కవితా స్రవంతి
ఇంకో అర్ధరాత్రినడిగితే
- డా||జె.రత్నప్రభాకర్

అప్పుడప్పుడే
తెల్లోడు బిగించిన దాస్యపు సంకెళ్ళను

ఒక అర్ధరాత్రి తెంచేసిందట
ఇప్పటికి అవి నల్లనోటులై బకింగ్హోమ్ కాల్వలో
తేలుతూపోతున్నాయి.

ఎవడికి తెలుసు
తాడిచెట్టు క్రింద తెల్లపాలు చందాన
మూణ్ణెల్ల క్రిందటే మ్రోగిన గుజరాతల నగారా
నల్ల ద్రవ్యపు ప్రవాహగమనాన్ని మార్చేసిందేమో!

అయినా
చట్టం సుత్తితో మోదిన అక్రమ బెల్లంముక్కల్ని
ఎప్పటికైనా మోసుకుపోవచ్చునని కాబోలు
బాంకుల ముందు బారులు తీరిన చీమలు
విసుక్కుంటునే లొట్ట్లలేస్తున్నాయ్!

కొంపతీసి
కుబేరుల విల్లాల్లో గాంధీ కట్టలకు సెల్యూట్ కొట్టి
గుడిసెల్లోని లక్ష్మీదేవి ఫోటోలను అరెస్ట్ చేస్తేరేమో!
ఎందుకంటే
నలుపు తెలుపుల ఆర్ధిక చదరంగంలో
ఆడేటోళ్ళు ఎప్పుడూ వాళ్ళే
ఓడేటోళ్ళు ఈ ప్రజాపావులే

అందుకేనా
అనువు కాని వేళ అర్ధ శస్త్ర విన్యాస విస్ఫోటనానికి
కుప్ప కూలుతున్నది మధ్యతరగతి గుండెలే
కుదేలవుతున్నవి గరీబు మార్కెట్లోని గంజి బ్రతుకులే!

ఏమో!
ముక్కు పచ్చలారని విప్లవాన్ని మట్టుపెట్టకముందే
రద్దు ఫిరంగి మ్రోగించివుంటే
సప్తదశాబ్దాలుగా సాగుతోన్న శ్రమ దోపిడీలను ప్రశ్నించే
మందుపాతర్లు కొంతవరకైనా చల్లబడేవేమో! కదా?.

అక్కడెవడో
వర్చువల్ విలువలు సామాజిక మధ్యమాలలో లైక్ లు కొట్టించునట్లు
రెండువేలూ చూపిస్తూ చంకలు గుద్దుకుంటూనే ఉన్నాడు
నలుగురిలో పూడ్చబడడానికైనా నలభైమైళ్ళుగా
భుజయాత్రలు చేస్తున్న దరిద్రుల శవాల కన్నీటివాసన
వాడికి సోకడంలేదా?

ఇప్పుడు కూడా
దీర్ఘ సుషుప్తిలో పురిటి నొప్పులు పడుతూ పడుతూ
కులరహిత సమాజం కోసం కలలు కనడం...మేలా?
కులం పునాదుల్ని కూల్చేందుకు ఎన్నెన్ని సర్జికల్ దాడులు చేయాలో
ఇంకో అర్ధరాత్రి నడిగితే పోలా!


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)