నాకు నచ్చిన కథ - బాలల కథ
బాధ్యత
కథారచన - పి. సరళాదేవి
శీర్షిక నిర్వహణ: తమిరిశ జానకి

ఆవేళ క్లాసు అతి నిశ్శబ్దంగా ఉంది పిల్లలందరి హృదయాలూ ఆ పాఠం పట్ల కుతూహలంతో నిండిపోయాయి. మాస్టారి కంఠం ఖంగుమంటూ వినిపిస్తోంది.

"అత్రి మహానగరంలో ఒక బక్కచిక్కిన ముసలి గుర్రం ధర్మఘంటకు కట్టిన తాటికొసని గడ్డిపరకలు అనుకొని లాగి నమలసాగింది. ఆ లాగుడికి ఘంట మ్రోగుతోంది. అది విన్న న్యాయాధిపతి విషయమేమిటో విచారిద్దామని వచ్చేసరికి తాటి కుచ్చు నములుతున్న గుర్రం కనిపించింది. అది అతనికి విచిత్రంగానే కాక విచారణాంశంగా కూడా తోచింది. గుర్రానికి అది ధర్మఘంట అని తెలియదు. అన్యాయం జరిగినప్పుడు మాత్రమే దాన్ని మ్రోగించి న్యాయం పొందాలని తెలియదు. అది బుద్ధి జీవి కాదు గాని అది జీవి. దానికి ఆకలి వుంది. తాటి కుచ్చును గడ్డి అని భ్రమించేంత ఆకలిలో వుంది. ఆ ఆకలి తీర్చుకోవడం కోసం దానిని అది నమలసాగింది. ఆ విధంగా అది తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పక చెప్పింది. న్యాయాధిపతి కళ్ళంట నీళ్ళు తిరిగాయి గుర్రపు యజమానిని పిలిపించి చీవాట్లు పెట్టాడు. అది వయస్సులో వున్నంత కాలమూ పనిచేయించుకొని, ముసలితనంలో తిండి పెట్టకుండా వూరివెంట వదిలినందకు జరిమానా విధించాడు".

ఇంతవరకూ చెప్పిన మాస్టారు కథావేశంలో మునిగిపోయారు. "చూశారా పిల్లలూ! ఆ యజమాని ఎంత స్వార్ధపరుడో. అది మూగ జీవి. తన కష్టం సుఖం చెప్పుకోలేదు. వీడో...నాగరికత నేర్చిన మనిషి. గుర్రం మంచి పరువంలో ఉన్నన్నినాళ్ళూ బాగా పనిచేయించుకున్నాడు. బాగా సంపాదించాడు. ఇప్పుడు ముసలిది అయిపోయిందని, పెట్టిన తిండికూడా కిట్టుబాటు కాదని వూరిమీద వదిలేశాడు. కొన్ని సంవత్సరాలపాటు తన కుటుంబంలో ఒక సభ్యునిగా బ్రతికింది. అటువంటి జీవిపట్ల కొంచెమైనా మమత లేదు. పోనీ మమతా వద్దు అభిమానం వద్దుగాని కనీసపు బాధ్యత ఉండొద్దా? దానికి నోరు లేదనీ, అడగలేదనీ, బ్రతకలేదనీ తెలిసి కూడా.,."

గంట గణగణ మ్రోగేసరికి టక్కున పుస్తకం మూసేశారు మాస్టారు. చుట్టూ చూశారు. అప్పటికి పిల్లల్లో కూడా చైతన్యం కలిగి బిలబిలలాడుతూ బయలుదేరారు.

నడుస్తున్నాడేగాని ఈ కథంతా రవి మనసులో మళ్ళీ మళ్ళీ తిరగసాగింది. ఆ చిన్నారి హృదయం గుర్రంపట్ల దయతో నిండిపోయింది. ఇలాంటి మనిషికి గుర్రం ఎందుకు సేవ చేయాలి? హాయిగా అడవుల్లో ఆకులూ, తీగలూ మేస్తూ, తన జాతి గుర్రాలతో తిరుగుతూ బ్రతికితే ఈనాడీ ఖర్మ పట్టేదికాదు గదా అనిపించింది. ఆ గుర్రం గురించి ఆలోచిస్తూ, ఆ గుర్రం మీద జాలిపడుతూ రవి ఇంటికి చేరేసరికి ఇంట్లోంచి పెద్ద పెద్ద కేకలు వినిపిస్తున్నాయి. తండ్రి గొంతు తారాస్థాయిలో వినిపిస్తోంటే భయంగా మెట్లపక్కనుండి తొంగి చూశాడు. తండ్రి పిడికిలి బిగించి మరీ నాయనమ్మ మీద అరుస్తున్నాడు.

"ఇంత వయస్సు వచ్చినా నీకన్నా బుద్ధిలేదమ్మా! పెద్దదానివికదా నువ్వు సర్దుకోకూడదూ. ఇంట్లో ఇరవై నాలుగ్గంటలూ కూర్చుని నువ్వు చేసేది మాత్రం ఏముంది? ఆ వంటా వార్పూ ఏదో నువ్వు చూసుకుంటూంటే నీ బ్రతుక్కొక అర్ధం పరమార్ధం కనిపించవా? ఒక్క రెక్క మీద సంపాదన. నేనుమాత్రం ఎంతమందిని ఊరికే భరించను!"

"అవును నాయనా! ఇంత బ్రతుకూ బ్రతికి ఇంటివెనకాల చచ్చినట్టు - నా బ్రతుక్కి అర్డం ఏమిటో పరమార్ధం ఏమిటో ఇవాళ నీ దగ్గిరే నేర్చుకోవాలి" అని కళ్ళు తుడుచుకుంటూ నాయనమ్మ వంటగదిలోకి వెళుతోంది.

చూస్తున్న రవికి గుండె గొంతులో కొచ్చింది. రోజూ ఎందుకో ఒకందుకు ఏదో గొడవ జరుగుతూనే ఉంటుంది. నాన్న లేనప్పుడు అమ్మా నాయనమ్మ కొట్టుకునే వరకూ వచ్చేస్తారు. అమ్మ స్పష్టంగా అంటుంది. -

"క్రిందటి జన్మలో నీ కొడుకేమో గాని ఈ జన్మలో నా మొగుడు. నాలుగు వేలు రూపాయలు పోసి కొనుక్కున్నాను. నీకిష్టమంటే నోరుమూసుకుని పడుండు. లేకపోతీ నీ దిక్కున్న చోటకి పో".

ఆ మాటలు విని నాయనమ్మ ఏడుస్తుంటే రవికి ఏడుపొచ్చేది. ఈ గొడవలన్నింటికీ కారణం నాయనమ్మ. అమ్మ నాన్నలకు ఆవిడ పని నచ్చదు. ఆవిడ మాటలు నచ్చవు. ఆవిడ బ్రతుకు నచ్చదు. అవన్నీ ఎలా ఉండాలో అమ్మ చెబుతుంది. నాయనమ్మ వినదు. ఆవిడ తనకెంత బరువో అమ్మ, నాన్న చెబుతారు ఇద్దరూ. ఇవన్నీ రవి చిన్న బుర్రకి స్పస్టాస్పష్టంగా అర్ధమవుతూనే ఉన్నాయి.

ఇంత వ్యధ భరిస్తూ నాయనమ్మ ఎందుకిక్కడ ఉంటోంది? ఈ విషయం రవికి చచ్చినా అర్ధంకావడంలేదు.

అమ్మా నాన్నా బయటకి రాబోతూ ఉండడం గమనించి రవి చటుక్కున ఇంటి పక్క సందులో దూరాడు. వాళ్ళు వెళ్ళిపోయాక మెల్లగా ఇంట్లోకి వచ్చాడు. పొయ్యి ముందర కూర్చుని నాయనమ్మ ఇంకా కళ్ళు తుడుచుకుంటూనే ఉంది రవిని చూసి కూడా మాట్లాడలేదు. రవికి తెలుసు - దుఃఖం ఎక్కువగా ఉన్నప్పుడు నాయనమ్మ ఎవరితోనూ మాట్లాడదని. రవికి కూడా ఏడుపొచ్చింది. పక్కకి వెళ్ళి కూర్చుని చెయ్యి పట్టుకుని లాగాడు. ఆవిడ మొగంలోకి చూస్తూ -

"ఇక్కడుందొద్దు, ఎక్కడికయినా పారిపో నాయనమ్మా - " అన్నాడు. మనుమడి అభిమానం చూసి నాయనమ్మ కన్నీళ్ళతోనే నవ్వింది. మనుమడి తెలివితేటలు తెలుసుకోవాలనిపించి ప్రశ్న వేసింది.

"ఎక్కడికనిపోయేదిరా"?
నాయనమ్మ ప్రశ్న, తాను తప్పు మాటనలేదన్న ధైర్యానిచ్చింది. ఉత్సాహంగా చెప్పాడు.

"ఎక్కడికో ఒకచోటికి. ఇంత పెద్ద భూగోళంలో ఒక మనిషి బ్రతకడానికి కాస్తంత చోటే దొరకదా నాయనమ్మా"!

"చోటు దొరగ్గానే చాలదురా. నాదీ అనేది చిల్లిగవ్వయినా లేనిదాన్ని ఏం తిని బ్రతకనురా?"

రవి చిట్టిబుర్రకు ఈ సత్యం అర్దం కావడానికి కోంతసేపు పట్టింది. అర్ధం కాగానే -

"ఇక్కడేం చేస్తున్నావు నాయనమ్మా! ఆ పనే నీపని. అవసరం ఉన్నచోట చేస్తే నీకు సరిపోదా నాయనమ్మా"

నాయనమ్మ తెల్లమొఖం వేసింది "ఏమంటున్నాడు వీడు? నా తిండి నన్నే సంపాదించుకోమంటున్నాడు?" మనుమడి సహజ జ్ఞానం ఆమెకు భయం కలిగించింది. సమాజ ధర్మం వాడికి బోధపరచాలనుకుంది. ఇటుతిరిగి, తీరిగ్గా చతికిలబడి మనుమడి రెండు చేతులూ నిమురుతూ, వాడి మొహంలోకి చూస్తూ మొదలెట్టింది.

"చూడరా నాన్నా! నేనూ నీలాగే ఒక అమ్మకూ అయ్యకూ పుట్టాను. వయస్సు వచ్చాక నాకో జతగాణ్ణి చూసి పెళ్ళి చేశాడు మా నాన్న. ఆ జగగాణ్ణి - అదే మీ తాతను నమ్ముకుని, అతడికి పుట్టిన మీ నాన్నను నమ్ముకొని జన్మంతా గడిపేశాను కమ్మగా వండిపెట్టాను చల్లగా సేవచేశాను ఆనందంగా ఇంటిని దిద్దాను. వాళ్ళే నా వూపిరి, వాళ్ళే నా ఆలోచన, వాళ్ళే నా ఆందోళన, వాళ్ళే నా సంతోషం, వాళ్ళే నా సౌభాగ్యం..ఇంతెందుకు? వాళ్ళే నా జీవితం, వాళ్ళు లేని జీవితమంటూ నాకేమీ లేదు. నా వయసూ, నా శక్తీ, సామర్ధ్యమూ అన్నీ వాళ్ళకోసం ఖర్చుచేసి, ఇప్పుడు ఈ ముసలితనంలో నడుం వంగిపోయి చూపు తగ్గిపోయిన ఈ చివరి రోజుల్లో నా కూడు నేను సంపాదించుకోడానికి బయలుదేరాలా నాన్నా!

"ఆడది డబ్బు కోసం, కీర్తికోసం, పదవి కోసం పనిచేయడం మన సాంప్రదాయం కాదురా. స్నేహం కోసం చేస్తుంది. అనురాగం కోసం చేస్తుంది ప్రేమ కోసం చేస్తుందిరా".

నాలుగు రోజులు పోతే నీకూ ఒక పెళ్ళాం వస్తుంది. అప్పుడూ నీకూ తెలుస్తుందిరా. పరవళ్ళు తొక్కే ఆ పడుచు ముందు నీ తల్లి ముసలి అత్తగారవుతుంది. ఆమె అవసరం నీకూ తగ్గిపోతుంది. ఆ తరువాత నీ కొడుకు.."

మరి వినలేక చివ్వున లేచి వీధిలోకి పరుగెత్తాడు రవి. బుర్ర గిర్రున తిరుగసాగింది. అర్ధమయీ అవని ఈ విషయాలన్నీ అతడిని వుక్కిరిబిక్కిరి చేయసాగాయి. యావత్తు ఆడజనం మగాడి మీద చేరబడిపోయే ఈ సాంప్రదాయం అతనికి భయం గొల్పసాగింది.

ఆ రాత్రి అన్నం తిని పండుకున్నాడె గానీ హాయిగా నిద్రపోలేదు. ఆ కలత నిద్రలో కూడా తాటికుచ్చు నములుతున్న గుర్రం, వంటగదిలోని నాయనమ్మ, తను ఆడుకుంటూండే పిల్లి పిల్ల, కుర్చీలో కూర్చున్న అమ్మ, అస్పష్ట రూపంతో నున్న పెళ్ళాం, వీళ్ళే కాకుండా అప్పచెల్లెళ్ళు, కూతుళ్ళూ, మేనత్తలు, మరదళ్ళు వంటి ఏవేవో అస్పష్ట ఆడరూపాలు అన్నీ గందరగోళంగా అరవసాగాయి. భయంతో ఒళ్ళంతా చెమటలు క్రమ్మేసాయి. కనపడని సంకెళ్ళేవో కాళ్ళు చేతులు బంధించేసినట్టనిపించింది. గుండెలమీద పెద్ద బండ ఏదో కూర్చున్నట్టయింది. కెవ్వున కేకవేసి లేచి కూర్చున్నాడు రవి.

(ఆంధ్రప్రదేశ్, డిసెంబర్ 1975)


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)