నాట్యరంజని
యామిని - కూచిపూడి నృత్యభామిని, విశ్వమోహిని
- టి. ఉడయవర్లు

దేశంలో శాస్త్రీయ నృత్యాలు ఎందరో చేయగలరు. కాని ఆమెలోని ఆ ఆవేశం, అభినివేశం అందరిలో లేవు. చక్కని కనుముక్కు తీరు ఎందరికో ఉండగలదు. కాని ఆమెలాగ కళలకు, కలలకు అవి భాష్యాలు పలికించలేవు, ఆనందభాష్పాలు రాల్పించలేవు. బోలెడంతమంది పదచాలనంలో ఎంతైనా వేగం ప్రదర్శించగలరు. కాని ఆమెలాగా భావవేగానికి అనుగుణమైన అభినయముద్రలు పడుతూ, లయగర్భితంగా కదిలే సుందరశిల్పంలాగా విన్యాసవేగాన్ని ప్రదర్శించలేరు. కేవలం సృజనాత్మకశక్తికి పదునుపెట్టి కొందరు వైవిధ్యం గల నృత్యాల రుచి చూపించగలరు. కాని ఆమె నృత్యంలోలాగా ఒక మధుర తుషారంలో తలమునకలై మల్లెల వాసనలలో అసాంతం తడిసిన అనుభూతి కలిగించలేరు.

ఈ విశేషాలన్నింటినీ తన నృత్య విధానంలో ప్రతిఫలింపచేసే వారెవరు? ఇంకెవరు? ఆమె సమగ్ర నృత్యమూర్తి - యామినీ కృష్ణమూర్తి. ఈమె ప్రతిభకు గుర్తింపుగా 1968 లోనే "పద్మశ్రీ" అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసింది. మూడు దశాబ్దాలు దాటిన తర్వాత 2000 సంవత్సరంలో ఆమెకు పద్మభూషణ్ అందచేశారు.

తన నృత్య ప్రదర్శనలు చూడవచ్చిన ప్రేక్షకులను మంత్రముగ్ఢులను చేసి, వారి హృదయాలపై "యామినీ ముద్ర" వేసే యామినీ కృష్ణమూర్తి కూచిపూడి బాణీ నృత్యంలో ఆమెకు ఆమే సాటి. అనంతరకాలంలో ఆమె భరతనాట్యంలోను బాగా ప్రావీణ్యం సాధించారు. ఒడిస్సీ నృత్యాన్ని కూడా ఒంటపట్టించుకున్నారు.

వివిధ రకాల నృత్యాలను హేమాహేమీలైన గురువుల వద్ద ఎంత నేర్చుకున్నా, యామిని తన కళతో ప్రేక్షకులను నిలవేసి "ఇది నా ఒరవడి" అని చాటే ఒకానొక విశిష్ట బాణీ నృత్యాన్ని ప్రదర్శిస్తుంది. ఆమె ఏ బాణీ నృత్యం చేసినా వివిధ నృత్య రీతులను కలగాపులగం చేయకుండా ఆయా నృత్య సంప్రదాయాల పరిధిలోనే తన వ్యక్తిత్వాన్ని అభివ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా ఆమె నయనాలు భావస్ఫూర్తికి నిలయాలు.

"విశ్వమోహిని" అని ఆమెను ఎందుకు అంటామంటే అలనాడు 1961 లో "ఇదిగో విశ్వమోహిని, ఇదియే లావణ్యమోహిని, చెదరి పయ్యెద చెరకు జారించుచు యెదపై అలవోక అలకోక నొత్తుచు.." అని ఆడిపాడిన యామిని - భావకవి కృష్ణశాస్త్రి ఊహించిన విశ్వమోహినిని ఇట్టే రంగస్థలంపై ఆవిష్కరించినందుకు!!

"క్షీరసాగరమధన"మనే నృత్యరూపకాన్ని కృష్ణశాస్త్రి ఆకాశవాణి కోసం రాశారు. కాని దాన్ని కూచిపూడి సిద్ధేంద్ర కళాక్షేత్రం లో ప్రసిద్ధ, నాట్యాచార్యులు - చింతా కృష్ణమూర్తి ప్రిన్సిపల్ గా ఉన్న రోజుల్లో అక్కడ ప్రదర్శించకోరి ఈ రూపకానికి నృత్యం కూర్చవలసిందిగా ప్రఖ్యాత నర్తకుడు, నాట్యాచార్యులు వెంపటి చినసత్యంకు అప్పగించారు. అప్పుడు ఆయన నేతృత్వంలో మొట్టమొదట ప్రదర్శించిన "క్షీరసాగరమథనం" లో యామినీ కృష్ణమూర్తి విశ్వమోహిని పాత్రలో, ధన్వంతరి, మహావిష్ణువు పాత్రల్లో వేదాంతం సత్యనారాయణశర్మ ఒదిగిపోవడం ఆ నాటి ప్రదర్శన చూసిన వారికి ఈ నాటికీ కళ్ళలో తిరుగుతుంది.

"క్షీరసాగరమథనం" లో చిందిన అమృతం అసలు కథ ఏమంటే - దేవదానవుల మధ్య చెలరేగిన యుద్ధంలో దేవతలు ఓడిపోవడం జర్గుతున్నదని దేవతల పక్షాన ఇంద్రుడు శ్రీ మహావిష్ణువుకు నివేదించగా, దానవుల సహాయసహకారాలను అర్ధించి అమృతాన్ని సాధించవలసిందిగా సలహా పొందుతారు. విష్ణువు వివరించినట్లుగానే పాలసముద్రంలో మందరగిరిని వేసి, వాసుకిని తాడుగా చేసుకుని దేవదానవులు కలిసి చెరొక వైపున తాడు పట్టుకుని సముద్రాన్ని చిలికి అమృతాన్ని సాధిస్తారు. ఆ అమృతపానంతో దేవతల కష్టాలు, కడగండ్లు అంతమవుతాయని చెప్పిన మహావిష్ణువే మోహినీ రూపంలో వచ్చి అమృతభాండాన్ని గైకొని తొలుత దేవతలకు అమృతంతో పంచిన తర్వాత మందబుద్ధులైన రాక్షసులు అమృతాన్ని మోహిని పంపిణీ చేస్తున్న తీరులోని కిటుకు గ్రహిస్తారు. అప్పటికి ఆ విశ్వమోహిని మహావిష్ణువై తన విశ్వరూపాన్ని సాక్షాత్కరింపచేయడంతో నృత్యరూపకం ముగుస్తుంది.

ఈ రూపక రచనలోని కవితాత్మతో కొంత, మోహిని మోహన నర్గనంతో మరి కొంత, ఆ నాటి ప్రేక్షకులు మధువు గ్రోలిన మధుపముల వలె మత్తెక్కిపోయారు. అందుకే అప్పటి నుంచీ నృత్యభామిని "యామిని" విశ్వమోహినిగా ప్రసిద్ధికెక్కింది.

ఇంతే కాదు, ఆమె "భామాకలాపం" లో సత్యభామగా అవతరించే వైఖరి, "మండూక శబ్దం" లో కృష్ణదేవరాయల ప్రశస్తిని లీలగా చూపే అభినయం, భంగిమల్లోని ఠీవి, ఔచిత్యం ఆమె ప్రతిభావ్యుత్పత్తులకు మచ్చుతునకలు. "సింహాసనస్థితే" శ్లోకంలో దేవిని కళ్ళకు కట్టిస్తూ పట్టే భంగిమలు ఆమె ప్రత్యేకతకు ఆనవాళ్ళు. అలగే "కృష్ణశబ్దం" లో ప్రదర్శనలో ఆమె చూపే భావతీవ్రత, లాలిత్యం, వైవిధ్యం మరపురానివి. వేదాలకు కొన్ని పసందైన జతులతో ఆమె కూర్చిన నృత్యం ఆమె పాండిత్యానికి దర్పణం.

అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడి నర్త్గనానికి ఖ్యాతి రావడానికి అర్ధశతాబ్దం క్రితం ఆమె అమెరికా, యూరప్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, బ్యాంకాక్, సింగపూర్, బర్మా ఇత్యాది ఎన్నోదేశాలు పర్యటించి ఆయా చోట్ల నృత్య ప్రదర్శనలిచ్చి, మన నాట్య ప్రచారం చేయడం జరిగింది. ఆయా దేశాల్లోని మహానగరాల్లో ఆమె ప్రదర్శించే నృత్యాంశాలను ముందుగానే ప్రేక్షకులకు ఇంగ్లీషులో విడమరిచి చెప్పిన తర్వాత నర్తించడం వల్ల, ప్రేక్షకులకు అనుభూతి తీరాలకు వెళ్ళిన వైనం వారి నయనాల్లో ప్రతిఫలించలేదని, అది తననెంతగానో కదలించివేసేదని యామినీ కృష్ణమూర్తి ఒక ఇష్టాగోష్టిలో చెప్పింది.

పూర్వం ఊరూరా సంచారం చేస్తూ కూచిపూడి నర్తకులు ప్రదర్శ్నలిచ్చేవారు. పాదుషాల కాలంలో భద్రత తక్కువ. అందుచేత స్త్రీలను వారి వెంట తీసుకెళ్ళేవారు కాదు. ఫలితంగా యక్షగాన ప్రదర్శనల్లో స్త్రీల వేషాలను విధిగా పురుషులే వేసేవారు. అంతేకాని స్త్రీలు స్త్రీల వేషాలు కూచిపూడి బాణీ నృత్యంలో వేయకూడదనేది సరైన వాదం కాదు. ఎందుకంటే కూచిపూడి నృత్యరూపకర్త సిద్ధేంద్రయోగి కన్నా ముందు క్రీస్తు శకం 14 వ శతాబ్దానికి ముందు దేవదాసీలైన స్త్రీలు నర్తించేవారని చరిత్ర చెబుతున్నది. అయితే వారు నైతికంగా పతనం కావడం వల్ల నృత్యం పట్ల చులకనభావం ఏర్పడింది. ఆ మచ్చను తొలగించి, కూచిపూడి నృత్యానికి పూర్వవైభవం కల్పించడానికి సిద్ధేంద్రయోగి పురుషులకే ఈ నృత్యవిశేషాన్ని పరిమితం చేశాడు. కృష్ణాజిల్లా విజయవాడ సమీపంలోని కూచిపూడి గ్రామంలో బ్రాహ్మణ బాలురంతా ఆజన్మాంతం ఈ కళాసేవకే అంకితమయ్యేటట్టుగా ప్రమాణం చేయించాడు. కలాప ప్రక్రియగా కూచిపూడి నాట్యాన్ని తీర్చిదిద్ది వారందరికీ నేర్పించాడు.

అయితే అనంతరకాలంలో కూచిపూడి నాట్యాన్ని ఈ నాటి అవసరాలకు తగిన విధంగా ఏకపాత్రకేళికగా నాట్యశాస్త్రబద్ధంగా వేదాంతం లక్ష్మీనారాయణశాస్త్రి రూపొందించారు. అంతే కాదు, వీరే కూచిపూడి నృత్యాన్ని తిరిగి స్త్రీలకు నేర్పించే సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.

వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి మదరాసులోని గాంధీనగర్ లో ఉండే ఒక జమీందారు కూతురుకు సుమారు ఏడు దశాబ్దాల క్రితం కూచిపూడి నృత్యం నేర్పేవారు. ఆ అమ్మాయి యామినికి స్నేహితురాలు కావడం వల్ల అనుకోకుండా ఆయనను వారింట్లో చూసిందట. ఏడేండ్ల ప్రాయంలోనే "చిదంబరం" శిల్పాల నృత్యభంగిమలు చూసి ఎంతగానో ప్రభావితురాలైన యామిని, తన స్నేహితురాలు నేర్చుకుంటున్న నృత్యాన్ని ఎంతో మక్కువతో చూసేదట. అది గమనించిన లక్ష్మీనారాయణ శాస్త్రి తన శిష్యురాలి వద్ద యామిని చిరునామా కనుక్కుని నేరుగా ఒక రోజు ఆమె ఇంటికి వచ్చారట. అప్పటికి కూచిపూడి నృత్య ప్రాశస్త్ర్యం యామినికి ఏ మాత్రం తెలియదు. కాని, తెలుగుభాషలో పండితుడైన ఆమె తండ్రి మంగరి కృష్ణమూర్తి, లక్ష్మీనారాయణశాస్త్రి ఇంటిపేరు "వేదాంతం" చూసి, వారు అసలు సిసలు కూచిపూడి నర్తన కుటుంబంవారని తెలుసుకున్నారు. అప్పటికి 1939 లో గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో "రైతుబిడ్డ" సినిమాలో వేదాంతం రాఘవయ్య చేసిన "దశావతార" నృత్యం చూసి ముగ్ధులయ్యారు. ఆ నృత్యాన్ని యామినికి నేర్పించాలనే కోరిక ఆయనకు కలిగింది. దాని వల్ల వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి యామిని చిరునామా కనుక్కుని ఇంటికి వచ్చిననాడే, దశావతార శబ్దంతో నృత్యాభ్యాసం ప్రారంభించింది. తొలుత ఒక్కొక్క అవతారాన్ని లక్ష్మీనారాయణ శాస్త్రి అభినయించి చూపగా, ఆ వెంటనే గురువు చెప్పిన పాఠాన్ని భావాత్మకంగా అభినయించి యామిని అప్పగించిందట. ఇలా ప్రారంభమైన యామిని కూచిపూడి నృత్యాభ్యాసం, ఆ తర్వాతి కాలంలో పసుమర్తి వేణుగోపాలకృష్ణ శర్మ ను మద్రాసుకు ఆహ్వానించి కొంతకాలం మరెన్నో అంశాలు అభ్యసించింది. ఆ తర్వాత కొంత కాలం చింతా కృష్ణమూర్తి వద్ద కూడా యామిని నృత్యం నేర్చుకున్నది. వేలాది నృత్య ప్రదర్శనలిచ్చింది.

కూచిపూడి నృత్యంతో పాటుగా యామిని మైలాపూర్ లో గౌరి అమ్మ వద్ద, పిదప కళాక్షేత్రంలో రుక్మిణీ అరండేల్ చెంత నాలుగేండ్ల భరతనాట్యం కోర్సు పూర్తి చేశారు. అనంతరం ఎల్లప్ప పిళ్ళ, చొక్కలింగం పిళ్ళే వద్ద, బాల సరస్వతి వద్ద భరతనాట్యంలోని మెలకువలు నేర్చుకున్నారు. నవచరణ్ దాస్ వద్ద ఒడిస్సీ బాణీనృత్యం అభ్యసించారు. ఆమెకు ఇరవై ఏండ్లు వచ్చేనాటికి యామిని ఒక ప్రతిభాసామర్ధ్యాలు గల నర్తకిగా గుర్తింపు పొందారు. ఆ క్రమంలో మకాంను న్యూఢిల్లీకి మార్చుకుని దేశంలోని వివిధ నగరాల్లో, విదేశాల్లో ప్రదర్శనలివ్వడం ప్రారంభించారు.

1958లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఏర్పాటైన తర్వాత వారు నిర్వహించిన ప్రత్యేక సదస్సులో భారతీయ శాస్త్రీయ నృత్యాలమ్టే భరతనాట్యం, కథాకళి, కథక్, మణిపురి మాత్రమేనని, కూచిపూడి నృత్యం జానపదమనే తప్పుడు అభిప్రాయం వ్యక్తమైంది. దానివల్ల స్వతంత్ర భారతదేశంలో నిర్వహించే తొలి సైన్స్ మహాసభల్లో తాను ప్రదర్శించాలని కలలు కన్న "దశావతారశబ్దం" కు నిర్వాహకుల అనుమతి లభించలేదు. ఈ సదస్సులో కేవలం భారతీయ శాస్త్రీయ నృత్యాలే ప్రదర్శించాలి తప్ప జానపదాలకు చోటులేదన్నారు. కూచిపూడి నృత్యం జానపదమని త్రోసిపుచ్చుతున్న నిర్వాహకుల వైఖరి యామనిని బాగా గాయపరచింది. బాగా ఆలోచించి అప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ ను కలసి ఆమె విషయం చెప్పింది. అంతే వెంటనే రాధాకృష్ణన్ నిర్వాహకులకు టెలిఫోన్ చేసి, కూచిపూడి నృత్యం జానపద నృత్యమని ఎవరన్నారు, అది శాస్త్రీయ నృత్యం, మానవుని జీవపరిణామ క్రమాన్ని వివరించే "దశావతార" నృత్యం యామిని ప్ర్దదర్శిస్తే దేశవిదేశీయులు చూడవలసిందేనని చెప్పారట. సైన్స్ కాన్ఫరెన్స్ లో యామిని "దశావతార" ప్రదర్శన చేస్తున్నంతసేపూ సర్వేపల్లి రాధాకృష్ణన్, ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, ఆయన ప్రక్కనే ఆసీనులైన ముఖ్య అతిథి ప్రిన్స్ ఫిలిప్ కు, కంఠోపాఠంగా దశావతారశబ్దం పాడుతూ ఇంగ్లీషులో జలచరమైన మత్స్యావతారం నుంచి సంపూర్ణ నరావతారం కల్కి దాకా విడమరిచి చెప్పారుట.

ఆ వెంటనే హైదరాబాదు రాష్ట్ర సంగీత నాటక అకాడెమీ నిర్వాహకులు నృత్యశాస్త్రంలో తలపండిన పండితులను, నర్తకులను రప్పించి, సదస్సు నిర్వహించి కూచిపూడి నృత్యం శాస్త్రీయమైనదేనని నిరూపించారు.

అలాంటి కూచిపూడి నృత్యం ఇవ్వాళ వాణిజ్యపరమైనదని ఆమె ఆవేదన పడతారు. సాధన లేకుండానే నాట్యం ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలనే చిట్కా పద్ధతులు పెరిగాయి. నృత్యంలోని మెలకువలు ఏ మాత్రం తెలియనివారు, ఒకటి రెండు అంశాలు నేర్చుకుని వాటిని చిలకల్లా వేదికలపై అప్పజెప్పి డబ్బులు గడించే పద్ధతికి ఆమె వ్యతిరేకం. ఇది మంచి పద్ధతి కాదు, డబ్బులు సంపాదించకూడదని కాదు కాని, డబ్బు సంపాదనే నాట్యం పరమావధిగా వ్యవహరించడం తగదంటారు. దాని వల్లనే వర్ధమాన నర్తకుల్లో నిర్మలత నశిస్తుందని, కళాత్మకత చెదరిపోతుందని ఆమె అభిప్రాయం. నృత్యంలో చవకబారు చేష్టలను చేర్చి ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తాలింపు వేసే ప్రక్రియ ఎంత మాత్రం మంచిది కాదని ఆమె హెచ్చరిస్తారు. నృత్యం పవిత్రమైన, కళాత్మకమైన, సృజనాత్మకమైన ప్రక్రియ. అది సామాన్యులకు నృత్యజీవితం కూడా ఒక సవాలు వంటిది. రెండు చేతులు, రెండు కాళ్ళు ఆడించే వారంతా నర్తకులు కాలేరు. ఎంత మాత్రం కారు అని ఆమె చెబుతారు.

విదేశీయులు మన నర్తనం, సంగీతాలపట్ల మోజు చూపుతున్నట్టుగానే, మన యువతీయువకులు విదేశీ నర్తనాలు, సంగీతం పట్ల మొగ్గు చూపడంలో తప్పులేదు. అయితే మనవారు వారి నృత్యపద్ధతులు, సాధన, అంకితభావం అలవరచుకోవడం కంటే పాశ్చాత్య జీవన విధానాలనే ఎక్కువగా అనుసరిస్తున్నారు. మనకు అంతటి అంకితభావం అలవరిచేందుకు దోహదం చేసే నృత్య సంస్థలు కూడా లేవు. మరీ ఆంధ్రప్రదేశ్ లో ఈ విషయం పట్ల అసలు పట్టింపులు లేవు. సినిమాలంటేనే ఇక్కడ మోజుపడతారు. ఇతర మాధ్యమం అంతగా ఇష్టపడరు. అయితే గుంటూరు, విజయవాడ ఇత్యాది కొన్ని ప్రాంతాల్లో ఇంకా సంప్రదాయ నృత్యాలు, సంగీతం అంటే కొంత ఆదరణ ఉంది. ఈ కొత్త తరానికి సమయం, వాతావరణం అనుకూలంగా లేవు. కళల పట్ల అహ్బిరుచి పిన్నవయస్సులోనే కలగాలి. దానికి తల్లిదండ్రులు దోహదం చేయాలి. కాని ఆంధ్రులకు సినిమాలన్నా, రాజకీయాలన్నా మిక్కిలి ఇష్టం.

తమిళనాడులో విద్యాబోధనలో భాగంగా సంప్రదాయ సంగీతం, నృత్యం నేర్పుతున్నారు. అలాగే కలకత్తాలో ప్రతి ఇంట్లో పిల్లలు కళల్లో ముఖ్యంగా నృత్యం, సంగీతం లేదా చిత్రలేఖనంలో తర్ఫీదు పొందుతారు. అలా తెలుగువారిలో సైతం కళలంటే మక్కువ పెరగాలంటే ఒక ఉద్యమంలా ఉప్పెనలా పెల్లుబుకిరావాలసి ఉంటుందని యామిని ఎంతో భావోద్రేకంతో చెబుతారు.

కళ అన్నది దైవికమైన అంశం. దానికి ఎంతో ప్రతిభ తోడైతే తప్ప ఈ రంగంలో రాణించడం కష్టం అంటారు. నృత్యకళ పట్ల జనసామాన్యంలో అవగాహన కలిగించడానికి అభిరుచి పెంచడానికి సుమారు మూడేండ్ల పాటు పరిశోధన చేసి "నృత్యమూర్తి" సీరియల్ ను పదమూడు భాగాలుగా రెండు దశాబ్దాల క్రితమే యామిని రూపొందించి దూరదర్శన్ లో ప్రసారం చేశారు. మన సంస్కృతీ వైభవానికి గోపురమై నర్తనశిల్పాల ఆధారంగా, స్థలపురాణాలు, చరిత్ర జోడించి వ్యాఘ్రపాద, పతంజలి సూక్తులు, కర్ణాటక సంగీతం రుచిచూపిస్తూ ఈ సీరియల్ లో ఆమె స్టూల్ మీద ఏనుగు కవాతు చేసిన విధంగా నృత్య సర్వస్వాన్ని ఇమిడ్చారు.

మీరే నృత్యకల్పన చేసిన నాట్యశాస్త్రాన్ని కొలబద్ధగా స్వీకరిస్తారా? మీరు ప్రదర్శించిన నృత్యాంశాలన్నీ మీరు నృత్యకల్పన చేసినవేనా? అని ప్రశ్నిస్తే - నాట్యశాస్త్రమే తనకు కొలబద్ధ అన్నారు. నిరంతర సాధన కారణంగా నాట్యశాస్త్రం ఆమె ఒంట పట్టించుకున్నారు. ఆమె ఏ అంశంపై నృత్యకల్పన చేసినా నాట్యశాస్త్రమనే చట్రాన్ని అతిక్రమించి వెళ్ళరు. అయితే సృజనాత్మకంగా, సాధ్య్తమైనంత సులభంగా ఉండాలని మాత్రం కృషి చేస్తారు. ఆమె ప్రదర్శించే, శిష్యులకు నేర్పించే నృత్యాంశాలన్నీ యామినీ ముద్రగలవే.

నృత్యం తనకొక వరమనీ, నర్తించడం తనకు వ్యసనమని ఆమె అంటారు. లోగడలాగా ఇవ్వాళ రంగస్థాలాలపై ఆమె నృత్యప్రదర్శనలు లేకపోయినా న్యూఢిల్లీలో ఆమె నెలకొల్పిన నృత్యశిక్షణ సంస్థ "నృత్యకౌస్తుభ" లో విద్యార్ధులకు నేర్పించడానికైనా రోజూ యామిని ప్రదర్శించి చూపుతున్నారు. యామిని జీవితం సమస్తం ఈ నృత్య ప్రచారానికే అంకితం చేశారు. దేశదేశాలలో భారతీయ నృత్యభారతి అందెల రవళి సదా ప్రతిధ్వనించేట్టు చేయాలన్నదే తన ఆశయంగా యమినీ కృష్ణమూర్తి పేర్కొంటారు.

నాట్యరంగంలో ఇంత అనుభవం సాధించినా వీరు ఇవ్వాళ యువనర్తకులకు ఇచ్చే సూచలనేమిటి? అని అడిగితే"నాట్య రంగంలో ఎందరో వస్తుంటారు, పోతుంటారు. అది ప్రవాహం లాంటిది. సత్తా ఉన్నవారు మీదుమిక్కిలి. సహృదయత గల తల్లిదండ్రులు లేదా భర్త మద్దతు ఉన్నవారు మాత్రమే ఇక్కడ ఈ రంగంలో నిలుస్తారు. నర్తకికి అందమైన ముఖం కన్నా భావాలు పలికించే ముఖం, కళ్ళూ అత్యవసరం.

అయితే అట్టివారు ఎంతగానో సాధన చేసి, కష్టపడి పైకి వస్తేనే వారు పదికాలాలపాటు మనగలరు. ఏదో అడ్డదారుల గుండా, రాత్రికిరాత్రే పైకి రావాలనీ, ఇచ్చిన నాలుగైదు ప్రదర్శనలకే నవరసాలు మెప్పించే నర్తకి అయిపోయినట్లు భావించడం తగ"దని అంటారు. "నేడు పుట్టిన నర్తకికి సమయం చాలడం లేదు. ఈ నర్తకి కేవలం నాట్యానికే పరిమితం కాకుండా అన్నింట్లో తలదూర్చుతున్నది. అందుచేత నాట్యశాస్త్రంలోని సూక్ష్మమైన అనేకాంశాలను నేర్చుకోవడానికి అంతగా ఆసక్తి కూడా ప్రదర్శించడం లేదు. ఏ రంగంలోనైనా దాదాపు పరిపూర్ణత లభించాలంటే ఎక్కువ సమయం కావాలి. ఎంతో సాధన కావాలి. వాటిని దృష్టిలో పెట్టుకుని కృషిచేయ" మంటారు యామినీ కృష్ణమూర్తి.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)