శీర్షికలు - సంగీతరంజని
భక్త రామదాసు
- కళాతపస్వి కొణికి సత్యనారాయణరావు

పవిత్ర గోదావరి నదికి తూర్పుతీరాన పశ్చిమాభిముఖులైన వెలసిన శ్రీ సాతారాముల దివ్య క్షేత్రం భద్రాచలం. ఖమ్మం జిల్లా కొత్తగూడెం (భద్రాచలం రోడ్డు) రైల్వే స్టేషనుకు సుమారు 40 కి.మీ. దూరంలో ఉన్న ఈ మహాపుణ్యక్షేత్రం, అసంఖ్యాకంగా రామ భక్తులనాకర్షిస్తున్నది. రెండు చేతులలో ధనుర్భాణాలు మరో రెండు చేతులలో శంఖ చక్రాలు కలిగియున్న చతుర్భుజ రాముడు ఈ ఒక్క క్షేత్రంలోనే కనిపిస్తాడు. భద్రాచలానికున్న ప్రత్యేకతలలోనిదొకటి. భద్రాచల క్షేత్రానికి నేటి వైభవాన్ని కల్పించినవాడు ''భక్త రామదాసు''గా ప్రసిద్ధి గాంచిన కంచెర్ల గోపన్న.

మన తెలుగు వాగ్గేయకారులలో వాగ్గేయకారుడనగా, ఒక గేయాన్ని రచించి, సంగీతాన్ని తానే కూర్చి, శ్రావ్యంగా గానం చేయగలవాడు వాగ్గేయకారుడుగా పేర్కొనదగిన త్యాగరాజు, నారాయణతీర్థులు క్షేత్రయ్య మున్నగు వారి కోవకి చెందినవాడు భక్త రామదాసు, రామభక్తులెందరో గలరు. కాని రామదాసు మాత్రం ఈ కంచెర్ల గోపన్నయే. పుట్టింది 1630 సంవత్సరం జనవరిలో, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలో తల్లి కామాంబ, తండ్రి అలింగనమంత్రి. ఆరువేల నియోగి బ్రాహ్మణుడు. ఆత్రేయ గోత్రీకుడు. పిన్నవయస్సులోనే కబీర్‌దాసు అను మహమ్మదీయ భక్తుని వద్ద రామ మంత్రాన్ని ఉపదేశం పొంది భక్తిరస ప్రధానములగు రామకీర్తనలు రచింపసాగాడు. రామనామ లేఖనము తోను, రామభజన గోష్ఠులనిర్వహణలోను ఆస్తినంతా ఖర్చుచేసి, చివరకు తన మేనమామలు అక్కన్న మాదన్నల పలుకుబడితో, గోల్కొండ నవాబులపాలనలో పాల్వంచ పరగణాకు తహసీల్‌దారుగా నియమింపబడ్డాడు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఖజానాలోని ఆరులక్షల వరహాలతో, భద్రాచల రామాలయ నిర్మాణాన్ని చేపట్టి, నిత్యధూపదీప నైవేద్యాలతో ఆలయాన్ని కలియుగ వైకుంఠంగా తీర్చిదిద్దాడు. ఫలితంగా పన్నెండేండ్ల కారాగార శిక్షననుభవించాడు. కారాగార క్ష్లేశమనుభవిస్తూగూడ, తాను నమ్మిన ఆరాధ్యదైవమైన, భద్రాచల రామస్వామిపై ఎన్నో మధుర, భక్తిరస కీర్తనలు రచించి గానం చేశాడు.

ఈయన రచించిన కీర్తనలు భజనగోష్టులలో పాడుకొనుటకు అనుకూలముగా ఉండుటచే బహుళప్రచారము పొందినవి. సుమారు 30, 40 రాగములలో కీర్తనలు రచించినట్లు తెలియచున్నది.
ఉదాహరణకు : ఈ క్రింది కీర్తనలు సంగీత కచేరీలలో భక్తిరంజని కార్యక్రమాలలో గానము చేయబడుచున్న అనేక కీర్తనలలో కొన్ని మాత్రమే .

కీర్తన రాగం తాళం
1. తారక మంత్రము కోరినదొరికెను ధన్యాసి ఆది
2. శ్రీరామ నీ నామ మేమిరుచిరా పూర్వికళ్యాణి ఆది
3. ఏ తీరుగ నను దయజూచెదవో నాదనామక్రియ ఆది
4. పాహిరామప్రభో మధ్యమావతి ఝంపె
5. హరి హరి రామ నన్నరమరజూడకు ఖానడ ఆది
6. రామ జోగి మందు కొనరే ఖమాస్‌ ఆది
7. ఏమయ్య రామబ్రహ్మేంద్రాదులకునైన కాంభోజి ఝంపె

ఈ రీతిగా వందకుపైగా కీర్తనలు రచించి గానం చేశాడు. అంతవరకు వాగ్గేయకాలరుల రచనలలో వాడని ''ఆనందభైరవి'' రాగంలో ''పలుకే బంగారమాయెనా'' అను కీర్తన రచించారు.

శతక వాజ్ఞ్మయంలో మేటిగా ప్రసిద్ధి చెందిన దాశరథీ శతక కర్త ఈయనయే! ఇవి ఎక్కువగా ఉత్పలమాల, చంపకమాల వృత్తములలో భక్తిరస ప్రధానములుగానున్నవి. ఈ శతకంలోని ఒక్క పద్యమైనరాని తెలుగువాడు ఉండడనుట అతిశయోక్తిగాదేమో! ఈ పద్యములన్నియు పండిత పామర రంజకముల అందులో కొన్ని హృద్యమైన పద్యాలు.

1. శ్రీరమ సీతగాక నిజసేవ కబృందము
2. దాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు
3. హరునకు నవ్వి భీషణున కద్రిజకున్‌
4. పరమదయానిధే పతిత పావన నామ
5. తరణికు లేక నానుడులతప్పులు గల్గిన
6. ముప్పున కాలకింకరులు ముంగిట నిల్చినవేళ

భగవంతుని, నామాలను, అవతార లీలలను కీర్తిస్తూ రచించిన కీర్తనలు:

(1) శ్రీరామనామం మరువాం (2) ''పాహిరామప్రభో'' - వీటిలో దశావతారస్తుతి గలదు.

తనకు గల్గిన దుఃఖాన్ని రామునికి ఏ విధంగా నివేదించాడో చూడండి.

(1) ముచ్చటైనవాడవేమిరా కోదండపాణి (2) రామచంద్రులు నాపై చలముజేసినారు. (3) ననుబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి.

నిందాస్తుతులు (1) ఎవడబ్బాసొమ్మని కులుకుచు దిరిగేవు రామచంద్రా (2) నిన్ను పోనిచ్చెదనా? (3) సీతమ్మకు చేయిస్తిచింతాకు పతకము.

ఈ రీతిగా ఆర్తి, వైరాగ్యము, శరణాగతి ప్రపత్తి, వీరి రచనలలోగాననగును. రామదాసువల్ల భద్రాచలము, భద్రాచలము వల్ల రామదాసు పేరు పరస్పర ఖ్యాతి గాంచినవి. భద్రాచలరాముడు మన తెలుగువారికి ఆరాధ్య దైవమైనాడు. అందుకనే మన పేర్లు రామయ్య, రామారావు, సీతారామయ్య, దాశరధి, సీత జానకి, వైదేహి మున్నగు పేర్లు విశేషంగా పెట్టుకొంటున్నారు.

దక్షిణ దేశములో రామదాసు కీర్తనలు గానము చేయుచూ ''భక్త రామదాసు'' హరికథ చెప్పెడి స్త్రీ పురుషులు అనేకులు నేటికీ గలరు. మన తెలుగునాట చావలి సూరయ్యగారు (పొన్నూరు), మల్లాది సుబ్బదాసుగారు (మున్నంగి), పాణ్యం సీతారామభాగవతార్‌ (కావలి) మున్నగు ప్రాచీన భాగవతార్లు రామదాసు కీర్తనలు గానము చేయుచూ రామదాసు కథను రోజులతరబడి చెప్పుచూ శ్రోతలను మైమరిపించేవారట. రామదాసు కీర్తనలు ఇంకనూ బహుళ ప్రచారములోనికి రావలసియున్నది - ప్రభుత్వము వారు సికింద్రాబాద్‌ సంగీత కళాశాలకు ''భక్త రామదాసు సంగీత కళాశాల'' యనిపేరు పెట్టి వార్షికముగా సంగీత పోటీలు నిర్వహించి, ప్రాచుర్యం కల్పిస్తున్నారు. - ఇది ప్రశంసనీయము.

భద్రాచలదేవస్తానమువారు, నేలకొండపల్లిలోగల రామదాసు ధ్యాన మందిరములో నిత్యధూపదీప నైవేద్యాదులు ఏర్పాటు చేసి మందిర అభివృద్ధికి కృషి చేయబూనుట ముదావహము.

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)