కథా భారతి - అనగనగా ఓ కథ
ఫల రసాదులఁగురియవే పాదపములు
- నిడదవోలు మాలతి

బాలభానుడు పన్నగపు దోమతెర లోంచి తొంగి చూస్తున్నాడు. వంటింట్లో గిన్నెల జలతరంగిణి వినిపిస్తున్నాయి. నైలాన్‌ దోమతెరల్లోంచి బాబు దోగాడుతూ ''త్తా... త్తా...'' అంటూంటే గుర్తొచ్చింది ఎక్స్‌ప్రెస్‌లో తార వస్తూందని. గొప్ప డైలాగు రచయిత వైపొమ్మని వాణ్ణి దీవించి ఎదుర్కోలు సన్నాహాల్లో పడ్డాను. ముఖ్యమైన ఐటమ్స్‌ క్రింద మల్లెలూ, మరువం కలిపి దండ కట్టమనీ, సుందరి వాళ్ల ఇంట్లోంచి రాజేశ్వరరావు, బాలసరస్వతి రికార్డులు తెమ్మనీ రామమ్మకి పురమాయించాను. ''నల్లనివాడా' పాట నేర్చుకోవాలని పాపం, ఎన్నాళ్లనుంచో ఉబటలాటపడుతూంది మరి. తన కిష్టం అని జరీ అంచు తెల్లచీరె కట్టుకున్నాను కాని, కాటుకా, పువ్వులూ పెట్టుకోవాలనిపించలేదు.

''పాల్‌... పాల్‌...'' అంటూ కాళ్ల కడ్డం పడుతున్న బాబుని చిన్న మొట్టికాయ వేసి, ''వెళుతున్నా''నని వదినకి చెప్పి బయలుదేరాను, బాబు సన్నాయిమేళం వినిపించుకోకుండా.

కారు బీచ్‌ రోడ్డుమీది కొచ్చుసరికి మనసుకి ఆహ్లాదకరంగా అనిపించింది. ఎంత తొందరైనా, కవిసమ్రాట్‌వారి సమాసంలా చుట్టు తిరుగుడైనా, నేను మాత్రం బీచ్‌ రోడ్డులోనే వస్తాను. మీది మీదికి వచ్చేస్తున్నట్టు బెదిరింపుగా, ఉవ్వెత్తుగా లేచి పడే అలలూ, నిండుగుండెలోకి ఆప్యాయంగా తొంగి చూస్తున్నట్టు కనుచూపుమేరలో కనిపించే అంబరమూ, అనంతంగా సాగిపోయే సాగర సంగీతమూ, మృదువుగా స్పృశించే సమీరమూ నొ కొకవిధమైన బలాన్నిస్తాయి. సృష్టి అందమైనదేననీ, జీవితం బ్రతకదగ్గదే అనీ అనిపిస్తుంది. అప్పుడు కారు జాగ్రత్తగా నడుపుతాను.

ఎక్స్‌ప్రెస్‌ రెండు గంటలు లేటట. కాదు మరీ? ఇది కలికాలం కదా! ఇక్కడ విప్రవరులు వేదములు వల్లించరు. గృహస్థులు అతిథుల నాదరించరు. పడి ఉండడానికి- కమనీయం కాకపోయినా- భూమి భాగము లంటూ ఉన్నాయి కాని, ఫల రసాదులు కురుస్తున్నాయా పాదపములు? రైళ్లు సకాలమున కెట్లు వచ్చును?

రాని స్టీల్‌ ప్లాంట్‌ ధర్మమా అని వాల్తేరు రైలు స్టేషన్‌ మాత్రం మూడింతలయింది. మొహాన మొజాయి క్కద్దుకుంది. ఓ వారగా నిలుచున్నాను- హిగిన్‌ బాథమ్స్‌లో పుస్తకా లేమైనా అడుగుదామా అని ఆలోచిస్తూ-

క్రైమ్‌ థ్రిల్లర్‌ టైటిల్స్‌ అస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏం కొనడమో? చీఫ్‌ ఎడిషన్‌ అని పేరు పెట్టుకున్న పుస్తకం ఏడు రూపాయలు పలుకుతూంది. ఎవరో అన్నారు- లైట్‌ రీడింగ్‌ అంటే చదివిన ప్రతి పేజీ చించి పారేస్తూ, పుస్తకం పూర్తిచేసి చేతులు దులుపుకోవడంట! ముందు వర్సు లైటయిపోతుంది.
''ఆరు గంటల ఎక్స్‌ప్రెస్‌ వచ్చి వెళ్లిపోయిందాండీ.''

''లేదండి ఎనిమిది గంటల కొస్తుందట'' అన్నాను నన్నే అడిగిందని నమ్మకం కుదిరాక.

''ఇంకా పోలేదన్న మాట!'' అని తృప్తిగా నిట్టూర్చి, మళ్లీ అంతలోనే ''ఇంకా గంటన్నర సేపుందన్నమాట!'' అంది నొచ్చుకుంట, చేతిలో ప్లాస్టిక్‌ బుట్ట జాగ్రత్తగా కింద పెడుతూ. ఆరు గంటల ఎక్స్‌ప్రెస్‌ కోసం ఆరున్నర కొచ్చి, అది రానందుకు సంతోషమూ, లేటయినందుకు విచారమూ ప్రకటిస్తున్న ఆ ముద్దరాలిని ఆశ్చర్యంగా పరికించసాగాను. ఎరుపు అంచు తెల్లచీరె లాంగుంది. నాలుగున్నరడుగులుంటుందా? ఉండచ్చు. కుందనపు బొమ్మలా ఉంది. పావడా జాకెట్‌ వేస్తే మూడో ఫారమ్‌ పుస్తకాలిచ్చి మున్సిపల్‌ స్కూల్‌ పంపచ్చు, ఈజీగా. తెల్ల వెంట్రుకలు చూస్తే అప్పియరెన్స్‌ గూర్చి పట్టింపున్నట్టు లేదు. మొహంలో అందం కాదుగానీ, 'నిన్నిదివరకు చూశా' నంటూ పలకరించే కళ్లు మరోమారు తిరిగి చూసేలా చేస్తాయి. ఆ పళ్లు అంత ఎత్తు లేకపోతే, ముక్కు కొంచెం తీరుగా ఉంటే, నుదురు మరీ అంత విశాలం కాకపోతే భువనమోహనంగా ఉండేది.

''కొంచెం ప్లాట్‌ఫారమ్‌ టికెట్‌ తెచ్చి పెడతారా?''

ఆవిడ నన్నే అడిగిందని తెలియగానే చటుక్కున కోపం వచ్చింది. చదువుకుని, ఉద్యోగాలు చేస్తూ, నలుగురి మధ్య తిరుగుతున్న ఆడవాళ్లు కొందరు ఫన్‌ చేసే విధం చూస్తే నాకు మహా చిరాకు. ఆవిడ చదువుకుని, ఉద్యోగం చేస్తూ, నలుగురి మధ్య తిరుగుతూందని ఆవిడ మొహాన వ్రాసి లేదు. కాని, నా కెందుకో ఆ క్షణాన ఒళ్లు భగ్గున మండింది.

''రెండు రూపాయలు చార్జ్‌ చేస్తాను'' అన్నాను కఠినంగా.

మళ్లీ హిగిన్‌బాథమ్స్‌లో టైటిల్స్‌ చదవడానికి ప్రయత్నిస్తున్నాను. అటు వేపు ఒకే డ్రెస్‌ వేసుకున్న ఇద్దరూ నవ్వుకుంటూ తుళ్లుతూ పోతున్నారు. ఒకరి నడక ఒయ్యారం చూస్తే అమ్మాయిలాగుంది. లేక అబ్బాయేనేమో? రైల్వేకూలీలు ట్రాలీల్లో బుట్ట లేసుకుని హడావిడిగా తోసుకుపోతున్నారు.

రిక్షాస్టాండు నుంచి ఒక సూట్‌కేస్‌ తెచ్చి ప్లాట్‌ఫారమ్‌మీద పెడితే రెండు రూపాయలూ, బోగీ కెక్కిస్తే మూడు రూపాయలూ ఇవ్వాలని ఒక పోర్టరు పేచీ పెడుతున్నాడు కాలేజీ అమ్మాయిలవంటి అమ్మాయిల దగ్గర. ''రెండున్నర ఇస్తాను, బోగీలో పెట్టు'' అని ఒక పిల్ల నైస్‌గా చెపుతూంది. లైసెన్‌నస కూలీ ఒకడు లైసెన్స్‌ లేని కుర్రాణ్ణి రెండు తన్ని వాడు సంపాదించుకున్న అర్ధ రూపాయి డబ్బులూ లాక్కున్నాడు. ఇటు తిరిగాను, ఆవిడ ఇంకా నా పక్కనే నించుని ఉంది.

''ఈ బాస్కెట్‌ ఇక్కడ పెట్టి నేను టికెట్‌ తెచ్చుకుంటాను'' అంది పిరికిగా నా వేపు చూస్తూ. సరే నన్నట్టు తల ఊపాను దయతో.

''అందులో గాజుబొమ్మ లున్నాయండి. ఎవరేనా తన్నేయగలరు!'' అంటూ నా వేపు బెదురుతోనూ, ఆ బుట్టవేపు ప్రేమగానూ చూస్తూ బుకింగ్‌ ఆఫీసువేపు వెళ్లింది. ఏం బొమ్మలో? తీసి చూస్తే? ఎక్స్‌ప్రెస్‌ అనకాపల్లి వదిలి ఉండాలి. తార ఎలా ఉందో? నా కొక మంచి బొమ్మ వేసి, ఫ్రేమ్‌ కట్టించి ఇస్తానంది. వేసి తెచ్చిందా సరి. లేకపోతే ఓ గదిలో పెట్టి తాళం వేసి, బొమ్మ వేసిచ్చేవరకూ తీయనని చెపుతాను.
''థాంక్సండీ.''

నవ్వీ నవ్వనట్టు నవ్వి ఊరుకున్నాను.

''మీ రెక్కడికండీ?'' తిరిగి నన్నే ప్రశ్నించింది.

''పెదవాల్తేరు'' అన్నాను ముక్తసరిగా. ఆమె రవంత చిన్నబుచ్చుకున్నట్టు కనిపించింది.
''అదేనండి. ఎస్ప్రెస్‌ బండిలో ఆల్లోరు వొస్తారు గాఁవాల. ఆర్ని, తీసుకెల్డాని కొచ్చేరు'' బేరం లేక అక్కడే నిలబడిన ఓ ముసిలి పోర్టరు జ్ఞానిలా తల తాటిస్తూ అన్నాడు.

ఆవిడ మళ్లీ విశాలంగా నవ్వింది. ''నేనూ అంతేనండి. ఈ ట్రెయిన్‌లో మా అమ్మాయి వస్తోంది.''
కాబోలన్నట్టు తల ఆడించి ఊరుకున్నాను.

కొండపల్లి బొమ్మలబండి అటొస్తే, పిలిచి రెండు కర్రభరిణెలు కొంది. బాస్కెట్‌లోంచి కాగితపు పొట్లాలు తీసి పసుపూ, కుంకుమా ఆ రెండిట్లో పోసింది. ''కొత్త పెళ్లికూతురండీ'' అంది అపాలజిటిక్‌గా నవ్వి. అప్రయత్నంగా ఆ బుట్టవేపు చూశాను. పువ్వులూ, పళ్లూ, ఇండియా సిల్క్‌ హౌస్‌ పాకెట్‌.

''టైమ్‌ లేదండీ, నిన్ననే తెలిసింది ఈ వేళ ట్రెయిన్‌లో వస్తోందని. కలకత్తా వెళుతున్నారుట. హనీమూన్‌...'' ఆ నవదంపతుల హనీమూన్‌ తలుచుకుని మురిసిపోతున్న ఈ వ్యక్తి మనస్తత్త్వం గురించి రవ్వంత అక్కసుపడ్డాను నేను.

''చూడదలుచుకుంటే ఇక్కడ మాత్రం లేవూ? అరకులోయ కంటె అందమైన ప్రదేశముందా? ఈ కాలపు పిల్లలు ఏవో లోకాలకి ఎగిరిపోవాలనుకుంటారు... అయ్యో!...'' ఓ పండు జారి కింద పడినందుకు నొచ్చుకుని, గబగబా వెళ్లి ఆ పండు కడుక్కుని వచ్చింది. వాటర్‌బాటిల్‌లో ఉన్న నీళ్లు పారబోసి మళ్లీ నీళ్లు పట్టుకొచ్చింది. అడుగున ఉన్న టిఫిన్‌బాక్స్‌ పైన పెట్టింది. పైన ఉన్న పళ్లు అడుగున పెట్టింది. పువ్వులు ఓ పక్కకి పెట్టింది. అమ్మాయికి సంపెగలంటే మహా ఇష్టంట!

''ఆయా సావన్‌ ఝామ్‌కే రన్నవుతోందనికూడా వ్రాశాను'' అందావిడ మళ్లీ.

కాలేజీ అమ్మాయి లిటు తిరిగారు. ఆవిడ వాళ్లకీ నాకూ కలిపి చెపుతూంది. ధర్మేంద్ర అంటే పడి చచ్చిపోతుందట. ఓసారి ఏదో సినిమా వచ్చింది... (సినిమాలు రాకేం చేస్తాయి?) కాకపోతే ఇక్కడ విచారకరమైన విషయ మేమిటంటే, అదే సమయానికి ఆ అమ్మాయికి నూటమూడు డిగ్రీల జ్వరం కూడా వచ్చింది. కదలకుండా పడుకోమని వాళ్ల నాన్నగారు వార్నింగ్‌ ఇచ్చి వెళ్లారు. ఆయన అటు వెళ్లగానే ఆ అమ్మాయి ఈవిడ దగ్గరి కొచ్చింది, సినిమాకి వెళ్లి తీరాలని. ముందు కొంచెం భయపడినా, అప్పుడు కాకపోతే సరదా లెప్పుడుంటాయని ఆస్పత్రికని చెప్పి మేటినీకి తీసుకెళ్లిపోయిందట. మర్నాటికి జ్వరం కూడా తగ్గిపోయిందట!

''తమాషాగా ఉందండి. మెడిసినల్‌ వాల్యూ కలిగిన ఆ సినిమా పేరేమిటో?'' పంజాబి డ్రెస్‌ వేసుకున్న పిల్ల ప్రశ్నించింది.

''గుర్తు లేదమ్మా'' అంది ఆవిడ నవ్వి. ''మా రమని తెలీని వాళ్లు లేరనుకోండి. అది బస్సు ఎక్కితే, దిగేవరకూ ఒకటే గొడవ. ఎల్‌.జి. (లాఫింగ్‌ గాస్‌) అని మగపిల్లలూ, ఎన్‌.ఓ. (నైట్రస్‌ ఆక్సైడ్‌) అని ఆడపిల్లలూ దాన్ని ఏడిపించేవారట...''

తార ఎలా ఉందో? చూసి ఆరేళ్లయింది. కొంచెమైనా ఒళ్లు చేసిందో, లేక అలాగే ఎదురుగాలికి వెనక్కి కొట్టుకుపోతూ ఊచలా ఉండిపోయిందో?

ఎవరో హడావిడిగా నన్ను దూసుకుపోయారు. విసుక్కుని ఇటు తిరిగాను. ఆవిడ ఆ కాలేజీ పిల్లల కేదో చెపుతూనే ఉంది.

''ముక్కూ, మొహం ఎరగని పెద్ద మనిషి- పాపం - ఎండన పడి వచ్చాడు. మరొకరైతే నమస్కారం పెట్టి, మంచినీళ్లిచ్చి, ఏం కావాలని అడిగేవారు. మా రమ ధోరణే వేరు కదా! 'వాటాలున్నాయా?' అని ఆయన ఎంతో మర్యాదగా అడిగితే, 'లేవండి, ఇంకా మేమే పంచుకోలేదు' అంది. ఆవిడ గలగలా నవ్వింది.
పల్లెత్తుగా ఉన్న ఓ అమ్మాయి పంజాబీ డ్రెస్‌ వేసుకున్న అమ్మాయి వేపు తిరిగి, ''నవ్వుదామా?'' అని అడిగింది.

రెండో అమ్మాయి, ''సరే, నవ్వు'' అంది నిర్వికారంగా.

తార కూడా చిన్నప్పుడు ఇలాగే అల్లరి చేసేది. ఇప్పు డది లెక్చరరయి ఏంచెపుతూందో?

ప్లాట్‌పారమ్‌ మీద సంచలనం హెచ్చింది. రైలు వస్తూంది. పోర్టర్లు వాళ్ల వాళ్ల బేరాల దగ్గరికి చేరుకున్నారు. అంపకాల కొచ్చిన బంధుమిత్రులు చివరి సందేశాలు ఇస్తున్నారు. ఫస్ట్‌క్లాస్‌ ఇంకా ముందు కుంటుందని ఒక పోర్టర్‌ చెప్పాడు నా ప్రశ్నకి సమాధానంగా. అటు చూశాను. తార చెయ్యి ఊపుతూంది. గుండెలు అతివేగంగా కొట్టుకున్నాయి. అది స్టేషనన్న స్పృహ వదిలి, తార చేతులు నా చేతుల్లోకి తీసుకుని చూస్తూ ఉండిపోయాను.

''నువ్వు మారనలేదే!'' తార అంటూంటే, నా కెందుకో గళం గద్గదికమైంది. ''పద'' అన్నాను.

''హలో!'' తార ఆగిపోయింది. వాళ్ల ప్రొఫెసర్‌ రమేష్‌చంద్రతో అది మాటాడుతుంటే, నేను ఒక నమస్కారం పారేసి కాస్త ఎడంగా నిలుచున్నాను.

''కనీసం ఒక్క రోజుకి బ్రేక్‌ వెయ్యకూడదూ?'' ఆవిడే- ఆ అమ్మాయే కాబోలు రమ - ప్రాధేయపడుతూంది. ఆ అమ్మాయి రైలు దిగలేదు. కిటికీలోంచి చూస్తూంది. ప్లాట్‌ఫారమ్‌ మీద ట్రెయిను కానుకుని అతను నించుని ఉన్నాడు. కాఫీ, టిఫిన్‌ తెచ్చానని ఆవిడ చెపుతూంది. ఆ అమ్మాయి అతని మీద నుంచి కళ్లు మర్చలకుండానే వాళ్ల బ్రేక్‌ఫాస్ట్‌ బోగీలోకి వస్తుందని చెపుతూంది.
''పోన్లెండి. టిఫిన్‌ వద్దులెండి. కాఫీ తీసుకుంటాం లెండి'' ఆ మాటలు వింటుంటే నాకెందుకో ఆవిడ మొహం చూడాలనిపించింది. చూడలేననిపించింది. ఇటు తిరిగాను. తార ఇంకా మాటాడుతూనే ఉంది.

''చా. చా.'' ''కేలా... కేలా...'' ''తప్పుకో... తప్పుకో'' ''ఆంధ్రప్రభ, పత్రిక, ఎక్స్‌ప్రెస్‌, దినమణి'' ''పాన్‌, బీడి, సిగరెట్‌'' ''తప్పుకో...''

''దబ్‌.'' ''అయ్యో!'' పళ్లబుట్టల ట్రాలీ కింద ప్లాస్టిక్‌ బుట్ట నలిగిపోయింది.

''అయ్యో! నీ కోసం తెచ్చాను.''

''పోనీలెండి.''

ఎవరో ఉరుకులూ పరుగులతో ఇండియా సిల్క్‌ హౌస్‌ పాకెట్‌ తనుకుంటూ పోయారు. కర్రభరిణెల్లో పసుపూ కుంకుమా సంక్రాంతి ముగ్గల్లా చల్లుకుపోయాయి.

''ఫరవాలేదండీ. మీరు వచ్చారు కదా- అదే చాలు'' ఆ స్వరంలో ఎందుకో నిండుదనం లేదనిపించింది. నే నొక ఫూల్‌ని. నా కెందుకో ఆవిడ మీద జాలి కలుగుతూంది. పాపం అనిపిస్తూంది.

''పద.'' తార వచ్చి భుజం మీద చెయ్యేసింది. ''ప్చ్‌!'' వెనుదిరిగాను

''అరె! తార!'' ఆవిడే తారని పిలుస్తూంది. తార వెనుదిరిగి నవ్వింది.

వాళ్లిద్దరూ ఒకరి నొకరు పరామర్శించుకుంటూంటే చూస్తూ నిలబడ్డాను. అయిదు నిమిషాల అనంతరం తార ఆవిడకి టాటా చెప్పి నన్ను కలుసుకుంది. కార్లో అడిగాను- ''ఆ మహాశ్వేత ఎవ''రని. తార చెప్పింది- తన మేనగోడలికి టీచరుట ఆవిడ. ఆ పిల్ల ఆవిడ గురించి అస్తమానం చెపుతూ ఉండేదట. ఓ మారు పిక్నిక్‌కి వెళితే అక్కడ ఆ పిల్లకి జ్వరం వచ్చిందంట. అప్పుడు ఆవిడ చేసిన సేవలు కన్నతల్లి కూడా చెయ్యదట. ఆ పిక్నిక్‌ అయిపోయిన తరవాత ఆవిడ స్వయంగా ఆ అమ్మాయిని తార అన్నగారి ఊరు తీసుకెళ్లి దిగవిడిచి వచ్చిందట. వాళ్ల బలవంతం మీదే అనుకోండి- నాలుగు రోజులు అక్కడే ఉందట. అప్పుడు తారంటే ఆవిడకి ప్రత్యేకాభిమానం ఏర్పడిందట. ''నా వెనక నీడలా తిరిగేదనుకో. నా కాశ్చర్యంగా ఉండేది. నేను మహా సోమరినని నీకు తెలుసు కదా? స్నానం చేసి ఆ బట్టలు అక్కడ వదిలేసి వచ్చేసేదాన్ని, పనిమనిషిని ఆరేయమని. తిరిగి చూస్తే ఈవిడ కనిపించేది- అవి ఆరేస్తూ.... అరె... ఇటు వచ్చేశాం... పెద పోస్టాఫీస్‌కి పోనియ్‌....''

తార తాఖీదు ప్రకారం కారు మళ్లించాను. ''ఏం, ఊరు పొలిమేరల్లో ఉన్నాం ఇంకా. ట్రంక్‌కాల్‌ చేసి బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకున్నారా అని అడగాలా?'' చిలిపిగా అడిగాను.

''క్షేమంగా చేరినట్టు టెలిగ్రామ్‌ ఇవ్వమన్నారు- ఏమిటో చాదస్తం!'' అంది ఏమాత్రం చికాకు ధ్వనించని స్వరంతో. ఎంతవారలైన కాంతదాసులే అన్నారు. కాని, కాంతలే కన్ను మూసి తెరచేలోగా కాంతుల జేబులో బొమ్మయిపోతారని వాళ్లకి తెలియదు అనుకున్నాను మనసులో.

టెలిగ్రామ్‌ ఇచ్చి, కారు బీచ్‌ రోడ్డు పట్టించాను. తార 'ఆయన' విశేషాలు చెపుతూంది. హవామహల్‌ దాటుతుండగా రోడ్డు వారగా నడిచిపోతున్న ఎరుపు అంచ తెల్లచీరె ద్యోతకమయింది. అప్రయత్నంగా కారు స్లో డౌను చేసి, వారగా తీసుకెళ్లి పిలిచాను, ''రండి, నేనూ అటే వెళుతున్నాను కదా? డ్రాప్‌ చేస్తాను'' అని.

ఒక్క క్షణం అయోమయంగా నా వేపు చూసింది. మరుక్షణంలో నవ్వుతూ, ''థాంక్సండీ, నాకు నడవడమే ఇష్టం. మీరు వెళ్లండి. నేను మెల్లిగా నడిచి వస్తాను. వెదర్‌ కూడా బాగుంది'' అంది.

నాకు మహాచిరాకు కలిగింది. ''రారా?'' అడిగాను మళ్లీ. నా కావిడ మీద ఏం అధికారం ఉందో, ఎలా వచ్చిందో? తెలియదు.

''వస్తున్నాకదండీ? మీరు పదండి. ఫరవాలేదు. తాబేలూ చేరుతుంది, కుందేలూ చేరుతుంది గమ్యం'' అంది. అదే నవ్వు మళ్లీ.

విసుగ్గా ఆక్సిలరేటర్‌ ఒక్క తన్ను తన్నాను- గేర్‌ మార్చి. తార పిలిస్తే వచ్చేదేమో? ''ఆవిడదంతా అదో రకం లెద్దూ!'' అంది తార.

''ఏ రకం'' అంటే తార మాటాడలేదు. భాష ఎంత విస్తృతం అయినా, చెప్పలేని వెన్నో మిగిలిపోతూనే ఉన్నాయనిపించింది.

ఆ రాత్రి తారా, నేనూ చాలాసేపు కబుర్లు చెప్పుకుని ఏ అర్ధరాత్రో దాటిన తరవాత నిద్రపోయాం. ఆ నిద్రలో ఓ పిచ్చి కల వచ్చింది... జనం ప్రవాహంలా కదిలిపోతున్నారు. ఏదో ఆవేశంతో, ఆవేదనతో, ఉరుకులతో, పరుగులతో సాగిపోతున్నారు. వాళ్ల మధ్య ఓ చిన్న పడవ నెమ్మదిగా కదిలిపోతూంది. ఆ చిన్నారి పడవ రాజహంసలా ఉంది. దానినిండా పారిజాత సుమా లున్నాయి. దాన్ని ఒరుసుకు పోతున్నారు జనం. ఎవరూ ఆ పువ్వులు తీసుకోవడం లేదు. ఇంతలో ఆ పువ్వులన్నీ జరీ నగిషి గల పీతాంబరాలుగా మారిపోయాయి. ఆ రాయంచ ఒక స్త్రీమూర్తిగా మారింది. ఆ వస్త్రాలన్నిటినీ చిన్న చిన్న పీలికలు నాలికలు చేయసాగింది. తన చేతిలోని దీపంతో వాటికి నిప్పంటించింది. మంటలు మిన్నంటుతున్నాయి. ప్రజావాహిని మాత్రం సాగిపోతూనే ఉంది. ఆ మంటల మధ్య ఆవిడ విరగబడి నవ్వుతూంది. జలక్రీడ లాడుతూంది. ''అయ్యో!... కాలిపోతోంది... నీళ్లు... మంటలు ఆర్పండి...'' అరుస్తున్నాను పిచ్చిగా.

''ఏమిటో నీ గోల!'' తార నన్ను కుదిపి లేవడంతో తుళ్లిపడి లేచి కూర్చున్నాను. చేతులు వణుకుతున్నాయి. గుండె దడదడ కొట్టుకుంటూంది. తార లైటు వేసి, గ్లాసుతో మంచినీళ్లు తెచ్చి తాగించిన తరవాత కొంచెం తేరుకున్నాను. నా కల తారకి చెపితే నవ్వేసింది. ''చిన్న పిల్లవి. డిటెక్టివ్‌ కథలూ అవీ చదవద్దంటే వినవు. మళ్లీ ఇలాటి పిచ్చి పిచ్చి కలలు కని బెదరిపోతావు!'' హేళన చేసింది.
''నీ మొహంలే. ఇందులో డిటెక్షనేముంది?'' అంటూనే తారకి దగ్గరగా జరిగి పడుకున్నాను. ''ఆ కలకి అర్థం ఏమయి ఉంటుందో?'' అని నేను మళ్లీ అంటే, తార- ''పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి పడుకో, లేకపోతే తన్నగలను'' అంటూ కసిరి నన్ను తన గుండెలో పొదుపుకొని జోకొట్టింది.

తార ఉన్న నాలుగు రోజులూ ఊపిరాడకుండా ప్రోగ్రాము లేసుకుని ఊరంతా తిరిగాం. రెండు మూడుసార్లు షాపుల్లోనూ, బీచ్‌లోనూ మహాశ్వేత తటస్థపడడం, ప్రతిసారి చిరునవ్వులతో పరిపుచ్చి దాటిపోవడం జరుగుతూ వచ్చింది. అప్పుడే మరొకటి కనిపెట్టాను. మా ఇంటికి డాబా దక్షిణం వేపునుంచి చూస్తే, ఆవిడ ఉన్న ఇల్లు భాగం కనిపించేది. ముందకొ పంచ, దా నాన్నకుని ఒక గది ఉన్నట్టున్నాయి. పంచలో ఒక మంచం, ఒక కుర్చీ ఉన్నా, ఆవిడ మాత్రం సాధారణంగా స్తంభాన్నానుకుని గచ్చుమీదే కూర్చుని చదువుకోవడమో, కుట్టుకోవడమో చేస్తుండేది. ఒకొక్కప్పుడు ఎవరితోనైనా మాటాడుతూ కనిపించేది. ఆ సమయంలో ఆవిణ్ణి చూస్తే ఎదుటి వ్యక్తి ఎంతో ఆత్మీయురాలయి ఉండాలనిపంచేది. క్రమంగా మహాశ్వేత విషయంలో నాలో నాకే తెలియకుండా కౌతుకం పెరగసాగింది.

తార వెళ్లిపోయిన తరవాత ఒకరోజు బాబు అల్లరి చేస్తుంటే బీచ్‌కి తీసుకెళ్లాను. పామ్‌ బీచ్‌ దగ్గర ఆవిడ కనిపించింది ఎక్కడినుంచో వస్తూ. నన్ను చూసి నవ్వింది పలకరింపుగా. నేనూ ప్రతిగా నవ్వి ''కొంచెంసేపు బీచ్‌లో కూచుందాం, రండి. ఏం తోచడం లేదు'' అన్నాను.

''వెళ్లాలండి'' అంటూనే వచ్చి కూర్చుంది. తీరా కూర్చున్న తరవాత ఏం మాటాడాలో తోచలేదు. ఆవిడ బాబుని పలకరించింది. విచిత్రంగా వాడు క్షణంలో ఆవిడకి మచ్చికయి పోయాడు. చాకటిపడేవరకూ వాళ్లిద్దరూ ఆడుకుంటుంటే చూస్తూ కూర్చున్నాను నేను. వెళ్లేటప్పుడు చెప్పాను- అప్పుడప్పుడూ మా ఇంటికి వస్తూండండని.

సరే అందావిడ. మూడు రోజుల నాడు ఆవిణ్ణి మా ఇంటి గేటు దగ్గిర చూసినప్పుడు మాత్రం రవంత ఆశ్చర్యం కలిగింది. హ్యాపీగానే ''రండి, రండి'' అంటూ ఆహ్వానించాను. ఆ తరవాత చాలాసార్లే ఆవిడ మా ఇంటికి వచ్చినా, నేను ఆవిడ గురించి తెలుసుకున్నది చాలా తక్కువే అని చెప్పాలి. ఒక్కొక్కసారి ఏవో పాటలు పాడేది. ''భానుమతిని, సుశీలవీ మాత్రం పాడమని అడగొద్దు. మరేవేనా అడగండి''- అనేది. ''మంచి పాటలన్నీ వాళ్లు పాడినవే. పోనీ, ఎల్‌.ఆర్‌.ఈశ్వరివి, స్వర్ణలతవీ పాడతారా?'' అంటే అవి రావనేది. ఒక్కొక్కసారి, ''ఏ పాటలు కావాలో చెప్పండి'' అని వరసగా నా చేత ఓ లిస్టు వల్లె వేయించి, ''అవన్నీ మీకు తెలుసున్నమాట. అవి కాక వేరే పాడతాను'' అని మరేవో పాడేది. నీటిరంగులతో బొమ్మలు వేసి, రంగుల బొమ్మలు కత్తిరించి అట్టమీద అతికించి, రంగు కాగితాలతో బొమ్మలు చేసి బాబుకి ఇచ్చేది. గంటల తరబడి కూర్చుని ఆవిడ తయారుచేస్తే వాడు వాటిని నిమిషాల్లో పాడు చేసేవాడు.

''అలా పాడు చేస్తున్నాడు. వాడికెందు కిస్తారు?'' అని అంటే- ''వాడి ఉద్యోగం అదే మరి. నేను బ్రహ్మని. వాడు శివుడు'' అనేది నవ్వుతూ.

ఎన్నోసార్లు అనుకొనేదాన్ని- ఈవిడికి ఇమోషనల్‌ ఇన్వాల్వ్‌మెంట్‌ లేదేమో అని. లోతు లేని మనిషేమో అని, అందరితో ఆప్యాయంగా మాటాడే ఈ వ్యక్తికి నిజమైన ఆత్మీయు లెవరూ లేరా అని, ఈఇడికి మనఃక్లేశం కలిగించే విషయమంటూ ఏమీ లేదేమో అని, తను అందరికీ కావాలనుకోవడమే గానీ తన కెవరూ అక్కర్లేదా? అని.

ఒకరోజు తెగించి అడిగాను- ''మీ రేం అనుకోకపోతే ఒక మాట అడుగుతా''నని.

''అడగండి'' అంది నవ్వుతూ.

తీరా అడగబోయేసరికి మాటలు తడబడ్డాయి. ''మీ... మీకు... మీ కెవరూ లేరా?''- ఎంత అబ్రస్ట్‌గా అడిగానో!

ఆవిడ మొహం వివర్ణమైంది. నేను పక్కకి తిరిగాను.

ఆవిడ వంగి బాబుని ఎత్తుకుని అంది: ''ఇంకెప్పుడూ నన్నిలాటి ప్రశ్న వేయకండి.''

మరు నిమిషంలో బాబుతో సహా ఆవిడ తోటలోకి వెళ్లిపోయింది.

నేను ఫూల్‌ని. ఉత్త ఫూల్‌ని. సెంటిమెంటల్‌ ఫూల్‌ని. మళ్లీ ఆవిడతో మాటాడడానికి చాలా గుండెబలం తెచ్చుకోవాలి.

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)