శీర్షికలు
పద్యం - హృద్యం
- పుల్లెల శ్యామసుందర్

ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.

ఈ మాసంప్రశ్న:

చదవని వాడె పండితుడు సంపదగల్గిన వాడె బీదయౌ

గతమాసం ప్రశ్న:

(1) "హద్దుల నుంచ నేల భువి హక్కుల కోసము మక్కు వేలనో" (పోచిరాజు కామేశ్వరరావు గారు పంపినది)

(2) నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మీకు నచ్చిన ఛందస్సులో పద్యములు పంపండి

ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.

రాజేశ్వరి నేదునూరి, న్యూజెర్సీ
సద్దును జేయకుండగను సాహస మందున కబ్జజేయుచున్
పెద్దల వోలెమౌ నముగ బింకము జూపెడి దొంగ లుండగన్
హద్దుల నుంచ నేల భువి హక్కుల కోసము మక్కు వేలనో
వద్దను వారలెవ్వ రిల వారసు లుండిన దక్కకుండునే

పోచిరాజు కామేశ్వర రావు, రాయిపూర్
ముద్దుగఁ బంచభూతములు మూరిన వేడ్క నమర్చె నీ భువిన్
సుద్దులు సెప్పరే సుమనసుల్ జగదేక కుటుంబమే యనం
బద్దులు దీరి నంతటనె ప్రాణము వోవును బంత మేలనో
హద్దుల నుంచ నేల భువి హక్కుల కోసము మక్కువేలనో

డా.చింతలపాటి మురళీ కృష్ణ , బ్రిజ్బేన్ , ఆస్ట్రేలియా
ఒద్దిక తోడ సాత్విక గుణోన్నతి నొంద నెరుంగ లేక ము
ప్పొద్దుల నాడిపోసుకొను పోటరిగత్తెలు నింటవాకిటన్
సద్దొనరించు కాంతలు ప్రశాంతి వహించి సహించు భర్తలన్
హద్దుల నుంచ నేల తమహక్కుల కోసము మక్కువేలనో !

వారణాసి సూర్యకుమారి, మచిలీపట్నం
వద్దనకుండ బిడ్డకును వస్తువు లన్నియు కోరినంతనే
ముద్దుగ తండ్రి హక్కనుచు ముచ్చట తీర్చగ సిద్ధ మైనచో
విద్దె నలక్ష్యమున్ యువత వేదనయే మిగులంగ జేయరే
హద్దుల నుంచనేల భువి హక్కుల కోసము మక్కువేలనో

కళ్యాణ్ తటవర్తి , ఓర్లాండో , ఫ్లోరిడా
హద్దుగ చట్టమున్ నిలిపి నందలి లోపము బట్టి పెంపుగన్
హద్దులు మీరి రాజ్యమును హక్కుగ నెంచెడి నేతలన్ జనుల్
వద్దని సుద్దులెన్నికల వారికి నేర్పగ నేడ్చు వారలే
హద్దుల నుంచ నేల భువి హక్కుల కోసముమక్కు వేలనో

గండికోట విశ్వనాధం, హైదరాబాదు
గద్దెల మిద్దెలన్‌కులుకు కాంక్షలు లేక, విశాల దృక్పధా
బధ్ధ ప్రయోజనం బరసి భావి తరంబుల మేలుకై కడున్‌
పధ్ధతితోడ ఆంక్షలవి భావ్యమగున్‌, వ్యతిరేక వాదనన్‌
హద్దులనుంచ నేల? భువి హక్కుల కోసము మక్కువేలనో?

దువ్వూరి వి.యన్. సుబ్బారావు, రాజమహేంద్రవరం
ఎద్దిర శాశ్వతమ్ము విను మీశ్వర సృష్టిని జీవులన్నియున్
పెద్దలె కొద్దిబుద్ధులను వీడి సమత్వము నాశ్రయించినన్
ముద్దగు నీది నాది యని మొత్తము మూటలు గట్ట మేలొకో
హద్దు లవేలనో భువిని హక్కుల పైనను మక్కు వేలనో.

ఈ క్రింది రెండి పూరణలలో సమస్య"హద్దుల నుంచనేల.." బదులు "హక్కుల నుంచనేల.." యని వాడబడినది.

"కళాగౌతమి" బులుసు వేంకటసత్యనారాయణమూర్తి, రాజమహేన్ద్రవరం
ఎక్కువ తక్కువల్ మనకు నేర్పడ తప్పక హక్కు లీయగా
తక్కుయయ్యె మాకనుచు దానికి కొందరు యుద్యమించగా
పెక్కురు చాలు చాలు నిక పెట్టుడు మాకును హక్కులంచు నీ
హక్కులనుంచనేల భువి హక్కుల కోసము మక్కువేలనో

మహీధర రామశాస్త్రి, రాజమహేన్ద్రవరం
ఎక్కుట చేతగాదనుచు యిచ్చిరి హక్కులనెన్నియో సదా
నిక్కము చూడగా నతని నెంతకు యిత్తురు భాగ్యముల్ యిసీ
ఒక్కటి మాత్రమే నిజము యోపితబట్టుచు యెక్కుటల్ హరీ
హక్కులనుంచనేల భువి హక్కుల కోసము మక్కువేలనో

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ వ్రాసిన పద్యములు:

పోచిరాజు కామేశ్వర రావు, రాయపూర్
కుసుమ సుకుమార సమ మా
నస చోదిత కర్మనిచయ నందకమే యీ
ద్విసహస్ర సప్త దశమము
వసుధైక కుటుంబ భావ వాత్సల్యమునన్

వారణాసి సూర్యకుమారి, మచిలీపట్నం
మత్తకోకిల
నిత్య జీవన యానమందున నిండు మోదము నొందగా
సత్య దూరము కాని రీతిని చాల కీర్తి గడించగా
ముత్యముల్ వలె బిడ్డలెంతయొ ముచ్చటన్ మురిపించగా
నిత్య శాంతిని సౌఖ్య సంపద నిచ్చు నూతన వర్షమున్

కళ్యాణ్ తటవర్తి , ఓర్లాండో , ఫ్లోరిడా
గడచిన యేడు జెప్పె నిటు ' గష్టసుఖంబుల మీకు నిచ్చి నే
నడిచితి నింత నే నలయ నాయన లార గతంబు నయ్యెదన్
విడిచెద కాల వర్తనము వేగ త్వదీయ మనో నివాసినై
పొడిచెద తీపిగుర్తుయను పూర్వ మహీధర సూర్య బింబమై '

అదివిని రెండువేల పదహారుని ప్రీతి మనంబునన్ జనుల్
పొదువుకు పాత నేస్తమని భూరిగ జెప్పెను ధన్యవాదముల్
మదినిక నూత్న వర్ష భవ మాధురియే చిగురింప నెల్లరున్
పదపడి స్వాగతోత్సవము పద్యపథంబున నిల్పి సల్పెనే

గండికోట విశ్వనాధం, హైదరాబాదు
ప్రీతిగ మాటలాడుచును పేర్మిని పెంచెడి మానవాళితో
ఖ్యాతిని పెంచు నేతలతొ, క్రాంతి పధమ్మున సాగు యానమై
వ్రాతల చేతలన్‌సుజన రంజనియై సుఖ సంపదాఖ్యమై
నీతిగ రెండువేల పదునేడవ వత్సర మొప్పు మెప్పులన్‌.

దువ్వూరి వి.యన్. సుబ్బారావు, రాజమహేంద్రవరం
రమ్మోయీ పదిహేడ! నాల్గు దిశలన్ రాగమ్ములన్ నింపుచున్,
నెమ్మిన్ సర్వుల మానసమ్ములను పన్నీ రొల్కుచున్, భావిపై
వమ్ముం జేయక మంచి యాశలకు తోడ్పాటిచ్చుచున్, శాంతిధ
ర్మమ్ముల్ భీతికి తావు లేని సుఖ మార్గమ్మందునన్ సాగగా.

వమ్ముం జేయుము నల్లడబ్బు కుటిల వ్యాపారదుర్వ్యూహముల్
కిమ్మన్నాస్తిగ చాప జుట్టి చనగా కీడెంచి యీ ధాత్రిలో
సమ్మోదమ్మున సజ్జనాళి జయహో సాకారమాయెం గదా
నమ్మంజాలిన నేత హస్తముల స్వప్నంబంచు శ్లాఘించగా.

ఇమ్ము పరాఙ్ముఖత్వమును హింసకు బుద్ధుని గన్న నేలఁ, ధ
ర్మమ్మున కాశ్రయ మ్మిడుము రాముని కృష్ణుని గన్న తల్లి యం
కమ్మున, నీతికిన్దగిన గౌరవమున్ గొని తెమ్ము, భారతి
న్నిమ్మగు స్థానమై వెలుగ నిమ్ము ధరిత్రిని నూత్న వర్షమా!

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)