సారస్వతం

సాహిత్యంలో చాటువులు. 15

- ‘విద్వాన్’ తిరుమలపెద్దింటి.నరసింహాచార్యులు

ఈ నెల ఒక మంచి సుభాషితంతో చాటువులని చదివి ఆనందిద్దాం.


“ వాసనలేని పువ్వు , బుధవర్గములేని పురంబు,భక్తి వి
శ్వాసము లేని భార్య, గుణవంతుడుకాని కుమారుడున్, సద
భ్యాసము లేని విద్య, పరిహాసము లేని ప్రసంగవాక్యమున్
గ్రాసము లేని కొల్వు – కోరగానివి పెమ్మయ సింగధీమణీ!”


పైపద్యం ‘సింగధీమణీ’ అనేశతకం నుండి గ్రహించబడినది. పనికి రాని వాటిని గూర్చి అద్భుతంగా వివరించిన శతకం యిది. తప్పక అందరు చదవతగ్గది. పైపద్యంలోని భావం సులభ గ్రాహ్యం కనుక వివరించటంలేదు. పై పద్యంలో “ పరిహాసము లేని ప్రసంగం” కొరగానిది అంటే పనికి రాదు అంటాడు కవి. మనం నవ్వుతూ, ఎదుటివారిని నవ్వించడం ఒక కళ. మనం మాటాడితే ఎదుటి వారు ‘ఇంకా,ఇంకా వినాలి’ అనేటట్టు ఉండాలి. అందుకే మాటాడేటప్పుడు కొన్ని ‘పద్ధతులు’ ( టెక్నిక్స్) పాటించాలని పెద్దలు చెప్పారు. అవి—


౧. స్పష్టంగా నవ్వు ముఖంతో మాటాడాలి. ( వదనం ప్రసాద సదనం)
౨. దీర్ఘాలు తీస్తూ మాటాడకూడడు.
౩. తల ఆడిస్తూ,తల వంచి మాటాడ కూడదు. ( శిరః కంపీ, అవనత వదనం)
౪. ఎదుటి వారి ముఖంలోకి చూస్తూ మాటాడాలి.

౫.నంగిరిగా, (అస్పష్టంగా) వణుకుతున్నట్లు మాటాడ కూడదు.
౬. ఎదుటి వారిలో విసుగు కనపడినా, ( అంటే బోర్ ఫీల్ అయినా) వినే ఉత్సాహం లేకున్నా!

మాటాడటం మానేయాలి. ముఖ్యంగా పైపద్యంలో చెప్పినట్లు పరిహాసంతో కూడిన ప్రసంగమే చేయాలి. అందుకనే ఎక్కువగా మాటాడేటప్పుడు నవ్వు తెచ్చే వాక్యాలని (జోక్స్ ని ) మధ్య,మధ్య జొప్పించాలి. కనుకనే మన పూర్వ సాహిత్యంలో హాస్యానికి పెద్ద పీట వేసారు. అట్టి హాస్యరసం కలిగి నట్టి కొన్ని చాటువులని మనం చదివి, ఎదుటివారికి చెప్పి ఆనందింప చేద్దాం!

ఈ నెల చాటువు ----
ఒక చెరువులో కొన్ని కొంగలు ( సంస్కృతంలో బకం అంటారు.) ఉన్నాయి వాటి దగ్గరకి ఓ రోజు ఒక హంస వస్తుంది. వాటి మధ్య జరిగే సంభాషణ ఈ చాటు పద్యం. రస విహీనుల మధ్య ఒక పండితుడు, చెడ్డ వారిమధ్య మంచి వాడు ఉంటే ఎలా గేలి చేయ బడతాడో ఈ చాటువు వివరిస్తుంది.

ఎవ్వడ వీవు కాళ్ళు మొగ మెర్రన ? హంసమ! ఎందునుందువో?
దవ్వుల మానసంబునను! దాన విశేషము లేమి చెప్పుమా?
మవ్వపు కాంచనాబ్జములు, మౌక్తికముల్ కలవందు! నత్తలో?
అవ్వి యెరుంగ మన్న ‘నహహా’ యని నవ్వె బకంబులన్నియున్!

హంసలు హిమాలయంలో ఉన్న మానస సరోవరంలో విహరిస్తాయి. ఆ సరస్సులో బంగారు వర్ణంతో మెరిసే పద్మాలు, మేలిమి ముత్యాలు ఉంటాయి. నత్తగుల్లలు కప్పలు వంటివి ఉండవు. మామూలు చెరువులలో వుంటూ నత్తలు, చేపలు తిని బ్రతికే కొంగలకి శ్రేష్టమైన పద్మాల, ముత్యాల యొక్క విలువ తెలియదు. అందుకే అవి హంసని పరిహసిస్తాయి. ఇది పైపద్యభావం.ఇప్పుడు సంభాషణారూపంలో వివరణ------

కొంగలు— “ఎవరునువ్వు? నీ కాళ్ళు ముఖం ఎర్రగా ఉంది ఎందుకు?
హంస - ‘నేను హంసని!’
కొంగలు – “ ఎక్కడనుంచి వచ్చావు”?
హంస - “ చాలా దూరంలో ఉన్న మానస సరోవరం నుంచి వచ్చా!”
కొంగలు - ‘ అక్కడి విశేషాలు ఏమిటి’?
హంస - “బంగారు వర్ణంలో ఉన్న తామర పువ్వులు, మంచి ముత్యాలు లభిస్తాయి!”
కొంగలు – ‘ నత్తలు ఉంటాయా’?
హంస - ‘ అవేమిటో నాకు తెలియదు’!
కొంగలు – “నత్తలు తెలియవా? అని పక,పకా నవ్వుతాయి”

చూసారా! గొప్పవారు గొప్ప,గొప్ప విశేషాలు చెప్పినా అల్పులకు అవితెలియక ‘ఎగతాళి’చేస్తారు. ఈ భావాన్నే శ్రీనాధుడు తన ‘భీమేశ్వర పురాణ’ కావ్యంలో కుకవి నింద చేస్తూ “ అడరి కాకులు చేరి బిట్టరచునపుడు, ఉదధి రాయంచ యూరక యుంట లెస్స, సైప లేకున్న యెందేని చనుట యొప్పు” అని దూషిస్తాడు. చెడ్డవారి మధ్య ఓ మంచి వాడు ఉన్నపుడు వారి ఎగతాళి మాటలకి మౌనంగా ఉండటమే మంచిది. లేదా అక్కడ నుంచి వెళ్ళిపోవడం ఉత్తమం. ఇది పై పద్య పాదానికి భావం. కనుక ‘గొప్పవారిని చూసి మనం ఎప్పుడు ఎగతాళి చేయకూడదు’. అని సుభాషిత రూపంలో ఉన్న పై చాటు పద్యం వివరిస్తుంది.

( సశేషం)మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)