సారస్వతం
అన్నమయ్య శృంగార నీరాజనం
- టేకుమళ్ళ వెంకటప్పయ్య

గత మాసాలలో అన్నమయ్య నాయకునిగా, శ్రీవేంకటేశ్వరుని ఎంత వైభవంగా వర్ణించాడో చూసాం. ఇప్పుడు నాయికల గురించి చూద్దాం. శరీర ఆకృతిని బట్టి స్త్రీలలో పద్మినీ, చిత్తిణి, శంఖిణి, హస్తిణి అను జాతులున్నాయని వాత్సాయన మహర్షి, అలాగే అనంగరంగ లో కల్యాణమల్లుడు తెలియజేశాడు. ఆ నలుగురు నాయికలను అన్నమయ్య ఒకే కీర్తనలో చెప్పడం విశేషం.

మొదట ఆ నాయికల లక్షణాలను తెలుసుకుందాం. పద్మినీ జాతి స్త్రీ సకల శుభ లక్షణాలతో అలరారుతుందని చెప్పారు. ఆ జాతి స్త్రీ శరీరం తామర మొగ్గలా సుతి మెత్తగా ఉంటుoది. శరీరము పద్మం వంటి సువాసన కలిగి ఉంటుంది. కళ్లు విశాలంగా వుండి తళ తళ మెరుస్తూ సుగంధం కలిగి వుంటాయి. నాసిక సంపెంగ రేకు వలె వుంటుంది. పద్మనీ జాతి స్త్రీ మనస్సు పెద్దల ఎడ, దేవతల పట్ల భక్తి తత్పరులతో నిండి వుంటుంది. సంగీత సాహిత్యాది కళలలో ఆమె రాణిస్తుంది. శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలన్నా, రత్నా భరణాలన్నా మక్కువ చూపుతుంది. అసత్యాలాడదు, కోపమన్నది ఎరుగదు. తెల్లని వస్త్రాలు ఇష్టపడుతుంది.

రెండవ జాతి స్త్రీ చిత్తిణి. పద్మినీ జాతి స్త్రీ కంటే శుభ లక్షణాలు కొద్దిగా తక్కువైనప్పటికీ, అంద చందాలలో ఆమెకు ఏ మాత్రం తీసిపోదు. ఈ స్త్రీ నడక అందం చిందుతూ వుంతుంది. చకోర పక్షి వలె చక్కని పలుకులతో ఆకట్టుకుంటుంది. నాట్యం, సంగీతం, నృత్య క్రీడ వినోదాదులపై ఆసక్తి మెండు. కనులు స్థిరంగా నిలపలేదు. రంగురంగుల దుస్తులు ఇష్ట పడుతుంది. శరీరం సుగంధాన్ని వెదజల్లుతుంటుంది. పూలంటే మక్కువ చూపుతుంది. పద్మినీ జాతి స్త్రీ కంటే ఈమె ఒకింత తక్కువ అని శాస్త్రకారులు చెప్తారు.

స్త్రీలలో మూడవ జాతి స్త్రీ శంఖిణి. పద్మినీ జాతి స్త్రీ కంటే ఈమె లక్షణాలు తక్కువ తరగతిలోకి వస్తాయి. శంఖిణి జాతి స్త్రీల దేహం బలంగా వుంటుంది. వీరికి కోపం ఎక్కువ. పువ్వులంటే మక్కువ చూపుతారు. కంఠ స్వరం కర్కశంగా వుంటుంది. కుటిల స్వభావంతో చెప్పుడు మాటలు వినడం పట్ల ఆసక్తి కనబరుస్తూ వుంటుంది. ఈ జాతి స్త్రీ వాగుడు కాయ. పరిమళ ద్రవ్యాలంటే అమితాసక్తి. కానీ భర్తపై ఎక్కువ అనురాగమే చూపుతుంది.

స్త్రీ జాతులలో కడపటిది హస్తిణి. ఈ జాతి స్త్రీలకు తిన్నగా నడవడం చేతకాదు. నల్లటి జుత్తు. కోపం మరీ ఎక్కువ. శరీరం నుంచి కొద్దిగా దుర్వాసన వస్తుంది. తిండిపోతు. స్థూలకాయం, ఖంగు మని మోగే కంఠ స్వరంతో వుండే ఈ జాతి స్త్రీలకు కపటం తెలియదు.

పైన వివరించిన వివిధ జాతుల స్త్రీల లక్షణాలు పరిశీలిస్తే పద్మినీ జాతి స్త్రీ ఉత్తమమైనదని, చిత్తిణి మధ్య రకం అని, శంఖిణి అధమం అని. హస్తిణి అధమాధమం అని తెలుస్తుంది.

ఆ నాలుగు రకాల స్త్రీల యొక్క తీరు మనం ఇప్పుడు అన్నమయ్య రాసిన ఈ క్రింది కీర్తనలో చూద్దాం.

కీర్తన:

పల్లవి: కుందణంపు మై గొల్లెత తా-
నెందును బుట్టని యేతరి జాతి ॥కుంద॥
చ.1. కప్పులు దేరేటి కస్తూరి చంకల
కొప్పెర గుబ్బల గొల్లెత
చప్పుడు మట్టెల చల్లలమ్మెడిని
అప్పని ముందట హస్తిణిజాతి ॥కుంద॥
చ.2.దుంప వెంట్రుకల దొడ్డతురుముగల -
గుంపెన నడపుల గొల్లెత
జంపుల నటనలఁ జల్లలమ్మెడిని
చెంపల చెమటల చిత్తిణిజాతి ॥కుంద॥
చ.3.వీఁపున నఖములు వెడవెడ నాఁటిన
కోపపుఁ జూపుల గొల్లెత
చాఁపున కట్టిగఁ జల్లలమ్మెడిని
చాఁపేటి యెలుగున శంకిణిజాతి ॥కుంద॥
చ.4.గారవమున వేంకటపతి కౌఁగిట
కూరిమిఁ బాయని గొల్లెత
సారెకు నతనితో చల్లలమ్మెడిని
బారపుటలపుల పద్మిణిజాతి ॥కుంద॥
(రాగం: ఆహిరి; శృం.సం.సం5; రాగి రేకు 16; కీ.సం.92)

విశ్లేషణ:

పల్లవి: కుందణంపు మై గొల్లెత తా-
నెందును బుట్టని యేతరి జాతి||

బంగారు ఛాయలోనున్న ఆ గొల్లభామ తాను ఏ జాతిలోనూ పుట్టని గొప్ప అతిశయముగల స్వేచ్చా విహారిణి అయిన స్త్రీ అని అర్ధము. వూహాసుందరి అని కూడా అనుకోవచ్చునని కొందరి భావన.

చ.1. కప్పులు దేరేటి కస్తూరి చంకల
కొప్పెర గుబ్బల గొల్లెత
చప్పుడు మట్టెల చల్లలమ్మెడిని
అప్పని ముందట హస్తిణిజాతి ||

అన్నమయ్య ప్రధమంగా హస్తిణీ జాతి స్త్రీ గురించి వివరిస్తూ..పరిమళాలు వెదజల్లే కస్తూరి సువాసనలతో గూడిన బాహుమూలములున్న స్త్రీ మరియూ ఎత్తైన వక్ష సంపద యున్న గొల్లభామ చల్లలమ్ముతూ వెళ్తూ ఉంటే..కాలి మెట్టెలకున్న మువ్వలు ఘల్లు ఘల్లు మని మోగుతున్నాయి. ఆమె ఎవరో కాదు వేంకటేశ్వరుని ముందరి హస్తిణీ జాతి స్త్రీ అని చెప్తున్నాడు.

చ.2.దుంప వెంట్రుకల దొడ్డతురుముగల
గుంపెన నడపుల గొల్లెత
జంపుల నటనలఁ జల్లలమ్మెడిని
చెంపల చెమటల చిత్తిణిజాతి ॥

ఆ తర్వాత చిత్తిణీ జాతి స్త్రీ గురించి చెప్తూ ఆ స్త్రీ తల వెంట్రుకలు దుంపలుగట్టి పెద్ద కొప్పుతో ఉన్నది. గొప్ప అట్టహాసంగా ఉన్న గొల్లభామ నడుస్తూ ఉంటే చెవులకున్న చెంప సరాలు నాట్యం చేస్తున్నాయట. అలాగే ఆ గొల్లభామ అక్కడ చల్లలు అమ్ముకుంటూ ఉండడం వల్ల పడిన శ్రమ ఫలితంగా ఆమె చెంపలపై చెమటలు కారుతూ ఉన్నాయి కనుక ఆమె ఎవరో కాదు చిత్తిణీ జాతి స్త్రీ అంటున్నాడు అన్నమయ్య.

చ.3.వీఁపున నఖములు వెడవెడ నాఁటిన
కోపపుఁ జూపుల గొల్లెత
చాఁపున కట్టిగఁ జల్లలమ్మెడిని
చాఁపేటి యెలుగున శంకిణిజాతి ॥

శంఖిణీ జాతి గురించి చెప్తూ..ఈమెను చూడండి వీపున నఖక్షతములు వేయగల స్త్రీ అంటున్నాడు. ఆ గొల్లభామ ఎంత కోపంగా చూస్తోందో చూడండి. ఆమె చల్లలమ్మడానికి ఎంత పెద్ద గొంతుతో కేకలు పెడుతోందో చూశారా! ఈమె ఖచ్చితంగా శంఖిణీ జాతి స్త్రీ సుమా అంటున్నాడు.

చ.4.గారవమున వేంకటపతి కౌఁగిట
కూరిమిఁ బాయని గొల్లెత
సారెకు నతనితో చల్లలమ్మెడిని
బారపుటలపుల పద్మిణిజాతి ॥

చివరగా.. ఈ గొల్లభామను గమనించారా! ఈమె గౌరవ భావంతో.. వేంకటేశ్వరుని కౌగిలినుండి ఎన్నడూ విడవక, ఎనలేని వలపులను కురిపిస్తోంది. ఈమె ఎప్పుడు చల్లలమ్మబోయినా ఆ వేంకట రమణుడు తనతోనే ఉండాలని ఆశించే గొల్లెత. ఈమె ఎక్కువ భారాన్ని శ్రమను తట్టుకోలేదు ఆమె పద్మినీ జాతి స్త్రీకదా అంటున్నాడు.

ముఖ్యమైన అర్ధములు:

కుందణము = కుందనము, బంగారము; ఏతరి = అతిశయము, గర్వి, స్వేచ్ఛావిహారి; కప్పులు = ఏతమునకు రెండువైపులా కాళ్లుపెట్టుకొనుటకు అమర్చు పొడవైన పలకవంటి కొయ్యలు, ఇక్కడ రెండు బాహుమూలలు అనే అర్ధంలో వాడి ఉండవచ్చు; కొప్పెర = ఉన్నతమైన, పెద్దదైన, పెద్ద పాత్ర; గుబ్బలు = వక్షములు; మట్టెలు = పెళ్లయిన ఆడవారు కాలివేలికి ఉంచుకునే వెండి తొడుగులు; దొడ్డ = పెద్ద; గుంపెన = గంతు, విజృంభణము, అర్భాటము; జంపులు = చెంప సరులు; నఖములు = గోళ్ళు; చాపేటి యెలుగున = పెద్ద గొంతుతో అరవడం; కూరిమి = స్నేహము, ప్రియము, వలపు; సారెకు = మాటిమాటికి.

విశేషములు:

కుందణము పదములో "ణ" కార ప్రయోగం సమీప కన్నడ భాషా ప్రభావం కావచ్చునని ఆచార్య రవ్వా శ్రీహరిగారి అభిప్రాయము.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)