల్లటి సూర్యకాంతిలా...అమ్మగారి పెరట్లో విరగబూసిన సన్నజాజుల్ని కోసి కుప్పగా పోసినట్లు....ఎలా సాధ్యం అనుకుంటాడు.

పనంతా చేసుకుని తను రాత్రికి యింటికెళ్ళబోయే ముందుకూడా ఆమె మొహంలో అదే కాంతి... అద్ తేజస్సు. చీర మడతకూడా నలగదు. మొహంలో కాసింత విసుగ్గూడా కనిపించదు. అబ్బో...ఎంత శుచీ! ...ఎంత శుభ్రం!

"ఏరా ఆలస్యమయిందేం" అందావిడ.

వాడికేం చెప్పాలో తెలియలేదు. గోడకున్న గడియారం వైపు చూశాడు. వాడికి టైం ఎలా చూడాలో తెలీదు. ఎండ తీవ్రతని బట్టి, నీడల్ని చూసి ఉజ్జాయింపుగా సమయం ఎంతయి ఉంటుందో చెప్పే విద్య వాడి నాన్న దగ్గర నేర్చుకున్నాడు. అంతే....

సర్లే..చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కుని రా..నీళ్ళు మరో ఒలకబోయకు" అందామె.

వాడు పెరట్లోకెళ్ళి చేతులూ కాళ్ళూ కడుక్కున్నాడు. వాడి నాన్న చినిగిపోయిన లుంగీలోంచి ముక్క చింపి రుమాలుగా మార్చుకుని జేబులో దాచుకున్న గుడ్డతో పొడిగా తుడుచుకున్నాడు.

తడికాళ్ళతో చలువరాతి బండలమీద మరకలు చేయకూడదని మొదటిరోజే పార్వతమ్మ హెచ్చరించింది.

వాడు లోపలికెళ్ళాక ఎప్పటికిమల్లే పార్వతమ్మ వాడివైపు నఖశిఖపర్యంతం నిశితంగా చూసింది.

"తలేమిట్రా మాసిపోయింది ? ఆ జుట్టుకు నూనె రాసుకోవా? నీకు చెప్పానా తలకు కొబ్బరినూనె రాసుకుని, నీట్ గా దువ్వుకుని రావాలని" అందామె.

"యింట్లో నూనె లేదమ్మా" సంజాయిషీ యిస్తున్నట్లు తలొంచుకుని చెప్పాడు.

"అంగట్లో ఉంటుందిగా"

"డబ్బుల్లేవమ్మా" అన్నాడు. ఆమె ఏమీ మాట్లాడకపోవడం చూసి, పొడిగింపుగా రాత్రుళ్ళు దీపంలోకి మట్టినూనె కొంటానికే డబ్బుల్లేవంటాడు మా అయ్య. కొబ్బరినూనె అడిగితే కొడ్తాడమ్మా" అన్నాడు.

"సర్లె..కిటికీలన్నీ దులుపు. దుమ్ముపట్టేసి ఉన్నాయి. వాటి అద్దాల్ని మరకల్లేకుండా బాగా తుడువు."
వాడు పనిలో నిమగ్నమైనాడు. చేతులు యాంత్రికంగా పని చేసుకుపోతున్నా మనసులో మాత్రం పాతచొక్కాని ఎలా అడగాలో పదేపదే రిహార్సల్సు చేసుకుంటున్నాడు.

"అదేం తుడవటంరా? అక్కడ చూడు.... దుమ్ముంది.... కనబడటం లేదా...?" ఆలోచనల్లో మునిగి ఉన్న శీను పార్వతమ్మ గొంతి విని ఉలిక్కిపడ్డాడు.

ఆమె చూపిస్తున్న వైపు జాగ్రత్తగా చూశాడు. వాడి కళ్ళకు దుమ్ము అణువంతైనా కన్పించలేదు.

"ఈ అద్దంపైన చూడు...మరక...గట్టిగా రుద్ది తుడవాలని చెప్పానా? గట్టిగా అంటే మరీ గట్టిగా కాదు. అద్దం పగిలిపోగలదు".

వాడా అద్దం వైపు కళ్ళు విప్పార్చి చూశాడు. అద్దం అద్దంలా తళతళా మెరుస్తోంది తప్ప మరక కన్పించలేదు.

తనక్కనిపించని మరక ఆమెకెలా కన్పిస్తుందో వాడికర్ధం కాలేదు. మధ్యాహ్నం ఒంటిగంట దాటింది. వాడికి ఆకలి వేస్తోంది.

పార్వతమ్మ ఆమె భర్త డైనింగ్ టేబుల్ దగ్గర భోజనాలకి కూర్చున్నారు. కంచాల, గిన్నెల శబ్దాలు..వేడి అన్నం మీంచి మూత తీసిన వెంటనే వచ్చే కమ్మటి వాసన..కూరల ఘుమఘుమలు.. వాడికి ఆకలి మరింత పెరిగింది.

ఎండ నిప్పులు చెరుగుతోంది.

అన్నం తిండానికి యింటికెళ్ళాలి. ..ఈ ఎండలో...నడుచుకుంటూ..చెప్పుల్లేకుండా..అమ్మో! కాళ్ళు నిప్పుల కుంపటిలో కూరుకు పోయినట్లు కాలుతుంటాయి. కడుపులో ఆకలి అగ్నిగుండంలా మండుతో ఉంటుంది. నెత్తి పెనంలా మాడుతో ఉంటుంది.

ఈ పూటకి తినకపోతేనే - మానేస్తాను అనుకున్నాడు. కానీ ఆకలి...కడుపులో సూర్యగోళం ఉన్నట్లు...భగభగమండుతూ..బైటి ఎండే నయం అనిపించింది.

అమ్మగారు నాలుగు ముద్దలు అన్నం పెడితే ఎంత బావుంటుది.! యిక్కడే తిని, కావాలంటే యింకాస్త ఎక్కువ పని చేస్తాను కదా...వాడిలో ఆశ పొంగుతూ..

కానీ ఈ పదిరోజుల్లో పార్వతమ్మ గారు ఒక్క మెతుక్కూడా విదల్చని విషయం గుర్తొచ్చి వాడి ఆశ చన్నీళ్ళ స్పర్శలో ఒదిగిన పాలపొంగైంది.

వాడి పని ఆపేసి "యింటికెళ్ళి బువ్వ తినొస్తానమ్మా" అన్నాడు.

" సరే. తొందరగా రా. తిని పడుకోకు" అందామె.

వాడు బైటికి వస్తున్నప్పుడు అయ్యగారి మాటలు విన్పించాయి. "యింతెండలో ఎక్కడికి పోతాడు"? ఓ ముద్ద పడేస్తే తిని యిక్కడే పడుంటాడుగా"

"మీకేం తెలీదు. వూర్కోండి. పనోళ్ళని పాపం అంటే నెత్తికెక్కి కూచుంటారు. ఐనా కేజీ పదహారు రూపాయలు పెట్టికొన్న సోనా మసూరి బియ్యం...వాడికెలా పెడ్తాను?"

ఆ మాటలు విన్నాక వాడికి ఎండ వేడిగా అనిపించలేదు.

తిరిగొచ్చేప్పుడు...నడిస్తే కాళ్ళు కాల్తాయని పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఐనా బొబ్బలెక్కేలా కాళ్ళు కాలాయి.

ఎప్పటికిమల్లె రాత్రి ఏడింటికే వాళ్ళిద్దరూ భోజనాలు చేశారు. అంట్లన్నీ తీసి సింక్ లో వేసేప్పుడు కూడా వాడు చొక్కా అడగడం గురించే ఆలోచిస్తున్నాడు.

పనంతా అయిపోయినా వెళ్ళకుండా నిలబడ్డ శీను వైపు ‘ఏమిటీ?’ అన్నట్లు ప్రశ్నార్ధకంగా చూసింది పార్వతమ్మ.

ఎలా అడగాలో తెలియని సందిగ్ధ అవస్థలో వాడేమీ సమాధానం చెప్పలేదు.

"ఏంటో చెప్పు" అందావిడ.

"అయ్యగారి పాత చొక్కా ఏదైనా ఇప్పించమ్మా" అన్నాడు గొంతు పెగుల్చుకుని.

"నీకా మీ నాన్నకా?"

‘నాకేనమ్మా. పొడుగైనా సరే తొడుక్కుంటా. నాకాడ రెండే సొక్కాలున్నాయి.’ అలా అంటున్నప్పుడు వాడి మొహంలో దీనత్వం.

పార్వతమ్మ వాడివైపో క్షణం దీర్ఘంగా చూసింది. ఈ అడుక్కునే వెధవలందరికీ నటన పుట్టుకనుండీ వస్తుందేమో... "పాత చొక్కాలేమీ లేవు. ఐనా పన్లోకి చేరి పదిరోజులైనా కాలేదు. అప్పుడే పాత చొక్కాలు అడిగేస్తున్నావే".

శీనుకి ఆవిడ ఉద్దేశం అర్ధం కాలేదు.

"పోనీ ఒక నెలయ్యాక ఇవ్వండమ్మా" అన్నాడు అమాయకంగా.

"ఉంటే కదా ఇవ్వడానికి. వెళ్ళూ" ఆమె గొంతులోని మృదుత్వం మార్పు లేదు.

వాడు నిరాశని మోస్తూ బైటికి నడిచాడు.

ఆమె తలుపేసుకుంది.

అడిగే విధానంలో అడగలేదా? తనకి ఎలా అడగాలో తెలీలేదా? అనే మీమాంసలో శీను ఒక నిమిషం అక్కడే నిలబడ్డాడు.

"బోల్డు పాత చొక్కాలు పడున్నాయి. నేను వాడటం కూడా లేదు. వాడికొకటిస్తే పోయేదిగా. పాపం పేద కుర్రాడు. అయ్యగారి మాటలు విన్పించాయి.

"మీకు ఈ పనోళ్ళ వేషాలు తెలియవు వూరుకోండి. పన్లోకి చేరి పదిరోజులు కాకుండానే చొక్కా అడిగాడు. రేపు వాళ్ళమ్మ కోసం పాత చీర అడుగుతాడు. మరోవారం పోతే కొత్త బట్టలు కొనివ్వమని డిమాండ్ చేస్తాడు. చాలా నీచమైన మనుషులు. ఒంటిమీదే కాదు బుద్ధినిండా మురికే వీళ్ళకి. వాళ్ళనెక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే మంచిది." పార్వతమ్మ గొంతు ..మృదువుగా..

* * *

అమ్మగారు ఏ సమయంలో చూసినా అంత శుభ్రంగా ఎలా ఉంటారో.. మాటల్లో కోపమో చిరాకు లేకుండా అంత ప్రశాంతంగా, మృదువుగా ఎలా మాట్లాడతారో..వాడు ఆలోచిస్తూ నడుస్తున్నాడు. కసుక్కున కాల్లో గాజుపెంకు గుచ్చుకుంది. "అమ్మా" అంటూ అక్కడే కూలబడ్డాడు.

పళ్ళ బిగువున బాధని భరిస్తూ గాజుపెంకుని కాల్లోంచి లాగేశాడు. రక్తం బొటబొటా కారిపోతూ...యింత మట్టి తీసుకుని అదిమి పట్టాడు. కుంటుతూనే పార్వతమ్మ ఇంటికి నడిచాడు.

"ఏమైందిరా" అందామె గడప దగ్గరే.

"కాల్లో గాజుపెంకు గుచ్చుకుందమ్మా"

‘అయ్యో అలానా’ అంటుందనుకున్నాడు. గాయానికి రాయడానికి ఏమైనా మందు ఇస్తుందనుకున్నాడు. యింటినిండా రకరకాల మందు బిళ్ళలు, సీసాలు ఉన్నాయిగా. కట్టుకట్టే గుడ్డ కూడా ఉంది.

ఏమైనా అనుకుంటుందని వాడు బైటికెళ్ళి మిగిలిన బ్రెడ్ ని పడేశాడు. వాంతికయింది. పెరట్లోని నీళ్ళతో నోరంతా ఎంత కడుక్కున్నా అదోరకమైన అరుచి వదలడం లేదు. వళ్ళంతా సలపరంగా అన్పించింది.

"జొరం వచ్చినట్లుందమ్మా. యింటికెళ్తా" అన్నాడు. వాడిపోయి, వడలిపోయినట్లున్న వాడి మొహం వైపు ఓ క్షణం చూసి, "సరే వెళ్ళు. కానీ ఈ పూట మానేసినందుకు నీ జీతంలోంచి డబ్బులు కట్ చేస్తాను. అందామె. వాడేమీ మాట్లాడలేదు. ఆమె వైపు చూశాడు. తెల్లటి మొహంలో రూపాయి కాసంత ఎర్రటి బొట్టుతో పాలనురగలాంటి చీరలో ఆమె ఎప్పటికిమల్లె దేవతలా ఉంది. అద్దాన్ని ఎంతబాగా తుడిచినా తనక్కనిపించని మరక అమ్మగారికి కన్పించినట్లు..యిపుడు వాడి కళ్ళకు కన్పిస్తోన్న మరక..

వాడు బైటికెళ్ళగానే విసురుగా తలుపేసింది. "మురికి వెధవ" గొణుక్కుంటున్నట్టుగా అంది.

(ఆంధ్రభూమి వారపత్రిక - 9 జూన్ 2005)

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)