సారస్వతం - కుంతి మాట
రసికపాఠక మానసికాపహరణము - రస పారిజాతాపహరణము
- కుంతి

ఆంధ్ర జాతికి నంది తిమ్మన ౧౬ వ శతాబ్దములో అందించిన అపురూప కావ్య రత్నము, రసికపాఠక మానసికాపహరణము పారిజాతాపహరణము. పంచకావ్యాలలో ఎంచదగినదియై మంచి ప్రబంధాలలో మించినదియై, ఆంద్ర సాహితీమాత కిరీటములో కలికితురాయి అయినది పారిజాతాపహరణము. శ్రీ కృష్ణదేవరాయల వారికి, వారి భార్యామణితో ఒకానొక సందర్భములో పొరపొచ్చాలు వచ్చాయట. ఈ కావ్యములోని ప్రధమాశ్వాసము చదవగానే, వారిలో మార్పుకలిగి భార్య దగ్గరికి వెళ్ళి, కలిసి సుఖించినాడట. ఇదీ ఆనాడు ఆ కావ్యము వలన కలిగిన లాభము. నేటికీ ఈ కావ్యము భార్యాభర్తల సంసార సాగరములో వచ్చే ఆటుపోట్లను, సునామీ కలహాలను నివారించగలిగేదని నా అభిప్రాయము. మరియు భార్యామణులు అహంభావము, మంకుతనము, అసూయవంటి గుణాలతో విరాజిలుతున్నప్పుడు భర్తలు సంసారాన్ని రచ్చకీడ్చుకోకుండా సంసార రధాన్ని ఎలా ఒడుపుగా, ఒద్దికగా నడుపుకోవాలో అందంగా, హృద్యంగా ఈ కావ్యము తెలియచెప్పునన్నది నా విశ్వాసము. ఈ కధలో శ్రీకృష్ణుడు, సత్యభామ, నారదుడు, రుక్మిణి, ఇంద్రుడు ప్రధానపాత్రలు. కధావిషయానికి వస్తే ఒకనాడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి ఇంట్లో ఉండగా కలహాశనుడు వచ్చాడు. వచ్చి, తెచ్చిన పారిజాతాన్ని శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. నారదుని కనుసన్నతో, రుక్మిణీదేవి ఇంట్లో ఉన్నకారణంగా ఆపుష్పాన్ని శ్రీకృష్ణుడు రిక్మిణికి ఇచ్చాడు. పనిలో పనిగా నారదుడు పుష్పము యొక్క గొప్పతనాన్ని, రుక్మిణి వైభవాన్ని ప్రశంసిస్తూ ,సత్యను నిందిస్తూ, ఈవిషయము ఆమె చెలుల చెవుల పడేట్లుగా చేస్తూ, కధను ముందుకు తోస్తాడు. శ్రీకృష్ణుడు భయసంశయాలతో ఆ పుష్పాన్ని రుక్మిణికి ఇచ్చినా ఎక్కడో మారుమూల సత్య అహాన్ని దెబ్బకోట్టే నారదుని ఆలోచనలకు జేకొడుతూ, తానూ నాటకములో పాత్రగా మారి కధను నడుపుతాడు. ఈ విషయము చెలుల ద్వారా విన్న సత్యభామ అవమానముతో కృంగిపోయి, కోపించి, శ్రీకృష్ణుని తూలనాడి కోపగృహాన్ని ప్రవేశిస్తుంది. శ్రీ కృష్ణుడు ఆమెను చేరి, మెప్పించబోయి భంగపాటుపడి ,వామపాదఘాత సత్కారాన్ని పొందుతాడు. ఆపై ఆమెను అనేకవిధాలా అనునయించి "పువ్వేమి ఖర్మ, నీ పెరట్లో చేట్టునే పాతేస్తాను" అని ప్రకటించి, దేవేంద్రుడితో యుద్ధము చేసి, ఆచెట్టును తెచ్చి సత్యభామ ఇంట్లో పాతి ఆమె ముచ్చట తీర్చాడు. అపై నారదుడు సత్యతో పుణ్యకవ్రతము చేయించి, చెట్టును, శ్రీ కృష్ణుడిని దానముగా గొని, కాస్తా శ్రీ కృష్ణుడి సహాయముతో నాటకాలాడి తిరిగి సత్యకు నాధుడిని, చెట్టును ప్రసాదిస్తాడు. అటుపై సత్యాకృష్ణులు సుఖంగాఉంటారు. టూకీగా ఇదీ కధ.

ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక నారదుడు, ఒక సత్యభామ, ఒక పారిజాత పుష్పము.......అదీ కధ.

ఇక కధలో ప్రధాన పాత్రలవిషయమెటులున్నా, నాయీ వ్యాసానికి పాత్రలైన శ్రీకృష్ణ సత్యభామల తీరు తెన్నులనొకసారి పరిశీలిద్దాము.

అసూయ, మాత్సర్యము, మంకుతనము, స్వాతిశయము, గర్వము, పరనింద, పరదూషణ, వదురుబోతుతనము, అసహనము వంటి గుణములతో విరాజిల్లునది మానవతి సత్యభామ పాత్ర. భార్యాబాధితుల సంఘానికి అధ్యక్షుడిగా, భార్యావిధేయ వర్గానికి అగ్రాసనాధిపతిగా, గృహహింసా పీడితుడిగా, ఇరువురి భార్యలమధ్య నలిగిన వాడిగా కనిపించడమే కాక, ఒకవైపు నారదుడితో పధకాలు రచిస్తూ, చాకచక్యాన్ని, కపటాన్ని, చతురతను మేళవిస్తూ, మరొక వైపు భయాతురతలను, సంశయాందోళనలను ప్రకటిస్తూ, ఇంకొకవైపు శృంగారకేళీ విలాసాలను చూపుతూ, బ్రహ్మాండ భార్యాబాధిత భర్తలకు తన నడవడినే సందేశముగా తెలుపుతూ కధను రంజుగా నడిపించినది అవలీలామానుషధారియైన శ్రీకృష్ణుడి పాత్ర.

ఇక ఈ కావ్యములో సత్యాకృష్ణుల ప్రణయకలహము, సత్యకోపము, సత్యగోపాలునినిందించుట, కృష్ణుడు సత్యను బుజ్జగించుట.. ఇత్యాదిఘట్టాలను నందితిమ్మనగారి సరసౌచిత్యముతో, హృద్యంబగు వర్ణనా చాతుర్యముతో చిత్రించి సరసఙ్హ్జులను అలరించాడు. కావ్యము చదువుతుంటే అది సరసమైన కధాగమనముతో ముందుకు సాగుతూ, సత్యాకృష్ణుల ప్రణయకలహమంతా మన కనుల ముందు కదలాడుతూ మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. ( కొండొకచో కళాభిరుచి గల పాత చిత్రాల ప్రేక్షకులకు శ్రీకృష్ణ, సత్యభామల పాత్రలలో శ్రీ ఎన్టీరామారావు, శ్రీమతి జమునలు కనిపించి మనలనరించడము కూడా జరుగుతుంది)
శ్రీ కృష్ణుడు తన పదహారు వేల భార్యలతో,

"ఏయే వేళల నే సరోజముఖి యేయేలీలలంగోరుఁదా
నాయా వేళల నాసరోజముఖి నాయా లీలలందేల్చి యే
చాయంజూచినఁదానయై మెలగుచు న్సౌఖ్యాబ్ధి నోలాడు భో
గాయత్తుండయి పెక్కు రూపముల మాయా కల్పనాచాతురిన్"

ప్రదర్శిస్తూ, అష్టభార్యలతో ఇష్టపూర్వకముగా వ్యవహరిస్తూ, భీష్మకనందనను, సాత్రాజితిని మరింత మన్నిస్తూ, వారిమధ్య్న గల రవరవలను గమనిస్తూ కాలము గడుపుతున్నాడు.

కానీ కాలము ఒక్కలా ఉండదు. మానవుడికైనా, మాధవుడికైనా.

కలహభోజనుడు నారదుడు వచ్చాడు. పారిజాత పుష్పము తెచ్చాడు. రుక్మిణి ఇంట్లో ఉన్న కృష్ణుడి చేతిలో పెట్టాడు. కానీ పాపము కృష్ణుడు " అపుడు మాధవుడా క్రొన్ననగయికొని భీష్మకనందన గనుగొని సత్యభామతలఁపున నిలువన్" -సంధిగ్ధములో పడ్డాడు. రుక్మిణి ఇంట్లో ఉన్నాడు కనుక సత్యభామకు ఈ విషయము తెలిస్తే ఎంత ప్రళయము వస్తుందోనని భయపడుతూనే, "ఇందునేనున్కిఁ జెల్లదువో యేరికి" అని నిర్ణయించుకొని, ముని కనుసన్నను కూడా గ్రహించి రుక్మిణికి ఆ పుష్పాన్ని ఇచ్చాడు.

అక్కడి నుండి నరకాసురదమనుడు అంతులేని ఇరకటములో పడ్డాడు. నారదుడు పుష్పాన్ని, రుక్మిణిని ప్రశంసించి, దీవించి పనిలో పనిగా సత్యభామను చెలికత్తెలు వినేట్లుగా ,

"చక్కనిదాననంచునెలజవ్వనినంచుజగంబులోనఁబే
రెక్కిన దాననంచుఁ బతియెంతయు నాకనురక్తుడంచుఁదా
నిక్కుచు విఱ్ఱవీగుచు గణింపదు కాంతల సత్యచింతకున్
స్రుక్కక యున్నె నీ మహిమ సూచినబోటులు విన్నవించినన్"
అనిపలికి, నిందించి, శ్రీ కృష్ణుడిని కలహాంబోధిలోనికి నెట్టి కధను ముందుకు తోసాడు.

ఈ విషయమంతయు చెలులు పూసగుచ్చినటులు, మాల్ మసాలా నూరి సత్యభామకు జారవేసారు. ఇక్కడ సత్యభామ శోకాన్ని, కోపాన్ని నంది తిమ్మనగారు అద్భుతంగా వర్ణించారు. ఇది తెలుగు సాహిత్యములో పేరు పొందిన పద్యము.

"అన విని వ్రేటువడ్ద యురగాంగనయుంబలెనేయివోయ భ
గ్గన దరికొన్న భీషణహుతాశనకీల యనంగలేచి హె
చ్చిన కనుదోయి కెంపు దన చెక్కులఁగుంకుమపత్రభంగ సం
జనిత నవీనకాంతి వెదజల్లగ గద్గద ఖిన్న కంఠియై"

సత్యభామ వ్రేటువడ్దయురగాంగన వలె కోపావేశము ప్రజ్వరిల్లగా భీషణహుతాశన కీలవలె మండిపడుచు, "ఏమిటీ? నారదుడు ఇక్కడికి వచ్చి ఇన్నిమాటలాడాడా? ఆ గోపికా వల్లభుండు ఈ మాటలన్నీ విన్నాడా?, రుక్మిణి యేమంది? మోమాటము మాని చెప్పు" అంటూ చెలిని నిలదీసింది. అదేదో గొప్ప పుష్పమని నారదుడు కృష్ణుడికి కానుకగా ఇస్తే ఇచ్చాడు. అది శ్రీకృష్ణుడు రుక్మిణికి ఇచ్చాడు.

అంతేకాని అతడు "ప్రియముగల్గునెడ" (రుక్మిణిపైగలఈర్ష్యతో సత్యభామ ఆమె పేరును ఉచ్చరించదు) ఇచ్చుగాక "మమ్ముదలంపనేల" (మమ్ము-అని స్వాభిమానాతిశయమును చూపుచు) అని విసుక్కుంది. అయినా రుక్మిణిని, మునిని అని యేమి లాభము "ధూర్తగోపాలుడు చేసినచెయిదమేమిచెప్పుదు మనమెరియదె ప్రాణమైనమగడిట్లయినన్" , "శరదంబుద చలచిత్తులు పురుషులుపో వారినమ్మబోలునె చెలియా" అంటూ తపన పడింది. ఇన్ని రోజులు సవతుల మధ్య ప్రాభవంగా బ్రతుకుతు, ఈ రోజు ఇట్టి పరిస్థితికి వచ్చానే, ఇక వారు నన్నెంత చులకనగా చూస్తారో, వారలా ప్రవర్తిస్తుంటే నేను తట్టుకోగలనా ప్రాణములెంత తీపోయనుచు, స్త్రీ సహజమైన అసూయ, ఆరాటాలు ప్రదర్షించింది. ఇంతకాలము కృష్ణుడు నామీద ప్రేమ కురిపిస్తూ ఎన్ని నాటకాలాడాడు? అంతేకాదు, నారదుడు పూవును తెచ్చి కృష్ణుడికి ఇవ్వడము, అది అతడు రుక్మిణికివ్వడము ఇదంతాచూస్తుంటే,

"ఇట్టిమాటలాహాచెవులన్వినంబడియబ్రాణముదాల్చెదమేననింతగానోచిననింకనెట్టివికనుంగొననెమ్మెయినున్నదాననో"

,"సవతుల్భజించుటకుఁబోవెఱగయ్యెడునేమిచెప్పుదున్" అంటూ అంగలార్చింది. తనతో కృష్ణుడు ఎలా ప్రవర్తించేవాడో, ఎంత అదుపాఙ్ఞలలో ఉండేవాడో తలపోసింది.

"కలలోననైన నవ్వులకైన నామాట జవదాట వెఱచునో చంద్రవదన
యే పదార్ధంబు నాయెదుట బెట్టక మున్న యెవ్వారికొసగడో యిగురుబోడి
చెలులు నాతో నేమి చెప్పుదురో యని లంచంబులిచ్చునో చంచలాక్షి"
అంటూ కృష్ణుని భార్యావిధేయత్వాన్ని వాక్రుచ్చింది. దీనిని బట్టి మనగురువుగారు సత్యభామ దగ్గర "సిట్" అంటే "సిట్’, "స్టాండ్" అంటే "స్టాండ్" అనియు, "హెన్ పెక్డ్ హస్బెండ్" అనియు, ఆమె ప్రేమ కోసము పడరాని పాట్లు పడ్డాడని, తగని హింసను పొందినాడనితెలుస్తుంది. అటుపై " కృతకాద్రికందర కేళి" పద్యములో తాను పొందిన సుఖాలు ఇక దక్కవేమోనని దుఃఖించింది. "పతిప్రాణ సదృశబంధువు పతిదైవంబేడుగడయుబతి సతులకునప్పతియు కడుమేరదప్పిన గతికులకాంతలకువేఱుగలదేచెపుమా" అనియు,

"ధనమిచ్చి పుచ్చుకొన్నను
మనముననోర్వంగ వచ్చు మగడింతులకున్
జనవిచ్చి పుచ్చుకొన్నను
మనవచ్చునె యింక నేటిమాటలుచెపుమా"
అనియు కొటేషన్లు కొడుతూ కృంగి పోయింది.

అటుపై కోపగృహానికి హరిచందన వృక్షపుతొఱ్ఱలోనికి ఉరగాంగనలాగా వెళ్ళి,మాసిన చీరకట్టుకొని, నిరస్తభూషయై జలదాంతచంద్రరేఖా సదృశాంగియై గాఢ మనోజ విషాదవేదనను పొందింది. మదపుటేనుగు యొక్కతొండమందు చిక్కినతామరతీగవలె సౌందర్యము చెడి దీనతను పొందింది. ఈ సమయములో శ్రీ కృష్ణుడు సత్యభామ కడకు వచ్చాడు. అక్కడ పరిస్థితిని గమనించాడు.

భయంకరమైన రక్కసులను అవలీలగా ఎదుర్కొన్న, భువనభాండము కనుచూపుతో పాలించగలిగిన ఆ కృష్ణుడు వేగంగా కొట్టుకుంటున్న గుండెను చిక్కబట్టుకొని చిన్నబోయిన చిన్నెలతోనున్న ఆ మందిరమునకు అడుగిడి తగిన ఉపాయాలు పన్నుతూ, అక్కడి చెలియలలో గల కొందరితో రహస్యమంతనాలాడి, కొందరిని బెదిరించి, కొందరిని వశపరుచుకొని మధ్యందిన మార్తండుని కిరణాల వేడిమి సోకిన తీగలా ఉన్న సత్యను చేరి, అక్కడ ఉన్న పరిచారిక చేతిలో నున్న విసన కఱ్ఱను తీసుకొని సరస శృంగార కేళీ ప్రియుడైన కృష్ణుడు తన అమ్ములపొదిలోని అనునయ, చతురోక్తి బాణాలను తీసి సత్యభామను వశపరుచుకొనే ప్రయత్నానికి సమాయత్తమయ్యాడు. "మంచినగలేల ధరించవు, తాంబూలము వేసుకోలేదేమిటి, చక్కని మాటలేలమాటలాడవు, నామనసును తెలుసుకోదలిచి ఇలా చేస్తున్నావా, హాస్యానికి చేస్తున్నావా, పగవాడినా, ఒక్క నిముషమైనా నీవు దయచూపక పోతేబ్రతుకగలనా" ," యురఃస్థలంబు జన్నులనెదురొత్తిమక్కువననుం బిగికౌగిట జేర్పవేటికే చిలుకల కొల్కియెవ్వరెడసేసిరి నీకిటులేల చింతిలన్" అంటూ వాపోయాడు. దానితో పాటుగా ఆ జగన్నాటక సూత్ర్ధధారి మరొక వాగ్భాణము సంధించాడు. వారిజాక్షులందు, వైవాహికములందు...... అబద్దాలాడవచ్చుకదా.

" మనముల మాటలం గ్రియల మన్ననలీనొకనాడు నెట్టికా
మినులకుగారవంబు మెఱమెచ్చులకై పచరింతుగాని పా
యని యనురక్తి నీ యెడన యగ్గ్గలమై కనుపట్టు నాకు నీ
పనిచిన పంపు సేయుటయు ప్రాభవమౌటది నీవెఱుంగవే"

ఈ మాటలు అంతఃపురములో వ్యాపించాయో పదహారువేల ఇండ్లు కోపగృహాలుగా మారేవి. మాటకారి, నాటకాలరాయుడు కనుకనే ఆ చెవికి తెలియకుండా ఈ చెవిలో అబద్దాలాడుతూ గుట్టుగా అందరితో సంసార రధాన్ని లాగేయగలిగాడు. గృహ హింసకు మరో రూపమైన సంసార హింసను ఒడుపుగా, నేర్పుగా భరించగలిగాడు. అయినా అమె లొంగలేదు. ఎన్నో విధాలా బ్రతిమాలినా ఆమె శాంతించకపోవడముతో భంగ పడ్డాడు. ఆ మానసచోరుడు ఇక లాభము లేదనుకొని, భర్తలందరికీ మార్గదర్శకత్వమును చేస్తూ, ఇలాంటి సందర్భాలలో ఎలా నెగ్గుకు రావాలో డెమో ప్రదర్శిస్తూ, సంసార బంధములోగల రసకందాయ పర్వాన్ని లేవదీస్తూ, భార్యాభర్తల కలహములో భార్యను మెప్పించడానికై భర్త ప్రదర్సించాల్సిన సరస ప్రనయ పతాక సన్నివేశానికి తెర తీస్తూ, కాలము కలిసి వస్తే ఈ గృహ హింసకు ప్రతిక్రియ చేసి ఈవిడ అహాన్ని అణచలేనా అని తనలో తాను చింతిస్తూ ప్రస్తుతము బ్రహ్మాండ భార్యావిధేయులలో తానే అగ్రగామిగా నిలుస్తూ, మనదారి కాళ్ళదారి.. అని భర్తల సంఘానికి మార్గోపదేశము అనుగ్రహిస్తూ ......

"పాటలగంధి చిత్తమునబాటిలు కోపభరంబు దీర్ప నె
ప్పాటనుబాటుగామి మృదు పల్లవకోమల తత్పదద్వయీ
పాటలకాంతి మౌళిమణిపంక్తికి వన్నియవెట్ట నా జగ
న్నాటక సూత్రధారి యదునందనుడర్మిలి మ్రొక్కెమ్రొక్కినన్"
-అయిపోయింది. పురుషసింహుడైనట్టి పురుషోత్తముడు స్త్రీ దౌర్జన్యానికి, ఆధిపత్యానికి. హింసకు లొంగిపోయాడు. నిజానికి అయిపోలేదు.

"జలజాతాసవవాసవాదిసురపూజాభాజనంబై తన
ర్చు లతాంతాయుధుకన్న తండ్రి శిరమచ్చో వామపాదంబునం
దొలగంద్రోచె లతాంగి"
- సాక్షాత్తు పరమాత్ముడగు శ్రీ కృష్ణుడు తన పడతి యడుగులపై పడి ప్రణమిల్లినపుడు, సత్యభామ తన వామపాదముతో అతడి శిరస్సును తన్నింది. నంది తిమ్మనగారు, పండితులు ఇక్కడ దీనిని భగవంతుడికి జరిగిన అపరాధముగా భావించరాదంటూ, కామశాస్త్ర సమ్మతమేనంటూ, శృంగార సంగరమందు ఈ పర్వము ఆమోదయోగ్యమేనంటూ తేల్చారు. నంది తిమ్మనగారు ఈ పద్యములో కొసమెరుపునిస్తూ,

"నాధుల్నేరముల్సేయ బే రలుకం జెందిన యట్టి కాంతలుచితవ్యాపారముల్నేర్తురే".. అంటూ అర్ధాంతరన్యాసాన్ని జోడించి స్త్రీల చేష్టలు సమంజసమేనంటూ వకాల్తా పుచ్చుకున్నాడు. అయితే కవులు,పండితులు సరసఙ్ఞులైన పాఠకులకంటే రసిక శేఖరుడైన గోపాలుడు ,సత్యభామక్రియకు ప్రతిక్రియగా,

"ననుభవదీయదాసుని మనంబున నెయ్యపుఁగిన్కఁబూని తాఁ
చినయది నాకు మన్ననయ చెల్వగు నీ పదపల్లవంబు మ
త్తను పులకాగ్ర కంటకవితానము దాకిన నొచ్చునంచు నే
ననియెద నల్కమానవు గదాయిక నైన నరాళకుంతలా" .
.. అంటూ నయగారపు పలుకులు పలికాడు. అ పై సత్యభామను ఎంతగానో కృష్ణుడిని దూరినా, మహానుభావుడు కాబట్టి ఎత్తుకు పై ఎత్తులు వేసి ఆమెను లాలించి, బుజ్జగించి, మెప్పించాడు. ఆమెకోరికను తీర్చడానికై అంగీకరించాడు. ఆమె కొరకై స్వర్గానికి వెళ్ళి దేవేంద్రుడితో యుద్ధము చేసి పారిజాత వృక్షాన్ని తెచ్చి ఆమె పెరటిలో నాటాడు.

ఏతావాతా ఈ కధ ద్వారా తెలిసేదేమంటే ఎంతవారలైనా కాంతాదాసులేనని, ఇంతుల మధ్య గొడవ ఎంతటివారినైనా ఇబ్బంది పెడుతుందని, భార్య పోరు పెడితే భగవంతుడైనా బాధపడాల్సిందేనని. ఇదంతా ఒక పార్శ్వమైతే ఈ ఘట్టములో శ్రీకృష్ణ సత్యభామలు సగటుభార్యాభర్తలై సంసార జీవితములో గల, ప్రణయకలహములో గల మాధుర్యాన్నితెలుపుతూ. కలహానంతర కలయికలోగల కమ్మదనాన్ని తెలుపుతూ సంసార జీవితాన్ని జనులు ఎలా ఆనందమయము చేసుకోవాలో తెలిపారు. కావునవారికీ, ఇంతటి గుట్టును రట్టి చేసి, రసికి పాఠకులకు సరస కావ్యాన్ని అందించిన శ్రీ నందితిమ్మన కవి వరేణ్యులకు జేజేలు పలుకుదాము.

శ్రీకృష్ణార్పణమస్తు!


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)