కథా భారతి - అనగనగా ఓ కథ
చిన్నారి ప్రేమలేఖ
- ఎ.మంజులత

ప్రియమైన రామానుజం,

ఈ ఉత్తరం ఇట్లాగ రాయడానికి వెనక చాలా చరిత్ర ఉంది. ఇట్లాగని బాబాయి అన్నాడు. అస లేమయ్యిందంటే, నేను బాబాయిని ఒకటి అడిగాను. అలసు అంతకన్న ముందు ఏమయిందంటే, మా నాన్న, నేను భోంచేస్తుంటే అమ్మ వడ్డిస్తోంది.

''ఇదేమిటి, ముందే చారు సోస్తున్నావ్‌? కూర లేదా?'' అన్నాడు మా నాన్న.
మా అమ్మేమో, ''ఇది చారు ఎందుకయ్యింది? పచ్చడి'' అంది కోపంగా.
మా నాన్న నవ్వాడు. మా అమ్మకి ఇంకా కోపం వచ్చేసింది.

అందుకని కొంచెంసేపయ్యాక, మా అమ్మ కోపం పోగొట్టెయ్యటానికి మళ్ళీ ''ఈ దొండకాయకూర చాలా బాగుంది కదూ, చిన్నారీ?'' అని నన్ను అడిగాడు మా నాన్న.

మా అమ్మ విన్లేదేమో ననేసి, మళ్ళీ గట్టిగా ఆ మాటే అన్నాడు.

మా అమ్మేమో మళ్ళీ కోపంగా చూసి ''అది దొండకాయకూర కాదు, బెండకాయ పులుసు'' అంది.
మా నాన్న మళ్ళీ నవ్వబోయి ఎందుకో ఆగాడు. మళ్ళీ నావైపు చూసి, మీ అమ్మ ఎంత గొప్పదో చూశావా చిన్నారీ? పచ్చడి చారులాగా, చారు పులుసులాగా, నీళ్లు మజ్లిగలాగా, అది ఇదిలాగా, ఇది అదిలాగా చేసెయ్యగలదు'' అన్నాడు నాతో.

''అది ఇదిలాగా, ఇది అదిలాగా అంటే ఏమిటి నాన్నా?'' అన్నాను నేను.
''అది ఇదిలాగా అంటే, చంద్రుడిని తన ముఖంలాగా అన్నమాట. ఇది అది లాగా అంటే తన ముఖాన్నే చంద్రుడిలాగా అన్నమాట'' అన్నాడు నాన్న. అంటే ఏమిటీ అని ఆలోచించాను నేను. అప్పుడు తెలిసిపోయింది నాకు. అంటే, అమ్మ మొహం చంద్రుడత్తయ్య లాగా ఉంటుందని నాన్న అనడం. చంద్రుడత్తయ్య తెలుసా నీకు రామానుజం? అప్పుడోసారి నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడుందే- లావుగా? గుర్తొచ్చిందా? ఆవిడనే బాబాయి, అత్తయ్య 'పీపా' అని చాటుగా నవ్వేవారు.

నాకు కోపం వచ్చేసింది. అమ్మ మొహం చంద్రుడత్తయ్యల్లే ఉంటుందా? 'ఇంచక్కా ముద్దొస్తూ ఉంటుంద'ని అమ్మమ్మ అంటుంది' కదా?

''అమ్మ మొహం చంద్రుడత్తయ్యల్లే ఉండదు'' అన్నాను నేను కోపంగా. నాన్న, అమ్మ నే నన్న దేమిటో తెలీనట్టుగా నాకేసి చూసారు కొంచెంసేపు. ''చంద్రు డత్తయ్యలాగా ఉండట మేమిటి?'' అని అడిగాడు నాన్న.

నేను కోపంగానే చూసాను నాన్న కేసి, ''అమ్మ మొహం చంద్రుడత్తయ్య లాగా ఉంటుందని ఎవరన్నారు?'' అన్నాడు మళ్ళీ.

నాకు ఇంకా కోపం వచ్చేసింది. ''ఇప్పుడు నువ్వేకదా అన్నావు. అబద్దాలాడొద్దు. ఆడపిల్లలు పుడతారు'' అన్నాను నేను.

నాన్న అస్తమానూ అబద్ధాలాడుతాడు. అందుకే నాన్నకి నేను పుట్టానట. అమ్మ ఎప్పుడూ అబద్ధాలాడదట. అందుకే అమ్మకి తమ్ముడు పుట్టాడట. ఇట్లాగని అమ్మ అస్తమానూ అంటుంటుంది నాన్నతో.

నాన్న పెద్దగా నవ్వాడు. అమ్మ కూడా నవ్వింది. ''చంద్రుడత్తయ్య కాదు చిన్నారీ! ఆకాశంలో చంద్రుడొస్తాడే, ఆ చంద్రుడిలాగా ముద్దుగా ఉంటుంది అమ్మ ముఖం'' అన్నాడు నాన్న, నవ్వడం అయిపోయాక. అమ్మేమో నవ్వడం అయిపోయాక, మళ్ళీ ఎప్పట్లాగా కోపం తెచ్చేసుకుని ''చాల్లెండి మీరు మరీనీ, చిన్నపిల్ల దగ్గర కూడా ఏమిటిదీ?'' అంది.

''వయస్సు మీరుతున్నకొద్దీ మీ బామ్మకి మతిపోతోంది. మతిలేని పనులూ, మతిలేని మాటలూ! ఎట్లా వేగేది!'' అంటుంటాడు మా తాతయ్య. మా నాన్నకి కూడా వయస్సు మీరుతున్నకొద్దీ మతిపోతోంది. లేకపోతే, అమ్మ మొహం ఆకాశంలో చంద్రుడిలా ఉండటమేమిటి మతిలేని మాటలు కాకపోతే! తాతయ్యకి లాగా నాకూ వీళ్లతో విసుగొచ్చేస్తేంది!

''అమ్మ మొహం ఆకాశంలో చంద్రుడిలా ఉండదు'' అన్నాను నేను మా నాన్నతో.
''నా కళ్లతో చూస్తే అట్లాగే కనబడుతుందిలే, చిన్నారీ!'' అన్నాడు నాన్న అమ్మకేసి చూస్తూ.
''నీ కళ్లతో ఎట్లాగ చూడ్డం నాన్నా!'' అన్నాను నేను.
''నా కళ్లతో అంటే, ప్రేమించే కళ్లతో అన్నమాట'' అన్నాడు నాన్న.
''ప్రేమించడం అంటే ఏమిటి నాన్నా?'' అనడిగాను నేను.

ఇంతలో అమ్మ, ''ఛట్‌! నోర్ముయ్‌'' అని కసిరింది నన్ను. ''ఇక మీద మాటలు కట్టిపెట్టి భోంచెయ్యండి'' అంది నాన్నతో.

ఇంక అమ్మ ఏమీ చెప్పనివ్వదు. అందుకే గబగబా భోంచేసేసి అత్తయ్య దగ్గరికి పరిగెత్తాను.
''ప్రేమించడం అంటే ఏమిటత్తయ్యా?'' అనడిగాను.
అప్పుడే బాబాయి ఏదో రాసుకుంటున్నాడు.
''అదుగోనే చిన్నారీ, ప్రేమించడంటే అట్లా రాయడమే'' అంది అత్తయ్య నవ్వేసి.
''ఏం రాయాలి?'' అన్నాను నేను. ''ప్రేమలేఖలు రాయడమన్నమాట'' అంది అత్తయ్య.
నాకూ ప్రేమించే బుద్ధేసింది. ''అయితే నేనూ ప్రేమిస్తానత్తయ్యా'' అన్నాను.
''ఓసి భడవా!'' అనేసి అత్తయ్య ఇట్లాగ నెత్తిమీద మొట్టి లోపలికి వెళ్ళిపోయింది.
నేను అత్తయ్య వెంటపడ్డాను.

''అత్తయ్యా! నేనూ ప్రేమిస్తాను. ఎలాగో చెప్పవూ?'' అని బతిమాలాను.
''ఇదెక్కడి గొడవేఔ'' అని అత్తయ్య నవ్వింది. తర్వాత ''ఆ వేషాలన్నీ బాబాయివే! బాబాయినే అడుగు'' అంది.

నేను బాబాయి దగ్గర కెళ్ళి అడిగాను, ''బాబాయి, బాబాయి! ప్రేమించడం నేర్పించవా?'' అని.
''ఏమిటి?!!'' అన్నాడు బాబాయి చాలా ఆశ్చర్యపోయి.
''నేనూ ప్రేమిస్తాను బాబాయి. నాకూ నేర్పు'' అని అడిగాను మళ్ళీ
''ప్రేమించమని ఎవరు చెప్పారే చిన్నారీ, నీకు?'' అని అడిగాడు బాబాయి నన్ను.
''అత్తయ్య చెప్పింద''న్నాను. ''ఎందుకు చెప్పింద''ని అడిగాడు బాబాయి. ''నాకు ప్రేమించ బుద్ధేస్తే చెప్పింద''ని చెప్పాను.
''ఎందుకు ప్రేమించ బుద్ధేసింది?'' అని అడిగాడు బాబాయి.
అప్పుడు ''అమ్మ మొహం ఆకాశంలో చంద్రుళ్ళా ఉంది'' అని చెప్పాను.
''ఎందుకు ఉందన్నాడు'' బాబాయి.
''ప్రేమిస్తే ఉంటుందని నాన్న చెప్పాడు'' అన్నాను.
''నాన్న నీకు ఎందుకు చెప్పాడే'' అని అడిగాడు.
''అమ్మ పచ్చడి చారులాగా, అది ఇదిలాగా, ఇది అదిలాగా చేసినందుకు చెప్పాడు'' అని చెప్పాను.
''ఓహో! ఇంత చరిత్ర ఉందన్నమాట నువ్వు ప్రేమించడానికి'' అన్నాడు బాబాయి.

''చరిత్ర కాదు బాబాయి'' అన్నాను నేను.

బాబాయి కేం తెలుసు, చరిత్ర అంటే సింధు నాగరికత, అశోకుని పరిపాలన, చెట్లు నాటడం అని? బాబాయి పదిహేడో క్లాసు చదువుతున్నాడు. అయినా, చరిత్ర అంటే అశోకుని పరిపాలన, చెట్లు నాటడం అనితెలీదు. ప్చ్‌! అందుకే అంటుంది బామ్మ ''ఏం చదువులో, ఏమిటో! చదువుకున్నవాడి కంటే చాకలాడు నయం'' అని. మా బాబాయి కంటే మా చాకలాడే నయం.

''అయితే, ఎవర్ని ప్రేమిస్తావే చిన్నారీ?'' అని అడిగాడు బాబాయి.
నేను కొంచెంసేపు ఆలోచించాను. అమ్మనే ప్రేమిద్దామనుకున్నాను. కానీ ఎట్లాగా? అమ్మ అస్తమానూ ఇంట్లో కదా, ఉంటుంది? ఇంక ఉత్తరం ఎలాగ రాసి, ఎలాగ ప్రేమించాలి? నాకు అప్పు డొక అనుమానం వచ్చింది. నాన్న మాత్రం అమ్మని ఎట్లా ప్రేమించాడు. అమ్మ అస్తమానూ ఇంట్లో ఉంటే? బాబాయిని అడిగాను. బాబాయి బుర్ర గోక్కున్నాడు. అప్పుడు అత్తయ్య గదిలో ఉంది కదా, మా మాటలు వింటోంది కదా!

అప్పుడు అత్తయ్య చెప్పింది ''అమ్మ, వాళ్ళ నాన్నగారి ఊరు- అంటే రామానుజం తాతగారి ఊరు- వెళుతుంది కదే చిన్నారీ; అప్పుడు మీ నాన్న అమ్మకి ఉత్తరాలు రాస్తాడు'' అని.

అప్పుడు నువ్వు గుర్తొచ్చావు రామానుజం, నాకు. అందుకని నేను ''అయితే రామానుజం తాతను ప్రేమిస్తాను'' అన్నాను.

''సరే'' అన్నాడు బాబాయి.

అందుకని రామానుజం నేను నిన్ను ప్రేమిస్తున్నాను.


ఇట్లు
- చిన్నారి.

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)