సారస్వతం

సద్గురువాణి- విధి మరియు నమ్మకం

-జగ్గీ వాసుదేవ్, ISHA Foundation

 

ప్రశ్న: పూర్వజన్మ పాపం అంటూ ఏదైనా ఉంటుందా? మంచివాళ్ళకి చెడు ఎందుకు జరుగుతుంది?

సద్గురు: చెడంటూ ఎవరికీ జరగదు. ఎన్నో జరుగుతుంటాయి. నచ్చనివాటిని మీరు చెడు అనుకుంటారు. చూడండి. ఈ రోజు మీ పెళ్ళనుకుందాం. మీరు వీధిలో ఊరేగింపుగా వెళ్దామనుకున్నారు. కానీ ఈ రోజు పెద్ద వాన పడింది. అంతా తడిసిముద్దయ్యారు. అది మీకు చెడు. కానీ ఇంకొకరు ఈ వర్షం కోసం ప్రార్ధిస్తున్నారు. అతనికి వర్షం పడుతోందని చాలా ఆనందం. కాబట్టి ఏది మంచీ, ఏది చెడూ అన్నది కేవలం ఏది మీ ఇష్టాఇష్టాల మీదే ఆధరపడుతుంది. అవునా?

కాబట్టి మనం జీవితాన్ని మంచీ చెడులని వేర్వేరుగా చూడొద్దు. ఎందుకంటే మీరంతా దేవుణ్ణి నమ్ముతున్నారు. అవునా? మీరు దేవుణ్ణి నమ్మినపుడు, ఆయనే అన్నీ సృష్టిమ్చాడని నమ్ముతున్నప్పుడు, ఇకమంచీ, చెడూ ఎక్కడ? ఇదంతా మీకు అవసరమేనేమో? అందుకే ఆయన ఇలా చేస్తున్నాడేమో అనుకోవాలి. కాదంటే మీకు దేవునిపై నమ్మకం అసలైనది కాదని అర్ధం. అవునా? మీరు దేవుణ్ణి నమ్మితే, అతను చేసేవన్నీ సరైనవై ఉండాలి. అవునా? లేదంటె అసలు దేవుణ్ణే తొలగించాలి! తాను చేసేది అతనికే తెలియకుంటే, అతనిని ఆ ఉద్యోగం నుంచి తప్పించాలి. అతను అంతా తెలిసే చేస్తుంటే మనం ఇక ఫిర్యాదు చేయకూడదు.

ఇదంతా దేవుడు తెలిసే చేస్తున్నాడంటే అతను మీకేమి చేసినా మీకు సంతోషమే కలగాలి. అవునా? ఈ రోజు అతను మీతో ఇక ఈ జన్మ చాలు, తిరిగి వచ్చెయ్యి! అంటే మీరు మహదానంద పడాలి. ఎందుకంటే మీరు మీ సృష్టికర్త దగ్గరకు వెళుతున్నారు. కాని వాస్తవం అలా లేదు. మీరు ఇంకో రెండురోజులు మాత్రమే జీవిస్తారని మీ డాక్టర్ చెబితే, మీరు చాలా దుఃఖపడతారు. ఇది భగవతేఛ్ఛ! ఎంత అద్భుతం నేను ఆయన చెంతకే తిరిగి వెళుతున్నాను. అని మీరు భావించి, ఆనందంగా వెళ్ళగలరా? లేదు. మీరంతా వంచనలో కూరుకుపోయారు. మీ మొట్టమొదటి బాధ్యత ఏమిటంటే, మీతో మీరు వందశాతం నిజాయితీగా ఉండడం. ప్రపంచంలోని అందరితో మీరు నిజాయితీగా లేకపోవచ్చు. కానీ కనీసం మీతో మీరు పూర్తిగా నిష్కపటంగా ఉండాలి. ఇది మీ బాధ్యత అవునా!

మీరిప్పుడు ‘పూర్వజన్మ’ కర్మలూ, వాసనలూ అంటూ ఏదో అన్నారు. ఇంకో జన్మ ఉందని మీరెలా భావించారు? ఎవరో మీకు చెప్పారు. అవునా? ఎవరో చెప్పేది మీరెందుకు నమ్ముతున్నారు? అసలు ఆ వ్యక్తికి తెలుసని మీకెలా తెలుసు? పూర్వజన్మల గురించి నేను మాట్లాడితే, అది నాకు వాస్తవం కావచ్చు. నా వరకూ అది వంద శాతం సత్యం కావచ్చు. కానీ మీకు సంబంధించినంతవరకూ అది ఒక కల్పిత కథ మాత్రమే. అవునా? మీ అనుభవంలోకి రానిది నమ్మడమంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్నట్లే కదా? అలాగని నమ్మకుండా ఉండాలని కాదు. ఎందుకంటే, అపనమ్మకం కూడా మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవడమే. కొందరు ఒక దాన్ని నమ్ముతారు. కొందరు దాన్ని నమ్మరు. ఇద్దరూ ఏదో విషయాన్ని నమ్ముతున్నట్లే కదా. ఒక వ్యక్తి ఇది నిజమని నమ్ముతున్నాడు. ఇంకో అతను ఇది అబద్ధం అని నమ్ముతున్నాడు. ఇద్దరూ తమకి తెలియని విషయంపై ఏదో ఒక అభిప్రాయాన్ని నమ్ముతున్నారు.

నాకు తెలీదు అని మీరు గ్రహిస్తే, మీలోని ఈ వివేకం మిమ్మల్ని ఈ స్థితిలో ఉంచదు. అసలు మీరేమిటో తెలుసుకోవాలన్న తపన కలుగుతుంది. ఈ తపన మీలో జ్వలించినపుడు మీరెవరో, ఎక్కడ నుంచి వచ్చారో, అసలు మీరేమిటో అనే అంశాలు తెలుసుకోవాలనిపిస్తుంది. అయితే తానెవరో తెలుసుకుని ఆ ఆనందాన్ని అనుభూతి చెందడానికీ ఎంత కాలం పడుతుంది. అన్నదే ప్రశ్న. ? పన్నెండేళ్ళు యోగా చెయ్యాలా? మీలో సంకల్పం ఉంటే కేవలం ఒక్క క్షణమే చాలు. అవునా? కానీ మీలో సంకల్పం లేదు, ఎందుకంటే మీరు నమ్మకాలతో నిండి ఉన్నారు. మీకు తెలియని ఎన్నో విషయాలని మీరు నమ్ముతున్నారు. కాబట్టి మనం గత జన్మల గురించి, రాబోయే జన్మల గురించి మాట్లాడుకోవద్దు. కేవలం ఈ జన్మ గురించే మాట్లాడుకుందాం. ఎందుకంటే మీకు తెలిసింది ఇదే. మిగిలినదంతా ఒక కల్పిత కథ. కాదంటారా?


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)