జగమంత కుటుంబం
చరిత్ర సృష్టించిన

ఐదవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు దిగ్విజయంగా పరి సమాప్తం
- వంగూరి చిట్టెన్ రాజు

నవంబర్ 5-6, 2016 తేదీలలో సింగపూర్ లో జరిగిన ఐదవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ప్రపంచ వ్యాప్తంగా పది దేశాల నుండి మూడు వందల మంది సాహితీ వేత్తలు, రచయితలు పాల్గొని దిగ్విజయం చేసి తెలుగు సాహిత్య ప్రపంచంలో చరిత్ర సృష్టించారు. భారత దేశం ఎల్లలు దాటి విదేశాలలో ఇంత మంది సాహితీ ప్రియులు తమదే అయిన ఒకే వేదిక పై కలుసుకోవడం ఇదే మొదటి సారి కావడమే దానికి కారణం. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, సింగపూర్ తెలుగు సమాజం ప్రధాన భాగస్వాములుగా, లోక్ నాయక్ ఫౌండేషన్ & మలేసియా తెలుగు సంఘం వారి సంయుక్త నిర్వహణలో ఈ సాహితీ సదస్సులో 60 సాహిత్య ప్రసంగాలు, చర్చా వేదికలు చోటు చేసుకున్నాయి.

నవంబర్ 5 ఉదయం 9 గంటలకు వంగూరి చిట్టెన్ రాజు నిర్వహణలో ప్రారంభ సభ జరిగింది. సింగపూర్ తెలుగు సమాజం గాయనీ మణులు ఆలపించిన “మా తెలుగు తల్లికి” ప్రార్ధనా గీతం. దీప ప్రజ్వలన లాంఛన ప్రాయంగా జరిగిన తరువాత రత్న కుమార్ నిర్వహణలో హాంగ్ కాంగ్, మలేసియా, సింగపూర్ లలో బాల బాలికలకు స్వఛ్చందంగా తెలుగు బోధిస్తున్న ఇరవై మందికి పైగా ఉపాధ్యాయులకు చిరు సత్కారంతో సభ ప్రారంభం అయింది. “పద్మ భూషణ్” డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ప్రారంభోపన్యాసం చేయగా సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు రవి కుమార్ రంగా, మలేసియా తెలుగు సంఘం అధ్యక్షులు డా. అచ్చయ్య కుమార్ రావు స్వాగత వచనాలు పలికారు. పిమ్మట సుప్రసిద్ద నటులు, సాహితీ వేత్త “పద్మశ్రీ” కె. బ్రహ్మానందం సుమారు 50 నిముషాల పాటు పోతన, తిక్కన, ధూర్జటి మొదలైన ప్రాచీన కవుల కవితా వైభవం తో శ్రీ శ్రీ, జాషువా, కాళోజీల వంటి ఆధునిక కవుల కవితా పాటవాన్ని సోదాహరణగా వివరిస్తూ అనర్గళంగా, సహజ సిద్ధమైన ఛలోక్తులతో చేసిన ప్రధానోపన్యాసం ఎంతో ఆకట్టుకుంది. “ఆంధ్ర జ్యోతి” సంపాదకులు కె. శ్రీనివాస్ కీలకోపన్యాసం, విజ్ఞాన ఖని గొల్లపూడి మారుతీ రావు విశిష్ట ఉపన్యాసం చేయగా తెలుగు విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య ఎస్.వి. సత్యనారాయణ, ఆది కవి నన్నయ ఉప కులపతి ఆచార్య ముర్రు ముత్యాల నాయుడు తమ సందేశాలని వినిపించారు. ఫ్రాన్స్ లో తెలుగు బోధనాచార్యులు ప్రొ. డేనియల్ నెజేర్స్ అచ్చ తెలుగులో మాట్లాడి సభికుల ప్రశంసలు అందుకున్నారు. తరువాత శ్రీధర్ భరద్వాజ్ & సుధాకర్ జొన్నాదుల రూపొందించిన సభా విశేష సంచిక, వంగూరి చిట్టెన్ రాజు, కోసూరి ఉమా భారతి, విన్నకోట రవిశంకర్, వ్యాకరణం రామారావు, నౌడూరి మూర్తి, వంగారి త్రివేణి, చిల్లర భవానీ దేవి, మీగడ రామలింగ స్వామి మొదలైన రచయితల నూతన గ్రంధాలు ఆవిష్కరణ లో ప్రారంభ సభ ముగిసింది. శ్రీధర్ భరద్వాజ్ ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

భోజన విరామం రవికుమార్ రంగా నిర్వహించిన జరిగిన అంతర్జాతీయ ప్రతినిధుల వేదికలో భారత దేశం, సింగపూర్, అమెరికా, ఫ్రాన్స్, హంగ్ కాంగ్, ఇండోనీషియా, మియన్మార్, బృనై, మలేసియా, యునైటెడ్ కింగ్డం ప్రతినిధులు ఆయా ప్రాంతాలలో తెలుగు భాషా, సాహిత్యాల పరిస్థితిని సమీక్షించారు. మలేసియా నుంచి వచ్చిన ఐదవ తరం బాలికల చిరు ప్రసంగాలు, పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈ రెండు రోజుల సదస్సులో జరిగిన ఆది కవి నన్నయ వేదిక, కట్టమంచి రామలింగారెడ్డి వేదిక, స్వీయ రచనా వేదిక, గురజాడ వేదిక, గిడుగు రామమూర్తి వేదిక, దేవులపల్లి వేదిక, ప్రత్యేక ప్రసంగ వేదికలోసుమారు ప్రసంగ వేదికలు అరవై మంది వైవిధ్యమైన అంశాలపై సాహిత్య ప్రసంగాలు చేశారు. ఆయా వేదికలను వెన్నా వల్లభ రావు, శరత్ జ్యోత్స్నా రాణి, జొన్నలగెడ్డ మూర్తి, ప్రభల జానకి, వెలమల సిమ్మన్న, దర్భా శ్రీనివాస్ నిర్వహించగా టీవీ లలో వ్యాఖ్యాత గా అనుభవజ్ఞురాలైన సుచిత్ర బాలాంత్రపు స్వీయ రచనా పఠనం వేదికని సమర్థవంతంగా నిర్వహించి స్వీయ కవితా గానం చేశారు. శాయి రాచకొండ నిర్వహించిన ముక్తేవి భారతి గారి కథ ముగింపు పోటీ, ద్వానా శాస్త్రి నిర్వహించిన సాహిత్యం ప్రశ్నలు జవాబులూ పోటీలకు విశేషమైన స్పందన వచ్చింది. సాహిత్య ప్రసంగాలలో ముక్తేవి భారతి, గుమ్మా సాంబశివరావు, ప్రభల జానకి, కేతవరపు రాజ్యశ్రీ, ఉదయశ్రీ, చందు సుబ్బారావు, శరత్ జ్యోత్స్నా రాణి, శివుని రాజేశ్వరి, రాధిక మంగిపూడి, జొన్నలగెడ్డ మూర్తి, చిల్లర భవానీ దేవి, నిడమర్తి నిర్మలా దేవి, గార బాబూ రావు, ద్వానా శాస్త్రి, మీగడ కె.ఎన్, మల్లీశ్వరి, డేనియల్ నెజేర్స్, వుగ్గిన తారకేశ్వర రావు, మల్లాది శ్రీనివాస శాస్త్రి ల ప్రసంగాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

సాంస్కృతిక కార్యక్రమాలలో సింగపూర్ వాస్తవ్యులు కాశీభొట్ల సత్య వేణు రచించి, మల్లాది శ్రీనివాస శాస్త్రి దర్శకత్వం వహించిన “ఇంద్ర సభలో ఆంధ్ర సభ” నాటకం 45 నిముషాల పాటు జన రంజకంగా సాగింది. సుచిత్ర బాలాంత్రపు, వై.ఎస్. రామకృష్ణ, లలిత నేమాన వీనుల విందుగా పాడిన సాహిత్య ప్రధానమైన సినీ సంగీత విభావరి శ్రోతలని సమ్మోహితులని చేసింది.

ఆమని కృష్ణ ‘మయ సభ “ ఏకాపాత్రాభినయనం, కోకిల నాగరాజు బహుపాత్రాభినయనం, మీగడ రామలింగ స్వామి గారి సంగీత నవావధానం ఉన్నత స్థాయిలో ఉన్నాయి. “హాస్య బ్రహ్మ” శంకర నారాయణ హాస్య ప్రసంగాలు చమత్కార భరితంగా ఉన్నాయి.

ఈ సదస్సులో ఆఖరి అంశంగా డేనియల్ నెజేర్స్ (ఫ్రాన్స్), ద్వానా శాస్త్రి (హైదరాబాద్), చందు సుబ్బారావు (విశాఖ పట్నం) గార్లకు సాహిత్య జీవన పురస్కారం బహుకరించబడింది. వంగూరి చిట్టెన్ రాజు నిర్వహించిన ఈ ముగింపు సభలో సదస్సుకు విచ్చేసిన ప్రముఖులందరూ పాల్గొన్నారు. తరువాత ఈ ఐదవ ప్రపంచ సదస్సు కు రవి కుమారా రంగా నేతృత్వంలో అహర్నిశలూ శ్రమ పడి ఈ అఖండ విజయానికి కారకులైన రత్న కుమార్, శ్రీధర్ భరద్వాజ్, సుధాకర్ జొన్నాదుల కూ, వేదిక నిర్వహణా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన కృష్ణ చైతన్య పువ్వాడ, మమత మాదాబత్తుల, రేణుక చామిరాజ్, శ్రీ విద్య ఆకెళ్ళ, సత్య సూరిశెట్టి, రాజ్యలక్ష్మి జొన్నాదుల, ప్రసన్న అమ్మనమంచి, జ్యోతీశ్వర రెడ్డి కురిచేటి, వంశీ, ప్రదీప్ సుంకర తదితర సింగపూర్ తెలుగు సమాజం కార్యకర్తలను సముచితంగా సత్కరించారు. సింగపూర్ దేశంలో మనబడి ద్వారా తెలుగుభాషను బోధిస్తున్న 20 మంది ఉపాధ్యాలను కూడా సత్కరించారు. కార్యదర్శి వేణు మాధవ్ మల్లవరపు వందన సమర్పణతో ఐదవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు దిగ్విజయంగా ముగిసి చరిత్ర సృష్టించింది. ఆ సదస్సు చిత్రాలు కొన్ని ఇందుతో జతపరిచాం.

ఈ చారిత్రాత్మిక ఐదవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు పూర్తి చిత్ర మాలిక, సంక్షిప్త వీడియో లింకులు ఈ క్రింద పొందు పరిచాం. ఆసక్తి, సమయం ఉన్నారు చూసి ఆనందించండి.

మొదటి రోజు:రెండవ రోజు:
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)