కవితా స్రవంతి

ఊండెడ్ హార్ట్

-అయినంపూడి శ్రీలక్ష్మి



పెళ్ళయ్యాక
మా ఆయన కూడా
నన్ను అంటిపెట్టుకుని ఉన్న రోజులు
కొద్ది మాత్రమే -
నా బంగారు పిల్లలు
బడికి వెళ్ళేంతగా ఎదిగిన
ఈ పదేళ్ళ కాలంలో కూడా
తోడుగా నన్ను అల్లుకున్న సమయం గంటలు మాత్రమే
కానీ -
నలభై ఏళ్ళుగా
నన్ను అనవరతం ఆజన్మం అంటి పెట్టుకుని
నాతో సహజీవించి
నా ప్రతీ కదలికలో నాతో సహచరిస్తున్నది మాత్రం
అవే కదా!

నా మంగళ సూత్రాన్ని
ఎంతో అపురూపంగా
పొదివి పట్టుకునే
ఆత్మీయ నేస్తాలు కదా

నేను ఏడ్చినప్పుడు
నాతో పాటు వెక్కెక్కిపడేవి
నేను హాయిగా నవ్వినప్పుడు
నిండుగా కదిలేవి
నేను కోపగించుకున్నప్పుడు
నాతోపాటు ఉద్రేకపడేవి
నేను ఆందోళన చెందినప్పుడు
ఉద్విగ్నమయ్యేవి
నేను ఆనందంతో సిగ్గుల మొగ్గ అయినప్పుడు
మంకెన పువ్వులుగా ఎర్ర బడేవి

నా ప్రతి అనుభూతిని - అనుభవాన్ని
సానుభూతితో - సహానుభూతితో
రెసిప్రొకేట్ చేసిన
నా జీవన నేస్తాలు కదా
నాలో నాకు - నాతో నాకు
నిండైన నిబ్బరాన్నిచ్చిన తోడులు
స్థైర్యపు జాడలు కదా...
నా గుండె వైకుంఠానికి
ఇరువైపులా -
రక్షణగా నిలుచున్న
జయ విజయులు కదా..!

ఫ్లాష్ ప్రజెంట్

ఎడతెరిపి లేకుండా
ఎన్నెన్నో థెరపీలు
కీమో థెరపీ
రేడియో థెరపీ
మేలినో థెరపీ

వీల్ చైర్..
నా విల్ పవర్ ని
ఎద్దేవా చేసింది
గ్రీన్ డ్రెస్ నా అడ్రెస్ ని మార్చేసింది
ఎక్కే సెలైన్ లు
గుచ్చే ఇంజక్షన్ లు
కారే నా కన్నీటిని
భర్తీ చేయలేకపోయాయి.

మానవుడు
జంతువు నుంచి పరిణామం చెందాడట
ఈ టెస్టుల పుణ్యమా అని
ఈ ల్యాబ్ లో నేను
పుణ్య పత్ని నుండి గినియా పిగ్ గా
రివర్స్ లో మారిపోయాను
‘క్యురియస్ కేస్ ఆఫ్ బెంజిమిన్ బటన్’ లాగా..

మాయలపకీరు ప్రాణం
ఏడేడు సముద్రాల ఆవల దీవిలోని
చిలకలో ఉందంటే
చిన్నప్పుడు కోటి ఆశ్ఛర్యదీపాలు వెలిగేవి
ఇప్పుడు చెట్టంత నా ప్రాణం
నా కంటికే కనిపించనంత
సూక్ష్మ కణంలో నిక్షిప్తమై ఉందంటే,
ఈ డయాగ్నసిస్ పుణ్యమా అని
నాలోని అల్పత్వం అవగతం అయింది.

అడిగితే కాని అమ్మయినా పెట్టదంటారు
క్యాన్సర్ - అమ్మలగన్నయమ్మ
నేనేది అడగకుండానే
తన కణాలను
నాలో పుట్టలు పుట్టలుగా పెంచింది

అల్ట్రా మోడ్రన్ ఎక్విప్ మెంట్
చేస్తున్న ట్రీట్ మెంట్స్ కన్నా
నా గుండెలపై పెరుగుతున్న
కణాల వేగం ఎకువట

చివరాఖరికి
తెల్ల యాప్రాన్ లు ధరించిన
దేవదూతలందరూ
ఒక్క స్థిరనిర్ణయానికి వచ్చారు
యూనిఫాం లో సైతం
ఒక్కలాగా ఉండని వీరందరూ
నా కేస్ విషయంలో మాత్రం
ఒక్కటై చేతులు ఎత్తేశారు.

ఇన్ ద థియేటర్

థియేటర్ ఆర్ట్స్ అంటే
నాకెంతో ఇష్టం
థియేటర్ అనగానే రవీంద్రభార్తో
సారస్వత పరిషత్తులో సురభినాటకమో
క్రాస్ రోడ్స్ లోని దేవి థియేటరో గుర్తుకొచ్చి
మూడు గంటల కొత్త బంగారు లోకం 
స్ఫురణ కొస్తుంది

కానీ -
ఇప్పుడు థియేటర్ కి
కొత్త అర్ధం ఏర్పడింది
సర్జికల్ బెడ్ - ఫోకస్ డ్ లైట్స్
గ్రీన్ కర్టెన్స్ - చేతులకి గ్లోవ్స్
స్వైన్ ఫ్లూ మాస్క్ లు
తలపై క్యాప్ లను బోర్లించుకుని
కళ్ళు మాత్రమే చూపించే దేవదూతలు
కత్తులు - సూదులు - మెడికేటెడ్ దారాలు
ఇది కూడా థియేటరే
ఆపరేషన్ థియేటర్....

ఈ థియేటర్ ఓ బోధివృక్షం
దేహాత్మల ద్వంద్వ తాత్వికతని
నాకు జ్ఞానోదయమ్ చేసింది.
నా దేహంపై కోతల్ చప్పుడు వినిపిస్తున్నా
ఆ సౌండ్ ని సెన్స్ చేయలేను

ఈ థియేటర్ లో
నేనే కథానాయకని
ఈ ఏకాంకికలో
అన్ని పాత్రలు నావే -
పాత్రలలో నిండిన గాయాల స్పెసిమెన్సూ నావే

జనరల్ ఎనస్తీషియా ట్రాన్స్ లో
నా ఉటోపియాని
నా నుంచి దూరంచేసే
అనివార్య పన్నాగం సక్సెస్ అయ్యింది
మూతలు పడుతున్న నా కంటి పాపలకి
నా నిండు చంద్రుళ్ళు
నా జయవిజయులు
స్టీల్ ప్లేట్ లో
రక్తపు ముద్దలుగా
లీ.. ఈ...ఈ..ఈ...ఈ..లగా
గుండెపెరికి వేసిన గ్లాడియేటర్ లా
నాలో నేను జా...ఆ...ఆ..అ...ఆ...లిగా

భూమి గుండ్రంగా ఉందని
నా గుండెలపై చెయ్యేసుకుని
ధైర్యంగా చెప్పేదాన్ని
ఇప్పుడు -
బల్లపరుపుగా ఉందని
చెప్పాలేమో..

 

(సశేషం)


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)