కవితా స్రవంతి

సంక్రాంతి లక్ష్మి

- ‘విద్వాన్’ విజయలక్ష్మి.రాచకొండ.

పామాలతో పూమాలతో – గోపాలుని అర్చించెను
శ్రీరంగని చేరికొనగ – గోదా మది పులకించెను
పచ్చ పసుపు పూతలతో – పచ్చనైన గుమ్మాలతో
బంతి పూల తోరణాల – చేమంతుల చేరికతో
రంగవల్లికల మాలికతో – ముత్యాల ముగ్గుల్లో
“ గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు – రతనాల గొబ్బిళ్ళు
గుమ్మడి పూల గొబ్బిళ్ళం” చు ఆరాధించు
కన్నె పిల్లల సొగసులతో
ఇంతుల కొప్పుల విరసిన – చేమంతుల చెలువముతో
ఆక్షయముగ నిండు నట్టి- అక్షయ పాత్రల తోడను
హరి కీర్తనలాలపించు – హరి దాసుల సు స్వరాలతో
“ అయ్యగారికి దణ్ణం పెట్టు – అమ్మగారిని వస్త్రం అడుగు”
అని సందడి చేసే డూ డూ బసవన్నలతో-
సన్నాయి నాదాలతో – కాంతల దానాలతో
ఇంద్ర ధనసు భువిని విరియ – పల్లె తల్లి పరవశించ
మంచు తెరల మాటు నుంచి –హేమంతపు బాటలలో
ప్రకృతి కాంత పులకించగ –కదలి వచ్చే కడలి వోలె
మకర సంక్రాంతి లక్ష్మి – పౌష్య లక్ష్మి వేషం తో;
ఏరువాక పాటలతో – ఏతాముల సవ్వళ్ళతో
కృషీ వలుల గాదులలో – ధాన్య లక్ష్మి కొలువుండగ
భోగి మంట వెలుగులతో – భోగి పండ్ల విభవంతో
ధనుర్మాస శోభలతో – పాశురాల విన్నపం తో
బొమ్మల కొలువులతో – పేరంటాళ్ళ సందళ్ళతో
పతంగుల విహంగాలతో – కోడి పందేల కోలాహలంతో
ఎడ్ల పరుగుల జోరులతో – గోమాతల పూజలతో
తెలుగు వారి లోగిళ్ళలో – పౌష్య లక్ష్మి ప్రభవించెను
మకరమందు వెలుగొందెడి- దినకర దివ్య కిరణాలతో
సకల జనావళి హృదిలో చైతన్యం వెల్లి విరియ
అభ్యుదయం అంబరమంటగ – సంబరాలు మిన్నంటగ
సంక్రమించె సంక్రమణం – కొలిచిరందారాదిత్యుని
తీయ తీయని కప్పురంపు భోగి పాయసాలతో
చవులూరు చోష్య లేహ్య పానీయాలతో
ఘుమఘుమలాడు శాక పాకములతో
క్రొత్త సన్నబియ్యపుటన్నముతో
జిడ్డుదేరిన వెన్నెల గడ్డపెరుగుతో
షడ్రుచులు మేళవించిన విందు భోజనముల సేయ
రండు రండు అని పిలుచుచు
కదలి వచ్చే వైభోగాముగ సంక్రాంతి లక్ష్మి .

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)