కవితా స్రవంతి
సిద్ధుడు - ఈశ్వరుడు
- డా.చింతలపాటి మురళీ కృష్ణ

శార్దూలము :

ఏకాగ్రమ్మగు చిత్త సాధనముచే నెవ్వండు సర్వేశ్వరున్
లోకేశున్ పరిపూర్ణ శక్తి యుతునిన్ లోలోన భావింఛి లో
కైకారాధ్యుని దర్శనంబు గనునో కంఠోక్తి గా నాతడే
లోకంబందున "సిద్దుడై " బరగు నాలోచింప ముక్త్యాత్ముడౌ !! 1

భావం : సర్వేశ్వరుడు అన్ని లోకాలకు ప్రభువు. అతడు పరిపూర్ణ మైన శక్తి కలవాడు. అన్ని లోకాలలో ఉండే అందరకు , అన్ని జీవాలకు అతడు ఆరాదించదగినవాడు. అటువంటి వానిని ఎవరైతే తన లోలోపల భావించుకుని ఏకాగ్ర మైన మనస్సుతో సాధన చేసి ఆ పరమాత్ముని దర్శనాన్ని పొంద గలుగుతారో ఖచ్చితంగా అటువంటివాడే లోకంలో " సిద్ధుడు" అనిపించుకుంటాడు. అతడే ఐహిక బంధాలనుండి ముక్తిని పొంద గలుగుతాడు.

శార్దూలము :

ఆపాతాళ నభ స్స్తలాంత భువన వ్యాపీ! మహాదేవ! చి
ద్రూప స్ఫాటిక లింగ ! మౌళి విలసత్ పూర్ణేందు శీతాంశు రే
ఖా పుణ్యామృత మూర్తి ! నిత్య మభిషేకార్చాడులన్ బొంద రా
రా! పాలింపర ! శంకరా !త్రిణయనా ! రక్షించు మాహేశ్వరా !! 2

భావం : పాతాళం నుంచీ ఆకాశం వరకు ఉన్న ఈ బ్రహ్మాండమంతావ్యాపించియున్న ఓ మహానుభావా! మహాదేవా! తెల్లని స్ఫటిక లింగంలో అణుశక్తి రూపంలో ప్రకాశించే ఓ పరమాత్మా ! శిఖ పై ప్రకాశించే పూర్ణ చంద్రుని యొక్క చల్లని అమృత కిరణాలతో మాకు పుణ్యాన్ని ప్రసాదించే ఓ అమృత మూర్తీ ! ప్రతి నిత్యమూ కూడా మేం నీకు అభిషీకాలు మొదలైన పూజలన్నిటినీ చేస్తాము. వాటిని స్వీకరించడానికి రారా స్వామీ ! మమ్మల్ని పాలించారా! మూడు కన్నులు కలిగి త్రిలోకాలలోనూ మమ్మల్ని కనిపెట్టి చూసే ఓ శంకరా ! ఎల్లా లోకాలకూ అధిపతివైన నువ్వు మమ్మల్ని రక్షించరా స్వామీ !!

చంపకమాల :

అణువణువేకమై తనువు నల్లిన యట్లుగ కర్మబంధముల్
గుణితములై ప్రభావ మొనగూర్చెడు నంతకు వెన్క నున్న కా
రణమగు నీశ్వరుండవు నిరామయ మూర్తివి నీవుకావె ! ధా
రుణి గల జీవకోటికి నిరూపిత ప్రాణము నీవె ఈశ్వరా!!

భావం: శరీర మనేది అణువణువూ కలిసి ఏర్పడింది. అలాగే చేసుకున్న కర్మ ఫలాలన్నీ కూడా ఈ శరీరాన్ని పట్టుకుని లెక్కలు వేసుకుని తమతమ ప్రభావాలను చూపిస్తూ ఉంటాయి. అయితే వీటికి వెనక ఉండి నడిపించే కారణ రూపుడు - ఎవ్వరిమీదా -ఎటువంటి అభిమానాలు కానీ దురభిమానాలు కానీ పెట్టుకోకుండా -ఏమీ పట్టకుండా నడిపించుకుపోయే నిరామయ మూర్తి పరమేశ్వరుడే కదా! లోకంలో ఉన్న ప్రాణి కోటి అందరిలోనూ ఉన్న ప్రాణం ఓ ఈశ్వరా నీవే కదయ్యా ! ఇది గమనించకుండా రకరకాల భేద భావాలతో ఉన్న పుణ్య కాలమంతా కొట్టుకుంటున్నాం -సత్యాన్ని గమనించలేక కళ్ళున్న గుడ్డి వాళ్ళం అవుతున్నాం

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)