కథా భారత

హృదయ మథనం


- నండూరి సుందరీ నాగమణి


పొన్నచెట్టు నీడలో కూర్చుని ఉంది రాధ… గాలిలో నుంచి తేలుతూ, తీయగా వినవచ్చే మురళీగానం కొరకు ఆరాటంగా ఎదురు చూస్తునాయి, ఆమె వీనులు. మసక వెన్నెట్లో మబ్బు తునకయై పొంచి పొంచి తనను చేరే మాధవుని కోసం ఒడలంతా కనులు చేసుకొని ఎదురు చూస్తోంది ఆమె.

ఒక ఝాము గడిచింది బహుభారంగా… ఎదురుచూస్తూనే ఉన్నది రాధ. గడవలేక గడవలేక రెండవ ఝాము కూడా గడచిపోయింది.

ఆకాశంలో చంద్రుడు కూడా ఆశాభంగంతో పడమర వైపుకు తన పయనాన్ని మొదలు పెట్టాడు.
ఇక చేసేదేమీ లేక తాను కూడా ఇంటి ముఖం పట్టింది, రాధ. ఇది మొదటి సారి కాదు... గత కొన్నేళ్లుగా జరుగుతున్నదే... కన్నయ్య తనతో ఆడీ పాడీ ఎంత కాలమయిందో... ఎదురు చూసి ఎదురు చూసి కన్నులు కాయలు కాస్తున్నాయి, మనసు బహు భారాన్ని మోస్తోంది కాని, అతడి కరుణారస వీక్షణాలు తన మీద ప్రసరించటం లేదే....

ఏదో శబ్దం వినిపించి, ఉలిక్కిపడి లేచింది, రాధ. వంటగదిలో పిల్లి దుత్త ఏదో పడగొట్టినట్టుంది. అరె, తానెక్కడుంది? తన ఇంటనే పిల్లల పక్కన శయనించి ఉన్నది. ఓహ్...అయితే ఇదంతా కలన్నమాట. అవునులే... ఇప్పుడు తనకు కలలే కదా శరణ్యమయ్యాయి? తన కన్నయ్య కలల్లోకి రావటం కూడా తగ్గిపోయింది… బాధగా నిట్టూర్చి, మరల నిద్రకి ఉపక్రమించింది, రాధ…

శయ్యపై ముళ్ళు పరచినట్టు…వేడి గాడ్పులు తనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు…ఒకటే నరక యాతన! మనసులోని వేదనంతా కన్నీటి రూపంలో కనుకొలకులనుండి జాలువారుతూ ఉంటే మళ్ళీ ఎప్పటికో నిద్ర పట్టింది రాధకు.

***

నేలపై ముడుచుకు కూర్చుని, మోకాళ్ళలో తల దాచుకొని, ఉన్న రాధకు… మనోహరమైన వేణుగానం వినిపించింది దూరంగా… అది క్రమంగా దగ్గరవసాగింది. నమ్మశక్యం కాక తలెత్తి చూసిన రాధకు తనకు కొంచెం దూరంలో నిలబడి, అరమూసిన కన్నులతో ఎర్రని పెదవులకు మృదువుగా ఆనించిన వంశీలో తన ఊపిరిని ఊదుతూ, తీయనైన రాగాన్ని ఆలపిస్తూ నల్లని మాధవుడు సాక్షాత్కరించాడు.

రాధ తనూలతిక ఆనంద పరవశంతో ఉప్పొంగింది. తటాలున లేచింది… ఆ మురళీ గానానికి దీటుగా మ్రోగాయి ఆమె కాలి మువ్వలు. అంతే! అంతులేని తన్మయత్వంతో నర్తించసాగింది రాధ. తారాస్థాయిని చేరిన వేణుగాన లహరి మెల్లగా క్రిందికి దిగుతూ, మధ్యమ స్థాయినుండి, మంద్రస్థాయికి దిగి, తిరిగి మధ్యమస్థాయిలో ఆగింది… ఆడి ఆడి అలసిపోయిన రాధకు మాధవుడు తన చేయిని అందించాడు… అతని భుజం మీదకు ఒరిగిపోయి, అలుపు తీర్చుకోసాగింది, రాధ.

అలుపు తీరిన మరుక్షణం అలుకబూని అతనికి దూరంగా జరిగింది రాధ.

“అయ్యో, అదేమిటి రాధా?” అమాయకత్వంతో దగ్గర జేరబోయాడు, కృష్ణుడు.

“కన్నయ్యా, నాతో మాటాడకు…” ఎరుపెక్కిన ముఖాన్ని అటువైపు తిప్పేసుకుంది, రాధ.

“అయ్యో, అలుకా, నా మీదనా?”
“ఆహా, నీ మీదనే…నువ్వు నాకు దర్శనమిచ్చి ఎంత కాలమైనదో చెప్పు?”

“ఓ, అదా?” నవ్వేసాడు, మాధవుడు.

“సంసార సాగరంలో తలమునకలుగా మునిగిపోయాను రాధా… ఆ సాగరమెలాంటిదో, వివాహితవు… నీకు నేను చెప్పవలెనా?” క్రీగంట రాధను చూస్తూ చెప్పాడు శ్రీకృష్ణుడు.

బరువుగా నిట్టూర్చింది, రాధ.

“ఎనిమిది మంది భార్యలతో కలిసి...కాపురం చేస్తూ, నీ రాధను మరచిపోయావా కన్నయ్యా?” గద్గద స్వరంతో పలికింది రాధ.

“మరచినది ఎన్నడూ లేదు రాధా, కాని నీ గురించి తలపోయటానికి సమయం చిక్కటమే లేదు...” గంభీరంగా పలికాడు కన్నయ్య.

“నాగురించి? అకటా... విధి ఎంత నిర్దయురాలు? ఈ నాటికి... నీ నోట ఈ పలుకులు వినుటకా నేను జీవించియున్నది? నాకు మాత్రము కన్ను మూసినా, తెరచినా, నీ రూపమే... అనుక్షణం మదిలో మెదిలేవి నీ తలపులే మాధవా!”

“అర్థం చేసుకోగలను రాధా...నీ హృదయం నాకు తెలుసు...” ఆమె ముంగురులను తన వేలి కొసలతో సవరించాడు వెన్నదొంగ.

“నీల మోహనా, అసలు మనమెందుకు ఇలా పుట్టాము? ఆ బ్రహ్మ దేవుడు, నీ కన్నా కొన్నేళ్ళ ముందుగా నాకెందుకు ఈ జన్మను ఇచ్చాడు? నీవు నా కన్నా చిన్నవాడవు కాకుంటే, ఆ మధుర పరిణయ బంధంలో మనము ఒక్కటయ్యే వారం కదా...” ఆవేదనగా అన్నది రాధ.

కృష్ణుని నుండి మౌనమే సమాధానమైంది.

“నీ వివాహ మహోత్సవాల గాధలు గోకులంలోని జనం నోట వింటూ ఉంటే నా గుండెల్లో ఈటెలు దిగినంత బాధ కలిగింది కృష్ణయ్యా...నేను నీకేమీ కానా?” అమాయకంగా అడిగింది కన్నీళ్లు నిండిన కన్నులతో.

“రాధామాధవులు ‘ప్రణయానికి ప్రతీకలు’ అని నీవెరుగవా? నిశ్చల, నిర్మల భక్తి ప్రణయాలకు రాధ హృదయమే చిరునామా...” మార్దవంగా చెప్పాడు యశోదా తనయుడు.

కొంచెం సేపు మౌనంగా గడిచింది. దాన్ని భగ్నం చేస్తూ , “సరే కన్నయ్యా, మీ రాజధాని విశేషములు చెప్పు... వింటాను...” అని అడిగింది రాధ.

కృష్ణయ్య కబుర్లు మొదలు పెట్టాడు. తన పరిణయ గాధలు... రుక్మిణి తనను వలచి వరించటం, సత్రాజితిని తాను పెండ్లాడడము, జాంబవతిని శ్యమంతక మణి తో సహా తెచ్చుకోవటం... ఇలా అష్ట భార్యలతో తన పరిణయ గాధలను చెప్పాడు... రేయి గడుస్తున్నది... మాధవుడు ఏమి చెప్పినా చెవులు విప్పార్చుకొని, మురళీగానమల్లే ఆస్వాదించే రాధకు ఈ కబురులు సొక్కటం లేదు.

సత్య అలుక, పారిజాతాపహరణ గాధను చెప్పటం మొదలు పెట్టాడు...

ఆమెకు ఆ విశేషాలు ఏవీ సాంత్వనను, ఆనందాన్ని కలిగించకపోగా దుస్సహంగా తోస్తున్నాయి. కన్నయ్య పలుకులు ములుకుల్లా తోస్తోంటే, ఇక వినలేక, అయిష్టంగా అన్నది రాధ...

“మాధవా, నీకు మన కబుర్లు, మన ఆనందం, మన రసాస్వాదనం ఇవేవీ గుర్తు రావటం లేదా? నీ భార్యలతో నీ ప్రణయ విశేషాలను, సరస శృంగార సంఘటనలను నాతో చెపుతూ ఉంటే నీకేమీ అపరాధభావన కలగటం లేదా? నాకు మాత్రం వాటిని వినటానికి, విని తట్టుకోవటానికి ఎంత దుర్భరంగా ఉన్నదో తెలుసా నీకు?” వెక్కి వెక్కి ఏడవ సాగింది రాధ.

ఒక్క క్షణం కళ్ళు మూసుకొని తెరిచాడు మాధవుడు.

“అర్థం చేసుకోగలను రాధా! మన ప్రణయ గాధ అంతా ఒక గతం... కరిగిపోయిన కల... ఇప్పటి వైవాహిక జీవితం మాత్రమే సత్యం... జరుగుతున్న కథ... మనం దానిని మరచిపోక, దీనిని ఆనందించక... ఆస్వాదించక తప్పదు రాధా! నీకైనా, నాకైనా... మన అనుబంధం... ఆ నాట్యకేళి, ఆ గానకేళి, ఆ రాసకేళి అదంతా ఒక అనుభవం, అనుభూతి...మాత్రమే... దాన్ని నెమరు వేసుకొని ఆనందించటమే తప్ప, ఇప్పటి జీవితాన్ని విస్మరించటం మనకి సరియైనది కాదు. భర్తగా నాకైనా, ఒక భర్తకు భార్యగా నీకైనా కొన్ని బాధ్యతలు ఉంటాయి రాధా... అవే ముఖ్యము... వాటిని నిర్వర్తించటమే నీ ధర్మము ... నీవు నీ ప్రియుడనైన నాతో పొందిన రస మాధురి ఇక కొనసాగదు. అది గతకాలం లోని ఒక మాధుర్య వీచిక మాత్రమే... ఇక సంసార నిర్వహణ, సంతాన బాధ్యతలే నీకైనా నాకైనా మిగిలిన కర్తవ్యం. ఆ వాస్తవాన్ని నీకు తెలియజెప్పటానికే నేనిలా వచ్చాను...” బోధించాడు, నంద నందనుడు.

“కానీ... కానీ... నా జీవితానికి ఏలికవు నీవే అని...”

“తప్పు రాధా... నిన్ను ప్రేమించే నీ పతి హృదయం ముందు, నీ ప్రేమను అభిలషించే నీ సంతానం ముందు నా ప్రేమ ఏపాటిది? నీ మానస నేత్రాన్ని ఒక్కసారి తెరచి చూసి ఆ ప్రేమను గ్రహించు... నీ ప్రేమను వారికి అందించు... బాలుడనైనప్పుడు నాకీ విషయాలు అవగతం కాలేదు... వివాహంతో నాకు కొంత జ్ఞానం కలిగింది. అందుకనే నేమో ఇన్ని నీతులు చెబుతున్నాను... అందుకే, నిరంతరం నా స్మరణ లో కాలం గడిపే నీవు, ఇకపై దానిని విడచి, ఇహ ప్రపంచానికి రావాలని కోరుకుంటున్నాను...”

“అంటే... ఇక ముందు... మనకి బృందావన విహారాలు, యమునా తటీ విలాసాలు, మురళీ గానాలు, నాట్య కేళులు ఉండవా?”

“ఉండవు... ఎందుకంటే, నీ స్వప్నసీమ లోకి కూడా నేనిక రాను రాధా... సతుల వలపు పాశాలలో బంధితుడనయ్యాను. ఒక గృహస్థుగా ఎన్నో బాధ్యతలు మోయవలసిన విధి నామీద పడినది. ఇక ఇదే మన ఆఖరి కలయిక...ఇక పోతే నీకు ఒక్క విషయాన్ని మాత్రం నొక్కి చెప్ప దలచుకున్నాను... మన బంధం తామరాకు మీద నీటి బొట్టు వంటిది...అది ఎప్పుడూ ఉంటుంది కాని ఒక మధుర స్మృతి లాగానే... తలపులు తీయగా ఉండాలి కాని, ములుకులై బాధించవచ్చునా?”

“మాధవా! ఎందుకింత కటువుగా మాట్లాడుతున్నావు? ఈ నిర్దయ ఏమిటి? సుధాబిందువుల వంటి నీ మాటలు ఈనాడు గరళపు చినుకులై నను బాధిస్తున్నాయి...పరీక్షిస్తున్నావా? కఠినంగా శిక్షిస్తున్నావా?” ఆక్రోశించింది రాధ.

“సరిగ్గా నీ భర్త కూడా నీ గురించి నీలాగే అనుకుంటాడు సుమా!” సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు వనమాలి.

“అదేమిటి?”

“అవును... నీ అవసరాలు, అక్కర చూసేది, నిన్ను ప్రేమించేది నీ భర్త... అతడిని ఏనాడైనా నీవు ప్రేమించావా? మృదువుగా మాట్లాడావా? మనసంతా పరపురుషునిపై ఉంచుకొని, కట్టుకున్న వానికి నీవు చేసేది న్యాయమని అనిపించుకుంటుందా? మనసు లేని సంసారం వ్యభిచారంతో సమానం రాధా...”

“అంటే, నీ ఉద్బోధ ఏమిటి? అతడిని ప్రేమించమనేనా?”

“అవును... అది నీ బాధ్యత... కనీసం అతడు నీకు అందించే ప్రేమకు ప్రతిస్పందించు... ప్రేమన్నది నీ మనసులో దానంతట అదే పుడుతుంది అప్పుడు... ప్రేమించటాన్ని నీకు కొత్తగా నేర్పించనక్కర లేదు రాధా... నీ హృదయమే ప్రేమ భరితం!”

“కాని, కాని... అది నీ విషయంలో మాత్రమే...”

“అని నిన్ను నీవు మభ్య పరచుకోకు... నేను నీకు వశుడను కాను... మన ప్రణయ లహరిని ఒక ఆనంద తరంగంలా... ఒక ప్రత్యేకమైన మధుర వీచికలా మనోమందిరం లో భద్రపరచుకోవాలి... ఇక అదే నీవు చేయవలసినది...” ఆదేశించాడు మాధవుడు.

“కృష్ణా!” ఒక్కసారిగా అతని హృదయవేదిక మీద వాలిపోయింది రాధ. ఆమె కన్నీళ్లు అతని తనువును అభిషేకిస్తున్నాయి. అంతులేని మోహంతో అతని కపోలాలను తన అధరాలతో చుంబించింది రాధ. అప్రయత్నంగానే మాధవుని కనులు కూడా చెమర్చాయి... ఆమె అమలిన ప్రేమకు దాసోహమన్నది అతడి అంతరంగం. కాని దానిని నియంత్రించుకుంటూ, సున్నితంగా ఆ కౌగిలిని విడదీశాడు.

“తూరుపు తెలతెలవారుతోంది రాధా... నీ గృహవిధులకు సమయము ఆసన్నమైనది. నేను కూడా సూర్యోదయం కాక మునుపే ద్వారకను చేరాలి... ఇక మేలుకో, కలలోంచి ఇలలోనికి రా...” ప్రేమగా ఆమె నుదుటను ముద్దు పెట్టుకుని వదిలాడు మాధవుడు.

అడుగులో అడుగు వేసుకుంటూ... అతడి నుంచి దూరంగా నడవసాగింది రాధ. మొట్టమొదటి సారిగా తనను చేపట్టిన వాని గురించిన ఆలోచన, తన గర్భాన పుట్టిన వారి తలంపు ఆమెలో మొదలయ్యాయి...

తెల్లవారిపోయింది. పతిసేవ, పిల్లల ఆలనలో ఇప్పుడు రాధకు సమయం సరిపోవటం లేదు... ఆమెకు రాత్రులందు కలలు రావటం ఆగిపోయింది.

***

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)