కథా భారతి - అనగనగా ఓ కథ
ఓ అమ్మాయి తెలుసుకో!
- అరిగే రామారావు

శైలజ సాయంత్రం కాలేజీనుండి యింటికి వచ్చేసరికి ఆమె తల్లి హాలులో కూర్చుని ఎవరో అమ్మలక్కలతో బాతాఖానీ కొట్టుతోంది. ఒకామె పిప్పళ్ళబస్తాలాగా వుంది; మరొకామె గడకర్రకు పట్టుచీర కట్టబెట్టినట్టుగా వుంది. వీళ్ళను తనంతకు ముందెప్పుడూ చూడలేదు.

పుస్తకాలు పట్టుకుని లోపలికి వస్తోన్న తనను చూచి, "ఈ అమ్మాయి ఎవరండీ అనసూయమ్మగారూ:" అని పిప్పళ్ళబస్తా అడిగింది.

"మా అమ్మాయేనండీ : కాలేజీలో బియ్యే చదువుతూంది." అంది. "శైలూ :" అని తనని పిలిచింది. తనని వాళ్ళకు పరిచయంజేయటానికి.

తనప్పటికే గదిలోపలి కెళ్ళిపోయింది - తల్లి పిలుపు వినిపించనట్లే పుస్తకాలు టేబిల్‍మీద పడేసి తలుపు వారగా నిలబడింది. దానికి వాళ్ళేమంటారో విందామని.

వాళ్ళు ఏమంటారో తనకు తెలుసు- "మీకింత పెద్దమ్మాయి వుందండీ?" అని.

ఇదే మాటను విని వినీ విసిగిపోయి వుంది తను.

తను అనుకున్నట్లే పిప్పళ్ళబస్తా మూతిమీద చెయ్యివేసుకుని మరీ అడిగింది ఆశ్చర్యంగా.

"అయ్యో రామా, అలా అశ్చర్యపోతారేమిటండీ: అమ్మాయికంటే పెద్దవాడున్నాడు. కాకినాడలో బి. ఇ. ఫైనలియర్ చదువుతున్నాడు." -ఈ మాట తల్లి మామూలుగా చెప్పినా, ఏదో గర్వంగా చెప్పినట్లనిపించింది తనకు.

"ఏఁవిటీ, మీకు ఇంజనీరింగు చదువుతున్న అబ్బాయి కూడా వున్నాడా:" ఈసారి గడకర్ర ఆశ్చర్యపోయింది.

"క్షమించండి అనసూయమ్మ గారూ : వీళ్ళు మీ సొంత పిల్లలేనా: అంటే మీది రెండో సంబంధం పెళ్ళా... నాకు తెలియక అడుగుతున్నా, మరేం అనుకోకండీ :" అంది పిప్పళ్ళబస్తా.

దానికి అనసూయమ్మ పకపకా నవ్వింది.

ఆ నవ్వులో కూడ తనకు తల్లి గర్వమే ప్రతిధ్వనించింది; వళ్ళు మండిపోయింది.

"తెలియనివాళ్ళు అందరూ అలాగే అనుకుంటారండీ : నా పిల్లలే..." అంది అలా నవ్వుతూనే.

"మిమ్మల్ని చూస్తే ఎవరూ అలా అనుకోరు సుమండీ :"

"ఏమనుకుంటారేఁవిటీ? ఈసారి నిజంగా కాస్త గర్వంతోనే అడిగింది.

"కొత్తగా పెళ్ళయి కాపురానికొచ్చిన క్రొత్త కోడలేమో అనుకుంటారు. ఇంత పెద్ద పిల్లలున్నారంటే ఎవ్వరూ నమ్మరు:" పాపం పిప్పళ్ళ బస్తా సిన్సియర్ గానే అంది.

నిజానికి కూడ అనసూయమ్మ అలాగే కనిపిస్తుంది. నాల్గుపదులు దాటబోతున్నా ఇంకా పల్చగా, లేతగా, రెబ్బపాయిలాగా నాజూగ్గా కనిపిస్తుంది.

"మీ అమ్మాయికి మీ పోలిక వచ్చినట్లు లేదు. మీ అమ్మాయి అంటే ఎవరూ నమ్మరు. పుస్తకాలు తీసికొని లోపలికి వస్తుంటే మీ బంధువులమ్మాయేమో అనుకున్నానండీ:"

"మా అమ్మాయికి వాళ్ళ నాన్న గారి పోలిక వచ్చింది. అబ్బాయిది నా పోలిక--"

ఇక తనక్కడ నిలబడలేక పోయింది. టవల్ భూజానేసుకుని విసురుగా బాత్‍రూంకేసి వెళ్ళిపోయింది.

ఖాళీ ప్లాస్టిక్ బకెట్ లోకి పంపులోంచి నీళ్ళు పడుతుంటే వచ్చే వింత శబ్దాన్ని వింటూ బొమ్మలాగా నిలబడి పోయింది శైలజ. బొమ్మ మనస్సులో ఏవో దృశ్యాలు బొమ్మలు కట్టుతోన్నాయి; నీళ్ళ శబ్దంలోంచి అప్పుడప్పుడు విన్న ఏవేవో మాటలు "రింగ్" అవుతున్నాయి.

"ఆడవాళ్ళంతా మన అనసూయమ్మను చూచి నేర్చుకోవాలి: చీర మాయనీయదు; జుట్టు చెరగనీయదు. అవునే పిల్ల వున్నంతలో శుభ్రంగా, పొందికగా వుండాలి :" -- ఒక పేరంటంలో ఒక నిండుముత్తయిదు యిచ్చిన కాంప్లిమెంట్ : అంతే అనసూయమ్మ ఎబ్బెట్టుగా అలంకరించుకుంటుందని కాదు. "చక్కనమ్మ" మామూలుగా వున్న అలంకరించుకున్నట్లే కనిపిస్తుంది.

"అనసూయమ్మా : ఏమిటే ఎప్పుడు చూచినా నీవు శోభనపు పెళ్ళికూతురులాగా వుంటావు; నీ కూతురు చూడబోతే ముసలిదానిలాగా వుంటుంది--" --ఒక దగ్గరి చుట్టం ఒకప్పుడన్న మాట : ( అవును, వుంటాను -- ముసలమ్మలాగే వుంటాను : మధ్యలో వీళ్ళకేంటి బాధ : నా బదులూ తన బదులూ తనే తగుదునమ్మా అని పెళ్ళికూతురులాగా ముస్తాబయి కూర్చుంటుందిగా? ఇంక తనెలా వుంటేనేం? )

"మీ పిల్లలెవరూ కనిపించరేమండీ? అడుకుంటాని కెళ్ళారా? ఈ అమ్మాయి ఎవరు ? మీ ఆడబిడ్డా ?" --ఈ వీధిలోకి క్రొత్తగా అద్దెకొచ్చిన తాసీల్దారు గారి భార్యామణి పేరంటానికి పిలవటాని కొచ్చి బొట్టుపెడుతూ అన్న మాట ఇది:( అవును, నేను ఈ అందాల బొమ్మగారి ఆడబిడ్డను : అసలు మాట్లాడితే ఈవిడగారి అత్తగార్ని : మీకేంటి : ... అందుకేగా ఈ బిడ్డతో కలిసి ఈ పేరంటాళ్ళాకూ పెళ్ళిళ్ళాకూ వెళ్ళడం మానుకున్నది : )

...బకెట్ నిండిపోయి నీళ్ళు పొర్లిపోతున్నాయి. బొమ్మలోకి జీవం వచ్చింది; ఈ లోకంలోకి వచ్చింది. గాఢంగా నిట్టూర్చి స్నానానికి వుపక్రమించింది.

స్నానం పూర్తిచేసుకుని లోపలికి వచ్చేసరికి పిప్పళ్ళబస్తా, గడకర్ర వెళ్ళిపోయాయి.

తను ఏదో ఆలోచిస్తూ, ఆనాసక్తిగా, మనస్సెక్కడో పెట్టుకుని జడల్లుకుంటుండగా తల్లి వచ్చింది.

"ఏఁవిటా జడల్లుకోవటం శైలూ : చక్కగా నేనేస్తా ఇలా రా : కాలేజీలో బి.ఏ. చదువుకుంటున్న పిల్లవుండే తీరు ఇదేనా ? యింటికి వాళ్ళూ వీళ్ళూ వస్తుంటారు కదా, కాస్త నీట్ గా వుండకపోతే ఎట్లాగా తల్లి ? ఎంతసేపూ నీ చదువు ధ్యాసేనా ?" అంది.

"ఏం, నీ కూతురునని చెప్పుకోవటానికి నీకు తలవంపులుగా వుందా?" ఉక్రోషంగా, దురుసుగా అని విసురుగా తన స్టడీ రూంలోకి వెళ్ళిపోయింది.

పాపం, అనసూయమ్మ విస్తుపోయి చూస్తుండి పోయింది. ఈ పిల్లేంటో, ఈ పద్దతి ఏంటో అర్థంకాకుండా వుందని దీర్ఘంగా నిట్టూర్చింది.

--క్లాసు పుస్తకం తీసిందన్నమాటే గాని మనస్సు దానిమీదకు పొవటం లేదు. అమ్మ మీద కసి, తన మీద తనకు కసి. అందరిమీదా కసి... ఇదేంటి, తన కళ్ళు వూరికే చెమ్మగిల్లుతున్నాయి.
కరువుదీరా ఏడిస్తే గాని ఈ బరువు తగ్గేటట్టు లేదు:

మనస్సు ఇలా బరువెక్కినప్పుడు ఆ వీధిలో వున్న అంజనేయస్వామి కోవెల కెళ్ళి కాసేపు కూర్చుంటే తేలికవుతుంది.

పుస్తకం ప్రక్కన పడేసి లేచింది.

తల్లికి చెప్పుదామని వంటింటి గుమ్మందాకా వెళ్ళింది. మళ్ళీ మనస్కరించలేదు. వెనక్కి వచ్చేసింది.

గుళ్ళో వున్న ఆ కాసేపు ఏదో శాంతి; గుండెలు సేదతీరినట్లుగా వుంటుంది.

ఇవ్వాళ తను ఈ కాసేపు ఏదో శాంతికి కూడ నోచుకోనట్లు లేదు. గుళ్ళో గుమ్మడికాయంత బంగారంతో చేయించుకున్న నగలు దిగేసుకున్న ఒక కోమటామె కనిపించింది. ఆమె అప్పుడప్పుడు గుళ్ళో తననీ, తల్లినీ చూస్తుంటుంది.

ఏదో పని వున్నదానిలాగా పలకరించి, "మీ అక్కయ్య రాలేదే?" అని అడిగింది.

"ఆమె మా అక్కయ్య కాదు, మా చెల్లెలు:" అని పెడసరంగా అంది తను. ఆమె నోరెళ్ళపెట్టుకుని చూస్తుండి పోయింది.

మరో క్షణం కూడ అక్కడ కూర్చోలేకపోయింది. లేచింది.

దారిలో అరుణా వాళ్ళింటి ముందుకొచ్చేసరికి అప్రయత్నంగా తన కాళ్ళు ఆగిపోయాయి. అరుణ వారం పదిరోజుల్నుంచి కాలేజీకి రావటం లేదు. ’జ్వరమండి’ అని వాళ్ళ చెల్లెలు కరుణ చెప్పింది; ఒకసారి వచ్చి చూచి వెళ్ళమని కబురు పంపింది. అరుణ తనకు ఆప్తమిత్రురాలు. స్కూలు నుంచి కలిసి చదువుకున్నారు. అలాంటి అరుణతో రెండు నెలలుగా తాను మాట్లాడటం లేదు.

ఆ రోజు మామూలుగా ఏదో నోట్స్ కోసం వచ్చింది. అప్పుడు అనసూయమ్మ ఏదో పెళ్ళి కెళ్ళటానికి ముస్తాబవుతూంది.

"మీ అమ్మ ఇంత స్లిమ్‍గా వుంటుంది. యోగాసనాలుగానీ వేస్తుందా. ఏమిటే శైలూ:" అని అడిగింది.

తనకు వళ్ళు మండుకొచ్చింది. "ఏం, నీక్కూడా నేర్పుతుంది. నేర్చుకుంటావా?" అని వ్యంగ్యంగా అంది. అరుణ నవ్వి, "కాదే, మన చిన్నప్పట్నుంచీ చూస్తోన్నానుగా, మీ అమ్మగారు అప్పటికీ ఇప్పటికీ చెక్కు చదరకుండా ఇలానే స్లిమ్‍గా వున్నారు.

మా చిన్నక్కయ్యకు నిరుడేగా పెళ్ళయింది. ఒక్క ఇష్యూకే డొక్కయిపోయింది. చూస్తానికి నాకే రోతగా వుంది.---" ఆ కాంప్లిమెంట్ కు తనేదో మురిసిపోతాననుకుంది. కాని, తన మనోవైచిత్రి దానీకేం తెల్సు? అంతే, మర్నాట్నుంచి అరుణతో మాట్లాడటం మానేస్తేగాని తన మనస్సు వూరడిల్లలేదు.

లోపలి కెళ్ళి జ్వరంతో మంచమెక్కిన స్నేహితురాలిని పలకరించటానికి మనస్సు మొరాయించింది. గిరుక్కున వెనక్కి తిరిగి వచ్చింది.

ఆ రాత్రి భోజనాల దగ్గర తనూ అమ్మా ముభావంగా వుండటం గమనించి నాన్నగారు నవ్వుతూ, "అమ్మా కూతుళ్ళూ పోట్లాడుకుంటున్నారా?" అని అన్నారు.

"అమ్మా కూతుళ్ళూ " కాదు సర్, "వదినా ఆడబిడ్డలూ" లేక "కోడలూ అత్తా" అనండి : మీ ముద్దులభార్య సంబరపడిపోతుంది అని అందామనుకుంది. కాని, అన్నం కంచంలో గీతలు గీస్తూ కూర్చుండిపోయింది...

మర్నాడు నిద్రపక్క మీదనుంచి లేవటమే నేరుగా వంటింట్లోకెళ్ళి తల్లితో మెల్లగా మాటలు కలిపింది.

కాని, తన కర్మానికి ఒక్క గంటలోనే అనుకోకుండా సుబ్బులు పిన్నీ వాళ్ళు తిరపతి తిరిగి వెళ్ళుతూ ఇక్కడ దిగేరు. పిన్ని అంటే - తన తల్లికి రెండోదీ - కడగొట్టుది అయిన సొంత చెల్లెలు.

అవటానికి అమ్మకంటే పదేళ్ళు చిన్నదయినా, ఇద్దరు పిల్లలకే లావెక్కిపోయి, రాను రాను చూట్టానికి అసహ్యంగా వుంది.

తనకు అమ్మమ్మ అవుతుందంటే ఎవరన్నా యిట్టే నమ్మేస్తారు... పైగా అమెకు బోలేడు బడాయి. హైదరాబాదులో వుంటున్నావిడకదా, ఆ అవతారానికి తోడు బోలెడు ఫ్యాషన్స్.

వున్న నాలుగురోజులూ సుబ్బులు పిన్నికి తన తల్లిని వుబ్బేయటంతోనే సరిపోయింది. "అక్కయ్యా, నీలాగా వుండాలంటే ఏం చెయ్యాలో చెప్పవే :" అని. "ఏఁవే అమ్మడూ, అమ్మ ఏం చేస్తుందే ఇలా నాజూగ్గా వుండటానికి ?" మళ్ళీ తనని అడుగుతుంది.

తనకేమో వంటికి అవకాయకారం రాసుకున్నట్లుంది. వళ్ళు చిత్రిక పట్టించుకోమని అందామని నోటిదాక వెచ్చేది. "అందరూ ఆమెను మెచ్చుకునే వాళ్ళే:" అనుకుని విసురుగా అక్కణ్ణుంచి వెళ్ళిపోయేది.

ఈ బాబాయి ఒకడూ --- వెధవ గుండూ, మెల్లకన్నూ : అటు వచ్చీ ఇటు వచ్చీ గుటకలు మ్రింగుతూ అమ్మ వంక దొంగచూపులు చూస్తాడు. తనకు వీళ్ళున్న ఆ నాలుగు రోజులూ యింట్లో వుండాలంటేనే ప్రాణంమీదకు వచ్చేది. ఎప్పుడు వెళ్ళిపోతారా అని అనిపించేది.

వున్న నాలుగు రోజులూ తన తల్లిని వుబ్బేసి, మూడొందలు పట్టుచీర పెట్టించుకుని పోయింది. రిక్షాలు కదలగానే "అమ్మయ్య :" అనుకుంది తాను.

కాని, పిన్నిరాక తన గుండెల్లో కనిపించని గాయాలను మరీ ఎక్కువ చేశాయని ఆ తర్వాతగానీ తెల్సుకోలేక పోయింది.

సుబ్బులు పిన్నీ వెళ్లుతూ వెళ్లుతూ తనకి పట్టని క్రొత్త పట్టు జాకెట్స్ తన తల్లి కిచ్చిపోయింది. అవి హైదరాబాదులో కుట్టిన ఫ్యాషన్‍బుల్ జాకేట్స్- పైకిపోయిన చేతులూ క్రిందకు దిగిన మెడా, షేపులున్నూ:

చెల్లెలు వెళ్ళిన తర్వాత వచ్చిన ఒక శుక్రవారం సాయంత్రం అనసూయమ్మ స్నానమదీ చేసి తీరిగ్గా కూర్చుని ఆ జాకెట్స్ లో నీలపు రంగుదీ ఎలా వుంటుందో చూద్దామని వేసుకుంది.

సవరంపెట్టి బర్మాముడేసుకుంది. దొడ్లో కాసిన గులాబీ పువ్వును ప్రక్కగా పెట్టుకుని అద్దంలో చూచుకుంది. జాకిట్ చేతులు మరీ కురచగా వున్నట్లనిపించాయి. జబ్బలమీద క్రింద నల్ల అరా, పైన పచ్చటి అరా - గమ్మత్తుగా వుంది. మెడ ఎలా వుందోనని ముందుకూ వెనక్కి తిరుగుతూ నిలువుటద్దంలో చూచుకుంటోంది.

తన గదిలో టేబిల్ ముందు కూర్చుని చదువుకుంటూ ఇదంతా ఓరకంట గమనిస్తోంది శైలజ. మనస్సులోనే తల్లి అందాన్ని ఒక్క క్షణమో అర క్షణమో మెచ్చుకుందో లేదో, మళ్ళీ అంతలోనే, "ఛీ, సిగ్గు లేకపోతే సరి: అవిడగారు యిచ్చింది ఇంతేచాలని "ఆ బొమ్మ రెవిక వేసుకుని కులుకుతోంది :" అనుకుంది. అలా అనుకుంటేగాని మనస్సుకు సుఖంగా లేదు మరి:

సరిగ్గా అప్పుడే, "మరీ ఎబ్భెట్టుగా వుందేమో :" విప్పేద్దామనుకుంటోంది అనసూయమ్మ.

సరిగ్గా అప్పుడే ఆమె భర్త శ్రీహరి రావు ఆఫీసునుండి వచ్చాడు. గుమ్మంలో నిలబడిపోయి, అద్దంముందు నిలబడి, క్రొత్తగా, మళ్ళీ మెరుగుపెట్టిన బంగారు బొమ్మలాగా వున్న భార్యను చూచి మురిసిపోయాడు.

"ఏంటోయ్, ఇవ్వాళ భలే గమ్మత్తుగా వున్నావు :", "అబ్బ, భలే తమాషాగా వున్నావోయ్ :" అంటూ ముందుకు వచ్చాడు. సందెట్లోకి విసురుగా లాక్కోని, చేతులు బిగించి, వెనక్కి మళ్ళించుకుని పచ్చటి మెడకేసి తన మొగాన్ని రుద్దుకుంటూ, "అబ్బ : కొబ్బరిముక్కలాగా వుందోయ్ : కోవా బిళ్ళలాగా వుందోయ్ : కొరుక్కుని తినేయాలనిపిస్తోందొయ్ :" అని అంటున్నాడు.

"ఛీ, ఏంటది : వదలండీ - అమ్మాయి యింట్లోనే వుంది :" అని అంటూ వదిలించుకోవటానికి అనసూయమ్మ గింజుకుంటోంది.

ఇదంతా గదిలోంచి శైలజ వింటూనే వుంది; వోరకంట చూస్తోనే వుంది.

అనసూయమ్మ జాకెట్ విప్పేయటానికి మరో గదిలోకి వెళ్లబోతుంటే శ్రీహరిరావు వద్దని వారించాడు. "అమ్మాయికి చూపిద్దాం రా, ఏమంటుందో :" అని చెయ్యిపట్టుకుని తన గదిలోకి లాక్కోచ్చాడు.

"చూడమ్మాయి, ఈ జాకట్ మీ అమ్మకు బాగా లేదూ:" అని అడిగేడు.

తనేం అంటుంది? ఏడ్పులాంటి నవ్వు ఒకటి నవ్వింది.

"మీ ఇద్దరూ వెళ్లి ఆ కృష్ణలో దూకండి :" అని మనస్సులోనే కసిగా అనుకుంది.

అప్పట్నుంచి పెద్ద పమిట తీసుకుని భుజాల చుట్టూ కప్పుకుని, గూడలు బిగపట్టుకుని నడవటం అలవాటు చేసుకుంది. స్నోలూ, పౌడర్లూ, కాటుకా వాడటం మానేసింది. పూలకు ఆమడ దూరంలో వుంటుంది. అంతకుముందు చేతులకు వున్న బంగారుగాజులు తీసేసింది; మెళ్లో గొలుసు తీసేసింది. బోసి మెడతో, బోసి గాజులతో వుంటున్నది. ఇలా వున్న వయస్సుకంటే ఎక్కువ వయస్సుదానిలాగా కనిపించడానికి ఏవేవి మార్గాలున్నాయో అలోచించి వాటిని అలవాటు చేసుకోవటం మెదలుపెట్టింది. తనకు త్వరగా సైట్ వస్తే బాగుణ్ణు, ఒక కళ్లజోడుకూడ పెట్టుకోవచ్చుననుకుంది.

ఇలా తనమీద తను కసిపెంచుకోవటం తన "వే ఆఫ్ లైఫ్"గా అలవాటు చేసుకుంది. అందులో తనకొక మానసికానందం లభ్యమౌతున్నట్లుగా ఫీల్ అవుతూ వచ్చింది.

పద్దెనిమిదేళ్లునిండని కూతురుయొక్క ఈ పద్ధతులు చూచి అనసూయమ్మ విస్తుపోతోంది. కూతురు మనస్సులో ఏముందో తెలియక ఆ తల్లి తల్లడిల్లి పోతోంది. కూతురు తనని చులకన చేసి, కూరాకులో పురుగును తీసేసినట్లు తీసిపారేస్తున్నందుకు, కట్టే విరిచిపొయ్యిలో పెట్టినట్లు పెడసరంగా మాట్లాడుతున్నందుకు తనకు భాదలేదు. తన బాధల్లా - నవ్వుతూ త్రుళ్ళూతూ, షోగ్గా ఈ కాలపు ఆడపిల్లలులాగా తన కూతురు వుండటం లేదనే : ఇదే విషయం భర్తతో అంటే ఆయన నవ్వేసి "ఈ రోజుల్లో ఇలా సింపుల్‍గా, మూడీగా వుండటం ఇదొక మోడరన్ టైప్ లేవోయ్:" అని తీసి పారెస్తారు. "కాదండీ, అమ్మాయి ఎందుకో తనలో తానే బాధపడుతోందండీ:" అని అంటే-- "నీ మొగం, పరీక్షలు దగ్గరి కొస్తోన్నాయి కదా సీరియస్‍గా చదువుకుంటోంది. చదువుకోనీయ్:" అని అంటారు. తాను మాత్రం ఇంత తేలిగ్గా తీసికోలేక, కూతురు తత్త్వం అర్థంకాక తనలో తాను సతమతమౌతోంది పాపం ఆ తల్లి :
శైలజ చదువులో ప్రస్తుత: బ్రిలియంట్. పైగా, తనమీద తను పెంచుకున్న కసీ, తన మనస్సు తన కేసిన శిక్షా - అందువల్ల మనస్సంతా చదువు మీద కేంద్రీకరించి చదివి పరీక్షలు రాసింది.

పరీక్షలు రాసి శైలజ అన్నయ్య మోహన్ కూడ వచ్చాడు. అతను వచ్చిన నాలుగురోజులవరకు అతనితో కబుర్లాడుతూ సరదాగా గడిపేసింది. "కనీసం అన్నతో అయినా సరదాగా వుంటోంది, పోనీలే" అనుకుంది అనసూయమ్మ.

కానీ అదీ నాలుగురోజుల సరదాగానే మిగిలిపోయింది:

ఆ రోజు ఏమయిందంటే-

మోహన్ తల్లిని వెంటపెట్టుకుని గుడికెళ్ళాడు. శైలజ యింట్లోనే వుండి పోయింది - తల్లి వెంట వెళ్ళటం యిష్టంలేక. ఆ పూట వంట తనే చేస్తోంది. ఇంతలో హాలులోంచి నవ్వులు వినిపించాయి. మోహన్ నవ్వుతూ ఏదోచెప్పుతున్నాడు. తండ్రి నవ్వుకూడ వినిపిస్తోంది. అంత నవ్వు వచ్చే విశేషం ఏమిటబ్బా అనుకుంది. వంట పని పూర్తిచేసుకుని చేతులు తుడుచుకుంటూ హాలులోకి వచ్చింది.

తనను చూచిన మోహన్, "రావె చెల్లాయి, ఇందాక మేం వస్తోంటే భలే తమాషా జరింగింది_" అన్నాడు.
"ఏఁవిటంత తమాషా?" నవ్వుతూ తను సొఫాలో కూర్చుంది.

ఇంతలో అతగాడు చెప్పిందేమిటంటే --- తల్లీ తను వస్తోంటే బజార్లో తన స్నేహితుడు కలిశాడట. అమ్మను చూచి, "ఎవరీమె మీ సిస్టరా?" అని అన్నాడట. తను అవునన్నాడట. తీరా వచ్చేసేముందు మా సిస్టర్ కాదు, మా అమ్మగారన్నాడట. దానికి ఆ ఫ్రెండ్ ఆశ్చర్యపోయాడట -- అదీ సంగతి: దానికి చెప్పలేక "వో" ఇదయిపోతున్నాడు; దీనికే నవ్వలేకపోతున్నారు. తండ్రి గొప్పగా కులుక్కుంటున్నాడు. తల్లి కన్నెపిల్లలాగా సిగ్గులు పోతోంది... ఛీ చీ అనుకుంది.

శైలజకు ఈ "తమాషా" వినగానే మొగంలో రంగులు మారాయి; నవ్వు మొగంలోనే ఇంకిపోయింది. గుండె కుదుళ్ళల్లోంచి దుఃఖంపైకి తన్నుకొచ్చింది. చివాల్న లేచి, తన గదిలోకి వెళ్ళిపోయింది. తండ్రీ, "అరె, వెళ్ళిపోతున్నావేంటీ శైలూ?" అన్నాడు. తను తలనొప్పిగా వుంది అంది.

ఆ రాత్రి ఎవరు ఎంత బ్రతిమిలాడినా భోజనం చెయ్యలేదు. మర్నాటి నుంచి తన అన్నయ్యతో కూడ మాట్లాడటం మానేసింది. యింట్లో అందరితో ముభావంగా వుంటోంది. కాలేజీ లైబ్రరీ పుస్తకాలతోనే కాలక్షేపం చేస్తోంది. మోహన్ కావాలని గదిలోకి వెళ్ళి మాట్లాడిస్తే ఏదో గిల్లికజ్జం పెట్టుకుంటుంది.

శ్రీహరిరావుకు కూతురు ప్రవర్తన వింతగానే కనిపించింది భార్య చెప్పితే అప్పట్లో ఏదో అన్నాడుగాని, మొత్తానికి ఇదేదో ఆలోచించవలసిన విషయంలాగే వుందనుకున్నాడు.

ఇంతలో రిజల్ట్సు వచ్చాయి. యిద్దరూ ఫస్టుక్లాసులో పాసయ్యారు. మరో వారం తర్వాత, శైలజ ఫస్టుక్లాసులో పాసవటమే కాదు యూనివర్సిటికే ఫస్టు వచ్చిందని తెల్సింది. అందరూ సంతోషించారు. శైలజ భావాలేమిటో ఎవరికీ తెలియదు.

శైలజ తన చిన్ననాటి స్నేహితురాలయిన అరుణతో కూడ మాట్లాడటం లేదన్న విషయం శ్రీనివాసరావుకు ఆ ఉదయమే తెల్సింది. ఆ సాయంత్రం ఆఫీసునుండి రాగానే కూతురు గదిలోకి వెళ్ళాడు. శైలజ పుస్తకం పట్టుకుని కూర్చుంది. కాని, ఆలోచనలు మాత్రం ఎక్కడో వున్నాయి.

"శైలూ : అలా డాబామీద కూర్చుందాం వస్తావా?" అన్నాడు.

మారు మాట్లాడకుండా డాబా ఎక్కింది.

శ్రీహరిరావు లుంగీ కట్టుకుని రెండు గ్లాసులతో కాఫీ తీసికొని, సిగరెట్టు పెట్టె తీసికొని డాబామీద కెళ్ళారు.

...శ్రీహరిరావు క్రిందకు దిగి వచ్చేసరికి రాత్రి ఏడుగంటలు దాటింది. అనసూయమ్మ వంట చేసేసి, స్నానం చేసి, పూలు గ్రుచ్చుతూ కూర్చుంది.

"తండ్రీ కూతుళ్ళ మంతనాలు అయ్యాయా? అమ్మయి ఏదీ? నవ్వుతూ అంది.

"బ్రెయిన్ వాష్ అయిందిగా, ఇంకో గంటకిగానీ క్రిందకు దిగిరాదు". అని టవల్ తీసుకొని స్నానం చెయ్యటానికి బాత్‍రూం కేసి వెళ్ళాడు.

శైలజ పైకి చూస్తో డాబామీద పడుకుంది. ఆకాశంలో మిలమిల మెరుస్తోన్న నక్షత్రాలను చూస్తూ ఆలోచిస్తోంది. చంద్రుడంత పెద్దగా, ప్రకాశంగా లేడని తారకలు తమ వునికే నిరర్ధకమనుకుంటున్నాయా? నిజానికి ఎంత పెద్ద చంద్రుడు వుంటేనేం--- చుక్కలు లేని ఆకాశం బోసిగా ఏం బాగుంటుంది? ఒక విధంగా చూస్తే, ఎప్పుడో వచ్చి ఎప్పుడో పోయే నిలకడ లేని ఈ చంద్రునికంటే చీకటిపడాగానే గుండెగూటిలో దీపాలు వెలిగించుకునే ఈ చిన్ని చిన్ని చుక్కలే మేలు : చంద్రుని రాహువు మ్రింగిన రాత్రి కూడ ఇలా నిశ్చలంగా నిండుగా వుంటాయి: ఇలా చూస్తే చుక్కలే గొప్పవి... నాన్నగారన్నట్లు ప్రతి ప్రాణికి ఏదో ఒక టేలెంట్ వుంటుంది. భగవంతుని సృష్టిలో ప్రతి ప్రాణికి ఒక్ "పర్ పస్" తనలోని టేలెంట్ ను వుపయోగించుకుని ఆ పర్పస్ ని పూర్తిచేయడమే జీవితానికి అర్థం... నాన్నగారు జీవితాన్ని ఎంత చక్కగా అన్‍లైజ్ చేశారు.

నిజంగా చూస్తే అమ్మకంటే తనెంత గొప్పది : అమ్మలో కేవలం అందం మాత్రమే వుంది. అదీ నాలుగురోజులు పోతే వన్నె తరిగిపోయే అందం : తనలో అపారమైన విద్యాతృష్ణ వుంది; రోజులు గడిచినకొద్దీ పెరిగే మేదస్సు వుంది. అమ్మ పదో క్లాసు కూడ పూర్తిగా చదివిందో లేదో : తనిక తనలో లేని దానికోసం కుమిలిపోదు; ఇతరుల్లో అది వుందికదా అని జెలసీతో కుళ్ళిపోదు. తనలో వున్న విద్యాసంపత్తును పెంచుకుంటుంది. ఎం.ఏ. చదువుతుంది. ప్.హెచ్.డి. చేస్తుంది...

---అబ్బ , ఇలా ఆలోచిస్తోంటే గుండెల్లో బరువు ఎలా మెల్లమెల్లగా కరిగిపోతుంది : ఎక్కడ్నుంచో ఏదో "బలం" మెల్లమెల్లగా తన పిచ్చి మనస్సులోకి బేలగుండెల్లోకి ప్రాకుతూ వస్తోంది: అమ్మకంటే, మరింకెవరికంటే తను తక్కువది?

శైలజ లేచి నిలబడింది. నిటారుగా నిలబడింది.

ఇవ్వాళ రాత్రి అమ్మ పక్కలో తన చిన్నప్పటి లాగా ఆమె మెడను వాటేసుకొని పండుకోవాలనుకుంది.
రేపు అరుణా వాళ్ళింటికెళ్ళాలనుకుంటూ మెట్లు దిగింది.

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)