కబుర్లు - సత్యమేవ జయతే
ముక్తాయింపు
- సత్యం మందపాటి

నా ముప్పైఐదు సంవత్సరాల అమెరికా జీవనంలో, నా అనుభవంలో నేను చూసిన మన వలసవీరుల కథలను, ఎన్నిటినో నెమరు వేసుకుంటూ, మనసు విప్పి “తరాలు- అంతరాలు” అనే ఒక వ్యాసం వ్రాసి, మన సుజనరంజని నవంబరు సంచికకు అక్టోబరు నెల మధ్యలో పంపించాను. ఆ వ్యాసమే ఇప్పుడు మీరు ఈ నెల సుజనరంజనిలో చదువుతున్నారన్నమాట.

అది సంపాదకులకు పంపించిన నాలుగైదు రోజుల్లో సుజనరంజని ప్రస్తుత సంపాదకులు, మిత్రులు, తాటిపాముల మృత్యుంజయుడు గారికీ, అంతకు ముందు సంపాదకులు తల్లాప్రగడ రావుగారికీ ఒక విద్యుల్లేఖ పంపించాను. అదేమిటో చిత్తగించండి.

“సుజనరంజని సంపాదక మిత్రులకు నమస్కారం.

ఒక చిన్న విన్నపం. తల్లాప్రగడ రావుగారి ఆధ్వర్యంలో నా అభిమాన వెబ్ పత్రిక సుజనరంజనిలో 'సత్యమేవ జయతే' శీర్షిక మొదలుపెట్టి, తర్వాత మృత్యుంజయుడుగారి ఆధ్వర్యంలో రకరకాల విషయాల మీద, ఐదు సంవత్సరాలు పైగా ఎన్నో వ్యాసాలు వ్రాశాను. మీ ఇద్దరి ప్రోత్సాహం, పాఠకుల అభిమానమే ఇన్ని సంచికలకు నాచేత ఎన్నో చక్కటి వ్యాసాలు వ్రాసే స్పందనని ఇచ్చాయి. నేను ఆంధ్రభూమి వారపత్రికలో ప్రతి వారం నాలుగున్నర సంవత్సరాలు ఏకధాటిగా వ్రాసిన ఎన్నారై కబుర్లు తర్వాత, ఇంతగా పాఠకులని ఆకర్షించిన శీర్షిక లేదని నాకు వచ్చే విద్యుల్లేఖలు, ముఖ పుస్తకం, సుజనరంజనిలో పాఠకుల స్పందన చెబుతూనేవున్నాయి. ఈ అవకాశం ఇచ్చిన మీ ఇద్దరికీ నమోవాకాలు. ధన్యవాదాలు.

కాకపొతే, నేను మొదలుపెట్టిన ఒక ఆంగ్ల నవల, ఒక తెలుగు నవల, వ్రాద్దామనుకున్న కొన్ని కథలు వెనకపడ్డాయి. నేను ఏ వ్యాసమయినా, కథ అయినా వ్రాయటానికి రెండు మూడు గంటలే సమయం తీసుకున్నా, విషయపరంగా కావలసిన సమాచారం సేకరించటానికీ, ఆ సమాచారాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోవటానికి కొన్ని వారాలు పడుతుంది. అది కారణం అనను కానీ, నాకు ఇప్పుడు వయసొచ్చింది కదా, అందుకని కొంచెం నెమ్మదిగా బండి నడుపుతున్నట్టున్నాను.

అందుకే ఈ డిసెంబరు సంచికతో 'సత్యమేవ జయతే' శీర్షికకు 'ముక్తాయింపు' పలుకుదామని అనుకుంటున్నాను. కొత్త సంవత్సరం నించీ, నా శీర్షిక బదులు ఇంకొకరికి ఆ అవకాశం ఇచ్చి మరో చక్కటి శీర్షిక మొదలుపెట్టే అవకాశం వుంటుందని మీకు ముందే చెబుతున్నాను. మీకు ఏదైనా అసౌకర్యం కలిగిస్తే క్షమార్హుడిని.

డిసెంబరు సంచికకు నా "ముక్తాయింపు" పంపించి, ఈసారికి సెలవు తీసుకుంటాను.

మరోసారి ధన్యవాదాలతో, సగౌరాభివందనాలతో,
సత్యం మందపాటి”

౦ ౦ ౦

సంపాదక మిత్రులు ఇరువురూ ఈ విద్యుల్లేఖకు వెంటనే సమాధానం పంపించారు.

“మీ వ్యాసాల వెనుక వున్న శ్రమని గుర్తించాను. మనం మొదలుపెట్టినది ఏదయినా, అది ఎప్పుడో ఒకప్పుడు పూర్తవాలి కదా. అర్థం చేసుకోగలను. డిసెంబరు సంచికతో ముక్తాయింపు పలకటం అర్ధవంతంగా వుంది. భవిష్యత్తులో కూడా మీ రచనా వ్యాసంగం ఇంకా విజయవంతం కావాలని ఆశిస్తున్నాను” అని శుభాభినందనలు తెలిపారు మృత్యుంజయుడు గారు.

“మీ వ్యాసాలను ఎప్పుడూ ఆస్వాదిస్తూనే వుంటాను. మీ ఆంగ్ల నవల కూడా విజయవంతం కావాలనీ, మీకు మరిన్ని విజయాలు కలగాలనీ కోరుకుంటున్నాను” అని శుభాకాంక్షలు చెప్పారు రావుగారు.

‘సత్యమేవ జయతే’ శీర్షికకు ముక్తాయింపు పలుకుతున్నాను అని కొంతమంది సాహితీ మిత్రులతో అంటే, “అదేమిటి? అంత తొందరరెందుకు. మాకు ఇష్టమైన శీర్షిక అది. ప్రతి నెలా చదువుతూనే వున్నాం. ఇంకా వ్రాయవచ్చు కదా..” అన్నారు.

మరి శ్రీశ్రీగారు అన్నట్టుగా, పీత కష్టాలు పీతవి.

సంపాదకుల రెండు ఉత్తరాలు చదువుతుంటే, మిత్రుల స్పందన వింటుంటే, నాకు ఏమనిపించిందో తెలుసా? ముక్తాయింపు పలకటంలో ఏమాత్రం ఇంపు లేకపోగా, అది అంత సులభం కాదని. ఇన్నేళ్ళు నడిపిన శీర్షికతో విడాకులు పొందటం కొంచెం కష్టమేనని. నా వ్యాసాలకూ, కథా శీర్షికలకూ, ధారావాహిక నవలలకూ ఇది కొత్త కాదు కానీ, ఇలా ‘శుభం’ పలికే ప్రతిసారీ మళ్ళీ ఎందుకో కొత్తగా ఆ భావన వస్తుంటుంది!

౦ ౦ ౦

“సత్యమేవ జయతే” కానీ, “ఎన్నారై కబుర్లు” కానీ, అలాటి వ్యాసాలు వ్రాసేటప్పుడు ఒక సౌలభ్యం వుంటుంది. అదేమిటంటే, కథలకీ. కవితలకీ వున్నట్టు, వ్యాసాలకి ఒక లాక్షణిక చతురస్రం అవసరం లేదు. కొంచెం స్వతంత్రం ఎక్కువ. ఆరోహణ, అవరోహణ వుండవు. ఒకే శ్రుతిలో వ్రాయాల్సిన పని కూడా లేదు. ముగింపు ఇలా వుండాలనీ, అలా వుండకపోతే మార్కులు తగ్గించాలనీ ఎవరూ అనరు. కాకపోతే ఈ వ్యాసాల్లో ఆకాశమే హద్దు. ఏ విషయం మీద వ్రాసినా, కొంచెం శ్రమపడి కొంత పరిశోధనతో వలసిన సమాచారం సేకరించి పాఠకులని ఆకట్టుకునే విధంగా, ఆలోచింపచేసే విధంగా వ్రాయగలిగితే, ఏ రచయితకైనా తను పడిన శ్రమకి ఫలితం దక్కినట్టే! రచయిత తను ఎత్తి చూపే సమస్యలకి, పరిష్కారం ఇవ్వలేదనే విమర్శని తరచూ వింటూ వుంటాం. ఏ రచయిత అయినా, వేరే రచయితలకి ఒక పాఠకుడే కదూ! అన్ని పరిష్కారాలకీ సమాధానం చెప్పటం సాధ్యం కాకపోయినా, అవి ఆ రచయిత ఆలోచనా పరిధిలో లేకపోయినా, సరైన మార్గంలో పాఠకులలో ఆలోచనలని రేకెత్తించే విధంగా వ్రాయగలిగితే ఆ వ్యాసానికి ఫలితం దక్కినట్టే అని నా స్వంత అభిప్రాయం! వేద వ్యాసుడే ఎన్నో సమస్యలకు సరైన సమాధానాలు ఇవ్వకుండా వ్రాసినప్పుడు, నాలాటి చిన్నకారు సన్నపాటి వ్యాస రచయితలు ఏపాటి?

౦ ౦ ౦

ఈ ‘సత్యమేవ జయతే’ వ్యాస పరంపరలో అమెరికాలో నివసిస్తున్న భారతీయుల, ముఖ్యంగా తెలుగువారి కష్టసుఖాల గురించి చర్చించటమే కాకుండా, భారతదేశంలో పరిస్థితులు, కులాలతో మతాలతో అక్కడ ముణిగి తేలుతున్న రాజకీయాలు, అమెరికాలో కాకిలా వాలిన ఆ రాజకీయాల, సాంఘిక వాతావరణ దిగుమతులూ, ప్రపంచీకరణలో ముందూ వెనుకలూ, మానవత్వపు విలువలూ, వ్యక్తిత్వ వికాసపు కబుర్లు... ఇలా ఎన్నో విషయాల మీద మాట్లాడుకున్నాం. విషయపరంగా కొన్ని విషయాలు సాహితీ మిత్రులు కోరి మరీ వ్రాయించుకున్నారు. అలా సలహాలు ఇచ్చి ప్రోత్సహించిన వారికీ, హించని వారికీ, చదివి స్పందించినవారికీ, స్పందించనివారికీ.. అందరు పాఠక మహానుభావులకీ వందనాలు. ధన్యవాదాలు.

చాల సందర్భాలలో ‘నొప్పింపక, తానొవ్వక తిరుగువాడినే’ అయినా, అప్పుడప్పుడూ విషయపరంగా కొందరిని నొప్పించటం అసంకల్పితంగా జరగుతూనే వుంటుంది. మరి అందరి ఆలోచనలూ ఒకే రకంగా వుండవు కదా! అందులోనూ తెలుగువారు పదిమంది వుంటే, పదిహేడున్నర అభిప్రాయాలు వుంటాయి కదా! నామీద నమ్మకం పెట్టుకుని ఈ శీర్షికని ఇన్నాళ్ళు (ఇన్నేళ్ళు అందామా?) ప్రోత్సహించినందుకు ఇరువురు సంపాదకులకీ, సిలికానాంధ్ర వారికీ పేరు పేరునా ధన్యవాదాలు!

౦ ౦ ౦


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)