కథా భారతి

వృక్షో రక్షతి రక్షితః

- అప్పరాజు నాగజ్యోతి

వైకుంఠం లో శ్రీ మహా విష్ణువు శేషతల్పంపై దీర్ఘనిద్రలో వుండగా “నారాయణ నారాయణ “ అంటూ వచ్చాడు నారదుడు.

“శ్రీవారికి నిద్రాభంగం కలుగుతుంది “ అన్నట్లుగా “ ష్ , నెమ్మది” అన్నది శ్రీలక్ష్మి.

“ సర్వ వేళలా కళకళలాడుతూ వుండే మీ ముఖారవిందం ఈ వేళ వెలవెలబోతోందేమిటి మాతా “

“ఏం చెప్పమంటావు నారదా. భూలోకంలోని ప్రజల దురాశ నానాటికీ అధికమైపోతోంది. తరతరాలకీ సరిపడ ధనాన్ని దాచాలన్న పేరాశతో , ఏళ్ల తరబడిగా ఇనప్పెట్టేల్లోనూ , గోడౌన్లవంటి గాలి చొరబడని స్థలాలలోనూ బంధిస్తే , యిన్నాళ్ళకి భారత ప్రియతమ నాయకుడైన నరేంద్ర మోడీ పుణ్యాన యిప్పుడిప్పుడే ఆ బందిఖానా నుండి విడుదలై కాస్త స్వేచ్చా వాయువులు పీల్చుకోగలుగుతున్నాను నారదా ”

“సత్యం పలికినారు మాతా . మానవుల మితిమీరిన కోరికలకి పృథ్వి పై జరుగుతున్న అత్యాచారాలు, దారుణాలే సాక్ష్యం . మానవుల చేతిలో బలైపోతున్న జీవుల ఆక్రందనలేవీ ప్రభువుల వారి దాకా రానట్లున్నాయి . అందుకే అంత హాయిగా పవళించగలుగుతున్నారు . “

అంతలో హఠాత్తుగా “ హా హా మంటలు, మంటలు , నా హృదయాన్ని అగ్ని దహించి వేస్తున్నది “ అంటూ గుండెల వద్ద చేతులనుంచుకుని బాధతో మెలికలు తిరిగి పోసాగాడు శ్రీ మహా విష్ణువు.
కంగారుపడ్డ లక్ష్మీ దేవి స్వామి వారి మీద నీళ్ళు చిలకరించగా , నారదుడు మంచి తీర్థం అందించాడు సర్వేశ్వరుడికి.

కొద్దిసేపటికి తేరుకున్న విష్ణుమూర్తి , లక్ష్మీ దేవిని తేరిపారా చూసి

“అదేమిటి దేవీ .పాల వెన్నెల లాగా మెరిసిపోతుండే నీ మోము ఈ వేళ అమావాస్య చంద్రుడిలా నలుపు రంగు ధరించింది ?“

“నిజమే స్వామీ . మీరు దీర్ఘనిద్రలోనే వుండడం వలన , భూలోకంలో జరుగుతున్న దారుణాలేవీ ఎరుగకున్నారు. ఆ దుర్మార్గపు మానవులు ఎన్నో సంవత్సరములుగా , నన్ను వారి ఇనప్పెట్టెలలో దాచడంతో నా దేహం శ్వేత వర్ణం నుండి నలుపు వర్ణానికి మారిపోయింది. ఆనాడు ఒక్క రావణాసురుడి చెర నుండి మీరు నన్ను విడిపిస్తే , ఈనాడు కోట్ల కొద్దీ వున్న దుష్ట మానవులనుండి నరేంద్ర మోడీ అనే ఒక గొప్ప నాయకుడు విడిపించినాడు ప్రభూ. అన్నట్టు , తమరెందుకలా మంటలు, మంటలు అంటూ కేకలు పెట్టినారు స్వామీ “

“ఏం చెప్పమంటావు దేవీ . అది ఒక దుస్వప్నం. నా హృదయస్థలి లో వసించే నిన్ను ఎవరో దుష్టులు అగ్గిలోకి త్రోసివేస్తున్నట్లుగా కలగంటిని దేవీ “

“ నారాయణ నారాయణ. అది స్వప్నం కాదు ప్రభూ, సత్యమే. భూలోకంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన క్రొత్త చట్టం వలన, ఇంతకాలమూ ఎక్కడెక్కడో బంధింపబడ్డ రొక్కమంతా ఒక్కసారిగా చెల్లకుండా పోయింది ప్రభూ . అందువలన , అలా దాచబడిన ఆ ధనాన్ని చిత్తు కాగితాలతో సమానం గా తలంచిన జనులు వాటితో చలి మంటలు కాచుకుంటున్నారు“

“ ఔరా. ఎంత ఘోరం . ఈ దుష్ట మానవులకెంత కండ కావరం . మా దేవేరినే అగ్గిపాలు చేస్తారా “

“ఈ మాటలకేమిలే స్వామీ . ఆనాడు త్రేతాయుగం లో తమరు మాత్రం నా చేత అగ్ని ప్రవేశం చేయించలేదా ఏమి. యథా రాజా తథా ప్రజా “ అని శ్రీలక్ష్మి రుసరుస లాడగా , ఏమి చేయాలో తోచక మిన్నకున్న శ్రీహరి , బక్క చిక్కిన దేహంతో వైకుంఠం లోనికి ప్రవేశిస్తున్న స్త్రీ మూర్తి ని చూసి “ నారదా , చిక్కి శల్యమై వున్న ఆ స్త్రీ ఎవరు? ఎక్కడో చూసినట్టుగా ఉన్నదే “ అన్నాడు.

“ నారాయణ నారాయణ. భూదేవినే గుర్తించలేకున్నారా స్వామీ “

“ ఏమిటీ ఆమె భూదేవా . నమ్మలేకున్నాను . భూదేవీ , నీకింతటి దుస్థితి కలిగించిన ఆ దుష్ట రాక్షసుడు ఎవడు ? వాడిని ఇప్పుడే నా చేతులతో హతమార్చెదను “ ఆవేశంతో ఊగిపోయాడు మహా విష్ణువు.

“ ఒక్కడా స్వామీ హతమార్చుటకు. వేలల్లో , లక్షల్లో వున్నారు నీచ మానవులు. రాక్షసులే నయం స్వామీ, వారు దేవతలను, దైవ భక్తులను మాత్రమే హింసించేవారు. చెట్లు , చేమలు లాంటి వాటి జోలికి వెళ్ళే వారు కాదు . కానీ ఈ దుష్ట మానవులు దురాశతో అభివృద్ధి పేరిట చెట్లన్నీ కొట్టివేస్తున్నారు స్వామీ . పృథ్వి పై పచ్చదనమే కరువైపోవడంతో క్షామంతో అల్లాడిపోతూ ఇలా బక్క చిక్కిపోయాను స్వామీ “
“ఔరా ఎంతటి రాక్షసత్వము ఈ మానవులది! ఈ దుష్ట మానవులనింక ఎంతమాత్రమూ ఉపేక్షించరాదు. తక్షణమే వారిని అంతమొందించెదను భూదేవీ ”

“తమకంతటి శ్రమ అవసరము లేదు ప్రభూ. నీడనిచ్చి , నోటికి తిండిని పెట్టే పచ్చటి చెట్ల ని నరికేస్తూ , వారి మరణాన్ని వారే కొని తెచ్చుకుంటున్నారు మూర్ఖ మానవులు. పోగాలము దాపురించిన అంతే కదా మరి “

అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్లుగా “ భూమ్మీద ఇన్ని అరాచకాలు జరుగుతుంటే ఈ దేవేంద్రుడు ఏం చేస్తున్నట్లు “అన్నాడు విష్ణువు.

“ నారాయణ నారాయణ. ఏ రాక్షసుడైనా తపస్సు చేస్తుంటే , తన పదవికి ఎసరు పెడతాడేమోనని భయపడతాడు ఇంద్రుడు. కానీ మానవుల వలన అలాంటి ప్రమాదమేమీ లేదు కదా ప్రభూ. అందుకే స్వర్గంలో విందులు, వినోదాలలో మునిగి తేలియాడుతుంటాడు ఆ దేవేంద్రుడు . తమరే ఏదో ఒకటి చేయాలి ” వ్యంగ్య బాణం విసిరాడు నారదుడు.

“శివుడో, బ్రహ్మో ఇచ్చిన వరాలకు భంగం కలగకుండా రాక్షసులనైతే ఏదో విధంగా అంతం చేసేవాడిని నారదా. కానీ ఇది మనమెన్నడూ కనీవినీ ఎరగని కొత్త సమస్య కదా. దేవగురువు బృహస్పతితో సహా అందరిని సమావేశపరచండి “

***

దేవుళ్ళందరూ ఎవరి స్థానాలలో వారు ఆసీనులవగానే సమావేశం మొదలైనది.

“ ఈనాడు మన ముందున్న సమస్య చాలా పెద్దది, మునుపెన్నడూ మనం ఎరగనిదీ , ఊహించనిదీ . యుగానికి ఒకరో ఇద్దరో రాక్షసులని వధించినట్టుగా కాదు. లక్షల కొద్దీ , కోట్లకొద్దీ దుష్ట మానవులు చేస్తున్న దుష్కృత్యాలను అరికట్టాలి. నీడనిచ్చి, కడుపు నింపే మాతృమూర్తులతో సమానమైన పచ్చటి చెట్లనే నరికేసే వారు అసలు మానవులేనా ? “

“ నిజమే స్వామీ . అన్ని జన్మల్లోకి అత్యంత ఉత్తమమైనది మానవ జన్మ. ప్రేమలూ , అనుబంధాలూ , అనురాగాలు వంటి పెన్నిధులన్నీ మానవ జాతికి మాత్రమె అందిన వరాలు. అందుకేగా తమరూ రాముడిగా, కృష్ణుడిగా పృథ్వి పై అవతారమెత్తినారు. కానీ నేటి మానవుల మధ్య ఆ ప్రేమలూ , అనుబంధాలూ నానాటికీ కనుమరుగై పోతున్నాయి. వాటి స్థానాన ఈర్శ్య, కోపం, మదం, మాత్సర్యం వంటివన్నీ వచ్చి చేరినాయి. మానవులిప్పుడు తమలో తామే కొట్టుకుంటున్నారు , ఒకరినొకరు చంపుకుంటున్నారు . తన కంటే తక్కువ స్థాయి జీవులని సమూలంగా నాశనం చేయడానికి మానవుడు ఏమాత్రమూ వెనకాడడం లేదు. భూమ్మీద ఏ జీవికీ రక్షణ లేకుండా పోయింది స్వామీ. చెట్టు, చేమ, గొడ్డు, గోదా తో సహా అన్ని జీవులూ మానవ జాతిని చూస్తేనే హడలిపోతున్నాయి . అందులోనూ , నోరు లేని, కదలలేని వృక్షాలైతే మరీ బెదిరిపోతున్నాయి “ అంది భూమాత.

“ ప్రౌఢ అని, ముదుసలి అనీ , పసిపిల్ల అనీ భేదం లేకుండా అత్యాచారాలు చేస్తున్నారు ప్రభూ . అక్కడి యువతులూ అంతేలే స్వామీ , యువకులని రెచ్చగొట్టే దుస్తులు ధరిస్తున్నారు. దాంతో ఎలాంటి వారికైనా మనసు చెదరదా “ అన్నాడు ఇంద్రుడు పెదవులు తడుపుకుంటూ .

“ఇవన్నీ సరే. పాప పుణ్యాల చిట్టా ప్రకారం తగు రీతిన అనుభవిస్తారులే ఇంద్రా. అసలు విషయానికి వద్దాం. ప్ర్రాణాధారమైన పచ్చటి వృక్షాలను కొట్టేస్తే , వర్షపు నీరు పృథ్వి నెలా చేరుకుంటుంది ప్రభూ. త్రాగుటకు నీరు , తినుటకు తిండి , పీల్చుటకు స్వచ్చమైన గాలి కరువైతే భూమిపై వున్న జీవులన్నీ అంతరించిపోవా . మానవులు చేసే ఈ అఘాయిత్యాల వలన భూమి పై ఉష్ణోగ్రత పెరిగిపోయి మరి కొద్ది సంవత్సరములలో పృథ్వి ఉనికికే ప్రమాదం సంభవించనున్నది . భూమిపై వాతావరణం పూర్తిగా కాలుష్యం ఐపోయింది ప్రభూ. అందుకే భూమి మీద మిగిలి వున్న అతి కొద్ది మంది దైవభక్తులు చేసే యాగాలూ , హోమాలూ . ప్రార్థనలూ కూడా మన వరకు చేరడం లేదు. మరి కొద్ది కాలం ఇదే పరిస్థితి కొనసాగితే , ఇక మన దేవ లోకానికీ , భూలోకానికీ సంబంధం లేకుండా పోతుంది ప్రభూ “ చెప్పాడు వరుణుడు.

“సత్వర పరిష్కారం సూచించండి బృహస్పతీ “ అర్థించారు దేవతలంతా ఏక కంఠంతో .

“ దీనికి ఒక్కటే పరిష్కారం గోచరిస్తోంది స్వామీ. భూలోకం లోని మానవులందరూ తలా ఒక మొక్కని నాటి , రొజూ ఆ మొక్కకి నీరు పోసి దానిని ప్రాణ సమానంగా పరిరక్షించడమే . అప్పుడే భువి తిరిగి నందనవనంగా మారగలదు “ చెప్పాడు బృహస్పతి.

“ ఇదెలా సాధ్యం బృహస్పతీ. మానవులకే అంత మంచి బుద్ధీ , తెలివితేటలూ వుంటే అసలు ఇటువంటి పరిస్థితే రాకుండును కదా “

“ ఈ కార్యం భూమ్మీద కేవలం ఒకే ఒక్క మానవుడి వలన సాధ్యపడగలదు ప్రభూ “

“ఎవరు బృహస్పతీ ఆ దివ్య మానవుడు ? త్వరగా సెలవీయండి “

“ అతను మరెవరో కాదు ప్రభూ. సాక్షాత్తూ శ్రీ మహలక్ష్మినే లెక్కకు మించిన ముష్కురుల చెర నుండీ విడిపించిన భారత ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ “

“దేవగురువు బృహస్పతుల వారు చెప్పినది అక్షర సత్యం ప్రభూ. ఇంతటి క్లిష్ట కార్యం కేవలం నరేంద్ర మోడీ కే సాధ్యం “ అన్నాడు ఊబ కాయంతో తన ఆసనంలో అటూ ఇటూ కదులుతున్న కుబేరుడు .

“అదేమిటి కుబేరా , నీ కాయం అటుల పెరిగిపోయినది . ఇదేమైనా క్రొత్త వ్యాధేమో . మన అశ్వినీ దేవతల చేత వైద్యం చేయించుకోలేకపోయావా “ అన్నాడు విష్ణువు.

“ఇది వ్యాధి కాదు ప్రభూ. నరేంద్ర మోడీ చేసిన ఆకస్మిక చట్టం వలన, అక్రమంగా సంపదను ఆర్జించిన వారంతా కుప్పలు తెప్పలుగా వారి నల్ల ధనాన్ని తిరుపతి హుండీ లో సమర్పించుకున్నారు స్వామీ. తమరు తమ వివాహానికి గానూ నా వద్ద అప్పు చేసిన కారణాన , ఆ నల్ల ధనమంతా వచ్చి నన్ను చేరడంతో నా కాయం ఈ విధంగా ఉబ్బిపోయినది “

యిది విన్న విష్ణుమూర్తి వదనం వికసించినది.

“ ఐతే కుబేరా, ఇక నేను నీ వద్ద తీసుకున్న ఋణమంతా చెల్లిపోయినట్లేగా . నన్ను ఋణ విముక్తుడిని చేసిన ఆ నరేంద్ర మోడీ కి ధన్యవాదాలు తెలుపుకోవలయును. “

“ మీ ఋణమెలా చెల్లగలదు ప్రభూ ? ఆ నల్ల ధనమంతా చెల్లని పాత రొక్కం కదా “

విష్ణుమూర్తి ఆనందం హరించుకుపోగా “ హతవిధీ “ అని నిట్టూర్చాడు .

“ స్వామీ తమరి ఋణ బాధని కాస్త ప్రక్కకు పెట్టి, నా సమస్యా పరిష్కారం యోచన చేయుడు “ అన్నది భూదేవి అసహనంగా.

“ అటులనే భూదేవీ . పరిష్కారాన్ని కాస్త విపులంగా వివరించండి బృహస్పతీ “

“ భువి పై అత్యధిక జనాభా వున్న స్థలం భారత దేశం. అటువంటి పవిత్ర దేశం లో అత్యంత ఉన్నత స్థానం లో వున్న నరేంద్ర మోడీ తలుచుకుంటే జరగనిదేముంటుంది ప్రభూ. ఆ మానవుడు ‘మనిషికో మొక్క, ఇంటికో చెట్టు’ అని ఒక్క చట్టాన్ని జారీ చేస్తే భూజనులంతా ఏకమై ఆ శాసనాన్ని అమలు చేస్తారు “

“భేషైన పరిష్కారాన్ని సూచించారు బృహస్పతీ. మరి మన తక్షణ కర్తవ్యమేమిటో కూడా సెలవీయండి “
“ మనం చేయవలసినదల్లా ఆ మానవుని మనస్సున చేరి ఆతనిని ఈ సత్కార్యానికి పూనుకునేటట్లుగా ప్రేరేపించడమే “

“ ఐతే వాయువేగంతో వెళ్ళగలిగే నా వాహనమైన గరుక్మంతుడే ఈ కార్యానికి తగిన వాడు. “ అని విష్ణుమూర్తి అంటుండగానే “ స్వామీ నా ఆరోగ్యం ప్రస్తుతం అందుకు సహకరించబోదు . నా అశక్తతకు నన్ను మన్నించండి “ అంటూ సభలో ఒక మూల నుండి దీనంగా వినబడింది గరుక్మంతుడి కంఠం .

“ అదేమిటి గరుడా, అలా నీరసం గా అగుపిస్తున్నావు ? ఏదైనా అస్వస్థతా ? “ ఆప్యాయంగా అడిగాడు విష్ణువు.

“ ఔను ప్రభూ. రెండు దినములకు ముందు భూలోక విహారం చేయవలెనని కోరిక కలుగగా, భూలోకానికి పయనమైనాను . అలా భారత దేశ రాజధాని ఢిల్లీ వరకూ ఎగిరానో లేదో , అక్కడి వాతావరణ కాలుష్యానికి ఉక్కిరి బిక్కిరైన నేను ఎలాగో కొన ఊపిరితో ఇక్కడికి తిరిగి రాగలిగాను “

“ అయినచో ఇది చాలా పెద్ద సమస్యే స్వామీ. మరెవరిని ఈ కార్యం పై అక్కడికి పంపినా, వారికీ మన గరుడిడికి పట్టిన గతే పట్టును కదా “ అన్నది లక్ష్మీదేవి .

దేవతలందరూ ఆలోచనలో పడినారు.

“ నారాయణ నారాయణ. ప్రభూ నాదో సలహా . మన మన్మథుడు నశ్శరీరుడు కాబట్టి భూలోక పర్యావరణ కాలుష్యం అతనిని ఏమీ చేయలేదు. అందుచేత మన్మథుడే ఈ కార్యమునకు అన్నివిధాలా తగిన వాడు “ .

“ నీవు చెప్పినది సబబుగానే వున్నది నారదా. వింటున్నావుగా మన్మథా , నీ విల్లూ , శరములతో సిద్దమై భూలోకమునకు పయనమవుడు. అచట మోడీ పై నీ మన్మథ బాణాన్ని సంధించి , ఆతనికి వృక్ష జాతిపై ప్రేమని కలిగించు. సఫలుడవై తిరిగి రమ్ము . విజయీభవ “

“తమరి ఆజ్ఞ ప్రభూ “ అంటూ మన్మథుడు భూలోకం దిశగా పయనమైనాడు.

“కారణ జన్ముడైన నరేంద్ర మోడీ, అతి త్వరలో అంతరించబోతున్న వృక్ష జాతికి జీవం పోయాలని కోరుకుంటూ, ఒక్కసారి ఆ దివ్య మానవుడికి జేజేలు పలుకుదాం “ అంటూ నారదుడు “ జయహో మోడీ “ అనగానే దేవుళ్ళందరూ కూడా “ జయహో మోడీ “ అని ముక్తకంఠం తో పలికారు.

***

మొహాన చల్లటి నీళ్ళు విసురుగా పడగానే ఉలిక్కిపడి లేచాను. ఎదురుగా నీళ్ళ గ్లాసు తో అమ్మ . “ ఏరా , బారెడు ప్రొద్దెక్కినా లేవకపోగా ఏమిటా గావుకేకలు ‘జయహో ‘ అంటూ , విన్న వాళ్ళందరూ హడలిపోయేట్టు “ అని తిడుతుంటే “ ఔరా నేనింతదాకా కలగంటున్నానా “ అనుకున్నాను.

బహుశా ఆ భగవంతుడే “వృక్షో రక్షతి రక్షిత “ అంటూ నాకు కర్తవ్యాన్ని ఉపదేశించాడేమో. “ మనిషికో మొక్క, ఇంటికో చెట్టు “ పథకాన్ని సర్జికల్ స్ట్రైక్ లాగా వెంటనే అమలు చేయమంటూ మన ప్రధాని మోడీ గారికి ఆన్ లైన్ లో విన్నపం పంపుదాం అనుకుని వెంటనే లాప్ టాప్ ఆన్ చేసాను.

అలాగే దేవతలు పంపిన వృక్ష సందేశాన్ని మరింత ఎక్కువ మందికి చేరవేయాలంటే అందుకు చక్కటి మార్గం కథా రూపంలో పాఠకులకు అందించడమే కదా అనుకుని పెన్నూ, పేపరూ అందుకున్నాను. వృక్షో రక్షతి రక్షితః

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)