కవితా స్రవంతి
కృష్ణపలుకు
- కృష్ణ అక్కులు

ఆ.వె||ల్యాపు పైన పెట్టి ల్యాపుటాపును సదా
రేయి పగలు నీవు రెచ్చి పోగ
అమ్మనాన్న అయ్యె అవకాశము తరుగు
కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు

ఆ.వె||కులము కలుపు తీసి కలుపుకు పోయిన
చెలిమి కన్న మిన్న బలిమి కలదె
విలువ కలిగి యున్న కలిమియే యది కదా!

కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు

ఆ.వె||కారు నడుపు నపుడు కాలు(call)తీయ వలదు
కాలు(call) చేయ వలదు, కాని యెడల
కాలుడు నిను వలచి కాలపురికి పిల్చున్

కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు

ఆ.వె||ఎండ మరచి నీవు ఏసిలోనె గడుపన్
డివిటమిను కరువగు, ఠీవి తరుగు
ఎముకలు పలచనగు ఏడుపు కలుగును
కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు

ఆ.వె||పంట భూములన్ని పట్టణములు కాగ
చెరువులన్ని పోయి ఊరు లవ్వ
నీరు నట్టి ఇంట చేరి చెరువు కాదె
కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు

ఆ.వె||పూలు ఫలములిచ్చి, వూపిరినిచ్చిచు,

ఎండ లోన నీడ, ఎన్నో ఇచ్చె
చెట్టును నరికినచొ పుట్టగతులులేవు
కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు

ఆ.వె||వంట చేయు వరకు మంట కావలయును
ఇంటిని మసి చేయు మంట వలదు
కోపమధిక మయిన కొంపలు ముంచును
కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు

ఆ.వె||తాగి నపుడు నీదు తనువు అదుపు తప్పు
చిన్న మెదడు మొదలు వెన్ను వరకు
మొద్దు బారినపుడు మోటరు నడపకు
కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు

ఆ.వె||రోడ్డు మనదె యనచు రోదన చేయుచు
కారు మనదె యనుచు జోరు గాను
వెళ్ళిన, తుది ఘడియ వేగమె వచ్చునె
కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు

ఆ.వె||పేసు బుక్కు లోన పెరిగిన స్నేహము
వాట్స అప్పు లోన పలుకు తీరు
నాటి ఉత్తరముకు దీటుగా వచ్చునె
కృష్ణ పలుకు వినగ గెలుపు కలుగు

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)