ధారావాహికలు - శ్రీరామాయణ సంగ్రహం
యుద్ధకాండ
- డా. అక్కిరాజు రమాపతిరావు

లక్ష్మణరావణుల యుద్ధం, లక్ష్మణమూర్ఛ

అప్పుడు లక్ష్మణుడు రావణుణ్ణి ఉద్దేశించి 'రాక్షసాధముడా! నాతో యుద్ధం చెయ్యి, వానరులతో యుద్ధం చెయ్యటం ప్రతాపం కాదు' అని భీకరంగా అల్లెతాటిలో బాణం సంధించేందుకు దిక్కులు పగిలిపోయేట్లు జ్యానాదం సృష్టించాడు.

రావణుడప్పుడు ఉద్రేకంతో ''నా అదృష్టం వల్ల ఇప్పుడు నీవు నాకంట పడ్డావు! కాచుకో. క్షణంలో నిన్ను మృత్యువు కబళించబోతున్నది'' అని వీరావేశప్రగల్భవాక్యాలు పలికాడు. లక్ష్మణుడికి తీవ్రమైన కోపం వచ్చింది. 'రావణా! దారుణపాపకృత్యాలకు పాల్పడడంలో నీకన్నా మహాత్ముడెవరూ లేరు. నీవలె ఎవరూ స్వాతిశయంతో మొరగరు' అని తిరస్కరిస్తుండగా లక్ష్మణుణ్ణి ఏడు బాణాలతో కొట్టాడు రావణుడు. ఆ ఏడు బాణాలను అలవకోకగా ఖండించాడు లక్ష్మణుడు. క్రూరసర్పాలు తునియలు తునియలుగా తెగిపడ్డట్టు ఆ ఏడు బాణాలు వమ్మైపోవడంతో పేట్రేగిపోయిన ఆగ్రహంతో మరింత తీక్షణమైన బాణాలు లక్ష్మణుడిపైకి వదిలాడు రావణాసురుడు. లక్ష్మణుడు ఏమాత్రం తత్తరపాటు చెందలేదు. రావణుణ్ణి శరవర్షంలో ముంచివేయటానికి తన ధనువు మండలాకారంగా తిప్పుతూ కత్తినాదర శరాలను, అర్ధచంద్రాకారపు అంచుగల బాణాలను, ఈటెలవంటి శరాలను రావణుడిపై గుప్పించాడు. రావణుడి బాణాల నన్నిటినీ అవి మింగివేశాయి.

లక్ష్మణుడి శరలాఘవానికి రావణుడు ఆశ్చర్యపోయాడు. అతితీవ్రమైన నిశితమైన మొనలు గల బాణాలను లక్ష్మణుడిపై ప్రయోగించాడు రావణుడు. రావణుణ్ణి వెంటనే సంహరించి వేయాలన్నంత కోపం వచ్చింది లక్ష్మణుడికి. లక్ష్మణు డప్పుడు వజ్రాయుధంవంటి బాణాల నెన్నిటినో రావణుడిపై ప్రయోగించాడు. అవి వేగంగా వెళ్ళి రావణుడి శరీరంలో నాటుకున్నా అతనిని ఏమీ చేయలేకపోయినాయి. రావణుడు తొట్రుపాటు చెందలేదు. ఆగ్రంతో ఊగిపోయినాడు. బ్రహ్మదేవుడు తనకు ప్రసాదించిన విలయాగ్ని వంటి శరాన్ని లక్ష్మణుడి ఫాలభాగాన గురిపెట్టి వదిలాడు రావణుడు. ఆ బాణం తాకగానే లక్ష్మణుడు వణికిపోయినాడు. ధనువు పట్టుకున్న పిడికిలి వదులై పోయింది. ఎంతో ప్రయత్నంమీద నిలదొక్కుకున్నాడు. వెంటనే మమాప్రభావం కల ఒక శరంతో రావణుడి ధనుస్సును వికలం చేశాడు. అది విరిగిపోయింది. అంతటితో తృప్తిచెందక పరమనిశితమైన మూడు బాణాలు రావణుడిపై ప్రయోగించాడు. అంతటితో ఆ దేవతావైరి గజగజలాడిపోయినాడు. శరీరస్పృహ లేకుండా పోయింది రావణుడికప్పుడు. తేరుకుని చూస్తే చేతిలో చాపం లేదు. ఒళ్ళంతా గాయాలు, శరీరమంతా నెత్తురు స్రవిస్తున్నది.

అప్పుడిక ఏమాత్రం లక్ష్మణుణ్ణి ఉపేక్షించదలచుకోలేదు రావణుడు. బ్రహ్మదేవుడు తన కిచ్చిన అమోఘమైన శక్తి అనే ఆయుధాన్ని వానరసేన అంతా గడగడలాడిపోతుందగా లక్ష్మణుడిపైకి వదిలాడు. లక్ష్మణుడు చలించలేదు. ప్రజ్వలించే అగ్నిలాగా తనపై పడబోతున్న రావణుడి మహాప్రభావంకల అస్త్రాన్ని చూసి తాను కూడా అభిమంత్రించిన అగ్నివంటి బాణాలు రావణుడిపై ప్రయోగించాడు. కాని శక్త్యాయుధాన్ని నివారింపలేకపోయినాడు. రావణుడు సంధించిన ఆ శక్త్యాయుధం లక్ష్మణుడి విశాలవృక్షాన్ని తాకింది. అక్కడ మంటలు పుట్టిన ట్లనిపించి, ఆ మంటల బాధ సహించలేక క్రిందపడి మూర్ఛిల్లాడు లక్ష్మణుడు.

వెంటనే లక్ష్మణుడిని సమీపించాడు రావణుడు. అతడిని ఎత్తుకొని తనతో తీసుకొని పోవాలని రావణుడి ఉద్దేశం (అప్పు డందరూ తనకు వశమవుతారనీ, స్వాధీనమవుతారనీ, తనదే పైచేయి అవుతుందనీ, శత్రువులు తాను చెప్పినట్లు వింటారనీ రావణుడి ఊహ). త్వరితంగా వెళ్ళి లక్ష్మణుణ్ణి తన చ ఏతులతో ఎత్తబోయినాడు. హిమవ్పర్వతాన్నో, మేరుపర్వతాన్నో చేతులతో ఎత్తడం సాధ్యం కావచ్చేమో, ముల్లోకాలనూ తన ఒక్కచేతిమీదుగా మోయగల సామర్థ్యం ఉండవచ్చేమో కాని యుద్ధభూమిలో తనతో పోరి అట్లా పడిపోయి స్పృహ తప్పిన లక్ష్మణుణ్ణి తన రెండు చేతుల బలంతో లేవనెత్తడం రావణుడి వల్ల కాలేదు. బ్రహ్మదత్తమైన మహామహిమ ప్రభావంగల శక్తి ఆయుధం తన వక్షాన్ని తాకగానే తాను విష్ణుమూర్తి అంశావతారం కాబట్టి అది తనను ఏమీ చేయలేదని లక్ష్మణుడు గ్రహించాడు. లక్ష్మణుడు మానవదేహాన్ని ఆశ్రయించిన విష్ణువు అంశ. రాక్షసదర్పం అణచినవాడు. అతడిని రావణుడు లేవనెత్తకపోవటం మాట అటుంచి కదపలేకపోయాడు.

అప్పుడు వాయుతనూభవుడు హనుమంతుడికి ఇంతింతనరాని కోపం వచ్చింది. ఆగ్రహంతో ఉద్రిక్తుడైపోయినాడు. రావణుడికి దేహశుద్ధి చేయాలని పరుగెత్తాడు. వజ్రాయుధప్రహారం వంటి తన పిడికిలిపోటుతో రావణాసురుడి వక్షఃస్థలంలో ఒక్క పోటు పొడిచాడు శక్తికొద్దీ, బలమంతా ఉపయోగించి. ఆ పోటుకు లంకాధిపతి అల్లల్లాడి పోయినాడు. గజగజ వణికి అటూ ఇటూ తూలి పోయినాడు. మోకాళ్ళమీద చదికిలబడ్డాడు. తర్వాత బోర్ల బొక్కల నేలమీద వాలిపోయినాడు. నోటినుంచి, ముక్కులనుంచి, చెవులనుంచి, కళ్ళలో నుంచి నెత్తురు బుళుక్కుబుళుక్కున వెలువడింది. గిర్రున తిరుగుతున్నానా నేను అని చాంచల్యం కలిగింది రావణుడికి. తూలిపోతూ రథం దగ్గరకు చేరి నిశ్చేష్టుడై అందులో కూలబడ్డాడు. కాని ఏం జరుగుతున్నదో తెలియలేదు. తెలివితప్పి మూర్ఛలో మునిగాడు పరమభయంకర పరాక్రముడైన రావణాసురుడు. చూస్తేనే హడలు పుట్టించేవాడు, ఈవిధంగా హనుమంతుడిచే తాడితుడై మూర్ఛపోవడం చూసి వ్యోమచారులైన దేవేంద్రుడు, సకలదేవతలు, దివ్యర్షులు అంతా పరమ సంతుష్టులైనారు. వానరులు యుద్ధభూమిలో నిర్విరామంగా సింహనాదాలు చేశారు.

అప్పుడు ఆ మహాబలి హనుమంతుడు మూర్ఛలో ఉన్న లక్ష్మణుణ్ణి తన చేతుల్లో ఎత్తుకుని రాముడి దగ్గరకు తీసుకొని పోయినాడు. రావణుడు దుర్మార్గుడూ, శత్రువూ కాబట్టి లక్ష్మణుణ్ణి ఎత్తలేక పోయినాడు. హనుమంతుడు రామలక్ష్మణుల పరమవిధేయభక్తుడు, అత్యంతాప్తమిత్రుడు కాబట్టి అలవోకగా ఎత్తుకొని పోగలిగాడు. ఎప్పుడైతే లక్ష్మణుడు రాముడిసన్నిధి చేరాడో శక్త్యాయుధం తనంతట అదే రావణుడి దగ్గరకు చేరిపోయింది. తన వైష్ణవతేజం స్మరణకు వచ్చింది మళ్ళీ ఒకసారి లక్ష్మణుడికి.

రావణాసురుడు కూడా అక్కడ రథం మీద మూర్ఛనుంచి తేరుకున్నాడు. తన భయంకర చాపం మళ్ళీ ధరించి వానరసైన్యాన్ని సంహరించటం ప్రారంభించాడు. అతిబలశాలులైన గొప్ప వానరవీరులు ఆ బాణాలకు సంచలించడం, కొందరైతే పరుగుతీయడం కూడా రాముడు చూశాడు, సహించలేక పోయినాడు. వేగంగా రావణుణ్ణి కట్టడి చేయాలని నిలిచాడు. ఇట్లా సంరంభిస్తున్న రాముణ్ణి చూసి హనుమంతు డాయన దగ్గరకు పరుగున చేరాడు. 'మహాప్రభూ! సుపర్ణుడు శ్రీమహావిష్ణువుకు వాహనం కదా! శ్రీరామా! నేను నీ వాహనాన్ని! నన్నిప్పుడు నీవు ఆరోహించాలి. అప్పుడు రావణాసురుడు నీ బాణాహతికి కూలిపోతాడు' అనగా శ్రీరాముడు ప్రీతితో హనుమంతుణ్ణి ఆరోహించాడు. తనతో తలపడటానికి రథాన్ని ఉరవడింపచేస్తున్న రావణాసురుణ్ణి శ్రీరాముడు చూశాడు. బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళిన విష్ణుమూర్తి లాగా శ్రీరాముడు రావణాసురుణ్ణి అసహనంతో వీక్షించాడు. తన ధనుస్సు సజ్యం చేశాడు. లోకభయంకరంగా అల్లెతాటిని నినదింప చేశాడు. రావణుణ్ణి ఉద్దేశించి కఠినోక్తులాడాడు. 'రావణా! ఎక్కడకూ నీవు ఇక పోలేవు. నన్ను, ఇంతింతనరాని దుఃఖసంతప్తుణ్ణి చేశావు. ఇప్పుడ ఎవరితో మొరపెట్టుకొన్నా, శరణు కోరినా ఎవరూ నిన్ను ఆదుకోలేరు. ఇన్నాళ్ళకు నీవు నా ఎదుట పడ్డావు. ఇంతకు ముందు నీవు నీ శక్త్యాయుధంతో ఎవరిని నొప్పించావో వాడే నిన్ను యుద్ధంలో భంగపరచటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక నేనెవరో, నాసంగతి ఏమిటో కాస్త తెలుసుకో! కపటరాక్షసుడా! జనస్థానంలో పధ్నాలుగు వేలమంది భయంకర క్రూరరాక్షసులను పరిమార్చినవాణ్ణి నేనే.'

రామరావణయుద్ధం

రావణుడికి ఈ మాటలు వినగానే మహాకోపం వచ్చింది. ముందుగా హనుమంతుడి శరీరం హూనంహూనం అయ్యేట్లు రావణుడు అతితీక్షణమైన బాణాలు ప్రయోగించాడు. ఆ బాణాలు తాకి అనలశిఖకు ఆజ్యధార సోకినట్లు హనుమంతుడు మరింత మహోజ్జ్వల తేజోమూర్తి అయినాడు. రావణుడి బాణాలు హనుమంతుడి శరీరాన్ని గాయపరచి రక్తసిక్తం చేయడం శ్రీరాముడికి ఎంతో ఆగ్రహం కలిగించింది. శ్రీరాముడు బాణప్రయోగం చేసి రావణుడి రథచక్రాలను తత్‌క్షణం ఊడగొట్టాడు. గుర్రాలు నేలకూలాయి. సారథి యముణ్ణి దర్శించటానికి పోయినాడు. రథంలో ఉన్న ఆయుధసామాగ్రి అంతా నుగ్గు సూచమైంది. శూలాలూ, ఖడ్గాలు, తోమరాలూ, ప్రాసాలు తునాతునకలైనాయి. దేవేంద్రుడు వజ్రాయుధం ప్రయోగించినట్లు ఆ రాక్షసుడి విశాలవక్షంపై అమితతీక్ష్ణశరాలు ప్రయోగించాడు శ్రీరాముడు. అశనిపాతంవంటి శరపాతాన్ని, వజ్రాయుధం వేటులను తట్టుకొని నిలబడ్డ రావణుడు రామబాణహతికి విలవిల లాడిపోయినాడు. తాళలేకపోయినాడు. అతడి ధనుస్సు చేజారిపోయింది. మూర్ఛపోయినాడు. అట్లా అచేతనుడైన రావణుణ్ణి చూసి కాంతి కలితమైన ఒక అర్ధచంద్రాకారబాణాన్ని ఆ రాక్షసాధిపుడి నవరత్నఖచిత దివ్యోజ్జ్వల కిరీటం ఊడి కిందపడిపోయేట్లు శ్రీరాముడు ప్రయోగించాడు.

విశ్రాంతి తీసుకొని మళ్లీ యుద్ధానికి రావటానికి రాముడు రావణుణ్ణి అనుమతించటం

రావణుడికి తెలివి వచ్చింది. కిరీటం అట్లా ఊడి ముక్కలై పోయినందువల్ల రావణుడి కళాకాంతులన్నీ వెలవెలపోయినాయి. ఆరిపోయిన అగ్నిలా, కాంతిమాసిన సూర్యుడిలా, సమస్తైశ్వర్యచ్యుతుడైన శ్రీమంతుడిలా, మలినవదనుడైన రావణుణ్ణి ఉద్దేశించి ''నీ విప్పటిదాకా మహాపరాక్రమం చూపావు. నావారైన గొప్ప శూరు లెందరినో చంపావు. ఇప్పుడు ధనుస్సు కూడా పట్టుకోలేకుండా ఉన్నావు. నిన్ను ఈ స్థితిలో సంహరించడంవల్ల లోకనింది చుట్టుకుంటుంది నాకు. అట్లా చేయడం యుద్ధనీతి కాదు. కాబట్టి నీ విప్పుడు నీ నివాసానికి వెళ్ళి బాగా అలుపు తీర్చుకుని, పూర్తిగా యుద్ధసన్నద్ధుడివై రా. రథారోహణం చేసి ధనుర్ధరుడివై నాతో పోరాటం చేయటానికి సిద్ధమై రా. అప్పుడు నా గురించి నీకు బాగా తెలుస్తుంది. నీ విక పోవచ్చు. ఇది నా అనుజ్ఞ'' అన్నాడు శ్రీరాముడు.

రాక్షసాధిపుడు రావణుడు లంకలో తన రాజభవనాన్ని చేరుకున్నా రాముడి బాణాలు తనను వెన్నంటి వస్తున్నాయేమో నన్నంతగా భయగ్రస్తుడైనాడు. రాక్షసగణాల నన్నిటినీ సమావేశపరచి వాళ్ళతో తన గోడు వెళ్ళబోసుకున్నాడు. దేవేంద్రుణ్ణే ఓటమిపాలు చేసిన నేను మానవమాత్రుడి చేతిలో పరాభూతుణ్ణి అయినాను. అయ్యో! నేను మానవుల నుంచి మరణం లేకుండా బ్రహ్మదేవుణ్ణి కోరలేకపోయినానుకదా!
పూర్వం ఒకప్పుడు ఇక్ష్వాకులాధీశుడైన అనరణ్యుడు 'నీవు మా వంశంలోని ఒక మహాపరాక్రమశాలివల్ల నశిస్తావు' అని నన్ను శపించాడు. ఈ రాముడే ఆ మహావీరుడు అని నా కనిపిస్తున్నది. పూర్వకాలంలో నేను వేదవతిని చెరపట్టబోగా ఆమె నన్ను శపించింది. ఆమే ఈ సీతాదేవిగా జన్మించినట్లు నాకు తోస్తున్నది. పార్వతీదేవి శాపం కూడా నాకుంది. కపిముఖంతో కనపడిన నందీశ్వరుణ్ణి చూసి నవ్వినప్పుడు నాకు వానరసనేలవల్లనే మృత్యువు ప్రాప్తిస్తుందని ఆయన శపించాడు. రంభ నన్ను శపించింది. పుంజకిస్థలవల్ల కూడా నాకు శాపం ఉంది. కాబట్టి ఈ శాపాలన్నీ నన్ను కుంగదీస్తున్నాయి. నా తమ్ముడు కుంభకర్ణుడు అజేయుడు. దేవదానవు లంతా వీడంటే భయపడతారు. బ్రహ్మదేవుడి శాపంవల్ల కుంభకర్ణుడు ఆరు నెలలు నిరంతరంగా గాఢనిద్రావశుడై ఉంటాడు. ఇప్పుడు నా తమ్ముడు నిద్రలో ఉన్నాడు. వెంటనే అతణ్ణి నిద్రలేపటం మన అవశ్యకర్తవ్యం. కుంభకర్ణుడే లేచాడా నా పరాభవానికి పరిహారం లభించినట్లే. వానరసేననంతా మింగేస్తాడు నా తమ్ముడు'' అని ప్రబలోద్రేకంతోనూ, దుర్భరపరితాపంతోనూ వెళ్లి ''కుంభకర్ణుణ్ణి లేపండి'' అని ఆదేశించాడు రావణుడు.

(సశేషం)

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)