ధారావాహికలు

సుందరకాండ


- డా.అక్కిరాజు రమాపతిరావు

 

 

హనుమంతుడు సీతమ్మని దర్శించడం

 

హనుమంతుడు కూర్చున్న అశోక వృక్షానికి దగ్గర్లోనే ఒక చైత్య గృహం ఉన్నది. అది అసంఖ్యాక స్తంభాలపై నిర్మితమై ఉన్నది. మహా విశాలంగా ఉంది. ఆ చైత్యప్రాసాద ప్రాంగణంలో ఆయనకప్పుడు ఒక స్త్రీ కనిపించింది. ఆమె చుట్టూ రాక్షసాంగనలు ఉన్నారు. ఎంతో కాంతిమంతురాలైన ఆమె ఎంతో కృశించినట్లు కనబడుతున్నది. ఆమె ధరించిన పచ్చటి పట్టుచీర బాగా నలిగిపోయి, మాసిపోయి కనిపిస్తున్నది. ఆమె దట్టంగా వ్యాపించిన అగ్ని జ్వాల వలె ఉంది. అంగారక గ్రహం వేధిస్తున్న రోహిణీ నక్షత్రంలా ఉంది. మంఅదలోనుంచి తప్పిపోయి వేట కుక్కల మధ్య ఉన్న హరిణంలా కంపించిపోతూ ఉంది.

ఎప్పుడూ ఈమె దు:ఖం ఎరిగి ఉండదు. ఇప్పుడు పరమ దు:ఖసంతప్తురాలై కనిపిస్తున్నది. ఆనాడు ఋశ్యమూక పర్వతం మీద తాము ఉండగా రావణాసురుడు దుర్మార్గంగా ఎత్తుకుని పోతున్నప్పుడు తాము చూసిన స్త్రీ ఈమే అయి ఉండచ్చని హనుమంతుడికి తోచింది.

ఆమె స్పష్టంగా అర్థం కాని స్మృతి సూక్తంలా, ఒట్టిపోయిన సంపదలా, సన్నగిల్లిన శ్రద్దలాగ, క్షోభించిన బుద్దిలాగ, గొప్ప కీర్తికి సంప్రాప్తించిన అపవాదులాగ ఉన్నది. రాముడు దగ్గర లేక, రావణుడి భయం వల్ల బెదురు చూపులు చూస్తున్న లేడిలాగ కనబడుచున్నది. కనుకొలకులనుంచి సతతం అశ్రువులు కారిపోతున్నాయి ఆమెకు. మబ్బులు కమ్ముకుని ఉన్న చంద్రబింబంలా ఉంది. రాముడు చెప్పిన గుర్తుల వల్ల ’ఈమె నిశ్చయంగా సీతాదేవే అయి ఉండాలి’ అనుకున్నాడు హనుమంతుడు.

సీత ధరించినట్లుగా రాముడు చెప్పిన ఆభరణాలనీ అక్కడ కొమ్మలకి వేలాడుతుండగా చూసాఉ. ఆమె పూర్వం నగలతో జారవిడిచిన వస్త్రం, ఇప్పుడు సీతమ్మ ధరించిన వస్త్రం ఒకే రంగులో ఉండటం హనుమంతుడు గమనించాడు. సీతారాముల పరస్పర సౌందర్యాన్ని పోల్చి చూసుకుని ఆనందించాడు. మళ్ళీ ఇలా బాధపడ్డాడు.

మాన్యా గురువినీతస్య లక్శ్మణస్య గురుప్రియా,
యది సీతాపి ద్:ఖార్తా కాలో హి దురతిక్రమ: (సుందరకాండ 16.3)


లక్ష్మణుడికి ఈమె అత్యంత పూజనీయురాలు, శ్రీ రాముడికి ప్రాణాధిక, అయ్యో! ఈమె ఇప్పుడిట్లా దు:ఖం పాలైంది. ఇంతకూ కాలాన్ని ఎవ్వరు అతిక్రమించగలరు?


ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య రామస్య విదితాత్మన:,
ఇయం సా దయితా భార్యా రాక్షసీవ్శమాగతా. (సుందరకాండ 16.17)


ఈమె దశరథ మహారాజు పెద్ద కోడలు, ధర్మమూర్తి, కృతజ్ఞ్నతా స్వరూపుడు, ఆత్మవిధుడు అయిన శ్రీరాముని ఈమె చెట్టపట్టింది. ఆయనకెంతో ఇష్టురాలు. ఇప్పుడిట్లా రాక్షసులకు వశమయింది.

 



మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)