ధారావాహికలు

మరీచికలు

-వెంపటి హేమ


( సవరణ: పాఠకులకు విన్నపం. డిసెంబర్ నెలలో ప్రచురింపబడిన భాగానికి జనవరి నెలలో ప్రచురించిన భాగానికి మధ్యలో కొంత నవల తప్పి కథా గమనం సరిగా సాగలేదు. రచయిత్రి మరియు కొంత మంది పాఠకులు ఈ విషయాన్ని మా దృష్టికి తెచ్చారు కూడా. ఈ నెలలో ఆ తప్పిదాన్ని సరిచేసాము. అంటే, డిసెంబర్ నెల తర్వాత కొనసాగింపు ఈ నెల మరీచికలు భాగం అని గమనించ ప్రార్థన. క్షమాపణలతో - సంపాదకుడు )

మరునాడు ఎప్పటిలాగే నీట్ గా తాయారయ్యి, ఆఫీసుకి వెళ్ళింది యామిని. తన రూంలోకి వెళ్ళి టైప్ మిషన్ ముందు కూర్ఛోబోతూ ఆగి అనుకుంది, " నిన్న నా మనసు ఎలాగుందో నా డెస్కు కూడా అలాగే ఉంది, గజిబిజిగా! ఇక నుండి ఇలా వదలను. ఏది ఏమైనా ఇంక నన్ను ఒకళ్ళు వేలెత్తి చూపించే దుర్దశలో నేనుగాని, నా డెస్కుగాని ఎంత మాత్రం ఉండము. ఇక కావాలని నన్ను ఎద్దేవా చేసి బాధపెట్టాలని ఎవరైనా అనుకుంటే, వాళ్ళ పాపం వాళ్ళదే! నాకు మాత్రం దాంతో ఏ సంబంధం ఉండబోదు."

యామిని డెస్కు సద్దడం పూర్తి చేసీ సరికి కాలింగ్ బెల్ మోగింది. "ఇక చూడు బాబూ, డ్రామా మొదలౌతుంది! ట్రాన్స్పరెంట్గా ఉండకూడదు, ఇక నుండీ నేనూ నేర్చుకుంటా డిప్లొమెసీ! మనసులో మాట పైకి తెలియనియ్యను. ష్యూర్! అంతా నటనే!" తనలో తానే నవ్వుకుంది యామిని.

చిరునవ్వు మొహం మీదికి తెచ్చిపెట్టుకుని, బాస్ రూంలోకి నడిచింది యామిని. డిక్టేషన్ తీసుకోడానికి, కావలసిన సరంజామా అంతా పట్టుకుని.

అమరేంద్రతోపాటు గోపాల్రావు కూడా అక్కడే ఉన్నాడు . గదిలోకి అడుగు పెడుతూనే ఇద్దరికీ విడి విడిగా అభివాదం చేసింది యామిని. ఆమె ముఖంలో సొగసులీనుతున్న చిరునవ్వు చూసి, అంత తొందరగా ఆమె మనసు సరిపెట్టుకున్నందుకు సంతోషించాడు గోపాల్రావు. అంత తొందరగా ఆమెలో ఇంత మార్పు వచ్చినందుకు ఆయన ఆశ్చర్యపోయాడు.

డిక్టేషవ్ మొదలయ్యింది. ముందుగా, కొత్తగా వచ్చిన ఆఫీసర్ కి చార్జి అప్పగించి, తాను రిలీజ్ అయ్యి, రాజమండ్రీ ఆఫీసుకి వెడుతున్న విషయం హెడ్డాఫీసుకి ఉత్తరం ద్వారా తెలియజేశాడు గోపాల్రావు. ఆ తరవాత, అమరేంద్ర తాను గోపాల్రావు గారి దగ్గరనుండి, హైదరాబాద్ మైత్రీ ఫర్నిచర్సు ఆఫీస్ చార్జిని అందుకున్నట్లుగా లెటర్ డిక్టేట్ చేశాడు. రెండు లెటర్లనీ షార్టు హాండులో రాసుకుంది యామిని.

తాను ఎంత స్పీడుగా డిక్టేట్ చేస్తే అంతస్పీడు గానూ అందుకుని చకచకా షార్టు హాండులో రాస్తున్న యామినిని వింతగా చూశాడు అమరేంద్ర. డిక్టేషన్లు పూర్తి అవ్వడంతో వాటిని తీసుకుని తన రూంలోకి వెళ్ళిపోయింది యామిని.

అమరేంద్రకి ఆఫీసు విషయాలు చెపుతున్నాడు గోపాల్రావు. పావుగంట గడిచేసరికి, లెటర్సు రెండూ టైపుచేసి, ఎన్వెలప్స్ మీద హెడ్డాఫీసు అడ్రస్సు, ఫ్రం అడ్రస్ గా తమ ఆఫీసు అడ్రస్సు టైపుచేసి, సంతకాల కోసం తీసుకువచ్చింది యామిని.

"వీటి మీద మీరు సంతకాలు చేసి ఇస్తే, ఈ రోజే పోస్టాఫీసుకి వీటిని పంపిస్తాను" అంటూ ఎవరి లెటర్ వాళ్ళకి అందించింది.

తన చేతికి ఇచ్చిన లెటర్ మీద, ఇక దాన్ని తను చూడవలసిన అవసరం ఎంతమాత్రం లేదన్నట్లు, వెంటనే సంతకంచేసి వెనక్కి ఇచ్చేశాడు గోపాల్రావు. అక్కడ తన పని పూర్తవ్వడంతో, అమరేంద్రకు "బై" చెప్పి వెళ్ళడానికి లేచిన ఆయన ఆగి, యామినితో "అమ్మా, యామినీ! వెళ్ళొస్తానమ్మా! రేఫు ఉదయమే బయలుదేరి నేను రాజమండ్రీ వెళుతున్నా. అక్కడ వసతి చూసుకుని ఆ తరవాత వచ్చి, కుటుంబాన్ని తీసుకువెడతా.

అప్పుడు మళ్ళీ కలుసుకుందాం. ఇక ఉంటానమ్మా" అన్నాడు ఆయన, ఆత్మీయంగా ఆమె వైపు చూస్తూ.
"సరే సర్!" అంటూ ఆయనకు నమస్కరించింది యామిని. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి.

అకస్మాత్తుగా చిన్నబోయిన ఆమె ముఖాన్నీ, కనుకొలకుల్లో చెమర్చిన కన్నీటి బిందువుల్నీ వింతగా చూశాడు అమరేంద్ర.. అవి అతనికి చెప్పకనే చెప్పాయి, ఆ ఇద్దరి మధ్యా పెనవేసుకునివున్న ఆత్మానుబంధాన్ని.

ఆయన వెళ్ళిపోయాక అమరేంద్ర అడిగాడు, "గోరా గారు మీకు బంధువా?"

యామినికి ఒకపట్టాన గొంతుక స్వాధీనంలోకి రాలేదు. బలవంతంగా కూడదీసుకుని జవాబు చెప్పింది. "బంధువులు కాదు. అయినా, ఆయన నన్ను తండ్రిలా ఆదరించి, ఆత్మీయత చూపించిన వారు - అన్నది నిజం. చాలా మెత్తని మనసు ఆయనది" అంది ఆమె మనస్పూర్తిగా.

"నిజమే! అలాగే కనిపిస్తున్నారు ఆయన! నోటిలో వేలుపెట్టి కరవమని మనం అడిగినా కూడా కరవలేని మనస్తత్త్వంలాగుంది ఆయనది " అన్నాడు అమర్ ఆమెవైపు కొంటేగా చూస్తూ.

ఒక్కసారిగా యామిని కళ్ళలో కోపం థళుక్కున మెరిసింది. పనిలోపనిగా దానితోపాటు నిద్రలేమి వల్ల వచ్చిన అలసట, అశాభంగం, అశాంతి వగైరాలన్నీ కూడా, ఆమె ధరించిన "మాస్కు" చాటునుండి, ఒక్కసారి చటుక్కున తొంగిచూసి వెళ్ళాయి. అంతలోనే యామిని సద్దుకుంది. ఆ లిప్తకాలంలోనే వాటిని గుర్తించాడు అమరేంద్ర!

"నీ మొహం చూస్తే నీకు రాత్రంతా నిద్ర పట్టలేదు - అనిపిస్తోంది. ఎందుకని? రాత్రంతా రాకూడని వారెవరైనా నీ మనసులోకి వచ్చి, నీ నిద్రంతా పాడుచేశారా? నువ్వు చాలా బడలికగా ఉన్నట్లు తెలిసిపోతూన్నావు, ఈ లెటర్ సంగతి ఒక్కటీ చూస్తే చాలు, నువ్వింటికి వెళ్ళిపోవచ్చు. ఈ వేళకి మరే పనీ లేదింక, హాయిగా రెష్టు తీసుకో " అన్నాడు, ఆమె టైప్ చేసిన లెటర్లో తప్పులకోసం తీవ్రంగా గాలిస్తూన్న అమరేంద్ర.

"అలాంటిదేం అక్కర లేదు సర్! నేను బాగానే ఉన్నాను. నేను నా రూంలోకి వెడతాను. లెటర్ చూసి సంతకం పెట్టాక బెల్ నొక్కండి వస్తా" అని చెప్పి, అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా, తన గదిలోకి వెళ్ళిపోయింది యామిని.
వెళ్ళిపోతున్న ఆమె వైపే చూస్తూ, అనుకున్నాడు అమరేంద్ర, " ఎంత తెలివిగా చెప్పింది, "నా కాళ్ళమీద నేను నిలబడగలను, నీ దయాదాక్షిణ్యా లేమీ నాకు అక్కరలేదు" అని! మొత్తానికి గట్టిదే!"

\ తన గదిలోకి వెళ్ళి సీట్లో కూర్చుంది యామిని. "అసాధ్యుడే! ఆవలిస్తే పేగులు లెక్కపెట్టగలడన్నమాట! ఇక నుండీ చాలా జాగ్రత్తగా ఉండాలి నేను, ఇలా దొరికిపోకూడదు" అనుకుంది.

***

మరునాడు యామిని బస్ స్టాపుకి చేరేసరికి తను ఎక్కవలసిన బస్సు సరిగా అప్పుడే వచ్చి ఆగింది. బస్సు ఎక్కి సీటు చూసుకుని కూర్చుని, బాగ్ లోంచి బస్సుపాసు తీస్తూ అనుకుంది, "ఈ రోజే, బహుశ:, నా ఉద్యోగానికి ఆఖరు రోజు అయినా అవ్వవచ్చు, కానియ్! "

తనకీ ఉద్యోగం చాలా అవసరం. సాధ్యమైనంత వరకూ అన్నీ సరిపెట్టుకుంటో తను బాస్ కి లాయల్ గానే ఉంటుంది . అలాగని తను, ఉద్యోగం నిలబెట్టుకోడానికి ఆత్మగౌరవాన్ని ఫణంగా పెట్టడం అన్నది - ఎంతమాత్రం జరిగేపని కాదు. బ్రతుకుతెరువు కోసం రాజీపడి అవమానాలు భరిస్తూ, బ్రతకడం తనవల్ల నయ్యే పని కాదు. "యామిని ఎప్పుడూ యామినిగానే ఉంటుంది! అది అంతే, దానికి తిరుగులేదు" అనుకుంది ఆమె మనసులో
నే ఖండితంగా.

యామిని ఆఫీసుకి చేరేసరికి రాజు దగ్గరుండి మరీ ఆఫీసుని శుభ్రం చేయిస్తున్నాడు. తన రూములోకి వెళ్ళి, టైపు మిషన్ ముందున్న కుర్చీలో కూర్చోగానే అనిపించింది యామినికి, "ఎందుకైనా మంచిది, ఒక రాజీనామా పత్రం తయారుచేసి దగ్గర పెట్టుకోడం బాగుంటుంది" అని.

బాస్ వచ్చే టైం అయ్యింది. ఎందుకనో, అమరేంద్రను ఒంటరిగా కలవాలంటే యామినికి బెరుకుగా ఉంది. కాని సరిగా తొమ్మిదిన్నర అయ్యేసరికి బజ్జర్ మ్రోగింది. ఉలికిపడ్డట్టుగా లేచి నిలబడింది యామిని. కట్టూ బొట్టూ సరిజూసుకుని, లెటర్ పేడ్డు, పెన్సిలూ తీసుకుని బాస్ గదిలోకి నడిచింది, తనకు తానే ధైర్యం చెప్పుకుని.

యామిని గదిలో అడుగు పెడుతూనే నవ్వుముఖంతో "గుడ్ మార్నింగ్ సర్ " అంటూ మృదుమధుర స్వరంతో అభివాదం చేసింది బాస్ కి.

ఏదో ఫైల్ చూస్తున్నవాడల్లా, అమరేంద్ర ఫైల్లోంచి కళ్ళు మాత్రం పైకెత్తి ఆమెవైపు ఆశ్చర్యంగా చూశాడు. "సేం టు యు యామినీ ప్రి య ద ర్శి నీ! ఇంత స్వీట్ గా నువ్వు నన్ను గ్రీట్ చెయ్యగలవని నేను కలలోకూడా అనుకోలేదు సుమీ . ఎనీహౌ, థాంక్యూ" అన్నాడు టీజింగ్ టోన్లో.

యామిని ఏమీ జవాబు చెప్పకుండా నిలబడి ఉండిపోయింది బొమ్మలా.

అతడే మాటాడాడు, "సారీ యామినీ! ఆ ప్రవరాఖ్యుడిలా, నువ్వూ బొత్తిగా ఇలా పెసరపప్పు వాలకం పెడితే, అది నీకు నప్పొద్దూ! ఇప్పుడు నిన్నిలా చూస్తూంటే, నువ్వు నువ్వేనా - అనిపిస్తోంది" అన్నాడు పెద్దగా ఆశ్చర్యపోతున్న వాడిలా మొహం పెట్టి.

అతని మాటలేవీ విననట్లుగా "డిక్టేషన్ ఉంటే చెప్పండి సార్! రాసుకుంటాను" అంది యామిని, ముఖంలో ఏ భావమూ వ్యక్తం కానీయకుండా జాగ్రత్తపడుతూ.

"కాసేపు ఆఫీసు విషయాలు పక్కనుంచు. ముందుగా మనం మన పాత అకౌంట్సు సెటిల్ చేసేసుకుని, ఏకాభిప్రాయానికి రావడం మంచిదని నా ఉద్దేశం ... " అన్నడు అమర్ కొంటెగా.

"ఏమంటావు నువ్వు" అన్నది కూడా అతని మాటల్లోనే ఇమిడి ఉన్నా, యామిని జవాబేం చెప్పకుండా నిలబడి ఉండిపోయింది.

అతనే మళ్ళీ మాట్లాడాడు, "నా పుణ్యం బాగుండి ఆ రోజు, నాకు నీ విశ్వరూప దర్శన మయ్యింది కనక గాని, ఇదే నిన్ను చూడడం మొదటిసారి అయ్యుంటే, ఈ పోజులో నిన్నుచూసి, నిజంగా నువ్వు శుద్ధ అమాయకురాలివని ఇట్టే నమ్మేసి ఉండేవాడిని కదా! ఇంకా నయం!

నువ్వేం సామాన్యమైన ఆడపిల్లవి కావు, ఫైర్ బ్రాండువి! ఆ రోజు ఏమిటీ అన్నాడు ఆ దద్దమ్మ? అగ్నిశిఖా లేక జ్వాలాముఖా ...? నిన్ను వర్ణించాలంటే అలాంటి మాటలే వాడాలి! నిన్ను గురించి నాకు బాగా తెలుసు, కష్టపడి నటించవద్దు. అదంతా శుద్ధ వేష్టు. ఎందుకంటే, అది నేను ఎంతమాత్రం నమ్మను కనుక ..... !

కొత్త బాస్ నేనని తెలియగానే, నువ్వు ఎంత షాకయ్యావో నేను చూడలేదు అనుకోకు! నే నిలా, ఇక్కడికి రావడం అన్నది, నీకు ఎంతమాత్రం నచ్చలేదు. ఎందుకైనా మంచిది, ఎప్పుడైనా అవసరమైతే ఉంటుందని, ఒక రాజీనామా పత్రం టైప్ చేసి దగ్గర ఉంచుకున్నావు కదూ! యా మై కరెక్ట్?" పత్రం అందుకోడం కోసం అన్నట్లుగా చెయ్యి ముందుకు చాపాడు అమరేంద్ర.

నిర్ఘాంతపోయింది యామిని. "ఈ విషయం ఇతడు ఎలా కనిపెట్టగలిగాడు? కొంపదీసి కర్ణపిశాచుల్లాంటి విచిత్ర శక్తులేమైనా ఉన్నాయా ఏమిటి? బాబోయ్!" అలాగని ఆమె మనసులో అనుకుందే కాని, అతనికి జవాబేమీ చెప్పలేదు.

"ఈ విషయం ఇతనికి ఎలా తెలిసిందా - అని ఆశ్చర్యపోతున్నావా యామినీ ప్రి య దర్శినీ! ఇదేం పెద్ద విషయం కాదు. నిన్న లేని ధీమా ఏదో ఈ వేళ నీ మొహంలో కనిపిస్తోంది. దాంతో నేను గెస్ చేశాను. రైట్? ఇంకా చెప్పాలంటే ...... నా కేమో ఫేస్ రీడింగ్ హాబీ, నీ ఫేస్ చూస్తే బొత్తిగా ట్రాన్స్ఫరెంట్! చ ఏదీ ఆ కాగితం, ఇలా ఇయ్యి ... "
మంత్ర ముగ్ధలా యామిని తన పర్సులో ఉన్న రాజీనామా పత్రం తీసి అతని చేతిలో పెట్టింది. "ఏమైతే అది కాని" మ్మని, ఒకవిధమైన నిర్లిప్తత ఆమెలో చోటుచేసుకుంది.

అతడు తన చేతిలోని ఎన్వెలప్ అటూ ఇటూ తిరగేసి, దానిమీదున్న అడ్రస్ చూసి, ఆ తరవాత దాన్ని ఓపెన్ చేసి, హస్తారపదంగా అందులో ఉన్న కాగితాన్ని పైకితీసి చదవసాగాడు. యామిని చేష్టలు దక్కి, ఒక సాలభంజికలా ఉన్నచోటనే నిలబడి, అతని చైదాల్నే చూస్తూ ఉండిపోయింది. ఆమెకు లోలోన చాలా తిక్కగా ఉంది . రాజీనామా పత్రం మీద అతడు సంతకం పెట్టెయ్యగానే, అతని మీదపడి, చీరి చిత్రమూలం పెట్టెయ్యాలనుకుంది ఆమె తనలో కసికసిగా.

రాజీనామా పత్రం చూడగానే అతని ఫస్టు కామెంటు, "ఎక్సెలెంట్ ఇంగ్లీష్ ! ఎక్కడా ఒక్క స్పెల్లింగ్ మిస్టేకైనా లేదు, వెరీ గుడ్" అని.

అమర్ తలెత్తి యామినివైపు చూసి, చిన్నగా నవ్వి, " నువ్వు రాసిన ఈ పత్రం కరెక్టు - అని అనుకోవాలంటే కుదరదు. ఇక్కడ అసలుకే మోసం వచ్చింది . ఫాల్టీ డాక్యుమెంట్సుకి వాల్యూ లేదు. ఒక చిన్న లీవ్ లెటర్ రాయాలన్నా " ఐ యాం సఫరింగ్ ఫ్రం ఫీవర్ అనో, హెడ్డేక్ అనో శలవు పెట్టడానికైన కారణం రాస్తారు కదా! మరి దీనిలో కారణం ఏమీ రాయబడి లేదు. ఇది చెల్లదు" అంటూ, అతడా కాగితాన్ని మడిచి, యధాప్రకారం కవర్లో ఉంచి, ఆ తరవాత దాన్నిమొత్తంగా చింపి, ఓపిగ్గా చిన్నచిన్న ముక్కలుచేసి, చెత్తబుట్టలో పారేసి, చేతులు దులుపుకున్నాడు. అంతసేపూ అతని కళ్ళు కొంటెగా నవ్వుతూనే ఉన్నాయి.

అతని కళ్ళలో మెరుస్తున్న చిలిపి మెరుపులు యామిని దృష్టి నుండి తప్పించుకుపోలేదు. ఏం చెయ్యడానికీ తోచక ఆమె అసహాయంగా నిలబడిపోయింది కోపాన్ని తగ్గించుకునీ ప్రయత్నంచేస్తూ.

" అంతా నా దురదృష్ట మనుకోవాలి! నా తప్పు తెలిసి ఉండడంవల్ల, నేనితనికి లోకువైపోయాను. ఆ తప్పుకి ఇది శిక్షగా భావించి, ఇదంతా నేను భరించక తప్పదు ..."

అలా అనుకుని మనసు సరిపెట్టుకోవచ్చు, కాని యామినికి అది సాధ్యపడే పని కాదు.

కావాలనే అతడు తనను ఆటపట్టించాలని చూస్తున్నాడని గ్రహించింది యామిని. ఇక్కడ ఎవరూ లేరుకనక గాని, స్టాఫ్ ఎవరైనా ఈ మాటలు వింటే తనకి ఎంత అప్రతిష్ట! - అలా అనుకునేసరికి ఆమె మనసులో కోపం మరింతగా భగ్గుమంది. చూపులలో నిప్పులు కురిపిస్తూ అతని వైపు కొరకొరా చూసింది, కాని, నోరువిప్పి ఏమీ మాటాడ లేదు.

ఆమెను చూసి అమరేంద్ర పకపకా నవ్వాడు. " దేర్ యు ఆర్! అమ్మయ్య, ఇప్పటికి బయటపడిందన్నమాట నీ నిజస్వరూపం. మంచితనపు ముసుగులో దాగొని మాయమాటలు చెప్పుకుంటూ తిరిగే వాళ్ళంటే నాకు పరమ అసహ్యం. ఇప్పటికైనా నువ్వా ముసుగులోంచి బైటపడినందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు చెప్పు , నా గురించి నువ్వు నిజంగా మనసులో ఏమనుకుంటున్నావో! మంచి తనం నటిస్తూ లేని గొప్పలు చెప్పొద్దు. మంచైనా, చెడ్డైనా ఉన్నది ఉన్నట్లు చెప్పు. అది నీ వల్లకాకపోతే, నీ మనసులోని మాట ఏమిటో నేను చెపుతా ..... విను" అన్నాడు.

అతని మాటల్ని మధ్యలోనే తుంచేసింది యామిని. "అంత కష్టం వద్దు, నేనే చెపుతా, వినండి ..... ఇక జన్మలో ఏ మొహాన్నైతే కళ్ళజూడకూడదు - అనుకున్నానో, ఎవరి ఊసైతే మళ్ళీ ఈ జన్మలో ఎంత మాత్రం తలపెట్ట కూడదు అని అనుకున్నానో - ఆ వ్యక్తినే ఇప్పుడు, అనునిత్యం చూస్తూ, మాటాడుతూ నేను బ్రతకవలసివుందా ఏమిటి భగవంతుడా! - అనుకుంటున్నాను. ఇదిచాలా, ఇంకా ఏమైనా వివరణ కావాలా" అంది యామిని ఉక్రోషపడుతూ.

కోపంతో ఎర్రబడిన ఆమె మొహాన్నీ, ఉద్వేగంతో వణికే పెదవుల్నీ చూస్తూ, అదే చిరునవ్వుతో అన్నాడు అమర్, "భేష్ యామినీ! భేష్! ఉన్నది ఉన్నట్లుగానే చెప్పు ఎప్పుడూ. అదే నీకు అందగిస్తుంది, నటన నీకు నప్పదు. నామాట నమ్ము" అన్నాడు ఉత్సాహంగా.

"అబ్బ! ఏం మనిషిరా బాబూ" అనుకుంది యామిని చిరాగ్గా.

అంతలో రాజు వచ్చి, కష్టమర్లు వచ్చారని చెప్పాడు. ఒక కొత్తగా తెరుస్తున్న స్కూలుకి కావలసిన ఫర్నిచర్ కొనడానికి, రాయతీ అడగాలని వచ్చారు వాళ్ళు. ఇక సాయంత్రందాకా ఆ లావాదేవీలతోనే సరిపోయింది ఆఫీసులో అందరికీ. ఆఫీస్ టైమ్ పూర్తి అయ్యాక ఇంటికి వెళుతూ అనుకుంది యామిని, "ఓ గాడ్! ఈ రోజు ఎలాగో గదిచిపోయింది, "టుమారో ఇస్ అనదర్ డే" అని.

* **

ఎప్పటిలాగే వారాంతపు సెలవుల్ని ఇంటిదగ్గర గడపడానికి బయలుదేరింది యామిని. అప్పుడే గోపాల్రావుగారు వెళ్లి ఒక్కరోజు తక్కువగా వారం అయ్యింది . ఈ వారం అంతా కొత్త బాసుతో ఆమెకి కత్తిమీది సాములా ఎంతో క్లిష్టంగా గడిచింది, ఏ క్షణంలో ఏమాట పడాల్సొస్తుందోనన్న భయంతో ఆమె స్వేచ్చగా ఊపిరి కూడా పీల్చుకోలేకపోయింది.

ఆ రాత్రి, అలవాటుగా ఒకే మంచం మీద పడుకుని కబుర్లు చెప్పుకోసాగారు. వకుళ, యామినీను. యామిని ఏవేవో మాటాడుతోందిగాని, కొత్త బాసు విషయం మాత్రం ఎత్తడం లేదు. వకుళకు అది వింతగా తోచింది. కుతూహలం పట్టలేక అడిగేసింది.

"మీకు కొత్తబాసు వచ్చాడని చెప్పావుగాని ఆయన్ని గురించిన విషయాలేమీ చెఫ్ఫావు కాదు. అతడు ఎలా ఉంటాడు? మంచి వాడేనా? వయసెంత ఉంటుంది? నీతో సరిగా ఉంటాడా?" దడ దడా ప్రశ్నల వర్షం కురిపించేసింది వకుళ గుక్క తిప్పుకోకుండా.

" ఏం బాసులే! ఒట్టి కోతి! చెప్పడానికేం లేదు, నోరిప్పితే నొసలు వెక్కిరిస్తాయి. ఒట్టి నస్మరంతిగాడంటే నమ్ము. వదిలెయ్, చెప్పేందుకేమీ లేదు" అంది, విసుగు ధ్వనించే స్వరంతో.

నొచ్చుకుంది వకుళ. "నే నసలు అడగకుండా ఉంటే బాగుండేది. నువ్వు అతన్ని గురించి మాటాడకుండా ఉన్నప్పుడే నేను అర్థంచేసుకుని ఉండవలసింది, అతడు నస్మరంతి గాడని! ఏదో పిఛ్ఛి క్యూరియాసిటీ నన్ను తొందర పెట్టింది" అంది.

"పెద్ద గొడవేం కాదులే. ప్రతిదానికీ పనిగట్టుకుని వంకలెంచి మరీ టీజ్ చేస్తాడు! ఒట్టి "టీజింగు మాష్టర్!" అంతే! అతని మాటల్ని మనం అసలు పట్టించుకోకుండా ఉంటే చాలు, సమస్య మొత్తం

దానంతటదే తీరిపోతుంది. నే నలాగే, అతని మాటల్ని వినీ, విననట్లు గాలికి వడిలేస్తున్నా. కంపెనీకి నేను రాసిన బాండు ఇంక ఒక సంవత్సరమేగా ఉంది, ఆ తరవాత ఒక్కనాటికి ఇక్కడ ఉండను. వేరే జాబ్ లోకి మారిపోతా. అంత వరకూ గడుపుకు పోడమే! మరే గత్యంతరం లేదు కదా! కొద్దిరోజుల్లో అంతా సద్దుకుపోయినా పోవచ్చు కూడా. నెమ్మదిగా అంతా నేనే సమర్ధించుకోవా లనుకుంటున్నా. వకుళా! నీకు పుణ్యముంటుంది, పొరపాటున కూడా మా నాన్నకీ సంగతి చెప్పకేం" అంది యామిని.

"ప్రామిస్, యామినీ ! మీ నాన్నకే కాదు, మానాన్నకు కూడా చెప్పను. ఇలాంటి వన్నీ నీకు నువ్వే సరిదిద్దుకోగలవని నా పూర్తి నమ్మకం. చూస్తూ ఉండు, త్వరలో అతడే నిన్ను మెచ్చుకునే రోజు వస్తుంది" అంది వకుళ ప్రోత్సాహకరంగా యామిని చెయ్యి తన చేతిలోకి తీసుకుని.

"ఇక ఆ విషయాలు వదిలేద్దాం, ఏమైనా మార్పు వస్తే నేనే నీకు చెపుతా. మనకున్న ఈ కాస్త సమయం హాయిగా గడపకుండా, "రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదు" అన్నట్లు ఇక్కడ కూడా బాస్ గొడవేనా ఏమిటి " అంది యామిని నవ్వుతూ, విషయాన్ని తేలికపరిచే ఉద్దేశంతో.

వకుళ మనసులోనే అనుకుంది, " నిజమే! ఈ రెండురోజులూ యామిని సంతోషంగా ఉండేలా చూడాలిగాని, నే నిలా అడ్డమైన ప్రశ్నలూ వేసి ఆమెను వేధించడం మంచిపని కాదు" అని.

***

రోజులు గడుస్తున్నకొద్దీ యామినిని బాస్ టీజింగ్ అంతగా బాధపెట్టడం లేదు. అందుకు కారణం అతడు టీజింగ్ తగ్గించడమా లేక తను దానికి అలవాటు పడిపోవడమా - ఏది కారణమో ఎంత ప్రయత్నించినా తేల్చుకోలేక పోతోంది యామిని. మొదట్లో, తనను వారాంతపు సెలవులకు వెళ్ళనీకుండా అతడు అడ్డుపడతాడేమోనని భయపడింది యామిని. కాని అలా జరగలేదు సరికదా శుక్రవారం వచ్చిందంటే తను
చెయ్యాల్సిన పని మరింత తొందరగా ముగించేస్తున్నాడు. ఆ విధంగా తనకు ఏంతో మంచి జరుగుతోంది. ఆఫీస్ టైమ్ అయ్యిన మరుక్షణంలో తానూ బయటికి వచ్చేసి, ఆటోలో సూటిగా బస్సుస్టాండుకి వెళ్లి, ఏ బస్సు దొరికితే ఆ బస్ ఎక్కి తమ ఊరికి శీఘ్రం వెల్లిపోగలుగుతోంది . దానికి ఆమె చాలా సంతోషి స్తోంది . కాని ఆ విషయంలో అతనికి బహిరంగంగా "థాంక్సు" చెప్పడానికి మాత్రం మనసురావడం లేదు ఆమెకు. వకుళా తనూ చెప్పుకునే ముచ్చట్లలో కూడా ఎక్కడా అతనిపేరు ఎత్తకుండా జాగ్రత్తపడుతోంది యామిని.

ప్రతీ వారం లాగే ఆ వారం కూడా ఇంటికి వచ్చింది యామిని. ఎప్పటిలాగే భోజనాలు ముగించి, స్నేహితురాల్లిద్దరూ మంచమెక్కి కబుర్లు చెప్పుకోడం మొదలు పెట్టారు. అలవాటుగా యామిని ఊళ్ళోవాళ్ళనందరినీ పేరుపేరునా కుశలమడిగింది. వకుళ ఓరిమిగా ఆ ప్రశ్నలన్నింటికీ తనకు తెలిసినంతవరకూ జవాబులిచ్చింది.

"అన్నట్లు వకుళా! ఈ మధ్య ఎప్పుడైనా గురూ అంకుల్ మనింటికి వచ్చారా? నేను ఆయన్ని చూసి చాలాకాలం అయ్యింది - అనిపిస్తోంది " అంది యామిని.

" ఆయన ఈమధ్య ఇంటికైతే రాలేదుగాని, ఏదో పనుండి బ్యాంకుకి వచ్చారుట! మా నాన్నను కలుసుకుని చాలా విశేషాలు చెప్పి వెళ్ళారుట!"

" విశేషాలా! ఏమిటవి? అంతా బాగున్నారా" అని ఆత్రంగా అడిగింది యామిని.

"బాగంటే ...... బాగేలే! సుధాకర్ మంచి మార్కులతో M.A. పరీక్ష పాసయ్యాడనీ , పనిలోపనిగా సివిల్సు ప్రిలిమ్సు కూడా అప్పటికప్పుడే క్లియర్ చేసేశాడనీ నీకు తెలుసుకదా! ఇప్పుడు ఫైనల్సు కూడా నెగ్గాడుట! "

"గుడ్! ఐతే మన భజగోవిందం గాడు, చూస్తూందగా ఇట్టే కలెక్టరు ఔతాడన్నమాట! ఇదేదో బాగుందే! గురూ అంకుల్, తన కొడుకు చదువుకోకుండా జులాయిగా వీధులట్టుకు తిరుగుతున్నాడని నాన్నకి చెప్పి తెగ బాధపడేవాడు. పోనీలే పాపం! నిజంగా వకుళా, గొంగళీ పురుగు సీతాకోక చిలకగా మారినంత అద్భుతమిది! తెలుసా?"

"ఐతే, చూస్తూండగా చాలా ఎత్తుకి ఎదిగిపోయాడన్నమాట సుధాకర్! ఇప్పుడు చూడు - అతడు అందం, చదువు, ఆస్తి - అన్ని హంగులూ ఉన్న గొప్ప కేండేట్ కదూ, మేరేజ్ మార్కెట్ లో" అంది వకుళ ఉబలాటంగా.
"ఔనౌను. అసలే మేరేజ్ మార్కెట్ ఇప్పుడు మంచి గిరాకీలో వుంది. కొడుకు ధర ఏపాటిగా నిర్ణయిస్తుందో ఏమో వాళ్ళమ్మ! ఇంక ఆమె కళ్ళు భూమిని చూడవు, ఆమె చూపులింక ఆకాశాన్నే చూస్తాయి" అంది యామిని అవహేళనగా.

"ఔనూ, నీకీ సంగతి ఇంకా తెలియదుకదూ, శాడ్ న్యూస్! సుధాకర్ వాళ్ళ అమ్మకి బ్లడ్ కేన్సర్ట! ఇంక ఎక్కువ రోజులు ఉండదంటున్నారు, పాపం! ఎంత డబ్బుండీ ఏం లాభంలే! ఇంకా ఆ జబ్బు తగ్గించే మందేదీ కనిపెట్టబడలేదుట! ఏవేవో వైద్యాలు జరుగుతున్నాయి గాని, వాటివల్ల అంతగా ప్రయోజనం ఉండదంటున్నారు. కొద్దిరోజుల్లో మరణించబోతున్నట్లు తెలిసీ, రోజులు లెక్కపెట్టుకుంటూ బ్రతకడం అన్నది దుర్భరమైన విషయం కదూ! అంకుల్ ఇప్పటివరకూ ఈ సంగతిమనకెవరికీ ఎంతమాత్రం తెలియనీయలేదు." విచారంగా అంది వకుళ.
యామిని పశ్చాత్తాపంతో ఖిన్నురాలయ్యింది. "సారీ, వకుళా! ఐ యాం వెరీ వెరీ సారీ!. నేనలా తొందరపడి ఆమె మీద జోకులెయ్యకుండా ఉంటే బాగుండేది కదూ ...... "

"సర్లే! ఐపోయిందిగా, వదిలెయ్యి. ఇదివిను, కొడుకు పెళ్ళి కళ్ళజూడాలన్నది ఆమె కోరిక. కాని సుధ పెళ్ళికి ఒప్పుకోడంలేదుట! "ముందు స్వప్రయోజకత్వం, అది సాధించాకే తన పెళ్ళీ" అంటున్నాడుట! "ఇంత పెద్ద ఆస్తికి ఏకైక వారసుడివి, "ఉద్యోగం చేసి సంపాదిస్తే గాని పెళ్ళి చేసుకోను" అని అనవలసిన కర్మం నీకేమిటిరా - అని అక్కలు ఎంతో చెప్పిచూశారుట, కాని మన హీరో వినడం లేదుట! అది నా తాత తండ్రులు సంపాదించినది. మరి "నీ ప్రయోజకత్వం ఏమిటి"అని ఎవరైనా అడిగితే"- అని ఎదురడుగుతున్నాడుట! బాగుందా?"

యామినికి గతం గుర్తుకొచ్చింది, సుమారుగా మూడేళ్ళ క్రితం, పుంతదారిలో తను సుధాకర్తో అన్నమాటలు తలపుకువచ్చాయి. ఐతే అతనికి స్వప్రయోజకత్వాన్ని గురించిన ఇనిస్పిరేషన్ ఇచ్చింది తనేనన్నమాట. పోనీ, మొత్తానికి దారికి వచ్చాడు, సంతోషం" అనుకుంది. కాని ఆ విషయం వకుళకు చెప్పడానికి ఇబ్బందిగా అనిపించడంతో మాటాడకుండా ఊరుకుంది.

పైకి మాత్రం, "ఓహో! ఐతే మళ్ళీ ఒక ఆదర్శ భారతీయుడు ఈ పుణ్యభూమి మీద ఇన్నాళ్ళకి ఉద్భవించాడన్నమాట! ఇకనుండీ మనమంతా అతని ఆశయసిద్ధికోసం దైవాన్ని

ఘనంగా ప్రార్ధించెదము గాక " అంటూ నాటకీయంగా రెండు చేతులూ జోడించి, కళ్ళు మూసుకుంది యామిని నిజంగా ప్రార్ధన చేస్తున్నదానిలా.

"ఏమిటిది? టీజింగా? బాగానే ఉంది నీ వరస! ఐనా, నువ్వేంచేస్తే నాకెందుకు? నేను మాత్రం మనస్పూర్తిగానే ప్రార్ధిస్తాను, సుధాకర్ విజయంకోసం. "లోక:సమస్తాం సుఖినోభవంతు" అనుకోడం మన సాంప్రదాయం - అది మనం మర్చిపోకూడదు" అంది వకుళ రవంత నిష్టూరం మిళాయిచి.

"అమ్మో,టీజింగా! ఔనా? నిజమేనా ... ! ఏమో బాబూ!" ఆరునెలలు సావాసం చేస్తే వారు వీరౌతా"రని సామెత! అలాంటిది , ఆరు వారాల్లోనే ఆ టీజింగ్ నాకు అంటుకుందా ఏమిటి, దేవుడా!" అంది యామిని నెత్తి మీద చెయ్యేసుకుని, వకుళ వైపు భయంభయంగా చూస్తూ.

"ఇక చాలు, సంతోషించాంలే" అని నవ్వేసింది వకుళ.

"ఊరికే సరదాకి అలా అన్నానేగాని, సుధాకర్ గొప్పవాడైతే సంతోషించే వాళ్ళలో నేనూ ఒకరిగా ఉంటాను. వకుళా, గుర్తుంచుకో సుమీ! ఎంతైనా అతడు మన గురూ అంకుల్ ముద్దుల కొడుకు కదా! మనకు చాలా దగ్గరవాడు " అంది యామిని.

" సరే! ఒప్పేసుకున్నానులే. ఇక నిద్రపోదాం. మళ్ళీ నువ్వు పెందరాళే లేచి ప్రయాణమవ్వలి కదా! గుడ్నైట్" అంటూ వకుళ వెనక్కితిరిగి పడుకుండిపోయింది.

. **

యామిని అనుకున్నంత భయంకరంగా ఏమీ లేవు రోజులు! క్రమం తప్పకుండా అవి సాఫీగానే గదిచిపోతున్నాయి. ఎప్పటిలాగే ఆఫీసుపని కూడా సవ్యంగానే జరిగిపోతోంది. ఇక బాస్ అమరేంద్ర మాటలతో టీజ్ చేస్తే, యామిని తన మౌనంతో అతన్ని టీజ్ చేస్తోంది. కాని రోజులు గడుస్తున్నకొద్దీ ఇద్దరి మనసులూ
గతానికి దూరమౌతూ, ప్రస్తుతానికి దగ్గరగా రాసాగాయి.వాళ్ళ మధ్య సాగుతున్న మౌనపోరాటం గమనించిన హెడ్ క్లర్కు వెంకట్రావుకి అది వరసైన వాళ్ళ మధ్య సాగే ప్రాయపు చెర్లాటలా కనిపించేది. అసలు విషయం ఆయనకేమి తెలియక!

వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన బిగువు కూడా క్రమంగా తగ్గి, నెమ్మదిగా సత్సంబంధాలు ఏర్పడే సూచనలు కనిపించసాగాయి. తక్కిన స్టాఫ్ అందరూ యామినిని గౌరవిస్తున్న తీరు అమరేంద్రని ఆశ్చర్య గొలిపింది. తనొక్కడూ కసి పట్టినట్లు, ఆమెను ప్రతి దాంట్లోనూ వంకలెంచి, ఆటపట్టించాలనుకోడం భావ్యం కాదేమో అన్న ఆలోచన కూడా పొడజూపింది అతనిలో. నెమ్మదిగా విలక్షణమైన యామిని వ్యక్తిత్వం అతన్ని ఆకర్శించసాగింది.

జీవితంలో, ఏదో ఒక చిన్న పొరపాటు దొల్లినంతమాత్రంలో, ఒక మనిషి ప్రవర్తన మొత్తానికి మసి రాయకూడదన్న విషయం అర్థం చేసుకున్నాడు అతడు. అంతే కాదు, ఆమెను టీజ్ చేసే హక్కు తనకు ఎంత మాత్రం లేదన్నది కూడా తెలుసుకున్నాడు. తనకు జరిగిన ద్రోహానికి బాధ్యురాలు ఆమె ఎంతమాత్రం కాదు కదా! ఒకతె చేసిన తప్పిదానికి, తను స్త్రీ జాతినంతటినీ తప్పు పట్టడం కూడా మంచిపని కాదు - అనుకున్నాడు. అక్కడితో, పనికట్టుకుని ఆమెను వెటకారం చెయ్యడంలో అతనికి సరదా కనిపించడం మానేసింది. క్రమంగా ఇద్దరి మధ్య అవగాహన పెరగి, సమరసభావం ఏర్పడే అవకాశం ఏర్పడింది.

క్రమంగా బిజినెస్ పెరుగుతూండడంతో టైప్ చెయ్యాల్సిన మేటరుతో పాటుగా మెయింటెయిన్ చెయ్యాల్సిన ఫైళ్ళు, పోష్టు చెయ్యాల్సిన ఉత్తరాలు కూడా పెరిగాయి. యామినికి చేతినిండా పనే అయ్యింది. వర్కులోడ్ బాగా ఎక్కువవ్వడంతో, ఆమె ఆఫీసుకి ఒక అరగంట ముందుగా వచ్చి, ఒక పావుగంట లేటుగా ఇంటికి వెడుతూ, ఎలాగైనా సకాలంలో పని పూర్తి చెయ్యాలని పట్టుపట్టి, దీక్షగా పనిచేస్తూ సతమతమౌతోంది. శ్రమ కోర్చిఅంకిత భావంతో పనిచేస్తూ - స్టెనోగా, క్లర్కుగా రెండుపాత్రలూ సమర్ధవంతంగా నిర్వహిస్తోంది యామిని.

***

ఒకరోజు ఆమె వచ్చీసరికే అమరేంద్ర, టైపు మిషను మీద ఏకాగ్రతతో పనిచేస్తూ కనిపించాడు. అది చూసి యామిని కంగారు పడింది.

ఫార్మల్గా అతనికి విష్ చేసి, "నేను వచ్చాకదా, ఇక మీరు లేవండి సర్!" అంది మర్యాదగా.

అమరేంద్ర పని ఆపి, ఆమెవైపు చూసి చిరునవ్వు నవ్వాడు. "ఐపోయింది. ఇంకొక్క ఐదు నిముషాలు టైం ఇస్తే చాలు, నీ మిషన్ నీకు ఇచ్చేస్తా " అని చెప్పి, మళ్ళీ టైప్ చెయ్యడంలో నిమగ్నుడయ్యాడు. వంచిన తల ఎత్తకుండా పని చేసి, చెప్పిన టైమ్ లోగానే దాన్ని ముగించి, ఆ పేపర్లు తీసుకుని తన రూం లోకి వెళ్ళిపోయాడు అమర్ .

ఆ పూటకింక అర్జంటుగా టైపు చెయ్యాల్సిన మెటీరియల్ అంతగా ఏమీ లేకపోవడంతో, యామిని చెదిరిన ఫైళ్ళను సవరించి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సద్దడం మొదలు పెట్టింది. అంతలో బజ్జర్ మ్రోగింది. చేతిలోని పని వదలి; పేడ్డు, పెన్సిలూ తీసుకుని బాస్ రూంలోకి నదిచింది ఆమె .

ఆఫీసు తెరిచీ వేళ అవ్వడంతో, అక్కౌంటెంటు, హెడ్గుమాస్తా - ఇలా ఒకరొకరే రావడం మొదలయ్యింది.
యామిని రూంలోకి రాగానే, అమరేంద్ర చేతిలోని ఫైల్ పక్కనపెట్టి, "రా యామినీ, వచ్చి ఇలా కూర్చో" అంటూ విజిటర్ల కోసం వేయబడిన కుర్చీని చూపించాడు.

కాని యామిని కూర్చోలేదు. "చెప్పండి సర్!" అంది డిక్టేషన్ తీసుకునే పద్ధతిలో పేడ్డు, పెన్సిలూ పట్టుకుని.
"నేనిప్పుడు పిలిచింది, డిక్టేషన్ కోసం కాదు, వేరే పనిమీద. నీతో కొన్ని విషయాలు మాటాడాలి. ఎక్కువసేపు నిలబడి ఉంటే, మనసంతా కాళ్ళ నెప్పులమీదే ఉంటుందిగాని, వింటున్న విషయం మీద నిలవదు. కూర్చో, ప్లీజ్!"

అతని కంఠంలో ధ్యనించిన మృదుత్వానికి యామిని నిర్ఘాంతపోయింది. "అతివినయం ధూర్త లక్షణం" అన్న నానుడి గుర్తొచ్చింది ఆమెకు. "ఇమిటిది? దీన్ని నేనేమనుకోవాలి ట " అనుకుంది భయం భయంగా. వెంటనే ఇంకేం మాటాడకుండా కుర్చీలోకూర్చుంది.

"ఇది కేవలం ఫ్రెండ్లీ ఛాట్! ఇందులో నీ ప్రమేయం కూడా ఉంది కనకనే నిన్ను పిలిచాను. ఇప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా విని, సంకోచించకుండా నీ మనసుకి తోచిందేదైతే ఉందో అదే చెప్పు, చాలు " అన్నాడు.

ఏం మాట్లాడడానికీ తోచక అవాక్కై ఉండిపోయింది యామిని. అమరేంద్ర మళ్ళీ మాటాడాడు.

" ఒకరోజు నేను ఊరికే ఊరు చూడాలని బయలుదేరా. ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అయ్యాక హైదరాబాదు చాలా వేగంగా డెవలప్ ఔతోంది - అని విని, అదేమిటో చూడాలని అనుకున్నా. ఏదో ఒక నాటికి, ఈ ఊరు కూడా మద్రాసు, బొంబాయ్, కలకత్తాల్లా అన్నిహంగులతో ఉన్న ఒక మహానగరంగా డెవలప్ ఐనా అవ్వొచ్చు ననిపించింది! తగినంత స్థలం కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడిప్పుడే ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా
అభివృద్ధిలోకి వస్తోంది. ఎటుచూసినా కట్టినవి, కట్టబోయేవి, కడుతున్నవీ భవనాలు కనిపిస్తున్నాయి. వాటిని చూడగానే నాకు, మన మైత్రీ పరంగా ఒక బిజినెస్ ఐడియా వచ్చింది. అది నీతో డిస్కస్ చెయ్యాలని నిన్ను రమ్మన్నా" అని మాట ఆపాడు.

ఈ లోగా రాజు ఫ్లాస్కుతో కాఫీ తెచ్చాడు. దాన్ని మగ్గుల్లో పోసి ఇద్దరి ముందూ చెరొకటీ ఉంచి, ప్లాస్కు తీసుకుని వెళ్ళిపోయాడు వాడు. కాఫీ ఆరోమాతో గదంతా నిండిపోయింది.

"కాఫీ తీసుకో యామినీ! చల్లారిపోతుంది! మనం కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం" అంటూ కాఫీ మగ్గు చేతిలోకి తీసుకున్నాడు అమరేంద్ర. వెంటనే యామిని కూడా మగ్గు తీసుకుంది.

కాఫీ రెండు గుక్కలు తాగి మాటాడ్డం మొదలుపెట్టాడు అమర్. " మైత్రీ ఫర్నిచర్సుకి ఇండియాలో ఎంత మంచి పేరుందో నీకు తెలుసుకదూ! మన్నికకు, నాజూకైన అందానికీ మనల్ని బీట్ చేసీవాళ్ళెవరూ ఇండియాలో లేరు - అన్నది అందరికీ తెలుసు. ఇప్పుడు మనం "మైత్రీ ఫర్ణిషింగ్సు" అన్న పేరుతో, ఇళ్ళు కట్టే టప్పుడు ఉపయోగించే ఉడెన్ ఫ్రేములూ, తలుపులూ; కిటికీలకు అలమార్లకూ పనికొచ్చే సామగ్రి తయారు చేయించి రెడీమేడ్ గా అమ్మితే, బిల్డర్ కి సౌకర్యం, మైత్రీకి లాభం ఉంటుంది. మన బిజినెస్ ఇంకా ఇంకా అభివృద్ది చెందుతుంది - ఇది నా ఐడియా! ఏమంటావు?"

"నిజమే! కాని, ఇందులో నా ప్రమేయ మేమిటో" అనుకుంది యామిని మనసులో. .

"ఇందులో నీ ప్రమేయం ఏమిటనికదా నీ సందేహం? ఏమీ లేదనుకోకు, ఉంది! ఈ ప్రోజక్టు మిత్రాగారు ఆమోదించి, అమలులోకి తెస్తే, అప్పుడు మనకు పని ఎక్కువౌతుంది. ముఖ్యంగా నీకు" అని ఆగాడు అమర్.
అప్రయత్నంగా ఊపిరి గట్టిగా పీల్చి, వదలింది యామిని. అది గ్రహించడమే కాదు, అతడు దాన్ని అర్థం చేసుకున్నాడు కూడా. ఆమె ఆ విషయం ఏమీ పైకి మాటాడకపొయినా, ఆమెకు వర్కులోడ్ ఇప్పటికే చాలా ఎక్కువగా ఉంటోందన్నది అతనికి తెలుసు.

" నీకు పని భారం ఎంత ఎక్కువ ఉంటోందో నాకు తెలుసు. ఈ ప్రోజెక్టుకి సుప్రీం బాస్ ఆమోద ముద్ర పడగానే, వేరే డిస్పాచ్ క్లర్కుని వేసుకుందాం. నీకు P.A. గా ప్రమోషన్ ఇమ్మని రికమెండ్ చేశా. ఈ విషయంలో నీ కేదైనా అభ్యంతరం ఉంటే ఇప్పుడే తెలియజేయి. నీకీ ప్రమోషన్ వల్ల వర్కు తగ్గడమే కాదు జీతం కూడా పెరుగుతుంది."
"థాంక్సు సర్! అలాగే కానియ్యండి. ఈ ప్రోజెక్టు ప్లాన్ చాలా బాగుంది. బిగ్ బాస్ తప్పకుండా ఆమోదిస్తారు. అన్నీ మీరు అనుకున్నట్లే జరుగుతాయి" అంది యామిని ప్రోత్సాహకరంగా

" ఇందాకా నేను టైప్ చేసింది ఆ లెటరే.! సంతకం చెయ్యడం అయ్యింది. ఇక దాన్ని డి స్పాచ్ చెయ్యాల్సింది నువ్వేకదా! ముందు నువ్వు దీన్ని చదివి, ఆ తరవాత మిత్రాగారికి పోష్టుచెయ్యి" అంటూ ఆ లెటర్ యామినికి అందించాడు అమర్.

లెటర్ తీసుకుని తనరూంలోకి వెడుతూ అనుకుంది యామిని, " ఈయన మాటతీరునుబట్టి, ఏమేమో అనుకున్నాగాని, మనసు మంచిదే అనిపిస్తోంది! నన్నంత టీజ్ చేసి ఏడిపించాలని చూసినా, మళ్ళీ నాకు మేలు చెయ్యాలని కూడా ఆలోచిస్తున్నాడు! "మాట కరుకు- మనసు చెరుకు" కాబోలు! ఏం మనిషో!" అల్లా అనుకోగానే, అప్రయత్నంగా అమరేంద్ర విషయంలో ఇప్పుడిప్పుడే రాజీ పడడానికి చూస్తున్న ఆమె హృదయం
తొలిసారి, అప్రయత్నంగా ఆర్ద్రమయ్యింది.

* **

అమరేంద్ర హెడ్డాఫీస్ కి లెటర్ పంపి అప్పుడే వారమయ్యింది. దసరా పండుగలు రావడంతో మధ్యలో ఒకసారి, యామిని మూడురోజులుపాటు ఇంటికి వెళ్లి వచ్చింది. ఈమాటు రమణమ్మేకాదు, రాజేశ్వరి కూడా ఏవేవో తను చేసిన పిండివంటలు కూడా కట్టి ఇచ్చింది యామినికి. మధ్య దారిలో ఏదో చిన్న రిపేర్ వచ్చి, బస్సు హైదరాబాదు చేరడానికి కొంచెం ఆలస్యమయ్యింది. దాంతో ఇక వంటపెట్టుకోకుండా, తాను తెచ్చుకున్న తినుబండారాలే, తను తినడమే కాక ఎవరికైనా కొంచెం ఇవ్వొచ్చన్న ఉద్దేశంతో, మరికాసిని టిఫిన్ బాక్సునిండా పెట్టుకుని ఆఫీసుకి వచ్చింది యామిని. .

నిన్నటి పని కొద్దిగా మిగిలి ఉండడంతో, ఆఫీసుకు రాగానే టైప్ మిషన్ సెట్చేసి, పని మొదలుపెట్టింది యామిని. ఆ సరికే వచ్చి ఉన్నారు స్టాఫ్ అందరూ. వాళ్ళు బాస్ ఇంకా రాలేదన్న ధీమాతో కబుర్లు చెప్పుకుంటూ, జోకులేసుకుని నవ్వుకుంటూ సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. ఆఫీసు బోయ్ రాజు కూనిరాగాలు తీస్తూ బాస్ టేబులు సద్దుతున్నాడు.

అంతలో, కదం తొక్కుతున్న పంచకల్యాణి గుర్రం కాలి అడుగుల చప్పుడులా లయబద్ధమైన బూట్ల చప్పుడుతో బాస్ గుమ్మాలెక్కి వస్తూండడం తెలిసింది. వెంటనే అందరూ, ఎక్కడివాళ్ళు అక్కడ సద్దుమణిగి, శ్రద్ధగా పని చెయ్య సాగారు. ఒక్కసారిగా ఆఫీస్ అంతా నిశ్శబ్దంగా మారిపోడంతో యామిని రూంలో టైపు మిషన్ చేస్తున్న చప్పుడు స్ఫుటంగా వినిపించసాగింది.

స్టెప్సు వేస్తున్నట్లు అడుగులు వేస్తూ, సంతోషంగా లోపలకు వచ్చాడు అమరేంద్ర. రాజు పరుగున వచ్చి అతని చేతిలోంచి బ్రీఫ్కేస్ అందుకున్నాడు. విష్ చేస్తున్నవాళ్ళకి తిరిగి విష్ చేస్తూ తన గది వైపుగా నడిచాడు అమరేంద్ర.

"రాజూ! పోస్టుమాన్ రోజూ ఎన్నిగంటలకు వస్తాడు?" పెట్టె తెచ్చి లోపలపెడుతున్న రాజుని అడిగాడు అమరేంద్ర.

"పది, పదకొండు మధ్యలో వస్తాడు సార్!" బ్రీఫ్ కేస్ కుర్చీ పక్కన ఉంచి, చేతులు కట్టుకు నిలబడ్డాడు రాజు.
"పోస్టు రాగానే లెటర్సు అన్నీ నువ్వు నా దగ్గరకే తీసుకురా, వెంటనే!"

"అలాగే సార్! ఇంకేమైనా పనుందా? చెప్పండిసార్!"

"ముందాపని కానియ్యి. ఆ తరవాత చెపుతా మరే పనైనా. ఇక వెళ్ళు."

"సరే సార్!"

రాజు వెళ్ళిపోగానే కాలింగు బెల్ ప్రెస్ చేశాడు అమరేంద్ర. "ఎందుకనో బాస్ ఈ రోజు మంచి ఉషారు మీద ఉన్నాడు" అంటూ గుసగుసలుపోయారు స్టాఫ్.

లోపలకు వస్తూనే "గుడ్ మార్నింగ్ సర్" అంటూ యామిని అతన్ని విష్ చేసింది.

"సేం టు యు" అన్నాడు ఆమెవైపు ప్రసన్నంగా చూస్తూ. " ఐ హోప్, టుడే బికమ్సు ఎ మోస్టు వండర్ఫుల్ డే ఫర్ అజ్ ! కొంచెం ఆగితే చాలు, అది కంఫర్ము ఔతుంది. చూస్తూ ఉండు" అన్నాడు అమరేంద్ర .

యామిని అతని సంబరం చూసి ఆశ్చర్యపోయింది. వింతగా అతని వైపు చూస్తూ నిలబడిపోయింది.

" ఏమిటలా చూస్తున్నావు? నా మాటమీద నీకు నమ్మకం కలగటల్లేదా? చూస్తూ ఉండు, ఈ వేళ హెడ్డాఫీసునుండి, మన ప్రపోజల్ని O K చేస్తూ లెటర్ వస్తుంది. ఇది ఇంట్యూషన్ అనుకో, లేదా సిక్స్తు సెన్సు అనుకో, మరేదైనా అనుకో - నీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు" అన్నాడు ఉత్సాహంగా.

"ఓహో! అదా సంగతి! అందుకా గురుడు ఇంత ఉషారుగా ఉన్నాడు ఈవేళ " అనుకుంది యామిని లోలోపల. పైకి మాత్రం రొటీనుగా, " నన్నెందుకు పిలిచారు? ఏమైనా లెటర్సు ఉన్నాయా సర్! డిక్టేషనుకి" అని అడిగింది.
" ముందు పోష్టు రానియ్యి, ఆ తరవాతే ఏ పనైనా! అలా కూర్చొ, కొంచెం సేపు మనం వెయిట్ చేద్దాం " అన్నాడు అమర్.

అంతలో రాజు పోస్టు పట్టుకుని వచ్చాడు. ఆ రోజు పోష్టుమాన్ రోజూకన్నా తొందరగా వచ్చాడు. ఉత్తరాలకట్ట తెచ్చి టేబుల్ మీద ఉంచాడు రాజు. వెంటనే వాటిని విడదీసి చూసిన అమరేంద్ర , వాటిలో రెండింటిని తీసి యామిని ముందుకి తోశాడు. తక్కినవన్నీబొత్తిగా ఒక పక్కన పెట్టేశాడు. యామిని తనముందున్న లెటర్సుని ఎత్తి చూసింది. ఒక దానిమీద హైదరాబాదు ఆఫీసు M. D. అడ్రస్సు ఉంటే, రెండవది తన పేరు మీద ఉంది. అది చూసి ఆశ్చర్యపోయింది యామిని.

ముండుగా ఆఫీసు అడ్రస్ ఉన్న కవర్ తెరిచి చదివింది యామిని. అది అమరేంద్ర ఊహల్ని నిజం చేస్తూ సత్యదేవ్ మిత్రాగారు పంపిన సమ్మతి పత్రం. అమర్ ప్రతిపాదించిన ప్రోజెక్టుని మెచ్చుకుంటూ, త్వరలోనే దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చెయ్యబడతాయని మిత్రాగారి ఆఫీసునుండి, ఆయన సంతకంతో వచ్చింది అది. అంత చక్కని ఐడియా ఇచ్చినందుకు అమరేంద్రకు "థాంక్సు" చెపుతూ మిత్రాగారు కొత్తగా ఎక్స్పాండు చేసిన కంపనీకి కూడా అతన్నే C.E.O. గా, శాలరీ హైక్ తో అప్పాయింట్ చెయ్యాలని అనుకుంటున్నారనీ, త్వరలో హెడ్డాఫీసుకి వచ్చి, మాటాడి స్వయంగా ఎంప్లాయిమెంట్ ఆర్డర్ తీసుకుని వెళ్ళవలసిందనీ, మిత్రాగారి P.A. రాసిన జాబు కూడా ఉంది అందులో.

యామిని చదవడం పూర్తిచేసి, ఆ లెటర్ ని ఎన్వలప్ లో పెట్టి, అతని ముందు ఉంచి, మెప్పుగా అతన్ని చూస్తూ "మై హార్టీ కంగ్రాట్యులేషన్సు సర్!" అంది సంతోషంగా.

"థాంక్సు! రెండో లెటర్ చదువు, అప్పుడు టేబుల్సు టరనౌతాయి" అన్నాడు అమర్ చిరునవ్వుతో.
అతను అంటున్నదేమిటో అర్థమవ్వక తెల్లబోయి అతనివైపు చూసింది యామిని. సెకన్ ఆలస్యమైనా సహించలేక అతడు, రెండవ ఎన్వలప్ చేతిలోకి తీసుకుని, తనే చింపి, దానిలోని ఉత్తరాన్ని పైకితీసి ఆమె చేతికి అందించాడు. అది చదివిన యామిని మొహం పూర్ణ కమలంలా వికసించింది. యామినిని అక్కడి C.E.O.కి పర్సనల్ సెక్రెటరీగా ప్రమోట్ చేస్తూ వచ్చిన ఎంప్లాయిమెంటు ఆర్డరు అది! అమర్, "మై హార్టీ కంగ్రాట్యులేషన్సు యామినీ" అన్నాడు మృదువుగా, నవ్వుముఖంతో.

"థాంక్సు సర్!" అంది ఉద్వేగంతో . అప్పుడు అర్ధమయ్యింది యామినికి, టేబుల్సు తర్నవ్వడం అంటే ఏమిటో!
అతడు లేచి యామిని ఉన్న దగ్గరకు వచ్చాడు. అతడు దగ్గరగా రావడం చూసి యామిని కూడా లేచి నిలబడింది. అతడు చెయ్యి ముందుకు చాపి, "ఎగైన్ మై హార్టీ కంగ్రాట్యులేషన్సు టు యూ " అన్నాడు. చాచి ఉన్న అతని చేతిలో తన చెయ్యి ఉంచి, "మై కంగ్రాట్యులేషన్సు అండ్ థాంక్సు టు యు సర్!" అంది ఉత్సాహంగా యామిని. అతడు ఆమె చేతిని మృదువుగా నొక్కి వదిలాడు. " మనం ఇక ముందు కూడా ఇలాగే చేతులు కలిపి, కలిసికట్టుగా పనిచేసి, మన ప్రోజెక్టుని విజయపు దిశగా నడిపించాలి" అన్నాడు ఉబికివస్తున్న ఉత్సాహంతో.
అమరేంద్ర కాలింగ్ బెల్ రెండుసార్లు నొక్కి, "యామినీ! ప్రస్థుతం ఇక్కడ దొరికే మంచిరకం స్వీట్సు కొన్ని తెప్పించు, స్వీటు ఇచ్చి మన స్టాఫ్ అందరికీ ఈ శుభవార్త చెపుదాము. ఆ తరవాత ఫార్మల్ గా ఇనాగరేషన్ జరిపించవచ్చు" అన్నాడు అమర్, డబ్బు తీసి ఇస్తూ.

రాజు వచ్చాడు కంగారు పడుతూ. రాజుకి డబ్బు ఇచ్చి, ఏదైనా నేతి మిఠాయిల షాపు నుండి రెండు కిలోల పాల మైసూర్ పాక్, రెండు కిలోల కళాఖండ్ కొని తెమ్మని చెప్పింది యామిని. రాజు ఆ పనిమీద వెళ్ళాడు. యామిని తన గదిలోకి వెళ్ళిపోయింది.

కొద్ది సేపట్లో టిఫిన్ బాక్సు చేత్తో పట్టుకుని, అమర్ దగ్గరకి తిరిగి వచ్చింది యామిని. బాక్సు తెరిచి అతని ముందుంచి, "ఇది నా వంతు సెలిబ్రేషన్, తీసుకోండి సర్!" అంది.

అతడు ఆశ్చర్యంగా వాటివైపు చూశాడు. ఆ బాక్సులో రకరకాల దేశవాళీ పిండివంటలు ఉన్నాయి. వాటిలోంచి అతడు ఒక కోవా కజ్జికాయను తీసుకుని తింటూ, "ఇవంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ నా కోసమని తరచూ చేసేది వీటిని. ఇవి ఎవరు చేశారు, నువ్వా?"

" లేదు, నా కంత ప్రజ్ఞ లేదు. వీటిని మా ఆంటీ చేసి, నాకు తినమని కొన్ని ఇచ్చారు. ఇలాంటి ప్రత్యేకమైన వంటలు ఆమె బాగా చేస్తారు. ఇవిగో ఈ మడతకాజాలూ, తొక్కుడులడ్డూలు మా ఇంట్లో మా అత్తయ్య చేసినవి" అంది యామిని, ఒక తొక్కుడులడ్డూ తీసి అతనికి ఇస్తూ.

అతడది అందుకుంటూ, వీటిని నువ్వు నీ లంచిబాక్సులో తెచ్చావంటే ఈ వేళ నీ లంచ్ ఇవేనని కదా అర్థం! ఇప్పుడివి ఖాళీ ఐపోతే నీకు లంచ్ ఎలా?"

" మరీ ఇన్ని స్వీట్లు తినగలనా ఏమిటి! అందరికీ ఇవ్వవచ్చుననే ఇన్ని తెచ్చా" అంది యామిని.

"ఇప్పుడీ బాక్సు మొత్తం నేనే తీసేసుకుంటే నీకేమైనా అభ్యంతరమా? ఇవి - నాకు మా ఇంటినీ, మా అమ్మనీ గుర్తుచేస్తున్నాయి" అంటూ టిఫిన్ బాక్సుకి గట్టిగా మూతపెట్టి దాన్ని తన వైపుకి లాక్కున్నాడు అమరేంద్ర . అతని చొరవకు యామిని తెల్లబోయింది, కాని ఏమీ అనలేదు. "సరే" అన్నట్లు తల ఊపి, తన సమ్మతిని తెలియజేసింది.


అంతలో రాజు స్వీట్సు పెట్టెలు తీసుకుని వచ్చాడు. స్టాఫ్ అందరికీ తియతీయని స్వీట్సు పంచి, అంతకంటే తియ్యని వార్తను అందించింది బాసు తరఫున అతని p. a. యామిని. అంతా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ హర్షధ్వానాలు చేశారు. ఎవరిమట్టుకు వాళ్ళే భవిష్యత్తును గురించి బంగారు కలలు కనడం మొదలుపెట్టారు. పెరగబోయే వర్కులోడ్ కన్నా వాళ్ళ దృశ్టిని ఇంక్రీజ్ కాబోతున్న పేస్కేల్ ఎక్కువగా ఆకట్టుకుంది. .

ఆ రోజు, తన వంతు సెలబ్రేషన్ గా యామినిని లంచ్ కి దగ్గరలో ఉన్న హోటల్ కి తీసుకువెళ్ళాడు అమరేంద్ర. . తిరిగి వస్తూండగా దారిలో చెఫ్ఫాడు, "మన ఆఫీసు ఇలా దీనంగా, మొరోజ్ గా ఉండడం ఏమీ బాగాలేదు. ఆఫీస్ ఎక్స్పాండ్ ఔతోంది, కష్టమర్సు పెరుగుతారు. వాళ్ళు, ఫేస్ వాల్యూనిబట్టే అంచనా వేస్తారు మన రియల్ వాల్యూని. నేనీ వారమంతా ఊళ్ళో ఉండను కదా! నీకో రెండువేలు ఇచ్చి వెడతా, ఇంటీరియర్ డెకరేటర్సుకి ఎవరికైనా ఆర్డర్ ఇచ్చి, వారం రోజుల్లో, ఆఫీస్ "రిన్నొవేషన్" పని మొత్తం పూర్తిచేయించు. నేను వెంకట్రావు గారికి చెప్తా, నీకు కావలసిన సాయం చెయ్యమని. మళ్ళీ నేను వచ్చేసరికి ఆఫీసు ఇలా ఉండకూడదు, నువ్వేం చేస్తావో మరి!"

"సరే సర్! నా కృషి లోపం చెయ్యకుండా పని జరిగేలా చూస్తా" అంది యామిని.

" నువ్వు నాకు పర్సనల్ అసిస్టెంటువి కాకముందే నీకు పనులు అప్పగిస్తున్నానని కోపగిస్తావనుకున్నా, కాని నువ్వు చెప్పగానే ఒప్పేసుకున్నావు, థాంక్సు!"

"మై ప్లజర్ సర్!"

"అసలు ఏ పనైనా సరిగా జరగాలంటే, దాన్ని తగిన మనిషికి అప్పగించాల్సి ఉంటుంది. నేను తిరిగి వచ్చే వరకూ ఆఫీస్ పని నీకు అప్పగించాలని ఉంది నాకు. నువ్వు ఏమంటావు?"

"వద్దు సార్! స్టాఫ్ లో సీనియర్ మోస్టు, హెడ్ క్లర్కు ఉన్నారు కదా! ఆయనకి అప్పగించండి ఆఫీసు బాధ్యత. అది బాగుంటుంది. ఆయన చిన్నబుచ్చుకొనీలా చెయ్యడం ఎవరికీ మంచిది కాదు. ఆయనకు అవసరమైతే, నా వంతు సాయం నేను చేస్తాను."

అంతలో ఆఫీసు దగ్గరకు రావడంతో వాళ్ళు కబుర్లు ఆపేశారు.

దూరంనుండి, వాల్లిద్దరూ అలా కలిసి రావడం చూసిన వెంకట్రావుగారి మనసు నిండా ఏవేవో ఆలోచనలు! "ఇంత వరకూ ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉండేవారు. అలాంటిది ఈ వేళ ఇలా కలివిడిగా, ఇద్దరూ వెళ్లి భోజనం చేసి వచ్చారంటే ఏమనుకోవాలి! జంట బాగుంది చూడముచ్చటగా! అలాని నేననుకుని ఏం లాభం, ఆ పైవాడు కూడా అనుకోవాలి కదా....!"

ఇలా ఏవేవోఊహలు ఆయన మేధని గిలిగింతలు పెట్టసాగాయి.

***

(సశేషం)

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)