ఆధునిక కవిత్వంలో అనుభూతి వాదం
అనుభూతి - ప్రాచీన దృక్పథం (మొదటి భాగం)
- సునీల పావులూరు
"అనుభూతి లేకుండా ఏ కాలంలోనూ ఏ కవీ ఏ రచనా చేసియుండటానికి వీల్లేదన్నది నిర్వివాదాంశం". డా|| జి.వి.సుబ్రహ్మణ్యం గారంటారు.. అనుభూతి లేని రచన ఏదీ లేదు అని చెప్పటంలో చాలా విస్తృతమైన అర్ఢం ఇది. సంస్కృతంలో ఆదికవి అయిన వాల్మీకి మహర్షి దగ్గరనుండి సమకాలీన సమాజంలో బతుకుతున్న రచయితల రచనలన్నీ అనుభూతితో కూడినవే అవి మనం తెలుసుకోవచ్చు. పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, ప్రబంధాలు, శతకాలు, ముక్తకాలు, పదాలు, గేయాలు, వచనకవితలు, నవలలు, నాటకాలు మరెన్నో - అన్ని ప్రక్రియలూ అనుభూతి పరిధిలోకి వచ్చేవే. "Poetry is the spontaneous overflow of powerful feelings" అని ఒక ఆంగ్లకవి చెప్పినా, కవి హృదయంలో నుంచి ఉవ్వెత్తుగా ఎగిసిపడే ఈ భావ సముదాయం అక్షరరూపం దాల్చడానికి కవి పొందిన అనుభూతే ప్రేరణ. ఇది కాదనలేని సత్యం. అయితే అక్షరరూపం పొందిన ప్రతిరచనా కవిత్వమే అవుతుందా? అంటే కాదనే చెప్పాల్సివస్తుంది. ప్రకృతిని చూసి పరవశుడైన కవి ప్రతిభావంతంగా పలికే పలుకులే అనుభూతిని వెలారుస్తాయి. అందుకనే ఆధునికుడైన బాల గంగాధర తిలక్ గులకరాళ్ళ డబ్బామోతనే గొప్ప కవిత్వంగా భావించవద్దని అంటారు.

పైన్ చెప్పినట్లుగా వాల్మీకి నుండి సమకాలీన కవులవరకూ వచ్చిన కాలంలో కవి అనిపించుకోదగిన వాడు చెప్పిన ప్రతి రచనా కూడా అనుభూతితో కూడినదే. శతాబ్దాలు మారుతున్నా కవిత్వ మనిపించుకోబ్వడుతున్న రచనలో అనుభూతి తప్పకుండా ఉంటుంది. అనుభూతి కవికి తప్పనిసరి.

శతాబ్దాల తరబడి రచన సాగుతూనే ఉంది. ఎందరో కవులు తమ తమ అనుభూతులకు తోచిన రచనలను చేస్తూనే ఉన్నారు. ఎవరైనా  నే చెప్పే రచనలో అనుభుతి లేదు అనే వాదనను చెప్పినా, ఆ వాదనలో కూడా వారి అనుభూతి ఆవిష్కరింపబడడం దాగని సత్యం. అందుకనే అనుభూతి లేకుండా, ఏకాలంలోనూ, ఏ కవీ, ఏ రచనా చెయ్యడానికి వీల్లేదన్నది నిర్వివాదాంశం అని నిర్ద్వంద్వంగా చెప్పుకోవలసి వచ్చింది.

రోజూ వెలుగుతున్న సూర్యుడిని చూపించి, ఈ వెలుగుతున్న వాడు సూర్యుడే అని చెప్పవలసిన అవసరం ఏముంది? అలాగే సర్వకాలాల్లోనూ, సర్వ రచనల్లోనూ కవులందరిచేతా రచించపడుతున్న రచనల్లో అనుభూతి ఉంది అని చెప్పుకోవలసిన అవసరం ఏముంది? అనే ప్రశ్న తలెత్తుతుంది. నిజమే, విచిత్రంగానే ఉంటుంది. ఉదయిస్తున్న సూర్యుడిని చూసి, దినకరుడు ఉదయించాడని ఒకడనుకుంటుంటే, ప్రత్యక్ష దైవం ఉదయించాడని మరొకరనుకుంటుంటే, ఒక గోళం దర్శనమిచ్చిందని మరొకరనుకుంటుంటే, చలన మెరుగని సూర్యుడు ఉదయించడమేమిటి? అనే ప్రశ్నలు మరొకరు వేస్తుంటే - ప్రశ్నలు వేసేవారి విభిన్న దృక్పథాలు తేట తెల్లమవుతున్నాయి కదా! మొత్తం మీద సూర్యుడు ఉదయించాడని ఒకరంటుంటే, సూర్యుడు ఉదయించనే లేదు పో అని మరొకరంటారు. ఇందులో ఏది అబద్ధంగా తోచదు. అయితే సమన్వయించుకిఓడానికి తలచుట్టూ తిప్పి ముక్కు పట్టుకోవాల్సి వస్తుంది.

సారస్వత చర్చలో ప్ర్దధానమైన అంశం రసచర్చ. కవిత్వంలో ప్రధానమైన వర్గాలు రెండే రెండు. కవిత్వంలో రసాన్ని  అంగీకరించేవారు, రసాన్ని అంగీకరించనివారు,  దీన్ని ప్రస్తుతాంశానికి సరిపడేటట్లుగా చెప్పాలంటే, కవిత్వంలో అనుభూతి ఉందనే వారిది ఒక వర్గం, లేదు అనేవారిది ఒక వర్గం.

భారతీయ అలంకారశాస్త్రం కడు ప్రాచీనమైందేకాక ప్రసిద్ధమైంది కూడా. ఈ విషయంలో ప్రపంచానికంతా మన అలంకారశాస్త్రం ఆదర్శప్రాయంగా ఉంది. కవిత్వాన్ని అనుభవించే తీరును గురించి వివరించటంలో లోలోతులకి పోయినవాళ్ళు భారతీయులు.

రసాన్ని గురించి ‘సాహిత్యదర్పణం’లో ఇలా చెప్పబడింది.
"సత్త్వోద్రేకాదఖండ స్వప్రకాశానంద చిన్మయః|
వేద్యాంతర స్పర్శ శూన్యో బ్రహ్మా స్వాద సహోదరః|
లోకోత్తర చమత్కార ప్రాణః కైశ్చిత్యమాతృభి:|
స్వాకార పద భిన్నత్వే నాయమాస్వాద్యతే రసః||

(చిత్తంతో సత్త్వోద్రేకం కలిగిన దశలో విశిష్ట సంస్కారాలతో కూడుకున్న సహృదయుడు అఖండ స్వప్రకాశానందము, చిన్మయమూ ఇతరాలయిన అన్నిరకాల జ్ఞానాలచేత వినిర్ముక్తమూ, బ్రహ్మాస్వాదన సహోదరమూ, లోకోత్తర చమత్కారము ప్రాణమూ అయిన రసాన్ని నిజస్వరూపభిన్నంగా ఆస్వాదిస్తారు)"2

ఇదే విషయాన్ని మమ్మటుడు తన "కావ్యప్రకాశిక"లో "సకల ప్రయోజన మౌళిభూతం సమనంతరమేవ రసాస్వాదన సముద్భూతం విగళిత వేద్యాంతర మానందమ్"౩

అంటే రసం సకల ప్రయోజన మౌళిభూతంగానూ, రసాస్వాదాన్ని ఆనందరూపంగానూ భావించాడన్నమాట. అనగా రసానుభవం ఆనందానుభవంవంటిదని మనవారు వివరించారు. ఆనందం అఖండమని, స్వప్రకాశమని, చిన్మయమని, అన్యజ్ఞానాలతో రహితమైందని చెప్తున్నారు.

ఆనందానుభవం ఆధ్యాత్మికమైంది. ఏమైనా రసానుభవం లౌకిక వాసనా రహితమని చెప్పడానికి వీల్లేదు. రసనిష్పత్తిని గురించి ‘విభావానుభావ వ్యభిచారి సంయోగాద్రస నిష్పత్తి:’ అని భరతుడు నాట్యశాస్త్రంలో రసవివేచనం చేశాడు. భారతీయాలంకారిక శాస్త్రాలన్నిటికీ మూలభూతమైన విషయమిదే. మనకిప్పుడు కావలసింది రసవాద చర్చకాదు. రసం అలౌకికమైనా, రసచర్వణం అలౌకికమైనా, రసచర్వణం అలౌకికమైనా, విభావాదులు అలౌకికాలై సాధారణీకరణాన్ని పొందినవైనా రసాస్వాదనలో లౌకికప్రసక్తి నిర్విషయంగా ఉండదు. కానీ ఆనందం అట్లాంటిది కాదు. అది నిర్విషయమే. అఖండమే. కాబట్టే రసాన్ని బ్రహ్మానంద సహోదరం అని చెప్పటం. బ్రహ్మానంద సహోదరం అంటే, బ్రహ్మానందాన్ని రసచర్వణం ద్వారా పొందవచ్చని అలంకారికుల అభిప్రాయం. ఆనందాన్ని గురించి మనం సమగ్రంగా తెలుసుకుంటుంటేగాని, అనుభూతి ఎంత లోతైందో మనం తెలుసుకోలేము. పిల్లకాలవలోనూ లోతు ఉంటుంది. అట్లాగే సముద్రానికీ లోతు ఉంటుంది. అట్లాగే అనుభూతికి కూడా. సామాజిక అవసరాన్ని బట్టి, కవి ప్రతిభని అనుసరించి, ప్రయోజనాన్ని ఉద్దేశించి, ఆశ్రయించిన ప్రక్రియని బట్టి అనుభూతి వేర్వేరు దశలను పొందుతుంది. అనుభూతి లోతులను పరిశీలించాలంటే మనం ఆనందదశాది విభాగాలను గమనించాల్సిన అవసరం ఉంటుంది.

జగన్నాథ పండితరాయలు ఆనందాన్ని గురించి తన "రసగంగాధరము"లో చర్చించాడు. 1. లౌకిక సుఖం - అంటే విషయానందం అన్నమాట. ఇది ఆనందాభాసం. అంటే అంతఃకరణ వృత్తులకు విషయ సాంగత్యం వల్ల లభించే సుఖం కనుక ఇది అంతఃకరణ వృత్తి రూపమైంది. 2. కావ్యానందం - దీన్నే రసం అంటారు. రసానందమని వాడుకలో ఉందే కావ్యానందం. దీన్నే మనం ఇప్పుడు అత్మానందం అని అలంకారికశాస్త్రాల్లో చెప్పుకుంటున్నాం. ఇది సోపాధికమైంది. విశుద్ధమైన రత్యాద్యుపాధిచే ఉపహితమైన చైతన్యాకారాకరితమైన చిత్తవృత్తి. 3. బ్రహ్మానందం - దీన్నే ఆత్మానందం అంటారు. ఇది విశుద్ధమైంది. నిరుపాధికమైంది. అఖండమైంది. అన్యజ్ఞ్హానరహితమైంది. ఈ ఆనంద స్వరూపాన్ని గురించి మనం సంపూర్ణంగా చర్చించుకోవాలి. రసం ఆనందానుభావాన్ని మనకు అందిస్తున్నది. ఈ బ్రహ్మానంద సహోదరమైన రసస్వరూపం అనుభూతికి నిలయమైంది. బ్రహ్మానందం ఎంత లోతో అనుభూతి అంతలోతైంది. సర్వకాలాలకీ, కవులందరికీ, అన్ని రచనలకీ సంబంధించిన అనుభూతిని గురించి మనం సవివరంగా తెలుసుకోవాలంటే ఆనందస్వరూపం గురించి తెలుసుకోవడం తప్పనిసరి.

ఉపనిషత్తుల్లో బ్రహ్మతత్వాన్ని గురించి, ఆత్మతత్త్వాన్ని గురించి, దేహతత్త్వాన్ని గురించి, ప్రపంచ స్వరూపాన్ని గురించి, జీవస్వరూపాన్ని గురించి, పంచభూతాల స్థూల సూక్ష్మ రూపాన్ని గురించి, మరణాన్ని గురించి, మరణానంతర స్థితిని గురించి, మోక్షస్వరూపాలని గురించి చెప్పడం కనిపిస్తుంది.

ప్రతి మనిషిలోనూ బ్రహ్మ నిహితమై ఉంటుంది. నిహితమై ఉన్న బ్రహ్మ పంచకోశాలతో ఆవరించుకొని ఉంటుంది. అన్నమయాది పంచకోశాలు ఆత్మను ఆచ్ఛాధించి ఉండటం వల్ల ఆత్మ స్వప్రకాశం కాదు. 

"కోశైరన్నమయాద్యైః పంచభిరాత్మానసంవృతో భాతి,
నిజశక్తి సముత్పన్నైః శైవలపటలై రివాంబు వాపీస్థమ్

(తా. దిగుడు బావియందు గల నీటివలన చెరిగిన నాచు నీటిని ఎటుల మాటుపఱచునో యటులనే, ఆత్మశక్తివలన (అవిద్యచే) నుత్పన్నమైన అన్నమయాది పంచకోశములు ఆత్మను లెస్సగ నాచ్ఛాదించుటవలన ఆత్మ ప్రకాశింపకున్నది)"4

- సశేషం

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)