కథా భారతి

ఆశ్రయం


- చెన్నూరి సుదర్శన్


ఎదిగిన కొద్దీ ఒదుగమని...’ అనే సినీ గేయం సూర్యం ఆదర్శం... నిరంతర కృషి ఫలితం... పిన్న వయస్కులోనే ‘ఉత్తమ పారిశ్రామిక వేత్త’ గా అవార్డు వరించింది.

సూర్యం ఇంజనీరింగ్ మెకానికల్ డిగ్రీ చివరి సంవత్సరంలో ఉండగానే క్యాంపస్ సెలక్షనొచ్చింది. అది ఒక పేరు మోసిన కంపెనీ. అందులో ఒప్పందం ప్రకారం సంవత్సరంబాటు పని జేసి మెళకువలు నేర్చుకొన్నాడు. తనే పదిమందికి జీవనోపాధి కల్పించాలనే తపనతో ‘గాంధీ సోలార్ సైకిల్ పరిశ్రమ’ నెలకొల్పాడు. అది ‘పని చేసేవారిదే పరిశ్రమ’ అనే నినాదంతో నడుస్తోంది. అందులో సైకిలుకు విడిభాగాలు తయారవ్వడమే గాకుండా పూర్తి స్థాయిలో సైకిలు తయారై అన్ని హంగులతో మార్కెట్లోకి వస్తుంది.

సైకిలు 19వ, శతాబ్దంలో (1817-18) కర్ర చట్రంతో బిగించబడిన రెండు చక్రాల సైకిలు నిర్మాణం జర్గింది. 1885లో చైన్ సైకిలు అభివృద్ధి చెందింది. 1890 లో సైకిలు స్వర్ణ యుగం ప్రారంభమైంది. బ్రిటన్‍లో మొదటిసారిగా సైకిలు ఫ్యాక్టరీ నెలకొంది. సైకిలు నిర్మాణానికి ఎక్కువగా కృషి సల్పింది ‘కిర్క్ పాటిక్ మాక్ మిల్లన్’ అనే స్కాటిష్ బ్లాక్‍స్మిత్..

అతనిని ఆదర్శంగా తీసుకొని నేటి కంప్యూటర్ యుగంలో సైకిల్‍పై పరిశోధనలు సలిపి ‘సోలార్ సైకిల్’ ను అనేక సౌకర్యాలతో రూప కల్పన చేశాడు సూర్యం. వ్యాయామం కోసం పెడల్స్ ఉపయోగించి సైకిలింగ్ చేయవచ్చు. లేదా ఇందులో ‘సోలార్ ప్యానెల్’ ద్వారా నిక్షిప్తమై ఉన్న సౌర శక్తిని ఉపయోగిస్తూ రయ్యిమంటూ దూసుకెళ్లవచ్చు. రాత్రి పూట కాంతివంతంగా వెలిగే లైటు... వేగాన్ని, ప్రయాణించిన దూరాన్ని కొలిచే సాధనాలు తదితర సౌకర్యాలన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ప్రమాదానికి గురైన వారిని తీసుకెళ్ళడానికి ఒక స్ట్రెచర్ గూడా సైకిలుకు ఒక ప్రక్క అంతర్గతంగా బహు నేర్పుగా అమర్చబడి ఉంది. అప్పుడు ఆంబులెన్సు సైరన్ సరేసరి...

ఈ పరిశోధనల వెనకాల సూర్యం బాల్యపు స్వేద బిందువులు అతడిలో ఇంకి పోయి ఉన్నాయి.. వారిది వ్యవసాయ కుటుంబం. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. ఆ లోటును పూరించడంలో తన తల్లి లక్ష్మమ్మ పడిన శ్రమ ఇంతా అంతా కాదు..

తల్లికి మద్దతుగా సూర్యం చదువుకుంటూనే సైకిల్‍రిపేరింగ్ షాపులో పనిచేశాడు. సైకిలు నిర్మాణాన్ని జీర్ణించుకున్నాడు..

సామాన్యునికి ఆరోగ్యరీత్యా, ఆదాయం ఆదా దృష్ట్యా సైకిలే సంజీవని. ఇంకా పర్యావరణ పరి రక్షణ కోసం ముందు ముందు సైకిలు పాత్ర ఎదుగుదల ఆవశ్యకత అనివార్యమని.. తాను మూడవ తరగతిలో ఉండగా చదివిన ‘సైకిలు’ అనే పాఠ్య భాగమే అతడికి స్ఫూర్తి. గాంధీ గారు సైకిలుపై ప్రయాణిస్తున్న బొమ్మను ఆ పాఠ్యాంశంలో ముద్రించబడి ఉంది. ఆ బొమ్మ అపురూపమనుకుంటే దానికి జీవం పోసింది రామచంద్రయ్య మాస్టారు. ఆ పాఠం సూర్యం పై తీవ్రమైన ప్రభావం చూపింది. ‘సైకిలు రూపు రేఖలు మార్చి దాన్ని మరింత శోభాయమానంగా ఆధునీకరించాల్సిన బాధ్యత నేటి భావి భారత పౌరులపై ఉంది.. ’ అంటూ మాస్టారు చెప్తుంటే సూర్యం కలలు కనేవాడు. అదే ఆశయం అతన్ని మెకానికల్ ఇంజనీరుగా తీర్చి దిద్దింది... సోలార్ సైకిలు రూపకల్పనకు దారి తీసింది.

ప్రభుత్వం తరఫున అతనికి పూర్తి మద్ధతు లభించింది. పేద విద్యార్థులకు ‘ఉచిత సైకిలు పథకం’ క్రింద తన వంతు సహాయం చేసే వాడు. దాంతో అతను నిస్వార్థ సేవలను గుర్తించింది ప్రభుత్వం. ప్రభుత్వం తరపున రాయితీ కూడా ప్రకటించింది.

సైకిలు నిర్మాణ వ్యవస్థనే గాకుండా నిర్మాణాత్మకంగా ఆలోచించే సూర్యం తన ఇండస్ట్రీలో పని చేసే ప్రతీ కార్మికుడు సైకిలు మీదే రావలని నిబంధన విధించాడు. ఆ నిబంధనలకాదర్శంగా... తనదీ సైకిలు ప్రయాణమే... ప్రతీ సైకిలుపై దాని ఉపయోగాల ప్రచార ఫలకం... సైకిలు వన్నెల రూపం... ప్రజలకు సైకిలు ప్రాధాన్యత తెలిసి వస్తుండడంతో సైకిళ్ల ఉత్పత్తి అంచెలంచెలుగా ఎదుగ సాగింది.

అది శీతాకాలం..

సమయం సాయంత్రం ఆరున్నర. పూర్తిగా చీకటై పోయింది. సూర్యం , అతడి ఆఫీసు సహాయకుడు వీరయ్య సైకిళ్ళపై బొల్లారం లోని ఫ్యాక్టరీ నుండి గ్రుహోన్ముఖులయ్యారు. గండి మైసమ్మకు వెళ్ళే దారిలో ఉన్న ‘లహరి కాలనీ’ లోని తమ, తమ ఇండ్లకు వెళ్ళడం నిత్య కృత్యం. ఆరోడ్డులో రద్దీ తక్కువ. ఎక్కువ కాలనీలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి.

బొల్లారం కూడలి దాటి ప్రథాన రహదారిలో కొంత దూరం వెళ్ళే సరికి రోడ్డు ప్రక్క చెట్టు క్రింద ఎవరో పడిపోయినట్లు గమనించిన సూర్యం సడన్ బ్రేకు వేశాడు. వీరయ్య కూడా ఆగిపోయాడు.

వీరయ్య తన సైకిలుకు స్టాండు వేసి హాండిల్ సోలార్ లైటు పవర్ పెంచాడు. ఆ వెలుతురులో సూర్యం పడిపోయి ఉన్న వ్యక్తిని చూసి నిశ్చేష్టుడయ్యాడు. అతడు రామచంద్రయ్య మాస్టారు. తనకు ఒకటవ తరగతి నుండి ఆరో తరగతి వరకు పాఠాలు చెప్పిన గురువు. అతడు చెప్పిన సైకిలి పాఠం ఎలా మరువగలడు?... ఎప్పుడూ తెల్లని లాల్చీ, కమీజు ధరించే మాస్టారు. ఆజానుబాహుడు. నుదుట కస్తూరి నామం... మధ్య పాపిడ... మెడపై కుడిప్రక్క గచ్చకాయంత పుట్టు మచ్చ. కాని నేడు చెదిరిన జుట్టు, మాసిన గెడ్డం, చిరిగిన దుస్తులు, నుదుట నామపు చిహ్నం... మనిషి నీరసించి మూల్గుతున్నాడు. సూర్యం చలించి పోయాడు. వెంటనే తన సైకిలు హాండిలుకున్న వాటర్ బాటిల్ లోని నీళ్ళు కొన్ని మాస్టారు ముఖంపై చిలకరించాడు. మెల్లిగా కళ్ళు తెరిచాడు మాస్టారు. గుక్కెడు నీళ్ళు త్రాగించాడు. ప్రమాదమేమీ లేదని కేవలం నీరసమేనని గ్రహించి వీరయ్యను పురమాయించాడు. విషయం అర్థమైన వీరయ్య తన సైకిలుకమర్చిన ’ఆపద్భంధువు స్విచ్’ నొక్కాడు. వెంటనే స్ట్రెచర్ తెరుచుకొంది. మరింత సౌలభ్యం కోసం రెండు సైకిళ్ళ స్ట్రెచర్స్ ను జతచేశాడు. నాల్గు చక్రాల బండిగా మారిపోయింది. దానిపై మాస్టారుని నెమ్మదిగా పడుకోబెట్టారు. సౌరశక్తి బటన్ ఆన్ చేసారు.. సునాయాసంగా పది నిముషాల్లో ఇల్లు చేరుకున్నారు.

***

అది ’శ్రీ లక్ష్మీ నిలయం’ దాదాపు అర ఎకరం స్థలంలో వాస్తు ప్రకారం నిర్మించాడు సూర్యం. ఈశాన్యంలో గేటు. ప్రక్కనే బోరు బావి. చుట్టూ ప్రహరీకానుకొని చెట్లు, ఇంటి చుట్టూ పూల మొక్కలు... ఉత్తర భాగంలో కూరగాయల మొక్కలు... కన్నుల పండువగా ఉంది వాతావరణం. పెద్ద కిటికీ గుండా చల్లని గాలి పడక గదిలోని ప్రసరిస్తుంటే మాస్టారు తన్మయత్వంతో చూస్తూ నిలబడ్డాడు.

రాత్రి తన శిష్యుని కుటుంబం శుశ్రూషలందించిన వైనం జ్ఞప్తికి వస్తుంటే కళ్ళు చెమర్చాయి. ఎప్పుడో సూర్యానికి పాఠాలు చెప్పిన పుణ్యానికి పోయాయనుకున్న తన ప్రాణాలు తిరిగి నిలబెట్టాడు. నేటి కాలంలో ఇలాంటి శిష్యులుంటారని కలలో గూడా ఊహించలేదు. పెంచీ, పెద్దజేసిన తన కొడుకే...

“అమ్మా... మాస్టారు లేచారు” అంటూ సూర్యం రావడంతో మాస్టారు ఆలోచనలు ఆగిపోయాయి.

“నమస్కారం మాస్టారూ...” అంటూ సూర్యం ఎంతో మర్యాద పూర్వకంగా రామచంద్రయ్య పాదాలనంటి మొక్కాడు. మాస్టారు హృదయం పులకరించి పోయింది. సూర్యంను లేవనెత్తి హృదయాని కత్తుకున్నాడు. అదృశ్యం చూసి సూర్యం తల్లి లక్ష్మమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి. లక్ష్మమ్మను పరిచయం చేసాడు సూర్యం. లక్ష్మమ్మ డైనింగ్ హాల్లోకి ఆహ్వానించింది.

బ్రేక్‍ఫాస్ట్ చేస్తూ సూర్యం తన భార్య శారదను పరిచయం చేశాడు. తన కొడుకు శ్రీకాంత్‍‍తో “నాకు స్కూల్లో పాఠాలు చెప్పిన మా గురువు గారు...” అంటూ రామచంద్రయ్యను చూపిస్తూ. పరిచయం చేయసాడు.. “మాస్టారూ!.. వీడు మా అబ్బాయి రెండో తరగతి ‘సరస్వతీ శిశుమందిర్’ ‍లో చదువుతున్నాడు” అంటుండగా “ నమస్కారం తాతగారూ...” అంటూ శ్రీకాంత్ తన రెండు చిట్టి చేతులను జోడించాడు. ముద్దు, ముద్దుగా

“గురు బ్రహ్మం గురు విష్ణుం - గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పర బ్రహ్మం - తస్మై శ్రీ గురువే నమః” అనే శ్లోకం చాలా చక్కగా చదివాడు.

మాస్టారు కళ్ళ నిండా నీళ్ళు నిండుకున్నాయి. శ్రీకాంత్‍ను దగ్గరికి తీసుకొని ముద్దులు కురిపించాడు. శ్రీకాంత్ కళ్ళళ్ళో తేజస్సు చూసి మురిసి పోయాడు. శ్రీకాంత్ సిగ్గు మొగ్గయ్యాడు.

“సూర్యం.. నీకొడుకును మాత్రం రెసిడెన్షియల్ హాస్టల్లో వేయకు...” పై కండువాతో కళ్ళు ఒత్తుకుంటూ అన్నాడు మాస్టారు.

“మాస్టారూ...” అంటూ కలవర పడ్డాడు సూర్యం. మాస్టారి హృదయం గాయ పడినట్లు గమనించాడు.

“అవును మాస్టారూ!.. నేను అడగడమే మరిచి పోయాను. మీరు రాత్రి ఆ చెట్టు క్రింద..” అంటుండగానే మాస్టారు దుఃఖం ఆపుకోలేక పోయాడు.. హృదయవిదారక వాతావరణం నెలకొంది. శ్రీకాంత్ తన చిన్నారి చేతులతో మాస్టారి కళ్లు తుడువ సాగాడు. సూర్యం, లక్ష్మమ్మ గాబరా పడిపోయారు. శారద వంటింట్లో నుండి వస్తూ నిశ్చేష్టురాలైంది.

మాస్టారు శ్రీకాంత్‍ను హృదయానికి గట్టిగా హత్తుకుంటూ తన మనసులోని వ్యథను తెరిచాడు..

***
“నాకు ఒక్కడే కొడుకు పేరు అనిల్. వాడు పుట్టగానే నా భార్య చనిపోయింది. సవతి తల్లి వాన్ని సరిగ్గా చూడదని నేను మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు. ఒక ప్రక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే వాణ్ణి గారాబంగా పెంచాను. వానిలో ఆకతాయి చేష్టలు ఎక్కువయ్యాయి. వాడు బాగా చదువుకోవాలనే అభిలాషతో రెసిడెన్సీ హాస్టల్లో వేశాను. అదే నేను చేసిన నేరం..‘బాల్యం నుండి నన్ను సరిగ్గా చూడలేదు... హాస్టల్లో ఖైదీగా పెరిగాను. ఆబాధ ఏమిటో నీకు తెలిసి రావాలి’ అంటూ నాకు శిక్ష విధించాడు” అంటుంటే మాస్టారు‍కు దుఃఖమాగలేదు.. భోరుమన్నాడు. చటుక్కున వరప్రసాద్ మాస్టారు దగ్గరికి వెళ్ళి ఊరడిస్తూ తనూ కన్నీళ్ళ పర్యంత మయ్యాడు. మాస్టారు మళ్ళీ చెప్ప సాగాడు..

“గత నెల నా పుట్టిన రోజు సెప్టెంబర్ ఐదు..

నా పూర్వ విద్యార్థులు కొందరు వారి పాఠశాలకు ఆహ్వానించి సన్మానించారు. నేను ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళాను. నా ముద్దుల మనవరాలి మెళ్ళో నాకు వేసిన దండలన్నీ వేసాను. నా కొడుకూ కోడలుకు ‘సంఘంలో గురువులకు ఇంకా గౌరవప్రతిష్టలు తగ్గలేదు.,’ అంటూ సగర్వంగా చెప్ప సాగాను. నా మాటలను సగంలోనే తృంచి వేసాడు నా కొడుకు అనిల్. నా మనసు చివుక్కుమంది..

అనిల్ మాట మారుస్తూ “ నాన్నా.. ఈ అద్దె కొంప బాధలు భరించలేక నేనొక ఇల్లు కొన్నాను. చూసి వద్దాం పద..” అంటూ నన్ను ఉన్న ఫళంగా తన స్కూటర్‍పై కూర్చోమన్నాడు. ఎటు వెళ్తున్నామో! ఆ కనుమసక చీకట్లో నాకు అర్థం కాలేదు. దాదాపు అరగంట సేపు ప్రయాణించి ఒక పాత ఇంటి ముందు ఆపాడు. అంతా నిర్మానుష్యం.. ఆ ప్రాంతంలో ఆ పాడుబడ్డ ఇల్లు అదొకటే. సెల్ ఆన్ చేసి తాళం తీసాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే భరించరానంత కంపు. ముక్కు మూసుకున్నాను. ఈ సమయంలో ఇక్కడకు తీసుకు రావడమేమిటో నా కర్థం కాలేదు. ఇల్లు కొంటే రేపయినా చూడ వచ్చు కదా.. అని మనసులో అనుకోసాగాను. ఇంతలో అనిల్ ఆ గదిలోని ఒక చిన్న కిటికీ తీసాడు. గబ గబా బయటకు వెళ్లి తాళం వేసాడు.

“అనిల్..” అంటూ బిగ్గరగా పిలిచాను. వాడు ఉలుకలేదు.. పలుక లేదు. స్కూటర్ వద్దకు వెళ్లి నట్లు గమనించాను. స్కూటర్లో నుండి ఏవో వస్తువులు తీస్తున్నట్లు వెన్నెల వెలుగులో అగుపడింది టిఫిన్ బాక్స్ వాటర్ బాటిల్. అవి తీసుకొని కిటికీ వద్దకు వచ్చాడు అనిల్.

‘నాన్నా.. ఈ ఇల్లు చాలా చౌకగా వస్తుందని కొన్నాను. ఇక నీ నివాసం ఇక్కడే.. కనీస వసతులు అన్నీ ఉన్నాయి. నీకు ప్రతీ రోజు సమయానుసారం భోజసం అందుతుంది.. దిగులు పడకు. నన్ను చిన్నప్పుడే రెసిడెన్షియల్ హాస్టల్లో వేసి నీ చేయి దులుపుకున్నావ్.. నేను ఎంతగా ఏడ్చినా బతిమాలినా నీకు కనికరం కలుగలేదు. ఆ బాధ ఎలా ఉంటుందో నీకి తెలిసి రావాలనే ఈ ఏర్పాటు చేసాను. నీ అనుభవాలు ఈ లోకం తెలుసుకొని మున్ముందు ఏ తండ్రీ తన బిడ్డలను హాస్టల్లో వేయడానికి సాహసించకుండా చేయడమే నా ధ్యేయం.. నీ పుట్టిన రోజు బాగా గుర్తుండి పోతుంది. తండ్రిగా ఒక గురువుగా నా గురు దక్షిణ.. ’ అంటూ వెకిలిగా నవ్వుతూ టిఫిన్ బాక్స్ వాటర్ బాటిల్ కిటికీలో పెట్టి వెళ్ళి పోయాడు..” మాస్టారు గొంతు జీర పోయింది. దుఃఖం కట్టలు తెంచుకో సాగింది.

“ఇంత అమానుషమా?...” అంటూ వాపోయాడు వరప్రసాద్. లక్ష్మమ్మ, శారదలు కొయ్య బారి పోయారు.
గొంతు సవరించుకుంటూ మాస్టారు. “ప్రతి మనిషిలో మానవుడు, దానవుడు ఇరువురూ ఉంటారు. తనలోని రాక్షసత్వాన్ని అణగ తొక్కిన మనిషి దేవుడవుతాడు. మానవత్వాన్ని మరిచిన వాడు దానవుడవుతాడు. ఇది జగమెరిగిన సత్యం... ఎందరికో నీతి పాఠాలు చెప్పిన నాజీవితం ఇలా మసి బారిపోతుందని కలలో గూడా అనుకోలేదు...

ఆ ఇంట్లో నుండి బయటపడాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. రోజూ కిటికీ దగ్గర అరుస్తూనే ఉన్నాను. నిన్న సాయంత్రం ఎవరో పశువుల కాపరి దేవుడిలా వచ్చి తాళం బ్రద్దలు కొట్టి నాకు విమిక్తి కలిగించాడు. లేని శక్తిని కూడగట్టుకొని పరుగులాంటి నడకతో వచ్చి సొమ్మసిల్లి చెట్టు క్రింద పడిపోయాను. దేవుడిలా వచ్చి కాపాడావు....” అంటూ రెండు చేతులతో దండం పెట్టబోతుంటే సూర్యం మాస్టారి చేతులను తన చేతుల్లోకి తీసుకొని కళ్ళకద్దుకున్నాడు.

“మాస్టారూ.. నాబాల్యంలోనే తండ్రిని పోగొట్టుకున్న దురదృష్టవంతుణ్ణి. ఇక తండ్రీ, గురువు సర్వస్వం మీరే.. నిశ్చింతంగా ఉండండి..” అంటూ ధైర్యవచనాలు పలికాడు సూర్యం.
ఇంతలో వీరయ్య వచ్చి మాస్టారుని పలుకరించాడు.
తాను ఈరోజు రాలేనన్నట్లుగా సెలవు పత్రం రాసిచ్చాడు సూర్యం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరుకిమ్మంటూ...
సూర్యం క్రమశిక్షణకు ముగ్ధుడయ్యాడు మాస్టారు. ‘ఇది మీరు నేర్పిన క్రమశిక్షణే’ అన్నట్లుగా కృతజ్ఞతా భావంతో చూశాడు సూర్యం.

***

అనిల్ గూర్చి వాకబు చేశాడు సూర్యం.
రామచంద్రయ్య ఇంట్లో నుండి తప్పించుకున్న విషయం తెలుసుకోగానే అద్దె ఇల్లు ఖాళీ చేసి భార్యా బిడ్డలతో పారి పోయినట్లు తెలిసింది.

తల్లిదండ్రుల తర్వాత పూజనీయులు గురువు. గురువు కూడా తన పిల్లలకు ముందు తండ్రి. ఆస్థానంలో నిరాదరణకు గురైతే...!

సూర్యం మస్తిష్కంలో రామచంద్రయ్య మాస్టారు జీవితం అలజడి రేపింది. తనను ఇంతగా తీర్చి దిద్దిన మాస్టార్లు ఇంకా ఎంతమంది ఇలాంటి దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారో.. ! అని ఆవేదన చెందసాగాడు. తన మనసులో ఒక ఆలోచన రాగానే నిశ్చితంగా దాన్ని అమలు చేయాలనుకున్నాడు సూర్యం.

***

చూస్తూ ఉండగానే ఏడాది గడిచింది..
ఆవాళ రామచంద్రయ్య మాస్టారు పుట్టిన రోజు..
“మాస్టారూ ఈ సంవత్సరం ఉపాధ్యాయదినోత్సవం మన సైకిల్ పరిశ్రమలో చేయాలని నిర్ణయించాను. అందుకు కార్మీకులంతా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసారు. మనమంతా కాసేపట్లో వెళ్దాం.. తయారవ్వండి..” అంటూ ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు సూర్యం. తన మదిలోని ఆశయం కాసేపట్లో నెరవేర బోతున్నందుకు సంతోషపు తరంగాలు సముద్రపు కెరటాల్లా ఎగిసి పడ్తున్నాయి. వాటికి తోడుగా మాస్టారు పుట్టిన రోజని శ్రీకాంత్ ఉరకలు వేస్తున్నాడు. ఇల్లంతా కోలాహలంగా మారింది..

అంతా కలిసి గాంధీ సైకిలు పరిశ్రమకు వచ్చారు. కార్మీకుల క్రమ శిక్షణ చూసి రామచంద్రయ్య ఆశ్చర్య పోయాడు. తాను పాఠాలు చెప్పిన పాఠశాల జ్ఞప్తికి వచ్చింది. పాఠశాల పేరుకు బదులుగా ‘గురువుల ఆశ్రయం’ అని కనిపిస్తుంటే మరింత ఆశ్చర్యపోయాడు.

“మాస్టారూ.. అన్ని వృత్తులలో కెల్ల అత్యుత్తమైనది ఉపాధ్యాయ వృత్తి. దేశ ప్రగతికి అమూల్యమైన సంపద ఉపాధ్యాయులు. నేడు వారికి ఆశ్రయం లేకుండా పోతోంది. మీరు మా ఇంట్లో అడుగు పెట్టిన రోజే ఈ నిర్ణయం తీసుకున్నాను. మీ మాదిరిగా నిరాదరణకు గురైన గురువులకు ఆశ్రయమిది. మీ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించండి” అంటూ ఆశ్రయం వైపు ఆహ్వానించాడు సూర్యం. లక్ష్మమ్మ శారదలు ఎంతగానో పొంగి పోయారు.

సరిగ్గా రామచంద్రయ్య మాస్టారు పుట్టిన సమయం సాయంత్రం ఐదు గంటల నాలుగు నిముషాలకు ‘ఆశ్రయం’ ఆరంభమైంది. రామచంద్రయ్య శ్రీకాంత్ చేతికి కత్తెర ఇచ్చి తాను సహకరిస్తూ రిబ్బన్ కట్ చేయించాడు. కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి,

***

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)