సారస్వతం - 'దీప్తి' వాక్యం

మహర్షి విడవమన్న సంసారం

- దీప్తి కోడూరు

డిసెంబర్ 1, 1945, సమయం మధ్యాహ్నం 3 గం||లు

తిరువణ్ణామలై శ్రీ రమణాశ్రమం

భగవాన్ శ్రీ రమణ మహర్షి విశ్రాంతిగా సోఫాలో కూర్చుని ఉన్నారు. దేశ విదేశాల నుండి వచ్చిన ఎందరో భక్తులు ఆయన చుట్టూ కూర్చుని ఉన్నారు.

మహర్షి దగ్గర ప్రతినిత్యం ఒక చిత్రమైన వాతావరణం నెలకొని ఉంటుంది. సాధారణంగా ఆరుబయట కూర్చున్నపుడు ఆయన అరుణాచలం కొండను చూస్తూ ఉంటారు. ఆ కొండ మొత్తం ఆయనకు వెలుగుతున్న మహా జ్యోతిలాగా అగుపిస్తుందట! గదిలో ఉన్నపుడు ఆయన దృష్టి శూన్యంలో నిలిచి ఉంటుంది.

ఎవరైనా ఏదైనా అడిగితే ప్రయత్నపూర్వకంగా తన మనస్థితిలోంచి దిగి వచ్చి, సమాధానం చెప్తారు మహర్షి. ఆయన దగ్గరకు వెళ్ళిన్నపుడు ఎన్నో ప్రశ్నలు అడగాలని సిద్ధపడి వచ్చిన వాళ్ళు ఆయన సమక్షంలో మాటలు రాక మౌనాన్ని ఆశ్రయిస్తుంటారు. ఆ మౌనంలోనే వాళ్ళకు కావలసిన సమాధానాలు దొరికేవి. సంతృప్తిగా తలాడించి, ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసుకుని తిరిగి వెళ్ళేవారు. ఇంకా కొందరు కొద్ది క్షణాల ఆయన సాన్నిధ్య మహిమను రుచి చూసాక, ఇక ప్రాపంచిక జీవితంలో ఉండలేక, అన్నీ విడిచి శాశ్వతంగా అరుణాచలంలో స్థిరనివాసం ఏర్పరుచుకుని, మహర్షి దగ్గరే ఆజన్మాంతం ఉండిపోయేవారు. అలాంటి వారిలో విదేశీయులు అధికంగా ఉండటం విశేషం.
ఆ రోజు మధ్యాహ్నం నడివయస్సులో ఉన్న ఒక ఆంధ్రుడు మహర్షి ఎదుటకు వచ్చి, వినయంగా నమస్కరించి, ఇలా అడిగాడు. "భగవాన్, నేను నియమంగా ప్రతిరోజూ ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట రామనామం చేస్తుంటాను. కానీ మొదలుపెట్టిన కొంతసేపటికే ఏవేవో ఆలోచనలు చుట్టుముట్టి నామం చేస్తున్న సంగతే మర్చిపోతున్నాను. మర్చిపోయానని ఎప్పటికో తెలుస్తోంది. ఏం చేసేది?"

"ఏముంది? మర్చిపోయానని గుర్తురాగానే మళ్ళీ ఆ నామాన్ని పట్టుకోండి" అన్నారు రమణ మహర్షి.
మహర్షి మాటలు విని, అక్కడ కూర్చున్న వాళ్ళలో కొందరు సన్నగా నవ్వారు. దాంతో అవమానంగా అనిపించిన ఆ భక్తుడు, "ఇలాంటి ఆలోచనలకు కారణం సంసారమే కదా? అందుకే ఈ సంసారాన్ని వదిలేద్దామని అనుకుంటున్నా?" అన్నాడు పౌరుషంగా.

మహర్షి శాంతంగా అతిడికేసి చూసి, "ఇంతకీ సంసారమంటే ఏమిటి?" అని అడిగారు.

"భార్యాపిల్లలు, ఇల్లు, ఉద్యోగం, బంధువులు ఇలాంటివే కదా భగవాన్"

"అదా సంసారమంటే? వాళ్ళంతా నిన్నేం చేశారని? ముందు సంసారమంటే ఏమిటో తెలుసుకో. ఆ తర్వాత విడవటం సంగతి ఆలోచిద్దాం" అన్నారు మహర్షి.

అతడికేం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. తలవంచుకుని అలాగే నిలబడిపోయాడు.

మహర్షికి అతడి పట్ల కరుణ కలిగింది. ప్రేమగా చుస్తూ, "భార్యాపిల్లలని వదిలినంత మాత్రాన సంసారం లేకుండా పోతుందా? అవన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చారనుకోండి. ఇక్కడ ఇంకో రకమైన సంసారం తగులుకుంటుంది. పోనీ సన్యసించారనుకోండి. కర్ర, కమండలం, భిక్షా పాత్ర, వాటిని సంరక్షించుకోవడంలో మరో రకమైన సంసారం ఏర్పడుతుంది.

సంసారం అంటే మనస్సు కల్పించేదే కానీ బాహ్యంగా ఉండేది కాదు. మీరు ఎక్కడున్నా దాని పని అది చేసుకుపోయి, మనల్ని అశాంతికి గురి చేస్తుంది. ఆ మనస్సు కల్పించే సంసారాన్ని విడిస్తే ఎక్కడున్నా ఒకటే. ఏదీ మిమ్మల్ని బాధించదు."

మహర్షి మాటలతో పృచ్ఛకుడికి కాస్త ధైర్యం వచ్చింది. "అదే స్వామీ, ఆ సంసారాన్నే ఎలా విడవాలి అని నేను అడగబోయేది?" అనడిగాడు.

"మొదటే చెప్పాను కదా! ఎక్కడ జపం ఆగిపోయిందని గుర్తించావో అక్కడి నుండి మొదలుపెట్టడమే. ఆ జ్ఞప్తిని వృద్ధి చేసుకోవడమే చేయవలసింది. మళ్ళీ మళ్ళీ ఆ నామాన్నే పట్టుకోండి. క్రమంగా తలపులు తగ్గుతాయి. అంతరాయాలు తగ్గేకొద్దీ శాంతి అనుభవమౌతుంది.

పెద్దగా ఉచ్ఛరించేకన్నా పెదాల కదలికతో ఉచ్ఛరించడం మేలు. దానికన్నా మౌనంగా చేయడం మరింత ఉత్తమం. కొంతకాలానికి అంతరంగంలో జరుగుతున్న ఆ నామం కూడా ఆగిపోయి, ఒకానొక కొనసాగింపు మాత్రమే అనుభవమౌతుంది. అది మరింత శ్రేష్టం." అని ముగించి, మహర్షి మళ్ళీ మౌనంగా, శూన్యంలోకి చూపు సారించారు.

అలాగే మరొక మారు వంట పని చేసే శాంతమ్మ, "నాకు ఎప్పుడూ ధ్యానం చేసుకోవాలని అనిపిస్తుంది. కానీ నా పనులతో కుదరట్లేదు" అని మహర్షి వద్ద వాపోయింది. అప్పుడు మహర్షి, "మనసుని ఉన్న చోటే ఉంచి, శరీరాన్ని పని చేయనీ" అని చెప్పారు.

గృహస్త జీవనం గడిపే ప్రతివారికీ మహర్షి సమాధానం దారి చూపిస్తుంది. కేవలం ఒక చోట కూర్చుని, బాసింపట్టు వేసుకుని, కళ్ళు మూసుకుని చేసేదే ధ్యానం కాదు. ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా నిరంతరం మనస్సుని తదర్పితంగా, ఆ జ్ఞప్తితో ఉండగలగడమే నిజమైన ధ్యానం.

మునుపు రామనామం జపించే వ్యక్తికి, తరువాత శాంతమ్మకి చెప్పినదాంట్లో విరుద్ధమేమీ లేదు. విశ్రాంతిగా కూర్చుని జపం చేసేవారికైనా, రకరకాల పనుల్లో మునిగిపోయిన వారికైనా ఆ గుర్తుని విడవకుండా కాపాడుకోవడమే చేయదగినది అని మహర్షిగారి సూచన.

మానవాళి అంతా మహాత్ముల అడుగుజాడల్లో నడిచి, పరమపథాన్ని చేరుకోవాలని అభిలషిస్తూ, సెలవు.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)