ధారావాహికలు - శ్రీరామాయణ సంగ్రహం
యుద్ధకాండ
- డా. అక్కిరాజు రమాపతిరావు

కుంభకర్ణుణ్ణి మేల్కొల్పటం

అప్పుడు వేలసంఖ్యలో రాక్షసులు ఒక ఊరంత ఉండే కుంభకర్ణుడి విశాల నివాసభవనంలో ప్రవేశించారు. కుంభకర్ణుడిని నిద్రనుంచి లేపటానికి శతధా ప్రయత్నించారు. భేరీ, పటహ, ఢక్కా, పవణవాద్యాలు వందల సంఖ్యలో మోగించారు. శూలాలతో గుచ్చారు. చెవులు పట్టి గుంజారు. గుదియలతో మోదారు. మీద ఎక్కి తొక్కారు. జుట్టుపట్టి లాగారు. గుర్రాలు, ఏనుగులు, గాడిదలు అసంఖ్యాకంగా తీసుకొని వచ్చి వాటి సకిలింపులతో, ఘీంకారాలతో, కూతలతో ఒక్కుమ్మడిగా పెద్ద ధ్వని సృష్టించారు. అయినా ఆ పర్వతాకారుడు నిద్ర మేల్కోలేదు. కుంభకర్ణుడు పెట్టే గురకకు, వదిలే నిశ్వాసావలకు ఆ రాక్షసులు ఎదురు నిలవలేకపోయినారు. నిశ్శ్వాసవేగంతో దూరదూరాలకు కొట్టుకొనిపోతున్నారు. అప్పుడు కొన్ని ఏనుగుల గుంపులను కుంభకర్ణుడిపై అటునుంచి ఇటు నడిపించగా అతడికి కొంచెం మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచాడో లేదో అతడికి విపరీతమైన ఆకలిదప్పికలు కలిగాయి. కొండచిలువలులాంటి తన చేతులు చాచి ఆవులించాడు. ఆయన నల్లటి పెద్ద మేఘంలా కనపడ్డా డప్పుడు. కళ్ళనుంచి విద్యుత్కాంతుల విస్ఫులింగాల వంటి చూపులు వెలువడుతున్నాయి.అప్పుడు వెంటనే పర్వతాల వంటి వివిధ మాంసభోజనాల రాసులు అతడు భుజించాడు. నిస్తారంగా రక్తపానం చేశాడు. మద్యమైరేయాలు బిందెలకొద్దీ, కడవలకొద్దీ తాగాడు. అప్పుడాయన తనని అకస్మాత్తుగా అతిప్రయత్నంమీద లేపారంటే లంక కేదో చేటు వచ్చి ఉంటుందని ఊహించాడు. కారణం ఏమిటి? అని తనను చుట్టుముట్టిన రాక్షసులను అడిగాడు. అప్పుడు వాళ్ళు రావణుడి ఆజ్ఞ ఇది అని తెలిపారు.

కుంభకర్ణుణ్ణి రావణుడి దగ్గరకు తీసుకొనిపోయినాడు రావణుడి మంత్రియైన యూపాక్షుడు. రాగానే విషయం తెలుసుకొని కోరి కోరి ఇటువంటి మహావిపత్తు తెచ్చుకున్నందుకు రావణుణ్ణి కుంభకర్ణుడు మందలించాడు. అయినా రావణుడు తమ్ముణ్ణి రెచ్చగొట్టాడు. మహోదరుడు మాయోపాయంతో సీతను వశం చేసుకోవచ్చునని రావణుడికి చెప్పాడు. కాని రావణుడు యుద్ధోద్ధతుడై ఉన్నాడు. యుద్ధం జరగాల్సిందేనని పట్టు పట్టాడు. అప్పుడు కుంభకర్ణుడికి రావణుడు సవిస్తరంగా జరిగింది అంతా చెప్పాడు. కుంభకర్ణుడు మహోదగ్రుడై వానరసేనను, రామలక్ష్మణసహితంగా సర్వనాశనం చేస్తానని హూంకరించాడు. రావణుడు తన తమ్ముడి యుద్ధోన్మాదాన్ని చూసి చాలా పొంగిపోయినాడు. కుంభకర్ణుడు యుద్ధానికి హుటాహుటిన వస్తుంటే వానరయూథాలన్నీ విహ్వలబుద్ధితో గడగడ వణికాయి. కంపించిపోయినాయి. కొందరు శ్రీరాముణ్ణి శరణువేడారు. కొందరు ఆటూ ఇటు పరుగులు తీశారు. అప్పుడు అంగదుడు ఆ వానరయోధులకు ధైర్యం చెప్పాడు. నలుణ్ణీ, నీలుణ్ణీ, గవాక్షుణ్ణీ యుద్ధోన్ముఖులను చేశాడు.

కుంభకర్ణుడి రణరంగప్రవేశం

అప్పుడు వానరవీరులు పెద్దపెద్ద కొండశిలలు, మహావృక్షాలు తీసుకొని కుంభకర్ణుణ్ణి యుద్ధభూమిలో ఎదుర్కొన్నారు. అయితే వానరులు ప్రయోగించిన అస్త్రాలేమీ ఆ మహాపర్వతాకారుడి మీద పనిచేయలేదు. కార్చిచ్చు అరణ్యాన్ని పూర్తిగా దహించివేసే తీవ్రవేగంతో కుంభకర్ణుడు వానరులను హతమార్చసాగాడు. ఆ కుంభకర్ణుణ్ణి తేరిపారచూడలేక నలుదిక్కులా వానరులు కకావికలైనారు. చిందరవందరైనారు. ఆత్మరక్షణ కోసం సముద్రంలో దూకారు. అంగదుడు మళ్ళీ వాళ్ళను సమీకరించాడు. వాళ్ళకు ధైర్యోత్సాహలు కలిగించాడు. తమ లక్ష్యసిద్ధిని పొందకపోతే చేసిన మహాకార్యాలన్నీ వృథా అయిపోతాయని నచ్చచెప్పాడు. 'రాముడు వీణ్ణి సంహరించి తీరుతాడు' అని వానరవీరు లందరికీ అభయమిచ్చాడు అంగదుడు.

ఆ సంకట సమయంలో హనుమంతుడు వాళ్ళను ఆదుకున్నాడు. సుగ్రీవాజ్ఞతో ప్రేరితులై మళ్ళీ వానరులంతా మహాఘోర యుద్ధం చేసి తమ విజయాన్ని సాధించాలని కృతనిశ్చయులైనారు. కుంభర్ణున్ణి చుట్టుముట్టారు. కుంభకర్ణుడు వీర్యోద్రేకంతో వానరులను బహుసంఖ్యాకంగా మట్టుపెట్టసాగాడు. ద్వివిదుడు ఒక మహాపర్వత శిఖరాన్ని తీసుకొని వచ్చి కుంభకర్ణుడిపై విసిరినా, అది ఆ క్రూరపరాక్రముడైన రాక్షసుణ్ణి ఏమీ చేయలేకపోయింది. కొందరు రాక్షసులనైతే నేలగూల్చింది. ఈసారి ఒక పర్వతాన్నే తెచ్చి కుంభకర్ణుడిపై ప్రయోగించాడు ద్వివిదుడు. అది మరికొందరు రాక్షసులను చంపివేసిందేకానీ, కుంభకర్ణుడి ముందు ఎందుకూ కొరగాకుండా పోయింది. రాక్షసులు చితికి, వాళ్ళ రక్తం కాలువలై పారి కుంభకర్ణుడికి మరింత ఉగ్రావేశం కలిగించింది.

అప్పుడు హనుమంతుడు ఆకాశం నుంచి మహావృక్షాలను, పెనుశిలలను కుంభకర్ణుడిపై వర్షింపచేశాడు. అయితే కుంభకర్ణుడు వీటన్నిటినీ తన శూలంతో ఛేదించాడు. తాను కసుగందలేదు. అప్పు డిక హనుమంతుడు ఆకాశం నుంచి కిందికి వచ్చి ఒక పర్వతాన్ని కుంభకర్ణుడిపైకి విసిరాడు. అది తాకి కుంభకర్ణుడు కాస్త చలించాడు. ఆ మహారాక్షసుడికి కోపం పెల్లుబికింది. అప్పుడు ఆ రాక్షసుడు హనుమంతుడి వక్షానికి గురిపెట్టి తన శూలం విసిరాడు. అది ఆంజనేయుణ్ణి తాకి ఆయనను నొవ్వజేసింది. హనుమంతుడు ప్రళయగర్జనం చేశాడు. హనుమంతుడే రక్తసిక్తగాత్రుడు కావడం చూసి వానరులు మళ్ళీ పరుగులు తీశారు. నీలుడు వాళ్ళకు ధైర్యం కలిగించాడు. తాను ఒక పర్వతశిఖరాన్ని కుంభకర్ణుడిపై విసిరాడు. ఈ పెద్దకొండను కుంభకర్ణుడు తన పిడికిటితో త్రోసివేశాడు. ఇది చూసి ఋషభుడూ, శరభుడూ, గంధమాదనుడూ నీలుడికి సహాయంగా కుంభకర్ణున్ణి చుట్టుముట్టారు. అయితే కుంభకర్ణుడు వాళ్ళను బాగా మర్దించి వాళ్ళ శరీరాలనిండా రక్తధారలు పారేట్లు చేసి పడవేసి వానరులను నమిలి మింగసాగాడు. అది చూసి వానరులు భయాక్రాంతులైనారు. కుంభకర్ణుడు శూలం పట్టుకొని ఎక్కడ చూసినా తానై యుద్ధభూమిలో చెలరేగాడు. అంగదుణ్ణి పరాజయం పాలు చేశాడు. సుగ్రీవుణ్ణి పరాభవించాడు. ఇది చూసి రాక్షసులు కోలాహలంగా సింహనాదాలు చేశారు.

అప్పుడు మహోత్సాహంతో కుంభకర్ణుడు సుగ్రీవుడిపైకి తన ప్రచండ శూలాన్ని విసరివేశాడు. దాన్ని మధ్యలోనే పట్టుకొని హనుమంతుడు విరచివేశాడు. అది చూసి వానరులు ఉప్పొంగి పోయినారు. కుంభకర్ణుడు ఆగ్రహోదగ్రుడైనాడు. సుగ్రీవుణ్ణి ఒడిసిపట్టి లంకలోకి తీసుకొనిపోయినాడు. రాక్షసవీరులంతా పరమోత్సాహులై కుంభకర్ణుణ్ణి ప్రశంసించారు. హనుమంతు డప్పుడు డోలాయమానమానసుడైనాడు. సుగ్రీవుణ్ణి విడిపించుకొని వస్తే అది సుగ్రీవుడికి చిన్నతనం అనుకున్నాడు. కుంభకర్ణుడేమో ఇక తమకు విజయం తథ్యం అని విర్రవీగాడు. లంకాపట్టణవాసులతా కుంభకర్ణుడిపై పుష్పవృష్టి కురిపించారు.

సుగ్రీవుడు స్థైర్యం కోల్పోలేదు. కుంభకర్ణుడి ముక్కుచెవులూ, పక్కలూ తనగోళ్ళతో చీల్చివేశాడు. రక్తప్రవాహాలు ఆ పర్వతాకారరాక్షసుడి నుంచి కాలువలు కట్టాయి. అప్పుడు కుంకర్ణుడికి తీవ్రమైన కోపం వచ్చి సుగ్రీవుణ్ణి నేలమీద విసిరికొట్టాడు. ఇదే అదను అని భావించి సుగ్రీవుడు ఆకాశంలోకి ఎగిరిపోయినాడు. కుంభకర్ణుడు కోపోద్ధతుడైనాడు. వీడు వానరుడా, రాక్షసుడా అని చూడకుండా కనపడ్డవాడినల్లా, చిక్కినవాడినల్లా పొట్టన పెట్టుకోసాగాడు. యుద్ధరంగం పెద్ద గగ్గోలు, విలయబీభత్సం సృష్టించాడు.

ఇదంతా చూస్తున్న లక్ష్మణుడు ఆగ్రహంతో ఊగిపోయినాడు. తీక్ష్ణమైన ఏడు బాణాలు ముందుగా కుంభకర్ణుడిపై ప్రయోగించి అటు తర్వాత బాణవర్షంతో ఆ మహాకాయుణ్ణి ముంచివేయసాగాడు. ఆ రాక్షసుడు లెక్కచేయకుండా రాముణ్ణి చేజిక్కించుకోవాలని నేలబద్ధలయేట్లు పెద్ద పెద్ద అంగలు వేస్తూ రాముడిపైకి దూసుకొనిపోయినాడు. శ్రీరాముడప్పుడు కుంభకర్ణుడిపై మహారుద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. కుంభర్ణుణ్ణి అసంఖ్యాకమైన శరాలు గజిబిజి చేశాయి. కుంభకర్ణుడి వృక్షస్థలాన్ని అవి ఛేదించాయి. అప్పుడు ఆ పరమభీకరుడు మూర్ఛపోయినాడు. కాని వెంటనే తేరుకున్నాడు. తన చేతుల్లో ఆయుధాలు లేవు అనిపించింది. అప్పుడు తన నోటి నుంచి అగ్నిజ్వాలలు సృష్టించాడు. రాముడిపై పెద్ద కొండను విసిరాడు. ఆ కొమడను తన బాణాలతో రాముడు ముక్కలు చేస్తే మంటలు పుట్టాయి. ఆ మంటల నుంచి వానరసేనలను కాపాడాడు శ్రీరాముడు.

కుంభకర్ణుణ్ణి ఎదిరించడం సాధ్యం కాదని లక్ష్మణుడి సూచనపై వానరులంతా అతడిపై కలిసి అతడి శరీరమంతా ఆక్రమించి కిందపడవేయాలని పూనుకున్నారు. అయితే వాళ్ళందరినీ శరీరం విదిల్చి నేలపాలు చేశాడు కుంభకర్ణుడు. ఇక రాముడు వానర నాశనాన్ని సహించలేకపోయినాడు. అల్లెతాటిని భయంకరంగా మోగించి కుంభకర్ణున్ణి యుద్ధానికి ఆహ్వానించాడు శ్రీరాముడు. కుంభకర్ణు డిది సహించలేక రాముడితో తలపడ్డాడు. అత్యంత ప్రభావ మహితమైన దివ్యాస్త్రాలతో కూడా శ్రీరాముడు కుంభకర్ణుణ్ణి ఏమీ నొప్పించలేకపోయినాడు. ఏడు మద్దులను ఒకేసారి కూల్చినవీ, వాలిని సంహరించినవీ అయిన బాణాలు కుంభకర్ణుడి ముందు నిష్ఫలమైనాయి.

కుంభకర్ణుడి వధ

ఒక మహాభయంకరమైన ముద్గరంతో (ముళ్ళగద) కుంభకర్ణుడు రాముడిపై విజృంభించాడు. వీరవిహారం చేశాడు. అప్పుడు రాముడు వాయవ్యాస్త్రం ప్రయోగించి కుంభకర్ణుడి ఒక చేకి నరికి వేశాడు. అయినా రెండో చేతితో ముద్గరం తిప్పుతూ రాముడిపై పడబోయినాడు కుంభకర్ణుడు. అప్పుడు ఐంద్రాస్త్రం ప్రయోగించి రెండో చేతిని కూడా నరికివేశాడు రాముడు. అప్పుడు బొబ్బరిస్తూ నోరు తెరచి రాముడిపైకి దూకాడు కుంభకర్ణుడు. వెంటనే రాముడు కుంభకర్ణుడి రెండు పాదాలు ఖండించాడు. ఆ మహారాక్షసుడి ముఖం నిండా బాణాలు సందులేకుండా నింపివేశాడు శ్రీరాముడు. తరువాత ఐంద్రాస్త్రంతో కుంభకర్ణుడి తల ఖండించివేశాడు శ్రీరాముడు. ఆ శిఖర సదృశమైన తల మహావేగంతో పోయి, లంకలో పడింది. లంకావాసులంతా భయోత్పాతంతో హాహాకారాలు వేశారు అది చూసి. రాక్షసులంతా రాముణ్ణి చూసి పెద్దపెట్టున ఆక్రందించారు. కుంభర్ణుణ్ణి రాముడు సంహరించాడని తెలియగానే రావణుడు మూర్ఛపోయినాడు. ఒక్కఉదుటున నేలమీద పడిపోయాడు. రావణుడి కొడుకులంతా హాహాకారాలతో ఏడ్చారు. దేవాంతకుడు, నరాంతకుడు, త్రిశిరుడు, అతికాయుడు తమ పినతండ్రి మరణం చూసి పెద్దపెట్టున ఆక్రోశించారు. మహోదరుడూ, మహాపార్శ్వుడూ తమ సోదరుడు మృతిచెందినందుకు దుఃఖసముద్రంలో మునిగిపోయినారు.

రావణాసురుడు మూర్ఛ తేరుకుని తన తమ్ముడి వీరవిక్రమాన్ని, అప్రతిహతపరాక్రమాన్ని తలచుకొని ప్రలపించాడు. చాలాసేపు వెక్కి వెక్కి ఏడ్చాడు. తన కిక ఏ దిక్కూ లేదని ఆక్రోశించాడు. ఈ యుద్ధం తనవల్లనే సంభవించిందనీ, సర్వనాశనం జరిగిపోయిందనీ పశ్చాత్తాపదుఃఖంతో ఆక్రందించాడు.

(సశేషం)

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)