కబుర్లు - వీక్షణం - సాహితీ గవాక్షం
బే ఏరియా వీక్షణం సాహితీ సమావేశం- 53
- నాగరాజు రామస్వామి

'సాహితీ గవాక్ష వీక్షణం - బే ఏరియా ప్రవాస సాహిత్యాభిమానులు 53 నెలలుగా నెలనెలా జరుపుకుంటున్న అక్షరోత్సవం; జనవరి 15న వేణు ఆసూరి గారింట్లో కళా వాహినై పొంగులెత్తింది. సుమారు ముప్పై మంది అరమరికలు లేని ఔత్సాహిక రసాత్ములు తెలుగు వెలుగుల ఆత్మీయ కెరటాలై తరంగించారు. మిత్రమండలి సభకు నిండుతనాన్ని కూర్చగా, వేమూరి వెంకటేశ్వర్ రావు , కిరణ్ ప్రభ, రావు తల్లాప్రగడ, గీతా మాధవి, వేణు ఆసూరి, శ్రీ చరణ్ వంటి సాహిత్య సంపన్నులు నిండు సభకు నిగనిగలను చేకూర్చారు. తెలుగు గడ్డ నుండి విచ్చేసిన శ్రీ అల్లం రాజయ్య, శ్రీమతి సుహాసిని ఆనంద్ వంటి విశిష్ట అతిథులతో సాహితీ గవాక్షంలో తెలుగుల కళ తొణకింది. తెలుగు చలువ తెల్ల నేల మీద పల్లవించింది.

వేణు ఆసూరి గారి హార్థిక స్వాగతం తరువాత అధ్యక్షులు వేమూరి వెంకటేశ్వర రావు గారి సంక్రాతి శుభాకాంక్షలతో కార్యక్రమం ప్రారంభమయింది. తొలి వక్త అల్లం రాజయ్య గారు.

రాజయ్యగారి ప్రసంగంలో 1968-1969 నాటి తెలంగాణా ప్రాంతీయ నేపథ్యం ప్రతిఫలించింది. అప్పటి స్థలకాల సమాజ దృక్పథాన్ని జాగృత జన చైతన్య ధార లోకి తేవడానికి విస్తృత యత్నం జరిగిందని, నాటి బడుగు జీవుల బతుకు కథలను వ్యవసాయ కుటుంబాల స్థితిగతులను ఆనాటి సమకాలీన కథా సాహిత్యం విశదపరచే ప్రయత్నం చేసిందని, విద్యార్థి ఉద్యమాలు, రైతాంగ తిరుగుబాట్లు, లెఫ్ట్ రాజకీయాలు ఆనాటి తెలంగాణా వాతావరణాన్ని ఊపివేసాయని వారు తెలిపారు. కొమరం భీం, కొలిమంటుకుంది, వసంతగీతం వంటి నవలలు ఉద్యమ స్ఫూర్తితో ఉద్భవించాయని చెప్పారు. రావిశాస్త్రి గారు ప్రాంతీయ యాసలో రాసిన కథలలాగే తెలంగాణా మాండలికంలో కథాసాహిత్యం తరగెత్తిందని, అందుకు అవసరమైన అనేక సాహిత్య వర్క్ షాపులను తాము నిర్వహించి సాహిత్యాన్ని సాధనంగా మలుచుకున్నామని తెలిపారు. పిదప, 40 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం తెచ్చిన పరిణామాలను వివరించే కథ " టైగర్ జోన్" ను (డిసెంబర్ 16 చతురలో ప్రచురించబడింది) ప్రస్తావిస్తూ రాజయ్య గారు 'అరుణతార'లో వచ్చిన "వెలుతురు నది" కథను చదివి వినిపించారు. అది రాష్ట్ర విభజనానంతరం తెలంగాణ విద్యాధిక ఉద్యోగుల సామాజిక మహిళా వాద దృక్కోణంలో సాగిన ఈనాటి కథ. రైలు ప్రయాణంలో కొనసాగిన సమకాలీన సమస్యల సమాహారం. కథా గమనంలో పెద్దపల్లి, మందమర్రి లాంటి ప్రాంతీయ పరిసరాల సంగతులు, అగ్రకులాలతో పాటు మాదిగ, యాదవ, పద్మశాలీల వంటి ఇతర కులాల ఊసులు, పోలవరం ఆదివాసుల, దళితుల, బహుజనుల సమస్యలు మూల కథను అల్లుకున్నాయి. మౌలికంగా ఆ కథ స్త్రీల కథ. తరతరాలుగా తెగని స్త్రీల వ్యథ. పాత్రల సంభాషణ సాగి సాగి, నిజానికి మహిళలకు నిజ చరిత్ర అంటూ ఉంటుందా అన్నంత దాకా వస్తుంది. నేటికీ, నాగరికంగా ఎదిగిన సమాజంలో సైతం, భార్యా భర్తల మధ్య అజ్ఞాత అసంతృప్తి అనివార్యమౌతున్న సంఘటనలు కథా సందర్భంగా ఉటంకించబడుతాయి. అపురూప కానుకలు అనదగిన ఆడవాళ్లను యుగయుగాలుగా మగవాళ్ళు కేవలం దేహంగానే అర్థం చేసుకుంటున్నారన్న నిరాశ ఈ కథలో పొడసూపింది. 'నిలువెల్ల గాయాలైన పిల్లంగోవి' లానే స్త్రీ అస్తిత్వం రూపుకట్టింది.

హైదరాబాద్ నుండి వచ్చిన రెండవ వక్త శ్రీమతి సుహాసిని ఆనంద్. వీరిది సంగీత వారసత్వం ఉన్న కుటుంబం. వీరి తండ్రి గారు శ్రీ పాలగుమ్మి రాజగోపాల్, లలితా సంగీత పర్యాయపదమైన పాలగుమ్మి విశ్వనాథ్ గారి అనుజులు. సాలూరు రాజేశ్వర్ రావు గారి శిష్యులు. వీళ్లిద్దరు కలిసి 14 సినిమా పాటలకు సంగీతం సమకూర్చారు. మరుగున పడుతున్న ప్రబంధ సాహిత్యాన్ని జనసామాన్య నాలుకలమీద ఆడేలా చేయాలన్న సత్సంకల్పంతో రాజగోపాలం గారు గజేంద్ర మోక్షం, గీతశంకరం, పోతన భాగవత సుధ, ప్రహ్లాదచరిత్రము, వామనావతారం లాంటి కావ్యాల పద్యాలను కర్ణాటక సంగీత బాణీలో స్వరపరిచారు. ఏ ఒక్క పద్యం పొల్లుపోకుండా శాస్త్రీయ సంగీత రాగాలలో పద్యాలను పలికించడం హర్షించదగ్గ గొప్ప యత్నం. అందుకు, రాశి ట్రస్ట్ వారు నిర్మాతలు కాగా, నక్షత్ర మ్యూజిక్ మార్కెటింగ్ సంస్థ వారు ఆడియో సీడీల రూపకర్తలు. పంచమహాకావ్యాలలో తొలి ప్రబంధ మైన 780 పద్యాల 'మనుచరిత్రము' ను 75 పద్యాల మాలగా మలచి వెలువరించిన 'గాన మాధురీ' సీడీని కిరణ్ ప్రభ గారు ఆవిష్కరించారు. ఇది తెలుగు పద్యానికి పట్ఠాభిషేకం, తెలుగు కావ్యానికి రాగ నివాళి. " పరుడే ఈశ్వరుడై మహా మహిముడై...ప్రారుద్భావ స్థాన త్రిశక్తి యుతుడై...అంతర్జ్యోతుడైన హరికిన్ తత్వార్థినై మొక్కెదన్ " అన్న గజేంద్రమోక్షం లోని పద్యాన్ని రాగయుక్తంగా పాడి సుహాసిని గారు సభను రంజింప జేశారు.

తదుపరి కార్య క్రమం కిరణ్ ప్రభగారు వీక్షణం సమావేశాలలో ధారావాహికంగా నిర్వహిస్తూ వస్తున్న 'సాహిత్య క్విజ్'. అత్యంత ఆసక్తిగా సాగింది.

కవితాగోష్ఠి లో మొదట కె. గీత గారు తన తొలి కవితా సంకలనం 'ద్రవ భాష' లోని 1991 నాటి ' పండగొచ్చినపుడు' కవిత వినిపించారు. పిల్లల బుడిబుడి కేరింతలు, చెంగావి చీరల జరజరలు, పేకముక్కల అల్లుళ్ళ హడావుడులు, కంచాల దగ్గరి కయ్యాలు, కోళ్లకు కూడా కసి నేర్పే సంక్రాంతి సంరంభాలు ఆ కవితలో చోటుచేసుకోవడం సందర్భోచితంగా వుంది. అరుణ్ సాగర్ తన కవితా సంకలనానికి రాసుకున్న 'నానుడి' లో తనను ప్రభావితం చేసిన కవులలో కవయిత్రి గీత గారు ఒకరని ఉందని సభికులు గుర్తు చేయడం అందరికీ సంతోషం కలిగించింది. అనతి కాలంలోనే 'వీక్షణం' ను ఆత్మీయం చేసుకున్న ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు ఇండియా నుండి పంపించిన కవిత "శివంకర రాత్రి " ని తల్లాప్రగడ రావు గారు చదివారు. లోతైన కవితకు పసందైన పఠనం.తెలుగు మాట్లాడడమే ఒక భోగంగా భావించే శ్రీచరణ్ గారు మకర సంక్రమణం శీర్షికతో సంస్కృతాంధ్ర పదభూయిష్టమైన పద్యాలను వినిపించారు. సుభాష్ పెద్దు గారు తమ కవితలో సుమ భావ పలుకరింతలను, మంచిముత్యాల కాంతులను వెదజల్లారు. ఉమర్ ఆలీషా శ్రీ విజ్ఞాన ఆధ్యాత్మిక తత్వ పీఠం అనుయాయులు వనపర్తి సత్యనారాయణ గారు పద్య పఠనం గావించగా, పిల్లలమఱ్ఱి కృష్ణ కుమార్ గారు చినజియ్యరు స్వామి గారి శారదా పీఠంను పురస్కరించి కవితాత్మకంగా ప్రసంగించారు. లెనిన్ గారు కవితలలో ఆత్మను పట్టుకునే ప్రయత్నం చేయగా, సాయిబాబా గారు తనదైన సరదా ధోరణిలో 'వీక్షణం ఆరంభ గీతం' చదివి నవ్వించారు. నాగరాజు రామస్వామి " తురీయం / ( లాస్ట్ లెగ్ ) " కవిత వినిపించగా, వేణు ఆసూరిగారు " హే చంద్ర చూడ " అనే సినిమా పాటను పాడి సభను రంజింప జేశారు.

మూడు గంటలకు పైగా సంతోషదాయకంగా సాగిన ఈ సమావేశం సంతృప్తికరంగా ముగిసింది. సుహాసిని గారు మరో రాగమయ పద్యంతో సభకు స్వస్తి పలకడం ఒక మంగళకర ముక్తాయింపు.



మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)