సారస్వతం - 'దీప్తి' వాక్యం
గీతా జయంతి
- దీప్తి కోడూరు

ఈ నెల 10వ తేదీన గీతా జయంతి.

అంటే భగవద్గీతకు పుట్టిన రోజన్న మాట!

మానవులు, జీవులు పుట్టడం మనం విన్నాం, కన్నాం కానీ గ్రంథాలు పుట్టడం, దానికి జన్మదినాలు జరుపుకోవడం ఏమిటి?

ఔను!

ఇందులో మహత్తర విశేషం ఇమిడి ఉంది.

భారతీయ అంతరాత్మను ప్రతిబింబించే మహత్తర, దివ్య, తపో స్వరూప సద్గ్రంథమే భగవద్గీత.

మొత్తం మన దేశంలో వెలుగులోకొచ్చిన గ్రంథాలన్నీ సమీక్ష చేసి, వాటిని మానవ జీవితంతో సమన్వయం చేసి, అక్షర రూపం దాల్చిన భావాల విప్లవమే భగవద్గీత.

వేదోపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు కలగలిసిన ప్రస్థాన త్రయ వ్యాఖ్యానమిది.

భగవద్గీత ప్రాచీన ఋషివర్యుల సమాహార తపస్సుకు ప్రతిరూపం గనుక ఆ మహర్షుల తపోశక్తిని ప్రసాదించే అక్షర స్వరూపమైన గురు స్వరూపమై మనను అనుగ్రహించగలదు. కనుక గీతకు జయంతి సమర్ధనీయమే.

మహాత్ములే మానవ జాతికి భగవంతుణ్ణి పరిచయం చేసి, ఆయన ఉనికిని వివరించి అనుభూతిని ప్రసాదించినవారు. అట్టి మహానుభావులకు జయంతులుంటాయే కానీ వర్ధంతులుండవు. అలాగే శ్రీమద్భగవద్గీత కూడా జయంతితో ఆరంభమై, చిరంజీవిగా వర్ధిల్లుతూనే ఉంటుంది.

భగవద్గీతకు రంగస్థలమైన ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నేడు ఉత్తర్ ప్రదేష్ లోని జ్యోతిసర్ తీర్థగా పిలువబడుతోంది. ఆ ప్రదేశంలో పడమటి దిక్కున పాండవులు, తూర్పు ముఖంగా తమ సైన్యాలతో మోహరించారు. అక్కడ వెనుకగా ఒక సరస్సు ఉంది. తూర్పున కౌరవులు పడమటి ముఖంతో యుద్ధానికి సన్నద్ధమయ్యారు.

ఈ పవిత్ర దినాన వేలాది భక్తులు ఈ పవిత్ర స్థలంలో సమావేశమై గీతా పారయణం చేసికొని, అగ్నిని వెలిగించి, హోమం చేసి, ఒకరికొకరు వెలిగే దీపాలను, భగవద్గీత గ్రంథాలను పరస్పరం కానుకగా ఇచ్చుకుంటారు.

అక్కడికి వెళ్ళడానికి వీలు కాని వారు తామున్న స్థలంలోనే ఉంటూ, భావనలో ఆ రణరంగాన్ని స్మరించుకొని, ధనుర్ధారియైన అర్జునుణ్ణి, సారధి, నారాయణ స్వరూపియైన కృష్ణుణ్ణి ధ్యానించుకొని విజయవంతులౌతారు.

భగవద్గీతా జననానికి నాందియైన కథాక్రమాన్ని ఇప్పు డు స్మరించుకొందాం.

ఈ మహాభారత సంగ్రామానికి కొద్ది ముందుగా వేదవ్యాస మహర్షి ధృతరాష్ట్ర మహారాజు వద్దకు విచ్చేసారు. "నీకివి చాలా దుర్దినాలు. కుమారులతో సహా నీ వారంతా యుద్ధంలో త్వరలో మరణించబోవడం విధి నిర్ణయం. కనుక దానిని గురించి చింతించవలదు. నీకు నేను దృష్టిని ప్రసాదిస్తాను. నీవు యుద్ధాన్ని చూడవచ్చు." అని చెప్పాడు.

ఆ మహర్షి వచనాలకు వణికిపోయిన ధృతరాష్ట్రుడు, "ఓ ప్రభూ! జీవితమంతా అంధుడిగా గడిపిన నేను ఇప్పుడిచ్చే దృష్టితో నా కుమారుల మరణాన్ని వీక్షించదలచడం లేదు. అయితే ఎవరైనా యుద్ధం జరిగే క్రమాన్ని వివరిస్తే మాత్రం సంతోషిస్తాను." అని అడిగాడు.

వెంటనే వ్యాస మహర్షి, "అయితే సంజయుడీ పని చేస్తాడు. అతడికి దివ్య దృష్టి లభిస్తుంది. దాని వల్ల అతడిక్కడే ఉండి యుద్ధరంగాన్ని వీక్షించగలడు. రాత్రింబవళ్ళు అతడికా శక్తి ఉంటుంది. అంతే కాదు, యుద్ధంలో పాల్గొనే వీరుల మనోభావాలు కూడా క్షుణ్ణంగా దర్శించగలడు. ఈ పనిలో అతడికి అలసట కానీ, నిస్సత్తువ గానీ ఉండదు. ఏది ఏమైన ప్రస్తుతం దృశ్యమానమౌతున్న శకునాలన్నీ కౌరవులకు అశుభాన్నే సూచిస్తున్నాయి" అని వివరించి వ్యాసుడు నిష్క్రమించాడు.

ఆ విధంగా మహాభారత యుద్ధాన్నంతా సంజయుడు ధృతరాష్టుడికి వివరించడంలో భాగంగా భగవద్గీత కూడా ప్రవచించబడటం జరిగింది.

ఇక భగవద్గీతకు రంగస్థలమైన కురుక్షేత్రాన్ని స్మరిస్తే, రెండు సైన్యాల మధ్య రథాన్ని ఆపి, పరికించిన అర్జునుడు వివశుడౌతాడు. శక్తిహీనుడై, హీన స్వరంతో అశక్తుడై, నిర్వీర్యుడై, శోకసంలగ్న మానసుడై, కర్తవ్య విముఖుడౌతాడు. ఆ సమయంలో పార్థసారధియైన శ్రీ కృష్ణుడు భగవానుడై చేసిన బోధయే గీతా సారాంశం. అట్టి భగవద్గీత రూపొందిన దినమే గీతా జయంతిగా పిలువబడుతోంది. భగవానుడైన శ్రీ కృష్ణుడు తన భక్తుడు, ప్రియసఖుడు అయిన పార్థునికి గీతా బోధ చేసిన పరమ పవిత్ర దినమిది.

భగవద్గీత భారతీయ అంతరాత్మను ప్రతిబింబిస్తుంది. వేదాల అంతిమ భాగాలైన ఉపనిషత్తులను, బ్రహ్మ సూత్రాలను అందరికీ అందించడం ద్వారా ప్రస్థాన త్రయంలో ప్రముఖమైనది శ్రీమద్భగవద్గీత.

భగవద్గీతలో 18 అధ్యాయాలతో కూడిన 700 శ్లోకాలు ఉన్నాయి. అంత సవిస్తారమైన విషయాన్ని మోహరించిన ఉభయ సైన్యాల మధ్య చెప్పడం సాధ్యమా? అన్నది ఒక ప్రశ్న.

దానికి పెద్దలిచ్చే సమాధానమిది:

శ్రీకృష్ణుడు గొప్ప బోధనా దక్షుడు, అంటే విషయం చెప్పడంలో సమర్ధుడు;ఎలా చెప్పాలో తెలిసినవాడు. అర్జునుడు కూడా గ్రహణధారణా సమర్ధుడే. కనుక అర్జునుడికి అర్థమయ్యేలా కృష్ణుడు కొన్ని పదాల్లోనో, వాక్యాల్లోనో చెప్పిన విషయ సారంశాన్ని మానవ జాతికి బోధపరిచేందుకై వ్యాస మహర్షి విపులంగా వ్రాసి ఉండవచ్చు.

మహాత్మా గాంధి వంటివారిని ఎందరినో ప్రభావితం చేసిన భగవద్గీత గురించి ఇప్పటికే వేలాది వ్యాఖ్యానాలు భారతీయ భాషల్లోనే కాక, అనేక ప్రపంచ భాషల్లోనూ లభించడం దాని ఔన్నత్యాన్ని సూచిస్తుంది.

ఇంత గొప్ప జీవన సత్యాన్ని బోధించి, అనుభవంగా విశ్వరూపాన్ని ప్రసాదించడానికి యుద్ధ రంగం ఎలా తగిన స్థలం? అనడిగితే, మన ప్రాచీనులు మహత్తర జీవిత సత్యాలను రూపకాలంకారంలో చెప్పడం పరిపాటి.

జీవితమే కురుక్షేత్రమనే యుద్ధ రంగం. ప్రతి జీవి, ప్రతి నిత్యం చేసే జీవన పోరాటమే అక్కడ జరిగిన మహా సంగ్రామం.

చివరగా ఒక్క మాటతో ఈ వ్యాసానికి భరత వాక్యం పలుకుతాను.

భగవద్గీతలోని సిద్ధాంతాన్ని, ఇంకా దానికంటే ప్రశస్తమైనదీ ఎందరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా చెప్పవచ్చు. కానీ భగవద్గీత యొక్క గొప్పతనం ఏమిటంటే, ఒక సిద్ధాంతం చెప్పి, దానికి దృష్టాంతంగా అనుభవం ఇవ్వడం ఈ ఒక్క చోటే కనిపిస్తుంది. అదే విశ్వరూప సందర్శనం. ఈ అనంత విశ్వమంతా ఒకే పరమాత్మ స్వరూపమనీ, దానిని గురువనుగ్రహంతో మానవుడు దర్శించి, గొప్ప ఆనందాన్ని, జీవన సాఫల్యాన్ని పొందగలడని నిరూపించింది శ్రీమద్భగవద్గీత.

అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)