సారస్వతం
అన్నమయ్య శృంగార నీరాజనం
- టేకుమళ్ళ వెంకటప్పయ్య

దేవదేవుని గుణ నామ మహిమలను కీర్తిస్తూ ఆత్మ, పరమాత్మల సంబంధాలతో కీర్తిస్తూ రచించినవి "ఆధ్యాత్మిక కీర్తనలు" కాగా, వూహలతో కల్పించుకొని, చెలిగా, నాయకునిగా, నాయికగా భావించి తత్సంబంధంతో సేవిస్తూ కీర్తించేవి "శృంగార కీర్తనలు". సేవాసక్తి చనువుతో సఖ్యాసక్తి, తదనుగుణంగా వాత్సల్యాసక్తి తో గూడినవై, కాంతాసక్తిని బయల్పరుస్తాయి. కాంతాసక్తి అనగానే దాంపత్యధర్మాలు బహిర్గతమవుతాయి. అవి సేవ, సఖ్యం, వాత్సల్యం మేలు కలబోతగా సాక్షాత్కరిస్తాయి. "తదర్పితాఖిల చారస్సన్ కామ క్రోధమానాధికం తస్మిన్నేవ కరణీయం" అని నారద భక్తి సూత్రాలలో చెప్పబడింది. అంటే పరమాత్మునికే సర్వమూ అర్పించి, కామ,క్రోధ అభిమానాదులన్నీ ఆ భగవంతుని యందే వుండాలని చెప్పాడు. గోదాదేవి, నందవ్రజ గోపికా బృందం, తరించిన రీతిలో అన్నమయ్య అన్నీ ఆ యేడుకొండలవానికే సమర్పణ చేశాడు. దాసాను దాసునిగా సేవిస్తానని సెలవిచ్చాడు.

అతను వర్ణించిన నాయికలలో “పరకీయ” లేక అన్యోఢ లేక అన్య ను గురించిన విశేషాలు విందాం. సాహిత్య దర్పణము లో అన్య ను గూర్చి "యాత్రాది నిరతన్యోఢా కులటా గళితత్రపా" అన్నారు. అలంకార శాస్త్రాలలో యేదో నెపముతో అటునిటు తిరుగుట, కిటికీలనుండి తొంగి చూచుట మొదలైన పనులను చేసే స్త్రీగా వర్ణిస్తారు పరకీయను. అన్నమయ్యకు శాస్త్రం అన్న తర్వాత అన్ని తరహాల నాయికలనూ వర్ణించవలసిన అవసరం ఉంది గనుక వారి గుణగణాలతో సంబంధంలేకుండా ప్రతినాయికనూ, ఎక్కడా దేవదేవేరులకు అపకీర్తి రాకుండా నిలిపిన తీరు అద్భుతం. ఈ కీర్తనలో ఓ పరకీయ స్వామితో పలికే పలుకులు విందాం. ఆ లోక సుందరునే మదినంతా నింపుకున్న ప్రణయనాయిక స్వామితో ఇలా అంటోంది.

కీర్తన:
పల్లవి: అంతచక్కనివాడవు అన్నిటా జాణవు నీవు
సంతోసాన నుప్పంగీ సారెకు నామనసు

చ.1. సొలసి నిన్నొకమారు పూచి తప్పక చూచితే
వలవక వుండుదురా వనితలు
నిలువున నెప్పుడైనా నీరూపు దలచుకొంటే
వులివచ్చి చెమటల నోలలాడకుందురా || అంతచక్క||

చ.2. సముకాన నీతోను సంగాతాలు సేసితే
తమకించకుండుదురా తరుణులు
జమళి మేనులు సోక సరసము లాడితేను
మమతల నిన్ను నిట్టె మరగక వుండుదురా || అంతచక్క||

చ.3. యీడుజోడై నిన్నుగూడి యెడవాయ కుండితే
వేడుక జొక్కకుందురా వెలదులు
యీడనే శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
యేడవారూ నీపొందుల కేకరకవుందురా || అంతచక్క||

(రాగం: సాళంగం; శృం.సం.సం 28; రాగి రేకు 1826; కీ.సం.146)

విశ్లేషణ:
ఈ కీర్తనలో శ్రీవేంకటేశ్వరుడు నాయకుడు, నాయిక పరకీయ. నాయకుని గూర్చి మాట్లాడుతూ "స్వామీ వారు నిన్నొక్క సారి చూస్తేనే చాలు, మీ మనోహరరూపం దర్శించగానే వారు తమకించి పోతారు అంటూ స్వామి శృంగారాదులను వివరించి చెప్పడం విశేషం.

పల్లవి: అంతచక్కనివాడవు అన్నిటా జాణవు నీవు
సంతోసాన నుప్పంగీ సారెకు నామనసు

స్వామీ! ఎంత ముగ్ధమనోహర రూపం మీది. పైగా అన్నింటా నేర్పరివి, రసికుడవు. నిన్ను చూస్తే చాలు నాకు మళ్ళీ మళ్ళీ సర్వదా మనసు ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఈ వాక్యాన్నే మనం ఆధ్యాత్మిక కోణంలో దర్శించితే "శ్రీవేంకటేశ్వరా! నీ దివ్యసుందర రూపం చూసి యెందరు ఋషులు, మునులు తరించలేదు. నీ రూపు మాకు ఎప్పటికీ ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు" అని కూడా తీసుకోవచ్చు.

చ.1: సొలసి నిన్నొకమారు పూచి తప్పక చూచితే
వలవక వుండుదురా వనితలు
నిలువున నెప్పుడైనా నీరూపు దలచుకొంటే
వులివచ్చి చెమటల నోలలాడకుందురా

స్వామీ! అతిశయంతో మిమ్ములను ఒక్కసారి దరిజేరి చూసినట్లయితే నిన్ను వనితలు ప్రేమించక విడిచిపెడతారా? ఏ స్త్రీ అయినా నీ రూపు ఒక్కసారి తలుచుకుంటే చాలు. మన్మధ తాపంతో వెంటనే మేని చమటలతో తడిసి పులకించకుండా ఉంటారా? అని పరకీయ ప్రశ్నిస్తోంది స్వామిని. అలాంటి మన్మధ స్వరూపం మీది అని ద్వాపరయుగంలోని రాధను, గొల్లెతలను కూడా గుర్తుకు తెస్తున్నది నాయిక.

చ.2: సముకాన నీతోను సంగాతాలు సేసితే
తమకించకుండుదురా తరుణులు
జమళి మేనులు సోక సరసము లాడితేను
మమతల నిన్ను నిట్టె మరగక వుండుదురా

స్వామీ! దివ్యమనోహరా! నీ దరిజేరి నీతో చెలిమిజేసినట్లయితే, ఆ తరుణీమణులు త్వరపడి మోహముతో పులకించి పోకుండా ఉండగలరా? ఇక జంట శరీరాలు తాకి సరసాలాడినట్లైతే ఇంకేమైనా ఉందా! ప్రేమమోహాలతో నిన్ను విడిచి పెడతారా? నీతో కూడక యుండగలరా?
చ.3: యీడుజోడై నిన్నుగూడి యెడవాయ కుండితే

వేడుక జొక్కకుందురా వెలదులు
యీడనే శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
యేడవారూ నీపొందుల కేకరకవుందురా

వారు మిమ్ములను ఈడూ జోడుగా దరిజేరి విడిపోకుండా వున్నట్లలైతే, మిక్కిలి పారవశ్యం పొందకుండా వుండగలరా? శ్రీవేంకటేశ్వరా! ఎక్కడివారైనా, ఎవరైనా సరే నీ పొందుకై అపేక్షిస్తూనే ఉంటారు. నన్ను మాత్రం ఇక్కడనే కరుణించావు. చాలు స్వామీ! అని నాయిక ముగించింది.

అన్నమయ్య కాలం నాటి ఎన్నో మాటలు ఈనాడు కనుమరుగయ్యాయి. నిఘంటువులకు సైతం అర్ధాలు దొరకడంలేదు. విజ్ఞులు ఎక్కువ సందర్భానుసరంగా చెప్పడమే కనిపిస్తోంది. ఉలివచ్చి, సంగాతాలు, ఏకరక వంటి పదాలు ఆకోవలోవే. ఉలివచ్చి (ఉలి + పచ్చి) అంటే కొంచెం పచ్చిగా అని. పచ్చిగా అనే మాట దైవపరంగా వాడవచ్చునా అంటే.. సమకాలీన నుడికారాలు అన్నమయ్య వాడడంలో దోషం ఏమీ లేదు. "సాధ్వీనైజ విభుం యధా ప్రాప్నోతి తధా పశుపతే:" అని శంకర భగవత్పాదులవారు శివానందలహరి లో సెలవిచ్చినట్లు ఒక పుణ్య స్త్రీ తన భర్త సాంగత్యాన్ని ఎలా కోరుకుంటుందో అలాగే భక్తుడు భగవత్సాన్నిధ్యాన్ని కోరుకోవడం సహజం. నవవిధ భక్తి మార్గాలన్నీ భగవంతుని చేరడానికే అని భాగవత కర్త సెలవివ్వడం తెలిసినదే కదా!

ముఖ్యమైన అర్ధాలు: జాణ = నేర్పరి, రసికుడు (జాణకాడవు అని పురుషులకు జాణ అని స్త్రీలకు ఉపయోగించడం సముచితం) సారె = మాటి మాటికి; సొలసి = అతిశయించు; ఉలివచ్చి = కొంచెం పచ్చిగా; సంగాతాలు = స్నేహాలు; జమళి = జంట; సోక = తాక; ఎడవాయకుండు = విడిపోక ఉండడం; చొక్కకుందురా = పారవశ్యం, మత్తు, మైకం పొందకుండా ఉంటారా; యేకరక = మిక్కిలి అపేక్షగా.



మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)