శీర్షికలు
పద్యం - హృద్యం
- పుల్లెల శ్యామసుందర్

ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.

ఈ మాసంప్రశ్న:

(1) "హద్దుల నుంచ నేల భువి హక్కుల కోసముమక్కు వేలనో" (పోచిరాజు కామేశ్వరరావు గారు పంపినది)

(2) నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మీకు నచ్చిన ఛందస్సులో పద్యములు పంపండి

గతమాసం ప్రశ్న:

సారా కొట్టుకు సజ్జనాళి వెడలెన్ సాహిత్య గోష్ఠుల్ గనన్

ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.

రాజేశ్వరి నేదునూరి, న్యూజెర్సీ
రారాపోదము దమ్ముకొట్టగను యారాజన్న వీధిన్ కొసన్
సారా కొట్టుకు , సజ్జనాళి వెడలెన్ సాహిత్య గోష్టుల్ గనన్
ధీరోధాత్తులు పండితోత్తములు సందేహింపకన్ వేగ మున్
రారాజుల్ కడుప్రీతి నొందగను వీరావేసమున్ వేడుకన్

డా.చింతలపాటి మురళీ కృష్ణ , బ్రిజ్బేన్ , ఆస్ట్రేలియా
సారాచార విశారదుండు గరిమన్ చాగంటి వాఙ్మూర్తి నె
ల్లూరన్ "కొట్టు" పురాన దీక్షగ పవళ్ళున్ రాత్రు లుత్సాహియై
ధారా శుద్ధి వచించు చుండె నటు పోదామా మనో రూప హం
సా! రా "కొట్టుకు" - సజ్జనాళి వెడలెన్ సాహిత్య గోష్టిన్ గనన్ !!

వారణాసి సూర్యకుమారి, మచిలీపట్నం
ధీరోధా త్తు లటంచు పేరు బడయన్ దివ్యమ్ము గా సిద్ధ మై
వీరావేశముతో ననర్గళము గా వేదాంత సారమ్మునే
ధారాళం బగు నీతులెల్లెడల బోథల్ సల్పుచున్ శీఘ్రమే
సారా కొట్టుకు సజ్జనాళి వెడలెన్ సాహిత్య గోష్ఠుల్ వినన్

"కళాగౌతమి" బులుసు వేంకటసత్యనారాయణమూర్తి, రాజమహేన్ద్రవరం
సారాకొట్టుకు సజ్జనాళి వెడలెన్ సాహిత్యగోష్ఠుల్ గనన్
ఔరా యింతటి నీచవార్త వినగా నాశ్చర్యమయ్యెన్ గదా
ఏరా యెక్కడ వింటివీవు? నిజమా?యీరీతిగా నౌటయా?
సారాకొట్టుకు పోవుటా? చని యటన్ సాహిత్య సంగోష్ఠియా?
పోరా చాలులె యీగతిన్ పలుకగా పుణ్యమ్ము పోద్రోయుటే

గండికోట విశ్వనాధం, హైదరాబాదు
(1)
పేరుంగాంచిన పండితోత్తములు మెప్పించన్‌సహస్రావధా
నారంభ ద్ఘన హృద్య పద్య కవితా నందాద్భుతోత్సాహ హే
లా రూపంబున " కొట్టు" గా నలరు మేళా వేదికన్‌గాంచ, మన్‌
సారా కొట్టుకు సజ్జనాళి వెడలెన్‌సాహిత్య గోష్టుల్‌ గనన్‌

(2)
సారాచార విధాన జీవనముతో " సాకేత రామయ్య"- ఓ
ఆరామంబున కోట కట్ట నది " సారా కొట్టు"గా క్లుప్త భా
షా రావంబున పేరు గాంచిన కళా స్థానంబుగా వెల్గ, నా
సారా కొట్టుకు సజ్జనాళి వెడలెన్‌సాహిత్య గోష్టుల్‌గనన్‌.

చావలి విజయ, సిడ్నీ, ఆస్ట్రేలియా
సారా తాగగ లోని బాధ తెలిపెన్ స్వాధీనమే తప్పినా
ధారాళం యతిలా యనంతమగు వేదాంతమ్ము సందేహముల్
ఆరాటమ్మున చూసె వీధి జనులంతా వింత, విభ్రాంతిగా
సారాకొట్టుకు సజ్జనాళి వెడలెన్ సాహిత్య గోష్టుల్ గనన్.

శివప్రసాద్ చావలి, సిడ్నీ, ఆస్ట్రేలియా
సారా కొట్టది తాగుబోతులకదే సంవాసమై మీరుచున్‌
దారిన్‌చెప్పగ కొండగుర్తగుచు నద్దారిన్‌ప్రసిద్ధిన్‌గనెన్‌
చేరంగన్‌సభ, పై విలాసమరయన్‌ చెంతన్‌ప్రవర్ధిల్లు యా
సారా కొట్టుకు సజ్జనాళి వెడలెన్, సాహిత్య గోష్ఠుల్ గనన్
(పై విలాసము: direction)

మహీధర రామశాస్త్రి, రాజమహేన్ద్రవరం
సారాకొట్టుకు సజ్జనాళి వెడలెన్ సాహిత్య గోష్ఠుల్ గనన్
ఔరా అచ్ఛేరువందుటన్ దగునయా, జ్ఞానంబు లేనట్టి వా
రౌరా యీ క్షణమందునన్ కవితలన్ రిక్తార్ధ వాచ్యన్బుగా
పేరాసన్ కలముల్ గభాల్న కదుపన్ , పొబెట్టు వారేనయా

మాజేటి సుమలత, క్యూపర్టినో, కాలిఫోర్నియా
సారాసార మనస్కుడై హనుమడా సామీరి సాకించి మై,
పారావారము దాటుచున్నటుల యా పాలేటిరాచూలిని
న్నా రామా రతనంబు నే తెరగునన్నర్థించెనో చూడ వ
త్సా రా కొట్టుకు సజ్జనాళి వెడలెన్ సాహిత్య గోష్ఠుల్ గనన్

పోచిరాజు కామేశ్వర రావు, రాయిపూర్
ప్రారంభించిరి సత్కళా విభవ విద్వన్మండ లాఖ్యాతమున్
ధారాదత్తము సేయ నా సరక సంత్రాసంపు సుక్షేత్రముం
బౌరుల్మెచ్చి సగౌరవమ్ము భువి నాప్రాంతమ్ము పూర్వోక్తమౌ
సారా కొట్టుకు సజ్జనాళి వెడలెన్ సాహిత్య గోష్ఠుల్ గనన్

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)