కవితా స్రవంతి

అనువాద కవితలు


తలుపుల్లో తమాషాలు



- రచన : 'కళా ప్రపూర్ణ" అవసరాల (వింజమూరి) అనసూయాదేవి


విశాలమైన ఆవరణలో, చిన్న కొండలాంటి ఎత్తైన ప్రదేశంలో అనేకమైన చెట్లూ, వాటినల్లుకున్న తీగలూ, మా వాళ్ళు స్పెషల్ గా నాటుకున్న మరికొన్ని పూలమొక్కలు మధ్య తీర్చి దిద్దినట్లు ఒక అమూల్యమైన భవంతిని నిర్మించుకున్నారు. నా కొడుకు నీహార్ గిరి, కోడలు రాధికా గిరి. అందరితో పాటు ఈ హవేలీకి (మినీ పేలస్ అంటే బాగుంటుందేమో) గృహప్రవేశం చేశాము.

నా రూం నుంచి లివింగ్ రూంకి రావాలంటే క్వార్టర్ ఫర్లాంగు నడవాలి. నాకిప్పుడు 94 ఏళ్ళు. వాకర్ సహయంతో నడుస్తున్నాను. నడత సరిగ్గా ఉన్న దాన్ని, నడక ఎలాగుంటే ఏం పోయింది?

ఈ ఇల్లు రెండు లెవెల్స్ లో కట్టారు. బెడ్ రూమ్స్ నుంచి మెయిన్ హాల్ (Living Room) వరకూ ఒక లెవెల్, కిచెన్, లివింగ్ రూమ్, డాన్సు హాలు వరకూ కొంచెం హైలెవెల్ లో ఉన్నాయి. ఈ హై లెవెల్ కి వచ్చేవరకూ ఒక వాకర్ ని ఉపయోగిస్తాను. అక్కడ నుంచి పై మెట్టు మీదున్న మరొక వాకర్ ని అందుకుని నాకు కేటాయించిన కుర్చీ వరకూ వెళ్ళి కూర్చుంటాను. మునుపటి రోజుల్లో లాగ రెండు ట్రైయిన్ లు మారడం, రెండు బస్సులు మారడం జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఈ నడక నాకు natural exercise లాగ పనిచేస్తోంది.

ఈ ఇంటి అందానికి ముఖ్యకారణం పెద్ద పెద్ద అద్దాల తలుపులు. వీటిని French Windows అంటారనుకుంటాను. నా రెండో వాకర్ మెయిన్ హాలులోకి దారితీస్తుంది. ఆ హాలు చాలా పెద్దది. ఓ ప్రక్క కిచెన్. (right side) రెండో ప్రక్క (left sided) ఆధునికాలంకరణలతో సోఫాల సెట్ వగైరా అమర్చాడు. తూర్పు దిశగా గోడకు పెద్ద టి.వి. పెట్టారు. అద్దాల తలుపులకి ఎదురుగా నా కుర్చీ దాని ముందు భోజన సదుపాయాలకి భోజన బల్ల అమర్చారు. అక్కడ కూర్చుంటే, అద్దాల తలుపుల్లోంచి రకరకాలా తలపులు కూడ తరంగాల్లాగ పుట్టుకు వస్తాయి.

ఈ అపురూపమైన హాల్ ని రోజుకి ఐదు సార్లు విజిట్ చేస్తాను. ప్రొద్దున్న కాఫీకి, తర్వాత బ్రేక్ ఫాస్ట్ కి, ఒంటిగంటకి లంచ్ కి, మధ్యాహ్నం నాలుగు - ఐదు గంటలకు టీకి. అప్పటి నుంచి ఇంటరెస్టింగ్ ఘట్టాలు మొదలవుతాయి. అందుచేత ఒక్కొక్కప్పుడు డిన్నరయే వరకు ఇక్కడే కూర్చుండిపోతాను.

పొద్దున్న కాఫీకి వచ్చినప్పుడు సూర్యోదయ వైభవాన్ని అనగా సూర్యుని రాకపోకలు, గమనికలు, కదలికలన్నీ బాగా గ్రహించాను. ఎందుకంటే ఇంత తీరుబడిగా ఇంత ప్రత్యేకించి ఎప్పుడూ చూడలేదు కనుక. నా కుర్చీకెదుర్గా దూరాన్ని పూలపొదల మాటున దాక్కున్న swimming pool, నేనూ ఉన్నానర్రోయ్ మర్చిపోకండి అంటూ తన అందాన్ని వెల్లడి చేస్తూంది. అందులో సూర్యకిరణాలు పడ్డప్పుడు Alaska లో చూసిన Glaciers జ్ఞాపకం వస్తూంటాయి.

చిత్రమేమిటంటే ఇదేబెల్లా చేమలూ, తీగలూ వగైరాలు ఉదయం నుంచి వేషాలు మారుస్తూ, బహురూపాలు దాల్చి నన్ని ఏమారుస్తుంటాయి. ఉదయం వాటిమీద నేనెక్కువ దృష్టి పెట్టుకోకపోవడం వల్ల, ఎక్కువ వింతలు కనపడవు కాని, సంధ్యా సమయం నుంచీ చీకటి తెరలు కప్పుతూంటే వీటి మార్పులు వింతగా ఉంటాయి. ఆ గుబురుల మధ్య ఎక్కడ నుంచో వెతుక్కుంటూ వచ్చి చిన్న సూర్యరస్మి పడి అక్కడ టార్చిలైట్ లేస్తూ, ఎవరో నక్కి ఉన్నారేమో అనిపిస్తుంది. కొంచెం చీకటి పడుతూంటే, అవే మొక్కలు ఆంజనేయులు విగ్రహంలాగ, మా కాకినాడ నూకాలమ్మ గుళ్ళో అమ్మవారులాగ, వినాయకడు తొండంతో యుద్ధం చేస్తున్న లాగ, గోవర్ధన పర్వతం క్రింద కృష్ణుడూ ఒకప్పుడు తోలు లాగే, కాళీయమర్దనం బాలకృష్టుడులాగ, డాన్సుతో సహా కనబడతాయి. ఆ ఏరియాలో గాలెక్కువగా ఎందుకు వీస్తుందో అర్ధం కాదు. అటువంటప్పుడు ఆ బొమ్మలే మళ్ళా ఇంకోలాగ, ఈ సారి చేతుల్లాగ కనపడి రా..రా.. అని పిలుస్తున్నట్టనిపిస్తుంది. అప్పుడు భయపడి విప్పారిన నా కేటరాక్ట్ కళ్ళతో మళ్ళీ భయపడుతూ చూస్తాను.

మరొక్కప్పుడు ఈ మొక్కలే చిన్న చిన్న పిల్లల్లాగ గెంతుతున్నట్లు కనపడతాయి. ఆ ప్రదేశంలోనే ఇవన్నీ ఎందుకు కనపడాలి చెప్మా. చిన్నప్పుడు భయమేస్తే అత్తయ్య పక్కలో పడుకుని, ఆవిడ పంచను గుప్పిట్లో పట్టుకుని కళ్ళు మూసుకుని పడుకునేదాన్ని. ఇప్పుడు భయమేస్తే ఏం చేయగలను. ఎవరు ధైర్యం చెబుతారు? నువ్వే దిక్కు?

నా స్నేహితులు కొందరు నన్నడిగారు కొత్త ఇంట్లో ఎలాగుందని. ఆల్కట్రాజ్ (famous jail) లో ఉన్నట్లుందన్నాను. ఇలాగంటే మరీ బాగుండదేమో అని అండమాన్ పేలస్ లో ఉన్నానన్నాను. అది కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. ఇంటలెక్ట్యువల్ (Intellectual Sahara) లో ఉన్నట్టుందన్నాను.

పిల్లలు తప్ప నాతో ఎవరూ మాట్లాడరు. అందుచేత మరీ ఏకాకిని. మనుష్యులందరికీ ఏదో కాలక్షేపమో, avocation ఆంటిదో కావాలి. ఈ దేశంలో సుఖపడే పద్ధతులు కనిపెట్టేశారు. అన్ని వయస్సుల వారికి తగినట్టుంటాయి. ఒక్కరూ ఆడుకునే గేమ్స్ కూడా ఉన్నాయి. నాకిప్పుడు 94ఏళ్ళు. 6 తరాలు చూసిన నేను ఇప్పుడెవరికీ అక్కరలేనిదాన్ని. అందుచేత నా కాలక్షేపాన్ని లైట్ అబద్ధాలని నేనే సృష్టించుకున్నాను. అతిశయోక్తులతో కూడుకున్న నా ఊహలకి, కొన్ని రసవంతమైన అబద్ధాలను జోడించి నన్ను నేనే మోసం చేసుకుని ఆనందిస్తాను. ఇదో ఒక విధమైన రియాలిటీ షో అనవచ్చు.

నా షోలో కేరెక్టర్సు - నేనూ, నా పరిసరాలూ, చెట్లూ, చేమలూ, తీగలూ, పువ్వులూ, పక్షులూ, లేళ్ళూ (హాని చేయని జంతువులు). నా ఆటలో కేరెక్టర్స్ కి మేకప్పులు లేవు, స్టేజి లేడు, టిక్కెట్లు అస్సలే లేవు. ఈ షోకి ఏం పేరుపెడదాం? తలుపుల్లో తలపులా? తలుపుల్లో తమాషాలా? విండో షో అందామా? ఏం బాగుంది చెప్మా!

మా షో ఉదయం 7 గంటలకే ఆరంభమౌతుంది. హలంతా ఒక విధమైన మైల్డ్ పరిమళం గుబాళిస్తూంటుంది. చెట్లలోంచో, పువ్వులలోంచో! నా రూం నుంచి మెదటి ట్రిప్ లివింగ్ రూమ్ కి కాఫీకి వెళ్ళి చరిత్రాత్మకమైన నాకు కేటాయించిన కుర్చీలో కూర్చుంటాను. నా కెదురుగా పెద్ద french windows లాంటి తలుపులు ముందు, నాలుగైదు గజాల దూరంలో ఓ వేపచెట్టు లాంటి చెట్టుంది. మరీ పెద్దది కాదు. కనీసం కరివేప చెట్టైనా బాగుండును. ఈ చెట్టు మ్ ఈద ఓ పిచ్చుక గూడు కట్టుకుంది. నా కుర్చీలోంచి మొదటి దృక్కులు ఆ పిచ్చుక మీద పడతాయి. ఓ పిచ్చుక ఎంతో busy గా ఉన్న ఆఫీసర్ లాగ హడావిడి పడుతూ ఈ చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు పరుగెడుతుంది. ఒకప్పుడు అరుస్తున్న పిల్లలమీదో, పెళ్ళాం మీదో కోపం వచ్చిన మగాడిలాగ, తిక్కగా. ఇంటి కార్లు వెళ్ళే చిన్న రోడ్ మీద ఇటూ అటూ పరుగులు పెడ్తుంది. తన ప్రాముఖ్యం అనగా male domination చూపిస్తూ. ఇది పొద్దున్న తంతు. మధ్యాహ్నం నేను లంచ్ కి వెళ్ళీనపుడు ఆ పిచ్చుకే ఎంతో ప్రశాంతంగా కనబడుతుంది. పిల్లలు నోళ్ళు తెరుచుకుని ఆకలితో కీచు కీచుమని అరుస్తూ ఉంటే, ఇంత ఆహారం వాటినోట్లో కుక్కి, తిండి ఇచ్చేస్తే తమ కర్తవ్యం అయిపోతుందని వెళ్ళిపోతున్న ఆ తల్లి, తండ్రులను చూసి ‘వెళ్ళొద్దు’ అన్నట్టు కీచుకీచుమని ఏడుస్తున్న ఆ పిల్లలతో, ‘అదిగో’ ఆ కుర్చీలో కూర్చుందే అమ్మమ్మ,మీకు సాయంగా ఉంటుంది లెండి. మీకు ఏ హాని జరగనీయకుండా వెయ్యికళ్ళతో చూసుకుంటుంది అంటూ తుర్రుమంటాయి.

సరిగ్గా సాయంత్రం 7 గంటల ప్రాంతానికి ఓ నల్ల పిల్లి ఆ మొక్కల్లోంచి బయటకు వస్తుంది. దీనికి విలన్ కేరెక్టర్ ఇవ్వాలి. తప్పదు. దీని ముఖం అలాంటిది. బయటకు రాగానే కత్తులూ, కఠారులూ అన్నీ ఉన్నాయా లేదా జేబుల్లో చూసుకున్నట్టు మెలికలు తిరుగుతుంది. ఒకవేళ Tom and Jerry లో నటించిన పిల్లేమో ఇది.! నిమిషాల్లో అంచల మీద పరుగెడుతూ స్విమ్మింగ్ పూల్ మీదుగా మాయమౌతుంది. ఎక్కడి నుంచి వస్తోందో! ఎక్కడికి వెళుతోందో! రోజూ ఇదే తంతు.

నా షో లో అందమైన ఘట్టం ఇది. రెండు లేళ్ళు - spotted deer గెంతుతూ వచ్చి నా కుర్చీ వైపువచ్చి, ఈ తలుపులకిఎదురుగా హాయిగా ఆడుకుంటాయి. ఉడతల్నీ, తొండల్నీ కూడా చూస్తే అర్చి తరిమే మా కుక్క ziggy(జిగ్గీ) ఈ లేళ్ళ కళ్ళ అందం చూస్తూ అరవడం మర్చిపోయిందేమో తోకాడిస్తూ అద్దాల తలుపులకు ఇవతల పక్క నిలబడిపోతుంది. ఆ జింక పిల్లలు కూడా తోకాడించడం నేర్చుకున్నాయి. పోలీసువాల్ళూ దొంగలూ లాగే.

ఈ అంకమవగానే మళ్ళీ చీకటి, మళ్ళీ తీగలూ, మొక్కలూ వేరే రూపాల్లో కనబడుతూ, నన్నానందపరుస్తూ, ఒకప్పుడు భయపెడుతూ కాలక్షేపాన్నిస్తాయి. ఇవాళ ‘షో’ ముగిసింది.

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)