సుజననీయం
కృషితో నాస్తి దుర్భిక్షం
- తాటిపాముల మృత్యుంజయుడు

సంపాదకవర్గం:

ప్రధాన సంపాదకులు:

తాటిపాముల మృత్యుంజయుడు

సంపాదక బృందం:

తమిరిశ జానకి

కస్తూరి ఫణిమాధవ్

చెన్నాప్రగడ కృష్ణ

 

తేదీ డిసెంబర్ 25, 2016. సమయం ఉదయం 10 గంటలు. స్థలం: ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, విజయవాడ. వేలాదిమంది పిల్లలు మైదానంలో గుమికూడారు. అందరి ముఖాల్లో సంతోషం తొణికిసలాడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలనుండి,విడేశాలనుండి వాళ్లంతా ఒకే ధ్యేయంతో వచ్చారు. సాయంత్రం మూడు తరాల కూచిపూడి కళాకారులు చేయబోయే మహాబృందనాట్యంలో పాల్గొనడం, తెలుగువారి నాట్యకళకు చిహ్నమైన కూచిపూడికి వన్నె తేవడం, అలాగే గిన్నీస్ బుక్ రికార్డు సృష్టించి గిన్నీస్ సర్టిఫికెట్ కైవసం చేసుకోవడం. అందుకుగాను ఎన్నో నెల్ల తరబడి గురువుల వద్ద రెండు గీతాలకు నాట్యాన్ని అభ్యసించారు. ఆ శిక్షణలో తుది విడతగా ఆ స్టేడియంలో నాట్యం చేసేందుకు గుమికూడారు.

ఆ సమయంలో నాకు ఓ యాభైమంది పిల్లలను పర్యవేక్షిచించే అదృష్టం లభించింది. నా బాధ్యత ఏమిటంటే ఆ పిల్లలందరు తమకు నిర్ణీతస్థానాల్లో నిలబడడం, చుట్టుపక్కల పిల్లలతో నాట్యం చేసేందుకు వీలుగా తగినంత స్థలాన్ని వదలడం, సాయంత్రం మహాబృందానికిగాను మైకులో చెబుతున్న ఇతర సూచనలను గుర్తుపెట్టుకోవడం మొదలైనవి.

నాకు కేటాయించిన పిల్లలలో ఓ చిన్నపాప ఉంది. వయసు ఏడేళ్లకు పైబడి ఉండవేమో. ఈ సాధనలో వాళ్లు గురుముఖంగా నిలబడి నాట్యం చేస్తున్నారు. గురువు పక్కన పిల్ల తల్లిదండ్రులు కూడా ఉన్నారు.

మొదటి గీతం 'జయము జయము ' రిహార్సల్ పూర్తయింది. ఇక మిగిలింది రెండవ గీతం 'ఆనంద తాడవమాయె'. డాక్టర్ సి. నారాయణరెడ్డి రచించిన ఈ గీతానికి గురువు వెంపటి చినసత్యం కూచిపూడి నృత్యాన్ని సమకూర్చారు. క్లిష్టతరమైన నాట్యం అది. మైకులో చెప్పారు 'ఈ గీతానికి నాట్యం చేయని వాళ్లు వెనక్కు వెళ్లి నిలబడండి ' అని. చాలామంది చిన్నపిల్లలు, కొంతమంది పెద్దవాళ్లు వెనక్కి వెళ్లారు. కాని ఈ భుడుతి మాత్రం అక్కడే నిలబడి ఉంది.


స్టేడియం మధ్యలో ఏర్పాటు చేసిన వేదికపై నుండి బృందం ఆలపిస్తున్న 'ఆనంద తాండవమాయే' గీతం మైకులో వినిపిస్తోంది. నాట్యం మొదలైంది. 'నేనేం తక్కువగాను 'అన్నట్టు ఆ అమ్మాయి నాట్యం మొదలెట్టింది. మొహంలో గంభీరత, పట్టుదల కొట్టొచ్చినట్టు అగుపడుతున్నాయి. క్లిష్టమైన అభినయాన్ని అవలీలగా చేస్తున్నది. ఎండకు చెమటలు పడుతున్నాయి. మొహంపై పడుతున్న ముంగురులను పైకి తోసేస్తు మధ్యమధ్యలో తల్లి దిక్కు 'బాగా చేస్తున్నానా?' అన్నట్టు చూస్తున్నది. తల్లి మెప్పు పొందాలనే తపన కానవస్తున్నది. పెద్దవాళ్లకే కష్టతరమైన పదిహేను నిమిషాలకు పైగా సాగిన నృత్యాన్ని అవలీలగా చేసింది ఆ చిన్నారి. ఏ మాత్రం అలసట లేదు. విసుగు కానరాలేదు.

ఇదంతా చూసిన నాకు అనిపించింది - ఈ పాపకు రోజు ఎంతో మధురమైనది. ఈ క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. ఈ పట్టుదలే ఆ అమ్మాయికి నాట్యంలో గానీ, మరేదైనా రంగంలో గాని రాణించడానికి ఉపయోగపడతాయి. ఇలాంటి చిన్నారులు ఆ వేలాది పిల్లల్లో చాలా మందే ఉండి ఉంటారు. వీళ్లకు ఈ అవకాశం కల్పించింది సిలికానాంధ్ర. ఎన్నో అడ్డంకులను ఎదురిస్తూ, అవరోధాలను అధిగమిస్తూ, కష్టనష్టాలకు ఓరుస్తూ తెలుగు సంస్కృతిని ముందు తరాలకు వ్యాపింపజేయాలన్న సిలికానాంధ్ర కృషి సత్ఫలితాలను ఇస్తుంది అనేటందుకు ఇది ఒక ఉదాహరణ. నాకు కూడా జీవితాంతం గుర్తిండిపోయే సంఘటన కూడా ఇది. ఈ సాక్ష్యాన్ని మననం చేసుకుంటూ మరింత అంకితభావంతో పనిచేయాలి అన్న స్ఫూర్తిని ఇస్తుంది.

 

 

 

 

 

 

 

 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)