ధారావాహికలు
విశ్వామిత్ర 2015 - నవల ( 6వ భాగము )
- యస్ యస్ వి రమణారావు

కుటుంబ విషయాలే దాగని ఈ హైపర్ కమ్యూనికేషన్ ఎరాలో ఏదీ దాచడం, దాగడం కష్టం..స్మార్ట్ సిటీగా రూపు దిద్దుకోనున్న విశాఖ నగరంలో ఒక ఫైవ్ స్టార్ హోటల్ కూలిపోయిందని అది ఆ స్టేట్ హోమ్ మినిస్టర్ దన్న వార్త దేశం మొత్తం పాకిపోయి సంచలనం సృష్టించింది. టివిల్లో జనరల్ పబ్లిక్ తోనూ, ఎక్స్పర్ట్స్ తోనూ ఇంటర్యూలు జరుగుతున్నాయి. మునిసిపల్ కమీషనర్ ఎప్పుడూ చూడనంత సీరియస్ గా, కంటిన్యుయస్ గా టి.వి. చూస్తున్నాడు. ఒక మేల్ ఏంకర్, ఇంకొక ఫీమేల్ ఏంకర్ కూలిపోయిన హోటల్ సైట్ వద్దనుంచి లైవ్ మాట్లాడుతున్నారు.ఫీమేల్ ఏంకర్ గంగ"బ్రేకింగ్ న్యూస్, నగరం నడిబొడ్డులో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ కుప్పకూలింది. అయితే అదృష్టవశాత్తూ మెయింటెనెన్స్ కోసమై హోటల్ గత రెండురోజులుగా క్లోజ్ చేసి ఉంచడం వల్ల ఎటువంటి ప్రాణాపాయమూ సంభవించలేదు. బాంబు ప్రయోగం వల్లనే ఇంత తక్కువ వ్యవధిలో బిల్డింగ్ ను కూల్చడం సాధ్యపడుతుందని నిపుణులు చెప్తున్నారు. కొందరు ఇది ‘టెర్రరిస్ట్ చర్య’ అంటే కొందరు ఇదంతా ‘ఇన్సూరెన్స్’ కోసమని అంటున్నారు. టెర్రరిస్ట్ చర్యే అయి ఉంటుందని ఎక్కువమంది ప్రజలు భయభ్రాంతులౌతున్నారు. అంత పెద్ద హోటల్ ఒక్క పెట్టున కూలిపోవడం ఒక వింత అయితే, అది మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారిది కావడం వల్ల రాజకీయ రంగు సంతరించుకుని ఈ విషయం మరింత శోభాయమానంగా తయారయింది. "కేమెరాతో షూట్ చేస్తున్న మేల్ ఏంకర్ రాంబాబు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. వెంటనే కేమెరా స్విచ్ ఆఫ్ చేసి "హలో "శోభాయమానంగా తయారవ్వడం ఏంటీ, ఇదేమైనా పెళ్ళిసీన్ కవరేజి అనుకుంటున్నావా, బ్లాస్ట్ సీన్ కవరేజి తల్లీ. ఈ సీన్ కి, నీచేతికి కేమెరాయే కరట్టు, ఇంద ఈ కేమెరా తీసుకో ఆ మైక్ ఇలా ఇచ్చెయ్"

"విశాఖ పట్టణ పురప్రజల్లో భయభ్రాంతుల్ని రేకెత్తిస్తూ, భారత్ దేశంలోని ప్రజలందరిని ఆందోళనకు గురిచేస్తున్న ఈ హోటల్ బ్లాస్ట్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. "అంటూ"మీరు చెప్పండి. ఈ బ్లాస్ట్ ఏమైనా టెర్రరిస్ట్ చర్య అని మీరేమైనా అనుకుంటున్నారా?" అక్కడ నిలబడి వున్న ప్రజల్లో ఒక పెద్దాయన దగ్గర మైక్ పెట్టాడు. "ఇదేమీ టెర్రరిస్ట్ చర్య అని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే టెర్రరిస్ట్ ఖాళీ బిల్డింగ్ ఎందుకు కూల్చాలనుకుంటాడు?హోటల్ హోమ్ మినిస్టర్ గారిదంటున్నారు కాబట్టి ఆయనకు నష్టం కలిగించే ఉద్దేశ్యంతో ఎవరైన చేశారనుకోవచ్చు."
"ఎవరో అంటే ఎవరని మీరు ఊహిస్తున్నారు?"

"హోమ్ మినిస్టర్ కాబట్టి, నక్సలైట్లు కావచ్చండి, లేదా..."

"ఫరవాలేదు, ధైర్యంగా చెప్పండి. మేము మిమ్మల్ని ఆధారాలేమీ అడగట్లేదు, కేవలం మీ ఊహ మాత్రమే అడుగుతున్నాం"రాంబాబు ఎంకరేజ్ చేశాడు.

"లోకల్ ఎంపి గారు కావచ్చండి. ఆయనకు, మినిస్టర్ గారికి పడదని ప్రతిరోజూ పేపర్లో వస్తున్న వార్తల బట్టి తెలుస్తూ ఉంటుంది"

"థాంక్యూ సార్. చాలా ధైర్యంగా మీ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. మీడియాలో ఉండి మేమే ఇంత ధైర్యంగా మాట్లాడలేం. కేమెరా లేడీ గంగతో రాంబాబు" అంటూ షో క్లోజ్ చేయబోతుంటే, ఇంకొక వ్యక్తి తను మాట్లాడతానని సైగ చేయడంతో ’ఓకె’ అని అతనికి మైక్ ఇస్తాడు.

"ఏదో జరుగుతోంది. భూకబ్జాల న్యూస్ తో మన సిటీ పేరు, ఆంధ్రరాష్ట్రమంతా మారుమ్రోగిపోతోంది. నాకు తెలిసే గతంలో ఎన్నో బిల్డింగ్ లు కూల్చివేయబడ్డాయి. గుడిసెలు తొలగించబడ్డాయి. కానీ అవేవీ మెయిన్ న్యూస్ లోకి రాలేదు. ఇప్పుడు కూలిపోయింది ఫైవ్ స్టార్ హోటల్ కాబట్టి న్యూస్ లోకి వచ్చింది."

"ఇంతకీ మీరేమంటారు. తొందరగా చెప్పండి."

"అసలు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారమే దీనికంతటికీ కారణమండి. పూర్వకాలంలో అన్ని భూములూ రాజుల అధీనంలో ఉండేవి. ఇప్పుడు ప్రజాస్వామ్యం కాబట్టి ప్రభుత్వ అధీనంలో ఉండాలి. ఎవరైనా స్కూల్ కాని, హాస్పటల్ గాని, ఫాక్టరీ కాని, హోటల్ గాని కట్టాలనుకున్నారనుకోండి. వారి స్థోమత వెరిఫై చేసి ప్రభుత్వం వారికి రెంట్ కి ఇస్తుంది. అందువల్ల ప్రభుత్వానికి ఏడాది పొడుగూతా అద్దెల రూపంలోనూ, పన్నుల రూపంలోనూ ఆదాయం వస్తుంది."

రాంబాబు మధ్యలో ఆపాడు" అయ్యా, మీరు చెప్పిన సిద్ధాంతం పైకి బాగానే కనబడుతున్నప్పటికీ, అందువలన ప్రభుత్వం, రాచరికం అంత బలోపేతమైపోతుందని అది ప్రజాస్వమ్యానికి అంత మంచిది కాదనే వాదం ఉంది, అయినా, ఆ చర్చకు ఈ లైవ్ షోలో సమయం లేదు. మీరు వ్యవస్థను బ్లేమ్ చేస్తున్నారు. వ్యవస్థ, మనుషులు వేరు కాదు కాబట్టి, ఈ బ్లాస్ట్ వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారంటారా?"

ఆ మాటలు విన్న ఆ పబ్లిక్ చాలా ఎప్రిషియేటివ్ గా రాంబాబు వంక చూశాడు

"ఉండొచ్చండి. మనుషుల్ని కాకుండా వ్యవస్థని బ్లేమ్ చేయడంలో ఎవరి ఉద్దేశ్యమైనా ఏంటంటే, కనిపించే క్రిమినల్స్ నే కాకుండా ఆ క్రిమినల్స్ వెనుక ఉన్న బడాబాబులు, వాళ్ళు బడాబాబులుగా తయారవుతూ ఉంటే వ్యవస్థ అంటే మీరు చెప్పినట్టు చుట్టుపక్కనున్న మనుష్యులు చూస్తూ ఉండడానికి గల కారణాలు కూడా తెలుసుకోవాలని, అన్వేషించాలని కోరుకోవడమే"

ఆ మాటలు విన్న రాంబాబు ఆయన వంక చాలా మెచ్చుకోలుగా చూస్తూ

"యథారాజా తథాప్రజ అన్నది పాత సూక్తి, యథాప్రజా తథారాజ అన్నది నేటి ప్రజాస్వామ్య సూక్తి, కాబట్టి జరిగిన ఈ బాంబ్ బ్లాస్ట్ అయినా, జరుగుతున్నా మరి ఏ ఘోరాలకైనా అందరూ లోతుగా అన్వేషించాలని, అప్పుడు మాత్రమే ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని, గాఢమైన, భావగర్భితమైన తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చిన..మీపేరు సార్.."

"రామారావు"చెప్పాడా వ్యక్తి

"రామారావు గారికి టివి 12 కృతజ్ఞతలు తెలియజేసుకుంటోంది, ఏకీభవిస్తోంది. కెమెరా ఉమన్ గంగతో రాంబాబు" అంటూ షో క్లోజ్ చేయబోతుంటే, రామారావ్ అన్న ఆవ్యక్తి "ఒక్క మాట"అంటూ రిక్వెస్ట్ చేశాడు. "ఓకె"అని రాంబాబు, గంగకి సైగ చేస్తూ మైక్ రామారావు దగ్గర పెట్టాడు.

"ఈ బ్లాస్ట్ ఒక అవాంఛనీయ సంఘటన అని మీరంటున్నారు, నేననలేదు. లోతుగా అన్వేషించాలని మాత్రమే నేను అన్నాను"

రాంబాబు కళ్ళు పెద్దవి చేశాడు."అంటే ఇది అవాంఛనీయ సంఘటన కాదని మీరంటారా?"

"అలా అని కూడా నేను అనట్లేదు. లోతుగా అన్వేషణ జరిగిన తర్వాతనే మనం ఒక నిర్థారణకు రాగలం, ఈ బ్లాస్ట్ పైకి కనబడుతున్నట్టుగా నిజంగా ఒక అవాంఛనీయ సంఘటనేనా లేక మరేదైనానా అని."

రాంబాబు కళ్ళు మరింత పెద్దవయ్యాయి. తలతిప్పి గంగ వంక చూశాడు. కెమెరాలోంచి చూస్తూ బలవంతాన నవ్వు ఆపుకుంటోంది గంగ.

"ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంతవరకు ఇది ఒక అవాంఛనీయ సంఘటనగానే ప్రజలందరూ భావిస్తున్నారు. వారితో టివి 12 ఏకీభవిస్తోంది"

షో క్లోజ్ చేశాడు రాంబాబు, కెమెరా స్విచ్ ఆఫ్ చేయమన్నట్టుగా గంగకు సైగ చేశాడు.

"ఈ లైవ్ షో వల్ల బాంబ్ బ్లాస్ట్ ఇన్వెస్టిగేషన్ సంగతెలా ఉన్నా, నీ ఉద్యోగం పోకుండా ఉంటేచాలు" పగలబడి నవ్వింది గంగ

(సశేషం)


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)