సారస్వతం - కుంతి మాట
దైవం-పౌరుషం
- కుంతి

లౌకిక ప్రపంచములో ప్రతి వ్యక్తి తన ప్రయత్నము ఫలించాలని, విజయం దక్కాలని కోరుకుంటాడు. విద్యార్ధి తాను వ్రాసిన పరీక్షలలో సర్వోత్తమ శ్రేణిని, వర్తకుడు తాను చేసే వ్యాపారములో పెద్ద లాభాన్ని, కర్షకుడు తాను చేసే వ్యాపారములో అత్యంత రాబడిని, ఉద్యోగి తన వృత్తి క్షేత్రములో సర్వోన్నత పదవిని పొందాల్ని కోరుకుంటాడు. ఒక సామాన్య మానవుడు సంసార సాగరములోని సమస్యల సిడిగుండాలను, అవమానాల ఆటుఫో టులను, కష్టనష్టలానే క్రూరమైన జలచరాలను అధిగమించి, సుఖాల తీరాలను చేరాలని ప్రయత్నిస్తుంటాడు. దీనికై వారు తమలో తాము లక్ష్యాలను నిర్ణయించుకొని, స్వీయ ప్రేరణ గావించుకొని, ధ్యేయము వైపునకు ఉన్ముఖీకరించిన వారై, శక్తియుక్తులను కూడదెసుకొని,ఒడిదుడుకులు, ఢ్కాముక్కీలు, సవాళ్ళు ఎదుర్కుంటూ, నిరాశా నిస్పృహలకు లోను కాకుండా, ఒక్కొక్క అడుగే ముందుకు వేసుకుంటూ విజయపు అంచులను ముద్దాడాలనుకుంటారు.

వీరు" ఆరంభించరు నీచమానవులు............." ఆన్న సూక్తి లోని ధీరులు. బహుప్రయత్న శీలురు. మరి కొందరు పై ప్రయత్నాలు చేస్తూనే కనిపించని దైవాన్ని, విధిని, అదృష్టాన్ని పరిపూర్ణంగా విశ్వసిస్తూ,పూజలు, పునస్కారాలు చేస్తూ, కొండలు, బండలు ఎక్కుతూతమ శ్రమకు తోడు దైవ శక్తి లబించేలా కోరుకుంటూ విజయాలను కాంక్షిస్తారు. ఇంకా కొందరు విజయాలకై కేవలము దైవ శక్తినే విశ్వసిస్తూ( నిజానికి వీరు సంపూర్ణ శరణాగతి చేసెడు వారుకాదు) నిష్క్రియాపరులై విజయాలను అపేక్షిస్తారు. అంటే గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా నీవే కాపాడు నుకునే రకం. కొందరు దైవాన్ని విశ్వసించరు. ప్రయత్నించరు. విజయాల పల్లకిలో ఊరేగాలని మత్రము కోరుకుంటారు.

అయితే సృష్టిలో కొన్ని చమత్కారాలు, విచిత్రాలు జరుగుతుంటాయి. న్యాయపరులు, ధర్మాత్ములు, దక్షులు చేసే పనులు జయప్రదం కావు. దుర్మార్గులు, కౄరులు చేసే పనులు కొన్ని విజయ వంతమవుతాయి. నిష్క్రియాపరులు-ఐశ్వర్యాలు, విజయాలు పొందుతారు. శ్రామికులు, దక్షులు అపజయం పొందుతారు. అంటే ఏదీ మన ఇష్టానుసారము జరుగదు. అలాగని చేతులు ముడుచుకోలేము. విధిని నిందిస్తూ బ్రతకలేము. బ్రతుకు బండిని లాగాల్సిందే. మరి అలాంటప్పుడు మనిషి తన జీవన యానములో అత్యున్నత విజయాలు సాధించాలంటే అతడికి కావలసినది, తోడ్పడవలసినది ఏమిటి? ఇది వెయ్యి డాలర ప్రశ్న. పౌరుషమా? దైవమా? లేదా రెండూనా? లేదా ఈ రెండూ కాక మరేదైనానా? ఈ రెండూ కాక మరేదైనా జరిగే అవకాశం లేదు.

మనిషి జీవితములో విజయములో పాత్ర వహించేది పౌరుషమో, దైవమో లేదా రెండూనూ అయి ఉండాలి.

అందుకే దీనిపై మన భారతీయ ఫూరాణేతిహాసాలలో దీనిపై విపరీతంగా చర్చ జరిగింది. యెతావాతా ఋషులు,పండితులు, కవులు అనేక రకాల అభిప్రాయాలు వెలిబుచ్చారు. ముఖ్యంగా మహాభారతం లో దీనిపైన పెద్ద చర్చే జరిగినది. అడుగడుగునా అనేక పాత్రల ద్వారా అనేక సందర్భములలో దైవ, పౌరుష ప్రాధాన్యాలు చర్చింపబడినాయి. అయితే ఈ సిధ్హాంతాలు ప్రతిపాదించడం ఆయా పరిస్థితులు, సందర్భాలు, ఆయా పాత్రల చిత్తవృత్తులకను గుణంగా చెప్పబడ్డాయి. ఆయా సిద్ధ్హాంత ప్రతిపాదనలు చదివి, అవగాహన చేసుకుంటే దైవ పౌరుష విధానాలు అర్ధమవుతాయి. మనిషి జీవన వ్యాపారములో తగిన విధముగా అనుష్ఠిస్తే , విజయాలు కూడాపొందుతాడు. ముఖ్యంగా మహాభారతేతిహాసములో దైవము మానవ విజయములో ఎలాంటి పాత్ర వహిస్తుందో చూద్దాం.

- సభాపర్వము, ద్వితీయాశ్వాసములో, ధర్మరాజు శకునితో రెండుమారు జూదమాడి ఓడినపుడు ...

అ) " ధర్మ సుతుడొడ్డి శకునిక! ధర్మస్థితినోటువడియె దైవము చెయిదిన్
నిర్మితమయిన శుభాశుభ!కర్మఫలంబెట్లు దేహి గడవగ వచ్చున్"

ధర్మరాజు పందెము వేసి శకుని చేతిలో అడ్డంగా ఓడిపోయాడు. దేవుడు నిర్ణయించిన మంచీచెడ్డల కర్మ ఫలము ఎలా దాటగలడు?

-అరణ్యపర్వములో పంచమాశ్వాసములో ధర్మవ్యాధుడు కౌశికునకు హింసాస్వరూపము చెప్పినపుడు
ఆ) " కార్యఫలములయెడ! దాన కర్తననుట! కడునెఱుంగమిజువ్వె! తా గర్తయేని
తగిలి దనదైన కార్య జాతంబునెల్ల! జెడక ఫలియించునట్లుగా జేయరాదె!

తాను చేసిన పనులు కొన్ని ఫలిస్తాయి. కొన్ని ఫలించవు. కావున తాను చేసే పనుల జయాపజయాలు తన సామర్ధ్యము మీదనే ఆధార పడి ఉంటాయి అని భావించడం అఙ్ఞానము కద! చేసే పనుల యెడల ,అన్ని పనులలో విజయం సాధించ వచ్చును కదా. అంటే మానవ ప్రయత్నములోనే విజయం సాధ్యపడదు. ఇంకా యేదో ఉంది. అదియే దైవం.

ఇ) "పురుషుడు కర్మాధీనత నరుగక తనవశమయనిన నాపదలు రుజల్
మరణంబును నివియేమియు బొరయక యూండంగబ్రతుకబోలడెచెపుమా?

అనగా మనుజుడు కర్మాధీనుడు కాకుండా, తన యిష్టానుసారం అంతా తీర్చిదిద్దుకోగలిగితే తనకు ఆపదలు, రోగాలు, చావు సంప్రాప్తించకుందా జీవించవచ్చు కదా. అంటే ఈ జన్మలో మనుజుడి ప్రవర్తనకు పూర్వజన్మ పరిపాకమే మూలము. బుద్ధి: కర్మానుసారిణి కదా. మనిషి తన జీవితాన్ని తానే నిర్మించుకుంటాడు ఆన్న వాదము ఈ సత్యము ముందు నిలబడగలదా?

-ఉద్యోగపర్వం ద్వితీయాశ్వాసములో ధృ తరాష్ట్రునకు విదురుడు నీతి చెప్పు సందర్భము లోనిది?

ఈ) " దైవంబు నేర్చు గాకిటు!నోవగ నేనేర్తు, నేరబొమ్మని పలుకం

గా వశమె నరున? కెక్కుడు! దైవము పౌరుషము కంటే ధరణీనాధా?

ధృ తరాష్ట్రా! దైవమే సమర్ధమయినది"నేనిలా నడువగలను, నడువలేను అనడానికి మానవుడి తరమా? పురుషప్రయత్నముకంటే దైవము గొప్పది.

-ఉద్యోగ పర్వము తృతీయాశ్వసములో కృష్ణుడు అర్జునుడితో దైవమే అయినా కాన్ట్లు , లౌకిక వ్యక్తి అయినట్లు దైవం ప్రత్యేకంగా ఉన్నట్లు దైవ మహిమ గూర్చి ఇలా ఉంటాడు.

ఉ)" వెరవున లావునంగృషికి వేయు విధంబుల మేలొనర్చినం
దొరకొనునె ఫలంబు? తఱితోదగు వర్షము లెకయున్న :నె
ప్పరుసున లెస్స సేసినను బౌరుషము ఫలియించుటెల్ల నా
దరణమునంబ్రసన్నమగు దైవము చేత చూవె ఫల్గుణా!"

ఉపాయంతో శక్తితో శ్రమించి సేద్యానికి పలురకాల్ దోహదము చేసినప్పటికీ సమయానికి తగినంత వషము లేకుంటే పంట చేతికందదు. అలాగే ఎన్నో విధాల పరిశ్రమ చేసినప్పటికీ ప్రేమతో దైవము ప్రసన్నమయినపుదే పురుషప్రయత్నములు సఫలమవుతాయి.

-శాంతి పర్వము చతుర్ధాశ్వాసములో భీష్ముడు ధర్మరాజునకు మంకి యను బ్రాహ్మణుడి కధని చెప్పినపుడు మంకి చెప్పిన మాట

ఊ)" సారమతి బరికింపగ బౌరుషంబు! కంటె దైవంబు ముఖ్యంబు గార్యసిద్ధి
కెచట నేనియు బౌరుషమెసకమెసగె! నెనియదిదైవదత్తంబయంత నిజము!"-శ్రేష్టమైన బుద్ధితో ఆలోచొస్తే కార్యసిద్ధి జరుగాలంటే మానవయత్నము కంటే దైవ బలం ముఖ్యము. ఎక్కడైనా, ఎప్పుడైనా మానవప్రయత్నము ఫలించినట్లు కనిపించినా నిజానికి అది దైవానుగ్రహము తప్ప అన్యము కాదు. ఇదిలా ఉండగా పురుషప్రయత్నము ఎంతటిదో చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

- సభాపర్వము ప్రధమాశ్వాసములో భీమార్జునులు ధర్మరాజునకు ఉత్సాహము కలిగించు సందర్భములో ప్రయత్న ప్రశంస ఇలా ఉంటుంది.

ఋ) " ఆరంభరహితు బొందునె! యారయ సంపదలు? హీనుడయ్య్యును బురుషుం
డారంభ శీలుడయి యకృతారంభులనోర్చునెంత యధికులనయినన్"-లోకములో ప్రయత్నము చేయని వాడికిసంపదలు సమకూరవు. బలహీనుడయినా సఎ పురుషుడు తాను ప్రయత్నం చేసే స్వభావం కలవాడైతే ప్రయత్నమే చేయని ఎంత బలవంతులనైనా జయించగలడు.

-అరణ్య పర్వములో ప్రధమాశ్వాసములో

ౠ) "తిలలందు దైలంబు గాష్ఠముల యండు దిరముగానగ్ని
గలుగుటెఱింగి యుపాయ పూర్వముగ గడిగి తత్సిద్ధి
యలయక యుత్సాహవంతుడవయినట్లునుత్సాహ
మొలసి దైవపరుడది వడయంగనె నోపునెయెందు? - నువ్వు గింజలో నూనె కర్రలో అగ్నిపొందడానికి ఉత్సాహ వంతుడు ఉపాయ పూర్వకమైన ప్రయత్నము చేయవలసి ఉంటుంది. పురుషకార్యాన్ని వీడీ కేవలం దైవాన్ని నమ్ముకున్నవాడు ఉత్సాహ వంతుడు పొందే సిద్ధిని పొందగలడా? మరియు కర్మఫలాలు పురుషోత్సాహము చేత స్థిరాలు. కోరికలు లేని వాడు దైవాన్ని మాత్రమే నమ్ముకున్న నీటిమీద పడవ వలె శక్తి హీనుడై నశిస్తాడు. కావున కార్య సాపాల్యానికై మనిషి లక్ష్యాలను నిర్ణయించుకొని, ద్విగుణీకృతోత్సాహముతో ధ్యేయ సిద్ధి జరుగునంత వరకు పోరాడు శీలియై ఉపాయపూర్వకమైన ప్రయత్నము చేయాలి. అంతే కాక ఏదో చిరు ప్రయత్నముతో సిద్దించే పనిని తెగువతో మొదలు పెట్టినా ఫరవాలేదు. కానీ మహాకార్యాన్ని తొందరపడి చేయరాదు. ఆలోచించి, జాగరుకతతో ఎన్ని అపజయాలు ఎదురైనా మడమత్రిప్పక నిరాశ, నిస్పృహలకు లోనుకాక పురుషకారము సలపాలి.

ఈ విధంగా కార్య సఫలతలో దైవము తోడ్పాటు లేదా ప్రయత్నముతోనే కార్యసాఫల్యము వంటి చర్చలెన్ని జరిగినా, మహాభారతమును క్షుణ్ణంగా గమనిస్తే మానవ జాతి తమ కార్య సాఫల్యానికి యేమి చేయాలో తెలుస్త్రుంది. అంటే మానవ జీవితముపౌరుషము మరియు దైవము యొక్క పరస్పర సమన్వయము అని తెలుస్తుంది. అంటే అసఫలురయితే ఈ రెండులో యేదో లోపించినవారైనా కావాలి లేదా ఉత్తమ ప్రయత్న శీలురై ప్రయోజనాలు పొందడములేదు. అంటే దైవ శక్తి తాత్కాలికంగానో లేదా పూర్వజన్మ కృతముచే దైవోపహతుడయినా అయి ఉండాలి. ఆ వ్యక్తి శక్తి ప్రేరేపితుడైనా, నిష్క్రియాపరుడు సోమరి, అవకాశాలను వినియోగించికోని వాడై ఉండాలి. మానవజీవితమనే నాణానికి ఈ రెండూ బొమ్మా బొరుసూ వంటివి. ఈ దైవ పౌరుషాల కలయిక వల్ల మానవ జీవితము బంగారాన్ని తావి ఆబ్బినట్లుగా పరిమళిస్తుంది. మహాభారతము స్పష్టంగా ఈ విషయం చెబుతుంది.

పురుషుడు ముందు తన మనసులో ధ్యేయాన్ని నిర్ణయించుకొని సంతోషముతో కూడిన దీక్షతో పవిత్రమైన, మేలైన పురుషకారానికి పూనుకోవాలి. అపుడే దైవము ఒకింత సహనాన్ని పరిక్షించినా చివరికి విజయాన్ని అందిస్తుంది.

రైతు మెడలు వంచి పొలము దున్నాడు. విత్తనాలు చల్లాడు. అపుడు ఆలస్యము కాకుండా వర్షము కురుస్తే ఫల సిద్ధి కలుగుతుఇంది. కానీ మేఘుడు దయ చూపకపోతే కర్షకుడి శ్రమ వృధా అవుతుంది. ఒక విద్యార్ఢి సంవత్సరమంతా చక్కటి క్రమశిక్షణాయుతమైన విద్యాభ్యాసము చేస్తాడు. బాగ శ్రమించి పరీక్షలు రాస్తాడు. ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడౌతాడు. కానీ సరిగా పరీక్ష రోజే అతడికి అనారోగ్యము కలిగినా, పేపర్ లీక్ ఇత్యాది కారణాలచే పరీక్ష రద్దు అయినా, ఒక వేళ బాగా వ్రాసినా ఇతరుల తప్పిదాలచే తక్కువ మార్కులు వచ్చినా లేదా ఫేయిల్ అయినా అతడి శ్రమ బూడిదలో పోసిన పన్నీరే. ఒక ఉద్యోగి ఎంతోశ్రమించి నిజాయితీగా తన కార్యాలయములో పని చేస్తున్నా రావలసిన పదోన్నతి ఎన్నో కారణాలచే ఇతరులుపొందవచ్చు. వ్యాపారి రేయింబవళ్ళు శక్తియుక్తులతో ఎంతగానో శ్రమించినా నష్టాలు పొందవచ్చు. అంటే మానవ ప్రయత్నముతోనే విజయాలు దక్కవు. మరింకేదో శక్తి తోడైతేనే విజయం సాధ్యం. అదే కనిపించని విధి, దైవము, అదృష్టము. అయితే మహాభారతము ఇక్కడ యేమి చెబుతుందంటే ఎన్ని అపజయాలు, కష్టనష్టాలు, అవమానాలు ఎదురైనా మనిషి ప్రయత్నము మానరాదు. అట్టి వాడికే దైవము తోడ్పడతాడు.

ఆ ప్రయత్నము కూడా ఎలా ఉండాలి?

సంస్కృత భారతములో సాక్షాత్ దైవ స్వరూపమైన వ్యాస ఋషి ఇలా సెలవిస్తాడు.

" దైవేన కిలయస్యార్ఢ: సునీ తోపి విపద్యతే
దైవస్య చాగమే యత్నస్తేన కార్యోవిజానతా" -మానవయత్నము ఎంత సవ్యంగా సాగినా దైవం అనుకూలించకపోతే కార్యం చెడి పోతుంది. అయినా నిరాశా, నిస్పృహలకు గురికాక మరలా దైవానుకూల్యము కొరకు ప్రయత్నిస్తే కార్యము ఫలిస్తుంది. ఉద్యోగపర్వము తృతీయాశ్వాసములో అర్జునుడు కృష్ణుడితో సంభాషించు సందర్భములో ఇలా అంటాడు

"నీవొనరింపఁ బూనిన పనింగమలోదర! కీడూ పుట్టునే
కావనినట్లుయుండి యవుఁగార్యము:లట్ళ్గుటంబ్రయత్న సం
భావన సేత పౌరుషము పద్ధతి తత్ఫల సిద్ధి వొందుచో
దైవము దోడ్పడన్ వలయుఁ:దధ్యము రెండు నీ వినోదముల్" -స్వామీ! నీవు చేయ నెంచిన పనికి హాని ఎపుడు కలుగదు. కొన్ని పనులు ఫలించినట్లే ముందు కనిపించినా చివరికి ఫలిస్తాయి. కావున కార్యానికి పూనుకోవటం పురుష లక్షణం. కార్యముతనకు సమకూరటములో దైవ సహాయము అవసరము కనుక పురుష ప్రయత్నము దైవానుకూల్యత, కార్యానుకూలత, అనురెండు నీ వికల్పానికి లోబడి ఉంటాయి. అంటే ప్రయత్నము, దైవ సహాయము రెండు దేవుడి చేతిలో నే ఉన్నాయి.

ఆనుశాసనిక పర్వము ప్రధమాశ్వాసములో ధర్మరాజు భీష్ముడుని" మహాత్మా! దైవ, పౌరుషలలో త్యేది గొప్పది అని అడిగినపుడు, భీష్ముడు పూర్వము నీ వలెనే వసిష్ఠుడు బ్రహ్మను అడిగాడు. ఆయన చెప్పిన మాటల సారంసహ్ము చెబుతాను విని" అంటూ ఇలా చెప్పాడు.

" క్షేత్రంబు పురుషాకారము!ధాత్రీశ్వరా! బీజమరయగ దైవము !రెండున్
సూత్రపడగూడనేనిం! బాత్రంబగుగర్మకరుడు ఫలమునకెందున్"

పౌరుషము చేను, దైవము విత్తు. ఈ రెండు కలవ గల్గెటట్లు ప్రయత్నించే మనిషి ఫలము పొందుతాడు. అనగా దైవము+పౌరుషము= మానవజీవితము. బీజము+క్షేత్రము=పంట.

పౌరుషము మన చేతిలోనిది. ఫలమిచ్చే అదృష్టము, కనిపించని శక్తి, దైవము ఈ రెండు కలిస్తేనే మానవ జీవితము సుఖవంతము.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)