శీర్షికలు
పద్యం - హృద్యం
- పుల్లెల శ్యామసుందర్

ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.

మాసం ప్రశ్న:
సమస్య " నీటి పైన వ్రాత నిలిచెను గద" (శ్రీ K.N.వరప్రసాదు, ఏలూరు, గారు పంపినది)

తమాసం ప్రశ్న:
చదవని వాడె పండితుడు సంపదగల్గిన వాడె బీదయౌ

ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.

డా.చింతలపాటి  మురళీ కృష్ణ , బ్రిజ్బేన్ , ఆస్ట్రేలియా

అదనుకు తగ్గరీతిగ పదార్ధములన్నియు మారుచుండు-పై
పదవిని నున్నవాడు తనవారికి వడ్డన జేయనెంచినన్
కొదవది యుండబోదు-యనుకూల ఫలంబు నొసంగ నెంచినన్
చదవనివాదె పండితుడు సంపదగల్గినవాడె పేదయౌ !

రాజేశ్వరి నేదునూరి, న్యూజెర్సీ

చదవక యున్ననేమి భవసాగర మందున బాధ్యతల్ గనన్
విధికెదు రీది నిల్చియు వివేకము నందున బుద్ధి క్లేశమున్
కుదిరిక నుండి దైవము నుకోరుచు లోకపు శాంతి భద్రతల్
చదవని వాడె పండితుడు సంపదగల్గిన వాడె బీదయౌ

పోచిరాజు కామేశ్వర రావు, రాయిపూర్

సదమల బుద్ధి భూతదయ శాంతము దాంతము గల్గి యుండినం
జదవని వాడె పండితుడు, సంపద గల్గిన వాడె బీదయౌ
మద ఘనలోభ మోహయుత మత్సర కామ విలోలతాత్ముడై
యుదరభరార్థ తప్త హృద యోద్విజమాన జనద్విషుం డవన్

వారణాసి సూర్యకుమారి, మచిలీపట్నం

వదలక కార్యసాధనకు వారెటువంటి పథమ్ము నైననూ
అదనుకు పొందు లాభము న కాశ గ చెప్పుచు మాయమాటలన్
మదిని మథించి గెల్వగల మానవు డౌను మనీషి నేడిలన్
చదువని వాడె పండితుడు సంపద కల్గిన వాడె బీద యో

"కళాగౌతమి" బులుసు వేంకటసత్యనారాయణమూర్తి,రాజమహేన్ద్రవరం

ఎదను తలంచుచున్ జనన మిద్ధర శాశ్వత మేమి కాదనీ
ముదముగ మోక్ష మార్గమును మోహము లేకను కోరుకొన్న యా
చదువనివాఁడె పండితుడు, సంపద గల్గినవాడె బీదఔ
నెదిరికి కొంచెమైన నిడ కెన్నడు తానును భోగ మందకన్

గండికోట విశ్వనాధం, హైదరాబాదు

ముదిరిన మొండి వాదనల ముందర సభ్యత శూ న్య వాటికన్‌
వదలని ఆశ లంపట అవాంఛిత మోసపు క్రీడ వాడలన్‌
వదరెడి వ్యంగ వాక్కుల వివాద విచిత్ర వినోద వేదికన్‌
చదవని వాడె పండితుడు సంపద కల్గిన వాడె బీదయౌ.

 

 

 

 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)